Friday, April 15, 2022

తండ్రి (అనువాద కథ)

 తండ్రి (అనువాద కథ)


ఒరియామూలం : గౌరహరి దాస్

తెలుగుసేత : మూర్తి కెవివిఎస్


ఇంట్లోకి ఎప్పుడు కాలు పెట్టినా సంజయ్ కి వెంటనే బయటికెళ్ళిపోవాలని అనిపిస్తుంది. కంపువాసన వచ్చే ఆ చెత్త ... ఏదో రోగాన్ని కలిగిస్తుందేమోనని ఓ అనుమానం.ఎంత తన కుటుంబం అనుకుందాం అనుకున్నా తన వల్ల కాదు.ఇంట్లో ఏ మూల చూసినా పెద్దమ్మతల్లి గజ్జెల చప్పుడు..! ఏం చేయడానికీ పాలుపోని స్థితి.తనలో తనే కుమిలిపోతుంటాడు.

వీటన్నిటికీ కారణం తన తండ్రి. సరిగ్గా పోషించలేనపుడు ఇంతమందిని కనడం దేనికి..?అసలు ముగ్గురు పిల్లలు అవసరమా..? నెపం అంతా తండ్రి మీదే నెడుతుంటాడు సంజయ్. 

సంజయ్ గ్రాడ్యుయేట్. కాలెజ్ విడిచిపెట్టి నాలుగేళ్ళయింది. ఇంకా జాబ్ కోసం వెతుకుతూనే ఉన్నాడు.వచ్చే ఆశ కూడా కనిపించడం లేదు.ప్రతి చోటా లంచమో,రికమండేషనో కావలసి వస్తోంది. తన కాలేజ్ మేట్ బిశ్వరంజన్ అడ్ హాక్ లెక్చరర్ గా ఓ కాలెజ్ లో జాబ్ సంపాదించాడు. అతనికి కన్నా సంజయ్ కే ఎక్కువ మార్కులు వచ్చాయి. అతగాడి తండ్రి విద్యా శాఖ లో డిప్యూటి సెక్రటరి, దాని ఫలితం మరి. ఇంకో మిత్రుడు నరేష్ కట్నం కింద ఓ ఉద్యోగం సంపాదించాడు. తన తండ్రికి ఉండవలసిన పరిచయాలు లేవు.అలాగే లంచం కింద అరవై,డబ్భై వేలు పోసే స్థోమతా లేదు.

ఆకాశం లో చుక్కల్ని చూసుకుంటూండగా,రోజులు అలా దొర్లిపోతూనే ఉన్నాయి.ఇదో జీవితమా..? కలలు గనే ఓపికా పోయింది.ఏం చేయాలో అర్ధం కాని జీవితం. గోపీనాథ్ అనే మిత్రుడు ఎమ్మెల్యే ద్వారా ప్రయత్నిస్తాను అని చెప్పాడు.తీరా చూస్తే ఆ ఆశ అడుగంటింది.విష్యం ఏమిటంటే సంజయ్ వాళ్ళ నాన్న ఆ ఎమ్మెల్యే కి గిట్టని వాళ్ళతో పనిచేశాడట.    

తండ్రి దగ్గర ఈ విషయం ప్రస్తావిస్తే "మహాత్మా గాంధీ గారు పనిచేసిన కాంగ్రెస్ పార్టీ కి వ్యతిరేకం గా ఎలా పనిచేస్తాను" అన్నాడు.అలా సమర్థించుకున్నాడు. అప్పటికే తను మంచం పట్టాడు.

"మనకి ఏదీ ఉపయోగమోఎవరు ఉపయోగపడతారో ఆ పార్టీకే మనం సపోర్ట్ చేయాలి. విలువలూ అవీ అని కూర్చుంటే పూట గడవక చావడమే.తెలివైన వాళ్ళు ఎవరైనా ఈ రోజుల్లో అలాగే చేస్తారు" అన్నాడు సంజయ్.

