Tuesday, July 2, 2024

వాట్సాప్ ని వదలడం మామూలు కాదు

 

వాట్సాప్ ని వాడకుండా ఉండటం అంత సులువు కాదు

---------------------------------------------------------------------------------------

 వాట్సప్ అంటే తెలియని వారు ఎవరైనా ఉంటే వాళ్ళని ఎగాదిగా చూసే రోజులివి. ప్రతి పూటా అన్నం ఉన్నా లేకపోయినా వాట్సప్ చెక్ చేయడం మాత్రం తప్పనిసరి. అంతలా మన జీవితాల్లోకి ఈ రోజున వాట్సప్ చొచ్చుకు పోయింది. 

అయితే చాలా సీరియస్ గా ఈ అలవాటు ని తగ్గించుకోవడానికి ప్రయత్నిస్తూ విఫలమవుతున్న వారెందరో ...ఎందరెందరో..! మన భారత దేశం లో 535.8 మిలియన్ల మంది వాట్సప్ యూజర్లు ప్రస్తుతం ఉన్నారు. 

అంతేకాదు,ప్రతి ఏటా 16.6 శాతం చొప్పున ఈ సంఖ్య పెరుగుతూ పోతోంది. బంధుమిత్రుల విశేషాలు ,ఆఫీస్ వార్తలు,స్థానిక వార్తలు దగ్గర నుంచి ప్రపంచ వార్తలు దాకా ప్రతీది ఈరోజున వాట్సప్ తో ముడిపడి ఉన్నాయి.

కొన్నిసార్లు సంబంధిత గ్రూప్ లో లేకపోతే వాటి సంగతులు ఏవీ తెలియవు. అంతేకాదు ఫోటోల్ని అతి సులభంగా అందుకోవలన్నా దాన్ని మించింది లేదు.అందువల్ల ఓ తప్పనిసరి అవసరంగా మన జీవితాల్లో మారిపోయింది.

పొద్దున లేవడం తోనే వాట్సప్ చెక్ చేయడం , ఆ తర్వాత మిగతా పనులు చేసుకోవడం అనేది ఓ మానలేని అలవాటు గా పరిణమించింది. విద్యార్థులు,ఉద్యోగస్తులు,వ్యాపారస్తులు వాళ్ళూ వీళ్ళూ అని లేకుండా ప్రతి ఒక్కరూ దీనితో బిజీగా ఉంటున్నారు.

 కాసేపు ఓ అయిదు నిమిషాలు చూసి బయటకి వచ్చేద్దాం అనుకుంటాం కానీ ఆ వాట్సాప్ లోని మిగతా గ్రూపుల్లో ఏముందో అనుకుంటూ రకరకాల విషయాలు చూసుకుంటూ పోతూనే ఉంటాం. తీరా టైం చూస్తే మనం అనుకున్న టైం కి వాట్సాప్ లోనుంచి బయటకి రాలేకపోయాం అని అర్థం అయ్యి తలబాదుకుంటాం.

 కొన్నిసార్లు చాలా అర్జంట్ పనుల్ని కూడా చేయలేము. ఎంత సంకల్పించుకున్నా ఇలాగే జరుగుతున్నప్పుడు అప్పుడు అర్థం అవుతుంది,మనం దానికి ఎడిక్ట్ గా మారిపోయామని! కొంతమంది గంటలు గంటలు దాంతోనే గడుపుతూ ఎంతో విలువైన సమయాన్ని కోల్పోతుంటారు. 

వాట్సాప్ ని ఏకధాటిగా 2 నుంచి 4 గంటలు దాకా చూడటం మంచిది కాదని పరిశోధకులు అంటున్నారు. బాగా అవసరమైతే మధ్య లో రెస్ట్ తీసుకుని చూడాలి. వాట్సాప్ ని విపరీతం గా చూసే వారిలో మతిమరుపు , నిద్రలేమి , కంటి నొప్పి, కారణం లేకుండా కోపం వంటి సమస్యలు తలెత్తుతాయని నిపుణులు చెబుతున్నారు.

కాబట్టి నిర్ణీతమైన సమయం లోనే చూడటానికి ప్లాన్ చేసుకోవాలి. అనవసరమైన గ్రూపుల్లోనుంచి బయటకి రావాలి. దానివల్ల సమయం కలిసివస్తుంది. మాటాడితే స్టేటస్ లు మార్చడం చేయకుండా ఉండాలి,అవి ప్రతి రోజు పెడుతున్నదగ్గరనుంచి వాటిని ఎవరెవరు చూస్తున్నారో చూడాలనిపిస్తుంది. అలా మళ్ళీ సమయం వృధా అవుతుంది. 

