Thursday, June 27, 2024

అమెరికా లో తెలుగు విద్యార్థులపై దాడులపై కారణాలు ఏమిటి ?

అమెరికా లో తెలుగు విద్యార్థులపై దాడులపై కారణాలు ఏమిటి ?

--------------------------------------------------------------------------------------------

 అమెరికా లో చదువుకోవడానికి వెళుతున్నవారిలో పంజాబ్ నుంచి ఇంకా ఆ తర్వాత మన తెలుగు రాష్ట్రాల నుంచి ఎక్కువ మంది ఉన్నారు. ఆ తర్వాత మహారాష్ట్ర,గుజరాత్,ఢిల్లీ,తమిళనాడు,కర్ణాటక రాష్ట్రాల నుంచి వెళుతున్నారు. ప్రతి సంవత్సరం దాదాపు 9 బిలియన్ డాలర్ల డబ్బుని అక్కడ కాలేజ్ ల్లో ఫీజులు కట్టడానికి ఇంకా ఇతరత్రా ఖర్చులకి మనం వెచ్చిస్తున్నాం. అంత చేసి అక్కడ చదువుకునే పిల్లలకి ఉన్న సెక్యూరిటీ నానాటికీ క్షీణిస్తున్నట్లు అనిపిస్తోంది. ఈ సంవత్సరం జూన్ నెల వరకు తీసుకుంటే 11 మంది విద్యార్థులు ప్రాణాలు పోగొట్టుకున్నారు. కొంతమందిని షూట్ చేశారు.ఇంకొంతమందిని వివిధ ఆయుధాలతో చంపారు.మరికొంతమంది అనుమానస్పద ఆక్సిడెంట్ లలో మృతి చెందారు. దీనికి కారణాలు ఏమిటీ అంటే ఎప్పుడూ అవే వినబడుతున్నాయి. డ్రగ్ ఎడిక్ట్స్, జాతి వివక్షత, వారి అవకాశాల పట్ల అభద్రతా భావం ఇలా పేపర్లలో చదువుతున్నాం.

మనతో పోలిస్తే చైనా విద్యార్థులు ఇంకా ఎక్కువ గా అమెరికా యూనివర్శిటీల్లో చదువుతున్నారు. దాదాపు 2,89,000 మంది చైనా యువత ఉండగా భారతీయ యువత సంఖ్య 2,68,000 దాకా ఉంది. అయితే తరచుగా అక్కడ భారతీయ విద్యార్థుల మీద ఎటాక్ చేయటాన్నే ఎక్కువ గమనిస్తుంటాం. చైనా దేశానికి చెందిన వాళ్ళు కూడా దాడులకి గురై చనిపోయిన ఉదంతాలు లేకపోలేదు గాని ఎక్కువగా అనుమానస్పద యాక్సిడెంట్లు,దాడులు జరిగి చనిపొయేవారు  మన దేశానికి చెందిన యువకులే ఉంటున్నారు.ముఖ్యంగా అంతా 25 ఏళ్ళ లోపువారే! క్లీవ్ లాండ్,ఓహియో,ఇల్లినాయ్ ప్రాంతాల్లో ఉన్న యూనివర్శిటీల్లో ఈ దారుణాలు ఎక్కువగా జరుగుతున్నాయి.

అమెరికా వెళ్ళి చదువుతున్న వారిలో అందరికీ మంచి అవకాశాలు వస్తున్నాయా అంటే అనుమానస్పదమే. అయినా ఏడాదికేడాది తామర తంపరగా క్యూ కట్టి వెళుతూనే ఉన్నారు. 2022-23 మధ్యకాలం లో వెళ్ళిన వారితో పోలిస్తే అమెరికా కి వెళ్ళిన వారి సంఖ్య 35శాతం పెరిగింది. అమెరికా లో చదవడం ఓ వేలంవెర్రి గా తయారయి తాలుసరుకు కూడా వస్తూంటే అక్కడి విద్యాసంస్థలు మాత్రం ఎందుకూరుకుంటాయి, ఏ మాత్రం నాణ్యత లేని అలాంటి సంస్థలు గట్టిగా డబ్బు పిండుకుంటున్నాయి. ఆనక వాటికి గుర్తింపు లేదని తెలిసి బాధపడటం మనం పేపర్ల లో చూస్తూనే ఉన్నాం. 

ఎంతసేపూ అవతల వాళ్ళని అనడమే కాకుండా అక్కడ మనవాళ్ళు ప్రవర్తించే విధానం కూడా అవలోకించుకోవాలి. యూరపు లోని దేశాలతో పోలిస్తే జాతి వివక్ష్త అమెరికా లో తక్కువే కాని ఇంకా ఇతర కారణాలు కూడా ఉండవచ్చు. ఉదాహరణకి అక్కడి అలవాట్లని గేలి చేయడం,ప్రభుత్వ వ్యవహారాల్లో కొన్ని విషయాల్లో ఎక్కువ గా తెలుసుకోవాలని ప్రయత్నించడం, లేనిపోని ఎకసెక్కాలు ఆడటం, అవతల వాళ్ళకి అర్ధం అవదులే అని వ్యర్ధప్రేలాపనలు చేయడం లాంటి అధిక ఉత్సాహాం ఇక్కడ మన దేశం లో లా చేస్తే ఊహించని రీతి లో ట్రీట్ మెంట్ ఇవ్వడానికి వెనుకాడరు. అమెరికా లోని ప్రతి నలుగురు పౌరుల్లో ఒకరు సీక్రెట్ ఏజెంట్ గా ఉంటారని ప్రతీతి. కేవలం కొంత కంప్యూటర్ పరిజ్ఞానం నేర్చుకుని అక్కడ ఉద్యోగిస్తూ అమెరికా మొత్తాన్ని మేమే నడుపుతున్నాం అనుకోవడం భ్రమ.

ప్రపంచం మొత్తానికి అమెరికా ఈరోజు సూపర్ పవర్, ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ! మన సుందర్ పిచాయ్ లు, సత్య నాదెళ్ళ లాంటి వాళ్ళే అమెరికా ని నడిపిస్తున్నారని అనుకుంటాం. మార్కెటింగ్ టెక్నిక్ లో భాగంగా వాళ్ళ పాత్రల్ని వాళ్ళు పోషిస్తుంటారు,అంతే. ప్రపంచం వాళ్ళ రంగభూమి. యుద్ధభూమి. వాళ్ళ వ్యూహాల్లో మనం కొన్నిసార్లు తెలిసి,కొన్నిసార్లు తెలియక పాత్రధారులం.

--- మూర్తి కెవివిఎస్ (చరవాణి: 7893541003)           




No comments:

Post a Comment