తన మాటని ఆయన ఒప్పుకోలేదు.అది సమస్య కాదు.కానీ జాబ్ సంపాయించే విషయం లో ఎమ్మెల్యే ని కలవలేకపోవడం...అదీ సమస్య..!

బయట చూస్తే,బారెడు పొద్దెక్కింది.తను ఆసుపత్రి కి వెళ్ళాలి.ఆ బెడ్ మీద ఉన్న తండ్రిని చూస్తే కొన్నిసార్లు జాలి అనిపిస్తుంది.అయితే చాలాసార్లు మటుకు విపరీతమైన కోపం వస్తుంది.అసలు ఇలాంటి మనుషులు ఎందుకు పుడతారో అనిపిస్తుంది.

తండ్రి తో బాటు తల్లి,అక్కా ఇంకా చెల్లి కూడా తన మీదనే ఆధారపడి ఉన్నారు.అక్క చేసిన పనికి ఇంకా సిగ్గు తో చచ్చినట్లయింది.వీథిలో నడవాలంటేనే సిగ్గుగా ఉంది. పెళ్ళికాని అక్క తన ప్రియుడి ఇంటి ముందు పెళ్ళి చేసుకోమని ధర్నా చేయడం...అదీ అప్పటికే పుట్టిన బిడ్డని ఒళ్ళోబెట్టుకుని మరీ..!తోబుట్టువు గా అది తనకి గౌరవం చేకూర్చే పనేనా..?

ప్రెగ్నేంట్ అని తెలియగానే తల్లి తీయించుకోమంది కానీ అక్క సుశీల ఒప్పుకోలేదు.కుటుంబం పరువు గంగ లో కలవాలనే ఆమె అలా చేసింది.ఇంత జరిగిన తర్వాత చెల్లికి మంచి సంబంధం ఎలా వస్తుంది..? అసంభవం. సంజయ్ దృష్టి లో ఈ అన్నీటికి తండ్రే కారణం.

ఇంట్లో ఒక్క క్షణం ఉండబుద్ధి కావడం లేదు.ఎటు చూసినా అవమానం,విచారం,తలవొంపులు.అలాగని ఎక్కడకి పోగలడు..?ఈ బాధ్యతలన్నీ తనవల్ల కాని పని. ప్రస్తుతం ఇంట్లో ఉండేది నలుగురు.తండ్రి కేన్సర్ పేషెంట్.బాగయ్యే ఆశ లేదు.ఆసుపత్రి మంచం మీదనే ఆయన జీవితం గడుస్తోంది.అందర్నీ విడిచిపెట్టేసి ఎక్కడకి పోవడం...ఒకవేళ పోయినా జనాలు ఏమనుకుంటారు..?రోగిష్టి తండ్రిని,పెళ్ళికావాల్సిన ఆడపిల్లల్ని,తల్లిని విడిచి పారిపోయాడని నలుగురూ అనుకోరా..?  

 తనకి జాబ్ అంటూ దొరికితే సమస్యలన్నిటిని ఎలాగోలా అధిగమించవచ్చు.గ్రాడ్యుయేషన్ అయిపోగానే జాబ్ వస్తుందని అనుకున్నాడు సంజయ్. కానీ అది అందని మానిపండే అయింది.పొద్దుటి నుంచి రాత్రి దాకా ఖాళీ గా ఉంటున్నాడు.ఇలా జీవించడం లో ఏమైనా అర్ధం ఉందా..?

తండ్రికి కేన్సర్ అనగానే సంజయ్ గుండె బద్దలయింది.తను ఎక్కువ కాలం బతికే అవకాశం లేదు.జనవరి లో ఎండ లా అతని ఆయుషు తగ్గుతూ వస్తోంది.తండ్రి మొహాన్ని దగ్గర నుంచి పరిశీలించేవాడు.మిగతా రోజుల్లో రోతగా,పనికిమాలినవాడిగా అనిపించేవాడు.ఇపుడు అతని లో వేదన ఉండటం వల్లననుకుంటా,ఏదో తెలియని ప్రశాంతత తండ్రి లో గోచరించేది.

