Sunday, December 12, 2021

ద వర్జిన్ అండ్ ద జిప్సీ (తెలుగు అనువాదం)- POST NO:41

 ఆంగ్ల మూలం: డి.హెచ్. లారెన్స్ 

తెలుగుసేత : మూర్తి కెవివిఎస్


వరద ఉరవడి భయంకరం గా గర్జిస్తున్నది. ఎట్టకేలకు ఇద్దరూ మెట్ల మీదకి చేరుకున్నారు. ఇంటి గోడ కంపిస్తున్నది. వరద నీరు వాళ్ళ కాళ్ళని మళ్ళీ మళ్ళీ తాకుతున్నాయి.జిప్సీ వెళ్ళి హాల్ తలుపులు తీశాడు.ఆ పిమ్మట తడిసిన దుస్తుల తోనే పై అంతస్తు కి ఎక్కసాగారు.ఇటు చూస్తే హాల్ లో నాయనమ్మ కనిపించింది.ముడుచుకుని డైనింగ్ రూం కి దగ్గరలో ఉంది. చేతులెత్తి సైగ చేస్తున్నది.వరద తటాలున మొట్ట మొదటిగా ఆమె కాలిని తాకడం తో ,భయం తో నోరు తెరిచింది.

Yvette కి ప్రస్తుతం ఏమీ కనబడటం లేదు. పై అంతస్తు ఎక్కే మెట్లు తప్పా..!ఆమె భయం తో తడిసిన పిల్లి లా అయిపోయింది.పక్కనే ఉన్న బానిస్టర్ ని పట్టుకుని కొద్దిగా సేద తీరింది.ఇల్లు కంపిస్తున్నది. కింద నీళ్ళు బాగా వచ్చేస్తున్నాయి. ఆ జిప్సీ ఆయాసం తో దగ్గుతున్నాడు. అతని కేప్ కూడా పడిపోయింది.తన నల్లని ముంగురులు కళ్ళమీద పడుతున్నాయి.హాల్ లోకి వచ్చిన నీటిని అలానే చూస్తున్నాడు.

బానిస్టర్ రైలింగ్ ని పట్టుకున్నప్పుడు,అతని చేతికి ఉన్న వెడ్డింగ్ రింగ్ తళుక్కుమన్నది. 

"పరిస్థితి ఏమీ బాగోలేదు..బాగోలేదు" అన్నాడు తల వెంట్రుకల్ని చేత్తో పైకి అనుకుంటూ. దానితో పాటుగా దగ్గుతున్నాడు.

ఇల్లు కంపించుతున్న శబ్దం. పడిపోయినా పోవచ్చు.వరద నీరు సముద్రం లా ఉంది.ఎక్కడ చూసినా నీళ్ళే.

Yvette ఒక్క ఉదుటున ఎక్కడలేని సత్తువ కూడదీసుకుని పైకి ఎక్కేసింది వేగంగా..!ఇంటి పరిస్థితి చూస్తే ఎప్పుడు కూలుతుందో అన్నట్లు గా ఉంది.

"ఇల్లు మునుగుతున్నట్లుగా ఉంది" అరిచాడు జిప్సీ. ఆమె ఆందోళన గా ఉంది.

"అన్నట్లు చిమ్నీ...వెనుక రూం లో ఉండే చిమ్నీ ఎక్కడా...అక్కడికి పోవడం మంచిది" అన్నాడతను. అక్కడ వెనుక ఒక రూం ఉంది. రెండు కిటికీలు ఉన్నాయి దానికి.వాటికి ఇరువైపులా పెద్ద చిమ్నీలు ఉన్నాయి. జిప్సీ దగ్గుతూ,వణుకుతూ వేగంగా కిటికీ దగ్గరకి ఉరికాడు,బయట కి చూసేందుకు. ఆ ఇంటికి ,ఎత్తుగా ఉన్న గుట్ట కి మధ్య చాలా వేగంగా పోతూన్న ఓ కాలువ ఉన్నది. ఇంకా కుక్కల్ని పగటిపూట చూసుకునే ఓ కేంద్రమూ ఉన్నది.అలాగే దగ్గుతూ కిందికి చూశాడు. చెట్లు గిట్లూ అన్నీ నేలకొరుగుతున్నాయి. ప్రవాహం లోతు పది అడుగులు ఉండవచ్చు.   

ఏమి చేయాలో అర్ధం కాలేదు. భయం గా చేతుల్ని గుండె కి ఆంచుకున్నాడు. Yvette కేసి చూశాడు.మరోవేపు భయంకరమైన ప్రవాహం ఇంటిని అతలాకుతలం చేస్తున్నది. ఇల్లు ఒక వేపుకి కుంగింది. ఇద్దరూ భయానికి లోనయ్యారు. ఏమి చేయలేని స్థితి ఇంకోవేపు.

"ఇదిగో..ఇక్కడ...ఫర్వాలేదు.బాగానే ఉంది. అటు చిమ్నీ ఉంది చూడు,చాలా ఎత్తుగా..! సరే..నువ్వు దుస్తులు తీసేసి మంచం మీద పడుకో...లేదంటే ఇదిగో ఈ చలి తో మరణించే ప్రమాదం ఉంది..!" అన్నాడు జిప్సీ.

(సశేషం)  

 

   

No comments:

Post a Comment