Wednesday, July 24, 2024

భారతదేశం లో ప్రస్తుత వైద్యవిద్య


భారతదేశం లో ప్రస్తుత వైద్యవిద్య

-------------------------------------------------------

 ఎంబిబిఎస్ చదవడానికి సీటు సంపాదించడం ఒక ఎత్తయితే ఆ తర్వాత విజయవంతమైన డాక్టర్ గా జీవితం లో నిలదొక్కుకోవడం మరో ఎత్తు. ప్రతి ఏటా మనదేశం లో దాదాపు లక్ష మంది వైద్య శాస్త్ర పట్టభద్రులు కాలేజ్ ల నుండి బయటికి వస్తున్నారు. ప్రస్తుతం దేశం మొత్తం మీద ఒకటిన్నర లక్షల జూనియర్ డాక్టర్లు నిరుద్యోగులుగా ఉన్నారని భోగట్టా. రెండు రకాలైన వాళ్ళు మెడిసిన్ చదివి బయటికి వచ్చే వాళ్ళ లో ఉంటారు. మొదటి రకం వాళ్ళు, వైద్య కుటుంబం నుంచి వచ్చిన వాళ్ళు,అంటే అప్పటికే వారి తల్లిదండ్రులు డాక్టర్లు గా అనుభవం సంపాదించినవారు కాగా రెండవ రకం వారు మొదటి తరం కి చెందిన వారు. దీంట్లో మొదటి కేటగిరీ కి చెందిన వారి జీవితం నల్లేరు మీద బండి కాగా రెండవ కేటగిరీ కి చెందిన వారు సక్సెస్ కావడానికి కొంత సమయం తీసుకోవలసిందే!

ప్రభుత్వ సర్వీస్ లో పనిచేయడం తప్పనిసరి కావడం తో తమ ప్రారంభ వేతనాన్ని 25 వేల రూపాయల నుంచి మొదలు పెట్టాలి. ఆ తర్వాత పెరుగుతూ ఉంటుంది. గ్రామీణ ప్రాంతాల్లో ,ప్రభుత్వ ఆసుపత్రుల్లో పని చేయడానికి ఇప్పుడొచ్చే తరం అంతగా ఇష్టపడటం లేదు. కారణం సరైన సదుపాయాలు ,రవాణా సౌకర్యాలు, ఆర్ధిక సౌలభ్యం ఆశించినంతగా ఉండకపోవడం. ఎక్కువమంది పేషెంట్లని చూసినా వచ్చే ఫీజులు అదనం గా ఏమీ ఉండవు. అదే సంఖ్యలో పేషెంట్లని బయట క్లినిక్ లో చూస్తే వచ్చే ఆదాయం అధికంగా ఉంటుంది. కార్పోరేట్ ఆసుపత్రులకి రిఫర్ చేస్తే దాని ఆదాయం కూడా ఇబ్బడి ముబ్బడి గా ఉంటుంది. అలా అని చెప్పి ఎంబిబిఎస్ చదివి బయటకి వచ్చిన ప్రతి డాక్టర్ నెలకి లక్షలాది రూపాయలు సంపాదిస్తున్నాడు అనుకుంటే పొరబాటు.

ఆసుపత్రి ఉన్న ప్రదేశం,డాక్టర్ కి ఉండే నైపుణ్యం,మార్కెటింగ్ ఇంకా కమ్మ్యూనికేషన్ స్కిల్స్ ఇలాంటివి అన్నీ వైద్యుని గా సక్సెస్ అవడానికి తోడ్పడతాయి. ఈరోజున మనం చూస్తున్నాం, పేషెంట్ కి ఏదైనా జరగరానిది జరిగితే ఆసుపత్రి ని ధ్వంసం చేయడం ఓ రివాజు గా మారిపోయింది. కార్పోరేట్ ఆసుపత్రులు ఇలాంటి వాటిని తట్టుకోవడానికి సెక్యూరిటీ,లీగల్ టీం ల్ని పెట్టుకుంటాయి. ప్రత్యేకించి ఏ డాక్టర్ మీదనైనా ఎలిగేషన్ లు వస్తే పోలీస్ స్టేషన్ కి వెళ్ళి ఓ సంతకం పెడితే చాలు,మిగతా వ్యవహారమంతా కార్పోరేట్ ఆసుపత్రి చూసుకుంటుంది. అలాంటి నెట్ వర్క్ ఉంటుంది.

 దక్షిణాది తో పోలిస్తే డాక్టర్ల కొరత ఉత్తరాది రాష్ట్రాల్లోని ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఎక్కువ.తమిళనాడు , ఢిల్లీ, కర్నాటక,కేరళ, గోవా, పంజాబ్, ఆంధ్ర,తెలంగాణా వంటి రాష్ట్రాల్లో రోగుల సంఖ్య కి సరిపోయిన సంఖ్య లోనే డాక్టర్లు ఉన్నారు.జార్ఖండ్,చత్తీస్ ఘడ్, బీహార్,ఉత్తర్ ప్రదేశ్ వంటి రాష్ట్రాల్లో జనాలకి అందుబాటు లో ఉండే డాక్టర్ల సగటు దారుణం గా ఉందనే చెప్పాలి. కోట్లాది రూపాయలు డొనేషన్లు కట్టి వైద్య పట్టభద్రులు అవుతున్న యువతరం కేవలం సేవా దృక్పథం తోనే పని చేయాలని ఆశించడం కూడా అత్యాశే అవుతుంది. అమెరికా,బ్రిటన్,సౌదీ అరేబియా,ఆస్ట్రేలియా,సింగపూర్ వంటి దేశాల్లో మన దేశపు వైద్యులకి మంచి డిమాండ్ ఉంది. కనుక ప్రతి యేటా వందల సంఖ్య లో వలస పోతున్నారు. దీని ప్రభావం దేశ ఆరోగ్య పరిస్థితులపై ఎక్కువగా ఉన్నది.     

       ప్రతి ఏటా ఇంతమంది యువతీ యువకులు పట్టభద్రులయి బయటకు వస్తున్నారు.కానీ వారంతా ఆ వృత్తి మీద ఎంతో ఇష్టం తో వెళ్ళారా అంటే చెప్పడం కష్టం. తల్లిదండ్రులు ఆ వృత్తి లో ఉన్నారనో,పెద్దవాళ్ళ కోరిక తీర్చడానికో,సంఘం లో ఓ గౌరవం కోసమో మన దేశం లో వైద్య వృత్తిని ఎంచుకుంటున్నారు. వైద్య పరిశోధన విషయానికి వస్తే భారతదేశం చాలా వెనుకబడి ఉందని చెప్పాలి. క్లినికల్ మెటీరియల్ ఎక్కువ గా ఉంది తప్పా పరిశోధన కి సంబందించిన డేటా గానీ,ఎక్విప్ మెంట్ గానీ మన వద్ద లేదని, పరిశోధనా పద్దతులపై ఆసక్తి ని కలగజేసే విధానం వైద్య విద్య లో లేదని సందీప్ గోడ్సే అనే నిపుణుడు అభిప్రాయపడ్డాడు. కార్డియాలజీ,గ్యాస్ట్రో ఎంటిరాలజీ వంటి రంగాల్లో పేరు ప్రఖ్యాతులు పొందిన వైద్యులున్నప్పటికీ అంతర్జాతీయస్థాయి లో చెప్పుకోదగ్గ పరిశోధనలు ఏమీ చేయలేకపోయిన మాట వాస్తవమని అంటున్నారు.  

--- మూర్తి కెవివిఎస్ (చరవాణి : 78935 41003)




No comments:

Post a Comment