"ఈ మహమ్మారి గురించి ఇంట్లో వాళ్ళకి చెప్పద్దు" అన్నాడు తండ్రి,సంజయ్ తో. మనం చేయగలిగేది ఏమీ లేదు. ఆ దేవుడే రక్షించాలి అన్నాడు డాక్టర్.మహా అయితే ఇంకో నాలుగు నెలలు బతుకుతాడని కూడా చెప్పాడాయన.

కేన్సర్ వైరస్ తండ్రి ని ఎప్పటి నుంచో కొరికి తినేస్తోంది.ఆయనలో శక్తి తరిగిపోతోంది.మెల్ల మెల్లగా మరణానికి చేరువ అవుతున్నాడు.   

సంజయ్ రోజంతా తండ్రి మంచం దగ్గరే ఉంటున్నాడు.ఆయనకి సేవలు చేయడం లోనే సమయాన్ని వెచ్చిస్తున్నాడు.ఆయన బతికేది కేవలం కొన్ని నెలలే.

సర్వీస్ లో ఉన్నపుడు ఉద్యోగి చనిపోతే ఫేక్టరీ వాళ్ళు కంపాసినేట్ గ్రౌండ్ లో అతని వారసునికి ఉద్యోగమిస్తారు.ఆ విధం గా నీకు జాబ్ వస్తే మిగిలిన కుటుంబాన్ని నువ్వు చూసుకోవచ్చు,అధైర్యపడకు అంటూ ఓసారి డాక్టర్, సంజయ్ కి చెప్పాడు.చిమ్మ చీకటి లో కాంతికిరణం లా అనిపించింది ఆ మాట.

తండ్రి అంటే సంజయ్ కి ఎంత అసహ్యమో ఆ తండ్రి కి కూడా తెలుసు.అందుకనే కామోసు ఈ రోగం తగిలింది.ఇలాగైనా తను పోతే తన జాబ్ కొడుక్కి వస్తుందని అతగాడి ఆశ కూడా.ముసలాయన వయసు రిటైర్మెంట్ కి దగ్గర లో నే ఉంది.ఇంకొన్ని నెలలయితే పదవీ విరమణ జరుగుతుంది.ఇదంతా సంజయ్ కి బాగా తెలుసు.

"నేను పోయిన తరువాత మీ అమ్మ ని,అక్కా చెల్లెళ్ళల్లని నిర్లక్ష్యం చేయకు.మీ అక్క సుశీల మంచిపిల్ల,కనకనే మోసపోయింది.వాళ్ళందరికీ నువు తప్పా వేరే ఎవరున్నారు..?" అంటూ తండ్రి,సంజయ్ ని దగ్గరకి పిలిచి చెప్పాడు.ఆయన కంటి లో కన్నీటి తెర.

"అదేమీ ఆలోచించవద్దు,అన్నీ నేను చూసుకుంటాను" అన్నాడు సంజయ్.  

ఈ సంభాషణ జరిగి అప్పుడే రెండేళ్ళు గడిచిపోయాయి.

"మీ నాన్న విల్ పవర్ చాలా గొప్పది. ఆయన ఇంత కాలం బతికారంటే మందులు కంటే అదే కారణం.కేన్సర్ పేషంట్లు ఇంత కాలం బతకడం అరుదు" అన్నాడు డాక్టర్, సంజయ్ తో.

ఆ మాట సంజయ్ కి ముందు హేపీ గా అనిపించినా,తనకి కంపాసినేట్ గ్రౌండ్ మీద ఉద్యోగం రావాలంటే ఫేక్టరీ విధించిన కండీషన్స్ గుర్తొచ్చి డీలా పడ్డాడు.ఇప్పుడిక వచ్చే ఉద్యోగం కూడా పోయేలా ఉంది.జీవితం నిరాశాకూపం లో పడి ఇక బయటపడటం అసంభవం లా తోచింది. తండ్రి ఇలాగే మంచం మీద జీవిస్తుంటే,ఆయన రిటైర్మెంట్ తేదీ కూడా అయిపోయి తనకి ఉద్యోగం కూడా రాదు.

