Sunday, December 26, 2021

ద వర్జిన్ అండ్ ద జిప్సీ (తెలుగు అనువాదం)-POST NO: 42

ఆంగ్ల మూలం: డి.హెచ్.లారెన్స్

తెలుగుసేత : మూర్తి కెవివిఎస్


 "ఆ..ఇపుడు ఫర్లేదు..సరే..సరే.." అంటూ ఆమె ఒక కుర్చీలో కూర్చుంది. తెలవెంట్రుకలు తడిసి ముద్దై ఆమె తెల్లని మొహానికి అంటుకుపోయి ఉన్నాయి.


"వెంటనే బట్టలిప్పేసి ..టవల్ తో గట్టిగా రుద్దుకో.అప్పుడే ఈ గడ్డ కట్టే చలి నుంచి బయటపడతావు.నేనూ అదే పని చేశాను.ఇల్లు కూలి పోతే ఓ పురుగు లా చనిపోవచ్చు కాని ఈ చల్లదనం వల్ల వచ్చే న్యూమోనియా తో పోకూడదు" అరిచి చెప్పాడు ఆ జిప్సీ.


అతను బాగా దగ్గుతున్నాడు.టైట్ గా ఉన్న తన జెర్సీని విప్పడానికి తంటాలు పడుతూ ఇది కొద్దిగా లాగు అన్నాడు.


ఆమె జెర్సీ ని బలం కొద్దీ లాగడం తో అది అతని మొహం మీది నుంచి ఊడి వచ్చేసింది.


"నువు బట్టలు తీసేసి టవల్ తో తుడుచుకో.." ఆజ్ఞాపిస్తున్నట్లుగా  అన్నాడు.తను కూడా షర్ట్ ని,ట్రవుజర్స్ ని విప్పేసాడు.విపరీతమైన చలికి గడగడా వణికిపోతున్నాడు. 


ఒక టవల్ ని తీసుకుని ఒంటిని బాగా రుద్దుకున్నాడు.కొంకర్లుపోయే చలికి అతని పళ్ళు పట పట మని శబ్దం చేస్తున్నాయి.Yvette కి అతను చెప్పింది సబబు గా అనిపించింది.ఆమె తన డ్రస్ తీసేయడానికి ప్రయత్నించింది.బాగా తడిచిన ఆ డ్రెస్ ని అతను కూడా ఓ చెయ్యి వేసి గట్టిగా లాగాడు.ఆ తర్వాత తన ఒంటిని రుద్దుకున్నాడు.తలుపు దగ్గరకి వెళ్ళి నిక్కి చూశాడు.పడమర వైపున కిటికీ ఒకటి ఉంది.సూర్యుడు అస్తమిస్తున్నాడు.ఇటు చూస్తే వరద సముద్రం లా ఉంది.చెట్లు అవీ అడ్డదిడ్డం గా పడిఉన్నాయి.


మేడమెట్లు దెబ్బతిన్నాయి.గోడ కూలిపోయింది.అతను ఆ నీళ్ళని అలాగే చూడసాగాడు.పళ్ళు చలికి పటపట లాడుతున్నాయి.చాలా ప్రయత్నం మీద రూం లోకి వెళ్ళి తలుపు వేశాడు.


Yvette కి ఒళ్ళంతా బలహీనత కమ్మేసింది.ఎలాగో తనని వెచ్చగా ఉంచుకోవడానికి టవల్ తో రుద్దుకోసాగింది.


"ఫర్లేదు...ఇక నీళ్ళు పెరిగే పరిస్థితి లేనట్టుంది" అరిచాడతను.

చలి తో మొద్దు బారినట్లు అయిన ఆమె శరీరం ఇపుడు కాస్త ఫరవలేదనిపించింది. 


"ఒక పని చెయ్యి..అదిగో ఆ మంచం మీద పడుకో నువ్వు...నేను నా ఒంటిని రుద్దుకుంటాను అవతలికి పోయి.." అన్నాడతను.

  అతని పళ్ళు చలికి లోబడి మాట ని స్పష్టం గా రానివ్వడం లేదు.సగం స్పృహ లో ఉన్నట్టుగా ఉన్న ఆమె మంచం మీదకి వెళ్ళింది.అతను తన ఒంటిని చలి నుంచి రక్షించుకోవడానికి తెగ పాట్లు పడుతున్నాడు.ఒకవైపు ఒంటిని  రుద్దుకుంటూనే,ఉత్తరం వైపు ఉన్న కిటికీ లోనుంచి చూశాడు.


నీళ్ళు కొద్దిగా పెరిగినట్లు తోచింది.సూర్యుడు కిందికి వెళ్ళిపోయినా,కొద్దిగా ఎర్రని కాంతి ఉన్నది.తలవెంట్రుకల్ని గట్టిగా తుడుచుకుంటూ ,ఊపిరి పీల్చుకున్నాడు.భయం అనిపించింది.మళ్ళీ ఛాతి మీద రుద్దుకున్నాడు.దగ్గు వస్తోంది.నీళ్ళు పొట్టలోకి పోయినట్లున్నాయి.టవల్ ని చూస్తే అక్కడక్కడా ఎర్రగా ఉంది.బహుశా ఎక్కడో గాయం అయి ఉండవచ్చు.అయితే ఎక్కడో అర్ధం కాలేదు వెంటనే.


నీటి శబ్దం విచిత్రం గా వినిపిస్తోంది.నీటి అలలు గోడలకి తగులుతున్నాయి. చల్లటి గాలి పెరిగింది.సూర్యుడు కనుమరుగయ్యాడు గదా.ఇల్లు మొత్తం పెద్దగా ధం అని శబ్దం చేసినట్లు తోచింది.భయం గొలిపే శబ్దాలు వినిపించసాగాయి.


(సశేషం) 

No comments:

Post a Comment