మరి వాట్సాప్ యాప్ ని తీసేద్దామంటే అది అంత ఈజీ కాదు. ఎందుకంటే మన అవసరాలు దానితో ముడిపడి ఉన్నాయి.మన ప్రొఫెషన్ కి సంబంధించిన లేదా సాంఘిక జీవనానికి సంబంధించిన ఎన్నో విషయాలు మనం కోల్పోతుంటాం. 

కాబట్టి ఏ మెసేజ్ ని ఎంతసేపు చూడాలి,ఏది ప్రధానమైనది అనే దాంట్లో మనకి క్లారిటీ ఉండాలి.అనవసరమైన వాటికి అమూల్యమైన సమయాన్ని వినియోగించాలి తప్పా ప్రతి వారూ పంపే వీడియోలు ,ఫోటోలు చూస్తూ కాలాన్ని వృధా చేయకూడదు. 

ఎన్నో పుస్తకాలు చదువుదామని ప్లాన్ వేసుకుని, తీరా వాట్సాప్ చూడటం లో మునిగిపోయి పుస్తకాల్ని నిర్లక్ష్యం చేసేవారు చాలామంది ఉన్నారు. బాగా గమనించినట్లయితే వాట్సప్ చూసిన తర్వాత చాలా సమయం వరకు, పుస్తకం చదవలేరు.

 కారణం మెదడు అలిసిపోయి విశ్రాంతి కోరుతుంది. అంతేకాదు కళ్ళు కూడా నొప్పి చేసి చదవడానికి అసౌకర్యంగా ఉంటుంది.

 ఎంతో అవసరం అయితే తప్పా,గ్రూప్ ల్లో సాధ్యమైనంత వరకు మెసేజ్ లు పెట్టవద్దు. దానివల్ల వాదవివాదాలు చెలరేగి స్పందిస్తూ పోతే మన ఇతర పనులు మూలన పడతాయి. అలాగే సెటింగ్స్ లో మార్పులు చేసుకుని అనవసరమైన సమయం లో వాట్సాప్ ని డిసేబుల్ చేసుకోవడం మంచిది. 

అవసరం లేదన్నప్పుడు, వీలైతే మొబైల్ ని దూరం గా ఉంచడానికి ప్రయత్నించాలి. మన అవసరాలకే వినియోగించుకుంటూ ఇతర హాబీల్ని కూడా పెంపొందించుకోవాలి. ముఖ్యంగా పుస్తక పఠనం అనేది ప్రధానమైనది. ఓ వైపు మానసికారోగ్యాన్ని కాపాడుకుంటూనే వాట్సాప్ లాంటి సాధనాన్ని వాడుకోవాలి. 


----- మూర్తి కెవివిఎస్ (చరవాణి : 78935 41003)    






1 comment:

  1. మా అపార్ట్మెంట్ సొసైటీలోనే ఒక విషయంపై చర్చించటానికి ఒక వాట్సాప్ గ్రూపు పెట్టి అందులో చేరమంటే చేరాను. ఇక చూస్కోండి. ఆ గ్రూపులో చర్చలు ముదిరిపాకానబడి అందరూ గోలగోలగా పుంఖానుపుంఖానుగా సందేశాలను విసురుతూ పోతూ ఉంటే దుర్భరం ఐపోయింది. రానురానూ గంటాకు వంద సందేశాల ఉరవడి అయిపోయేసరికి తట్టుకోవటం నావలన కాలేదు. ఆసలే వ్యక్తిగత సమస్యలతో నాకు తీరిక లేకుండాఉంటే ఇది పులిమీద పుట్ర అన్నట్లుగా ఐనది. ఆ గ్రూపుకో దండం పెట్టి బయటకు వచ్చేసాను. ఇకపోతే రకరకాల కమ్మర్షియల్ సంస్థలు సదుపాయం అంటూ అయాచితంగా పంపే రొట్ట గోల ఐతే చెప్పనక్కరలేదు. నాఉద్దేశంలో పీరియాడికల్గా వాట్సాప్ చెత్తను ఎత్తేయకపోతే చాలారకాలుగా తలనొప్పే.

    ReplyDelete