తండ్రి వైపు చూశాడు.చాలా నీరసపడ్డాడు.లేచే స్థితి కూడా లేక,ఆయన జీవచ్చవం లా అయిపోయాడు. ఉన్న పదీ,పరకా మందులకి కరిగిపోయాయి.ప్రావిడెంట్ ఫండ్ నుంచి వచ్చిన డబ్బూ అయిపోయింది.తల్లి నగలు కూడా అమ్మవలసి వచ్చింది.తండ్రి ఇంకా కొన్నాళ్ళు బతికితే తాము బిచ్చం ఎత్తుకోవడం ఖాయం.అప్పుల ఊబిలో పడి,ఉన్న కొద్ది భూమి సైతం అమ్ముకోవలసిన పరిస్థితి వస్తుంది.తనకి వచ్చే జాబ్ మాట అటుంచి,తండ్రి బతుకు తన ముందు పెద్ద దయ్యం లా దాపురించింది.  

గత రెండేళ్ళనుంచి ఇంట్లో సంతోషం అనేది లేదు.చావు కళ కమ్ముకుంది.తమ బతుకుల మధ్య ఈ కేన్సర్ పేషంట్.భవిష్యత్తు భయంకరంగా గోచరిస్తున్నది.తనేం చేయాలి...ఎక్కడకి ఉరకాలి..?ఈ పరిస్థితి నుంచి బయటపడటానికి ఆత్మహత్య నే శరణ్యమా..? లేకపోతే కుటుంబాన్ని వదిలేసి రోజువారీ కూలీ గా తన దారి తాను చూసుకోవడమే మంచిదా..?

ఇలాంటి ఆలోచనలన్నీ సంజయ్ ని వేధించసాగాయి. మాసిపోయిన గడ్డం,మురికి బట్టలు,దైన్యం తో నిండిన తన వాలకం...దారిద్ర్యానికి ప్రతిరూపం లా మారిపోయాడు తను. తాను ప్రేమించిన అమ్మాయి కళ్యాణి ,టెలిఫోన్ శాఖ లో పనిచేసే ఓ ఉద్యోగి ని పెళ్ళిచేసుకుపోయింది.అంతేలే...మనిషి కలల్ని తింటూ బతకలేడుగదా..!లోకరీతి ఎరిగిన మనిషి ఆమె..!

తనతండ్రి తొందరగా,అంటే ఈ వారం లోపు మరణిస్తేనే తనకి జాబ్ వస్తుంది.ఒక్కసారి జాబ్ లోకి వెళితే ఏ అప్పు చేసైనా తండ్రి కర్మకాండల్ని సజావు గా చేయగలడు.ఆయన అస్థికలు ప్రయాగ లో కలపడం గాని,స్పెషల్ ట్రైన్ లో తల్లిని తీర్థ యాత్రలకి పంపడం గాని చేయగలడు.సుశీల ని మోసం చేసిన వాడి మీద కేసు వేయగలడు.ఇంకో సోదరికి పెళ్ళి చేయగలడు.ఇవన్నీ పూర్తి చేసిన తర్వాత తాపీగా తన జీవితం గురించి కలలు గంటాడు.ఎక్కడెక్కడో లోపల నిద్రపోయిన కలలు,ఈ దరిద్రపు జీవితం అంతమవుతే తప్పా నిద్రలేవవు...!

కాని తండ్రి ఇంకా చనిపోలేదు.ఆ డాక్టర్ చావనివ్వడం లేదు.ఆయన ఆయుషుని తానూ,డాక్టరూ పోటీబడి మరీ పెంచుతున్నారు.కాని రహస్యంగా,తనలో తనకి అనిపిస్తోంది...తండ్రి తొందరగా చనిపోతే బాగుండునని..!ఆలోచనలు అపసవ్యం గా సాగుతున్నాయని తోచి గిల్టీ గా ఫీలయ్యాడు.  

