Tuesday, September 26, 2023

కేరళ లోని మాతృవ్యవస్థ పై వచ్చిన ఓ మంచి నవల "The Grande Matriarch of Malabar"

 


The Grande Matriarch of Malabar అనే పుస్తకం ఇటీవల చదివాను.సజిత నాయర్ అనే రచయిత్రి కేరళ రాష్ట్రం లో ఒకప్పుడు ప్రబలం గా ఉన్న తరవాడ్ వ్యవస్థ పై రాసిని నవల ఇది. మాతృస్వామ్యం ఒకప్పుడు ఆ ప్రాంతం లో వర్ధిల్లిన సంగతి మనకి ఎంతో ఒకంత తెలుసు. మరి ఈ కేరళ రాష్ట్రానికి చెందిన రచయిత్రి ఏం రాశారో చూద్దామని చదివాను.

భూస్వామ్య మరియు ఫ్యూడల్ వర్గం గా చెప్పదగిన  నాయర్ కులం లో ఈ తరవాడ్ సంస్కృతి ప్రబలింది. ఒక పెద్ద ఇల్లు,దాని చుట్టూ తోటలు,అనేక ఎకరాల ఎస్టేట్ ఇలా ఉండే ఒక ఉమ్మడి కుటుంబం ...ఆ కుటుంబానికి అధిపతి గా ఒక స్త్రీ ఉంటుంది. ఆ ఇల్లు,ఆస్తిపాస్తులు అన్నీ ఆవిడ పేరు మీదనే ఉంటాయి. ఆమె తదనంతరం కూతురుకి అవి చెందుతాయి.లేదా కూతురు కూతురు కి ఇవ్వవచ్చు. ఇంటిపేరు కూడా భర్త ది ఉండదు.సంతానాన్ని కనడం వరకే తప్పా ఆస్తిపాస్తుల మీద ఎలాంటి అధికారం ఉండదు.

టూకీగా అలా ఉండే కుటుంబాల్లో సంబంధ బాంధవ్యాలు ఎలా ఉంటాయి తెలుసుకుందాం అని ఈ నవల చదివాను. రచయిత్రి సజిత నాయర్ కూడా అదే వర్గం నుంచి వచ్చిన వ్యక్తి కనక ఆసక్తి పెరిగి తెప్పించాను. మొత్తం 238 పేజీల్లో సాగింది. ఆసక్తికరం గా ఉంది రాసిన విధానం. Kalydath కుటుంబానికి చెందిన తరవాడ్ యొక్క కథ ఇది. ఆ తరవాడ్ కుటుంబ పెద్ద దాక్షాయణి అమ్మ. లంకంత ఇల్లు, భూమి పుట్రా బాగానే ఉంటుంది.కథ మొత్తం ఎక్కువగా 70 వ దశకానికి ముందు సాగి ఆ తరవాత మెల్లగా వర్తమానం లోకి వస్తుంది.

  రోహిణి, దాక్షాయణి అమ్మ మనవరాలు. ఆమె అమెరికా నుంచి ఈ వచ్చి తరవాడ్ లో ఉన్న పాతతరం ఇంటిని అమ్మివేసి డబ్బు తీసుకుపోవాలని ఇక్కడకి వస్తుంది. ఆమె కుటుంబీకులు చాలామంది అప్పటికే చనిపోయి ఉంటారు. ఎన్నిసార్లు అమ్మాలని చూసినా ఏదో ఆటకం వచ్చి కొనేవాళ్ళు వెనక్కి తగ్గుతుంటారు. చుట్టుపక్కల వాళ్ళు ఇంట్లో దాక్షాయణి అమ్మ ఆత్మ ఉందని అది బయటవాళ్ళని ఎవర్నీ ఇంటిని కొననివ్వదని చెబుతుంటారు.

ఈ రోహిణి మాత్రం అవి నమ్మదు. కాని ఆమె అక్కడ పడుకున్నప్పుడు మాత్రం కొన్ని అనుభవాలు ఎదురవుతాయి. చుట్టుపక్కల ఉండే మరో పెద్దావిడ దాక్షాయణి అమ్మ జీవితం గురించి వివరిస్తుంది. ఆ వివరణ లో భాగం గానే కథ అంతా సాగుతుంది. ఆ రోజుల్లో ఆవిడ ఎలా జీవించింది,తన సోదరుని సాయం తో ఎలా కుటుంబాన్ని నెట్టుకొచ్చిందీ,పిల్లల్ని ఎలా పోషించిందీ,మూగ చెవుడు ఉన్న కుమార్తె కి పెళ్ళి చేయడానికి పడిన కష్టాలు,కుమారుడు అచ్యుతన్ చేతికి అంది రావడం, అతని జీవిత విధానం, భర్త బయటకి వెళ్ళి వేరే స్త్రీ ని చేసుకోవడం,దైనందిన జీవితం లో వివిధ వర్గాల మధ్య ఘర్షణలు ఇవి అన్నీ మనం దీనిలో క్షుణ్ణంగా తెలుసుకోవచ్చు.

కొడుకు ఎంత సాయం చేసినా తరవాడ్ సంస్కృతి ప్రకారం కుమార్తె కుమార్తె కే ఇంటిని ,ఆస్తిని ఇవ్వాలనుకోవడం దానికి కొడుకులు అందరూ వ్యతిరేకించడం పాతతరం మరుమక్కతాయం చట్టాలు 1975 తోనే పోయినాయని వాదించడం ఇలా కేరళకి మాత్రమే పరిమితమైన కొన్ని విషయాల్ని ఈ నవల లో చదవవచ్చు. ఆనాటి కేరళ సమాజం లో కరుడు గట్టిన నమ్మకాలు ఓ వైపున ఉంటే , దాన్ని పూర్తిగా వ్యతిరేకించి పోరాడిన మనుషులు ఓ వైపున ఉన్నారు. అలా పరస్పర వైరుధ్యాలు కనబడతాయి.

అసలు దేశం లో ఎక్కడా లేని ఈ తరవాడ్ విధానం ఇక్కడ ఎందుకు ప్రబలింది అని లోపలికి వెళితే ఆ రోజుల్లో నాయర్ పురుషులు ఎక్కువగా యుద్ధాల్లోనూ వాటిల్లోనూ మరణించడం వల్ల , స్త్రీలు నంబూదిరి బ్రాహ్మణుల ద్వారా పిల్లల్ని కనడానికి అనుమతించిడం జరిగింది. అతను కేవలం పిల్లల్ని కనే ప్రక్రియ లో ఉపయోగపడటానికే తప్పా స్త్రీ మీద గాని,ఆమె ఆస్తి మీద గాని ఎలాంటి అధికారం ఉండదు.అక్కడ బ్రాహ్మల్లో కూడా పెద్ద కొడుకు కే వివాహం అదీ. ఆ తరవాత వాళ్ళు నాయర్ యువతులతో సంబంధాలు పెట్టుకునేవారు. మరి ఇలాంటి గమ్మత్తు వ్యవస్థ ని చూసే స్వామి వివేకానంద లాంటి ఆయన కూడా సెమీ క్రాక్ పీపుల్ అన్నాడేమో ...ఇంకా రాస్తాను. ఇప్పటికి ఇది. అమెజాన్ లో ఉందీ పుస్తకం.

--- మూర్తి కెవివిఎస్       

No comments:

Post a Comment