తన ఆలోచనలు ఎలా పోతున్నాయి అనుకున్నప్పుడు చాలా భయం గా తోచింది.ఏమిటి..? తండ్రి హత్య కి ప్రణాళిక వేయడమా..?లేదు..లేదు..ఆయన చనిపోవాలని తాను కోరుకోడు.మరి అలాగని ఆయన బతకాలని కూడా అనుకోలేడు.సందిగ్ధపరిస్థితి. కుటుంబం మొత్తానికి ఏమి జరిగితే మంచిదో అలా జరిగితే చాలు అనుకున్నాడు.

పురాణాల్లో అలాంటివి ఎన్నో ఉన్నాయి.యయాతి మహారాజు తన కుమారుడైన పురు యొక్క యవ్వనాన్ని కోరుకున్నాడు.అది పాపం కాదా..?అలాంటప్పుడు ఒక కొడుకు తన జీవితాన్ని మొదలుపెట్టడానికి తండ్రి మరణాన్ని కోరుకుంటే తప్పు ఏముంది..? అదీ కొన్ని రోజులు ముందుగా మరణించమని..!

సంజయ్ ప్రతిరోజు డాక్టర్ ని రెండుసార్లు కలుస్తుంటాడు.ఆయన ఎప్పుడూ బిజీ గా ఉంటాడు.ఏది అడిగినా అవే జవాబులు.సంజయ్ తన లోపల ఉన్నది ఎప్పుడూ డాక్టర్ తో చెప్పలేదు.ఓ వైపు రేషన్ సరుకులు,మరో వైపు మందులు కొనడానికి డబ్బులు లేని రోజులున్నాయి.ఈ మనిషి తాను చావడు,తమని చావనివ్వడు.సంజయ్ కొన్నిసార్లు అసహనం తో రగిలిపోతుంటాడు.

లేదు.ఆ పని తాను ఒంటరిగా చేయలేడు.డాక్టర్ కూడా హెల్ప్ చేస్తేనే అవుతుంది.ఒక్క ఇంజెక్షన్ డాక్టర్ ఇస్తే ... అంతే...తండ్రి ప్రాణాలు అనంతవాయువుల్లో కలిసిపోతాయి.ఎవరికీ ఏ ముప్పూ ఉండదు.   

అన్నిరకాల బాధలనుండి మిగతా కుటుంబం విముక్తి పొందుతుంది.మందులు కొనడానికి ఎవరిదగ్గర బిక్షమెత్తాలా అని ఆలోచించనవసరం లేదు.భవిష్యత్ లో వచ్చే ఏ ఉపద్రవం గురించి భయపడనవసరం లేదు.ఈ ప్రణాళిక ని డాక్టర్ కి చెబుదామంటే,పేషెంట్లు ఉండటం వల్ల ఎప్పుడూ కుదిరేది కాదు.ఏదో అలా కలిసివచ్చేసే వాడు.

ఏదో ఓ సారి ఖాళీ గా ఉన్నప్పుడు దిగులుగా ఉన్న సంజయ్ ని డాక్టర్ అనునయించాడు. నేను చేయవలసింది చేస్తున్నాను,మిగతాది అంతా దేవుడిదే భారం అన్నట్లుగా చెప్పాడు.డాక్టర్ కి తన మనసు లో ఉన్న మాట ని ఎలా చెప్పాలా అని తటపటాయించాడు.తండ్రికి ఎంత చేయాలో అంతా తాము ఇద్దరూ చేస్తూనే ఉన్నారు.ఇంకా ఎక్కువకాలం బతికితే మిగతా కుటుంబం అంతా ఆకలిచావులే. 

సాయంత్రం అయింది.డాక్టర్ వచ్చే వేళ.సంజయ్ సైకిల్ ని గోడకి చేరబెట్టి లోపలికి వెళ్ళాడు.ఆసుపత్రి లో ఉన్న బెంచ్ మీద కూర్చున్నాడు.డాక్టర్ వచ్చి తన చాంబర్ లోకి వెళ్ళాడు.ఆ రూం తలుపులు మూసుకున్నాయి,గ్రీన్ కర్టెన్స్ ప్రశాంతం గా ఊగుతున్నాయి.మళ్ళీ ఎవరూ రాకముందే లోపలికి వెళ్ళాలి,ఒంటరిగా ఉన్నప్పుడే డాక్టర్ ని కలిసి చెప్పాలి. రాత్రి ఎనిమిదింటికి కుదిరింది.

డాక్టర్ దిగ్గున సంజయ్ ని చూశాడు,టేబిల్ మీద అతని నీడని గమనించి..!

" సంజయ్...ఏమిటి...? ఏదో చెప్పాలని వచ్చినట్లుంది.." అన్నాడు డాక్టర్.

నోరు పెగల్లేదు. "అదే...నాన్న" అని ఆగిపోయాడు సంజయ్.

"నిన్నటి కంటే ఫర్లేదు సంజయ్.నా ప్రయత్నం నేను చేస్తాను" అన్నాడు డాక్టర్.

" అది కాదండి.మీ పని మీరు బాగానే చేస్తున్నారు.కానీ నాన్న కి పూర్తిగా నయమవుందా..?" అడిగాడు సంజయ్.

"అది అసంభం" గంభీరం గా అన్నాడు డాక్టర్.

"ఎంత కాలం బ్రతకవచ్చునంటారు" సంజయ్ అనుమానం.

"అది నేను ఎలా చెప్పగలను..?ఇప్పటికే రెండేళ్ళు పైగా గడిచిపోయాయి.కేన్సర్ పేషంట్ వెయ్యి రోజులు మించి బతకడం అరుదు.ఆ లెక్కన ఆరు నెలలు బతకవచ్చునేమో అనుకున్నా...కానీ" ఏదోచెప్పబోయి ఆగాడాయన.

"ఆ లెక్కన ఎప్పుడో పోవాలి గదా...చాలా కాలం బతికినట్లే" అన్నాడు సంజయ్.

"ఎప్పుడోనా ..." డాక్టర్ అనుమానం గా సంజయ్ వైపు చూశాడు.   
సంజయ్ భయం తో వెనక్కి తగ్గాడు.అసలు విషయం చెప్పే ధైర్యం చేయలేకపోయాడు. డాక్టర్ లేచి సంజయ్ భుజం పై చెయ్యి వేసి చెప్పాడు. 
 "మీ కుటుంబం ఎన్ని విధాలుగా బాధ పడుతోందో ఊహించగలను.పరిస్థితులకి తలొగ్గి కొన్నిసార్లు బతకాలి. తోటలోని గులాబీని,గోడ ఇరుకుల్లో పెరిగే మొక్క తో పోల్చగూడదు.నువ్వు ఎంత చేయాలో అంతా చేశావు మీ నాన్న కి..! అంతకన్నా ఏం చేస్తావు చెప్పు" అనునయించాడు.

డాక్టర్ మాటలకి ఏమి బదులివ్వాలో అర్ధం కాలేదు.ఇంటికి వెళ్ళేసరికి తల్లి నిద్రపోతోంది.సుశీల తన బిడ్డని ఊయల్లో వేసి ఊపుతున్నది.చెల్లాయి వచ్చి అన్నం పెట్టానని చెప్పి పడుకోవడానికి వెళ్ళిపోయింది.

సంజయ్ కి ఆకలి కూడా కావడం లేదు.తలవెంట్రుకల్ని నీరసం గా చేతి తో వెనక్కి తోసుకున్నాడు.ప్రతిరోజూ చల్లారిపోయిన అవే కూరలు.మంచి రుచిని కూడా ఆస్వాదించే హక్కు లేదీ జీవితానికి.

బాగా పొద్దుపోయింది.చంద్రుడి మీదికి కొన్ని మేఘాలు కమ్ముకుంటున్నాయి.గోడ అవతల ఉన్న చవిటి కాలవ నుంచి ఒకటే దుర్గంధం. చీ ..పాడు కొంప.ఎటు చూసినా మాసిన బట్టలు,వెలిసిపోయిన గోడలు,విరిగిపోయిన ఫర్నీచరు. ఇదేనా జనాలు అనుకునే స్వీట్ హోం అంటే..? అలా రాసిన కవుల మాటలు గుర్తొచ్చి అసహ్యమనిపించాయి.
ఏమైనా సరే,డాక్టర్ తో తన లోపల ఉన్న బాధని చెప్పితీరాలి అనుకున్నాడు సంజయ్.తండ్రి సమస్య ని పూర్తిగా నిర్మూలించే క్రమం లో ఆయన సాయం అడుగుదామనుకున్నాడు.అలాంటి బ్రతుకు ఎవరికి ఉపయోగం..?అదే ఇతర దేశాల్లో అయితే పేషెంట్లు యుథనేషియా అనే ప్రక్రియ ద్వారా స్వచ్చందంగా చనిపోవడానికి నిర్ణయించుకుంటారు.దానివల్ల అందరికీ ఉపయోగం.డాక్టర్ తనకి ఆ సాయం చేసిపెట్టొచుగదా..!

ఇలా ఆలోచిస్తూనే నిద్రలోకి జారుకున్నాడు.దాంట్లో ఓ కల వచ్చింది.ఏమిటంటే...సంజయ్ చెప్పిన మాటల్ని విని డాక్టర్ నిర్ఘాంతపోయాడు.ఆ తర్వాత అతనూ పరిస్థితి అర్థం చేసుకున్నాడు."నేనూ కొన్ని రోజులుగా అదే ఆలోచిస్తున్నా...అయితే నువ్వు ఒప్పుకుంటావో లేదో అని సందేహిస్తున్నాను.నిజం...మీ నాన్న చాలా బాధ పడుతున్నాడు.సరిగా నిద్ర కూడా పోవట్లేదు.మాట్లాడనూ లేకపోతున్నాడు.ఇలాగే తను జీవిస్తూపోతే నీకు వచ్చే జాబ్ కూడా రాదు.."  అంటున్నాడు డాక్టర్.

ఇద్దరూ కలిసి తండ్రి బెడ్ దగ్గరకి వెళ్ళారు.డాక్టర్ ఇంజెక్షన్ తీసి తండ్రి కుడిచేతికి పొడిచాడు.కాసేపటికి తండ్రి కన్నుమూశాడు శాశ్వతంగా.ఆయన మొహం మీద తెల్లని గుడ్డ కప్పారు.సంజయ్ లో ఆశాకిరణం పొడసూపింది.కిటికీ లోనుంచి సూర్యకిరణాలు పడటం తో సంజయ్ కి తెలివి వచ్చింది.ఏడీ..ఎక్కడ తండ్రి..?డాక్టర్ ఎక్కడా..?ఎవరూ లేరు...ఓహ్ ఇదంతా కలేనా..?

లేచి బయటకి వచ్చి బావి దగ్గరకి వెళ్ళాడు.తల్లి పైన ఎక్కడో ఉన్న కాకరకాయల్ని తెంపడానికి ప్రయత్నిస్తోంది.పాదు మొదట్లో ఉన్న చీమల కుప్ప మీద కొద్దిగా కిరోసిన్ చిలకరించింది.

"ఏమిటి ఉపయోగం...ఆ పాదు ఇప్పుడేమన్నా కాస్తోందా...ఏమిటి..అంత జాగ్రత్త తీసుకోవడానికి" సంజయ్ ప్రశ్నించాడు తల్లిని.

"ఇపుడు కాయకపోతే ఏమిటి...ఒకప్పుడు కాసింది గదా...నీకు ఇష్టమని చెప్పి ఈ పాదుల్ని మీ నాన్న వేశాడు.ఆయన ఆసుపత్రి నుంచి వచ్చిన తర్వాత ఈ పాదు లేకపోతే ఎంత బాధపడతాడు..?" అంది తల్లి.సంజయ్ ఆ మాటకి ఒక్కసారిగా కదిలిపోయాడు.

అతనికి బాగా జ్ఞాపకం.చిన్నప్పుడు తనకి టైఫాయిడ్ వస్తే తండ్రి భుజాన వేసుకుని ఎన్నో ఆలయాలకి తీసుకెళ్ళాడు.గుప్తేశ్వర స్వామికి మొక్కుకుని తిండి లేకుండా ఉన్నాడు. పొర్లు దండాలు పెట్టేప్పుడు మెట్లు తగిలి గాయాలు కూడా అయ్యాయి.ఆ ప్రార్థనల వల్లే తను బతికాడు. 
సంజయ్ కి చెమటలు కారుతున్నాయి.అసలు ఇవన్నీ ఇప్పుడు ఎందుకు గుర్తుకు వస్తున్నాయి..?చనిపోయిన మనిషి స్మృతుల వలే ఎందుకు ముసురుకుంటున్నాయి..?తను డిగ్రీ చదవడానికి అప్లికేషన్ పెట్టేటపుడు నాన్న చేతి ఉంగరం కనబడలేదు.ఆ పెళ్ళినాటి ఉంగరాన్ని తన చదువు కోసం అమ్మేశాడు.

తండ్రికి చిన్నతనం నుంచి పేదరికం వెంటాడుతోంది.ఆయన తల్లిదండ్రులు చాలా కాలం జబ్బుతో ఉండి పోయారు.ఆ తర్వాత అక్కచెల్లెళ్ళ పెళ్ళిళ్ళు చేయడం..ముగ్గురు సంతానం కలగడం...ఇవన్నీ ఆయన్ని బిచ్చగాడి స్థాయి కి తీసుకొచ్చాయి.

ఓ క్లర్క్ జీతం ఎంతవరకు సరిపోతుంది..?ఆయన అంటుండేవాడు "మనిషికి ఎంత ఇవ్వాలో అంత ఇస్తాడు పైవాడు,దానితో సంతృప్తి పడాలి,ఎవరికి ఎంత సక్సెస్ ఇవ్వాలో విధి నే నిర్ణయిస్తుంది" అని..! 

సంజయ్ గబగబా బయటకి నడిచాడు.సైకిల్ కూడా మర్చిపోయాడు.తండ్రి రూపం మదిలో మెదిలింది.భుజాలపై ఎక్కించుకుని తనని సంత కి తీసుకెళ్ళేవాడు.బొమ్మలూ స్వీట్లు కొనిచ్చేవాడు,అలాంటి వాడి పట్ల తాను ఎలా ఆలోచించాడు..?

సంజయ్ వేగంగా పోతూనే ఉన్నాడు.ఇల్లు,రోడ్డు,ఎలక్ట్రిక్ పోల్స్ అన్నీ వెనక్కి వెళ్ళిపోతున్నాయి.ఆసుపత్రి కి చేరుకున్నాడు.తండ్రి మంచం పక్కన డాక్టర్,నర్సులు ఉన్నారు.

""సంజయ్...పరిస్థితి నా చెయ్యి కూడా దాటిపోయింది.మీ నాన్న ని బతికించలేకపోయాను,నా చేతి లో ఉన్నంతదాకా చేయగలిగాను" అంటూ డాక్టర్ ,సంజయ్ చేతిని తట్టి చెప్పాడు.
 
తండ్రి మంచం లో ఏ చలనమూ లేకుండా ఉన్నాడు.ఆయన సహజంగా మరణించినట్లు తనకి అనిపించలేదు.తనే చంపినట్లు తోచింది.రాత్రి కలలో కనిపించినట్లుగా తెల్లని వస్త్రం లో తండ్రి శవం చుట్టబడి ఉంది.

(సమాప్తం)     

(Sri Gourahari Das is a renowned journalist and writer hailed from Odisha. My heartfelt thanks to let me translate his stories into Telugu)

No comments:

Post a Comment