Sunday, August 25, 2024

గల్ఫ్ దేశాల్లో మళయాళీలు ఎక్కువ... కారణమేమిటి?

 కేరళ రాష్ట్రం కి చెందిన ప్రజలు అత్యధికం గా గల్ఫ్ దేశాల్లో ప్రవాసం ఉండే విషయం అందరకీ తెలిసిందే. కువైట్ లో ఉండే విదేశీయుల్లో 80 శాతం దాకా మన దేశం లోని కేరళ నుంచి వెళ్ళిన వారే. గల్ఫ్ దేశాల్లోని అవకాశాల్ని మొట్టమొదటిగా గుర్తించి వాటిని అందిపుచ్చుకోవడం వల్ల వారి ఆధిపత్యం అక్కడ అనేక రంగాల్లో అలా కొనసాగుతూనే ఉంది. 1972 నుంచి 1983 మధ్య కాలం లో వచ్చిన గల్ఫ్ బూం ని మళయాళీలు బాగా వినియోగించుకున్నారు. అక్షరాస్యత ఎక్కువ గా ఉండటం ,సాంకేతిక నైపుణ్యం గల కోర్సులు చేయడం వల్ల చాలా మంది క్లర్కులు గా, ఆర్కిటెక్ట్ లుగా,నిర్మాణ రంగం లో సూపర్వైజర్ లుగా,ఇంజనీర్లుగా ఇలా మంచి అవకాశాల్ని పొందగలిగారు. మొదటి తరం వారు ఆ తర్వాత తమ బంధువుల్ని,స్నేహితుల్ని ఇక్కడకి తీసుకువచ్చారు.

ప్రస్తుతం వాళ్ళ సంఖ్య గల్ఫ్ దేశాల్లో ఎలా ఉందంటే యు.ఏ.ఈ.లో 7,73,624 మంది, కువైట్ లో 6,34,728 మంది,సౌదీ అరేబియా లో 4,47,440 మంది,ఖతర్ లో 4,45,000 మంది,ఒమన్ లో 1,34,019 మంది,బహ్రైన్ లో 1,01,556 మంది ఉన్నారు. అక్కడి నుంచి వాళ్ళు పంపించే విదేశీ మారకద్రవ్యం వల్ల కేరళ రాష్ట్రం యొక్క ఆర్ధిక చిత్రపటం మారిపోయిందని చెప్పాలి. ప్రతి ఏటా రమారమి 60,000 కోట్ల రూపాయలు కేరళ రాష్ట్రానికి వస్తుంటాయి.తాము ఆ దేశాల్లో పనిచేసి సంపాదించిన ధనం లో ప్రతి ఒక్కరు కొంత వెనక్కి తమ కుటుంబాలకి పంపిస్తుంటారు. మిగతా దేశాలతో పోలిస్తే మళయాళీ ప్రజలు గల్ఫ్ లో ఎక్కువ గా ఉండటానికి అనేక  కారణాలు ఉన్నాయి. ఎన్నో శతాబ్దాల నుంచి అరబ్బు దేశాలతో కేరళ రాష్ట్రానికి సముద్ర మార్గాల ద్వారా వ్యాపారం జరగడం ప్రధాన కారణం.

కేరళ రాష్ట్రం లో పెద్ద పరిశ్రమలు తక్కువ. పర్యావరణం పై ప్రజల చైతన్యం ఎక్కువ గా ఉంటుంది. ట్రేడ్ యూనియన్ ల ప్రభావం వల్ల పెద్ద పెట్టుబడిదారులు రావడానికి వెనకడుగు వేస్తుంటారు. కాబట్టి మంచి సంపాదన ఎక్కడ ఉన్నా సగటు మళయాళీ ప్రవాసి గా వెళ్ళడానికి సిద్ధం గా ఉంటాడు. యువతులు కూడా దూర ప్రదేశాలు వెళుతుంటారు.కోల్కతా,ముంబాయి,ఢిల్లీ ఇంకా దేశం లో ఎక్కడ అవకాశాలు ఉన్నా వెళుతుంటారు. ముఖ్యం గా నర్సింగ్ వృత్తి పరం గా చూస్తే దేశ విదేశాల్లో కేరళ నర్స్ లకి మంచి డిమాండ్ ఉంది. దేశం లో ఏ కార్పోరేట్ ఆసుపత్రి ని చూసినా అత్యంత ఎక్కువ సంఖ్య లో కేరళ రాష్ట్రానికి చెందిన నర్సు లే ఉంటారు. గల్ఫ్ సంపద ఎంత ప్రధాన పాత్ర కలిగి ఉందంటే చాలామంది మళయాళీ బిలియనీర్లు ఆ దేశాల్లో నే వ్యాపారం చేసి తర్వాత మిగతా దేశాల్లో తమ బిజినెస్ ల్ని విస్తరించారు.

ముథూట్ గోల్డ్ ఫైనాన్స్ గానీ, జాయ్ అలుక్కాస్ గోల్డ్ కంపెనీ గానీ గల్ఫ్ దేశాల సంపద తో విస్తరించినవే. యూసుఫ్ ఆలీ (లూలూ గ్రూప్) ,షం షేర్ వయలిల్ (విపిఎస్ హెల్త్ కేర్), సన్నీ వర్కీ (జెంస్ ఎడ్యుకేషన్), పిఎన్సి మీనన్ (శోభ గ్రూప్), జార్జ్ ముథూట్ ఇలాంటి మళయాళీ కుబేరులంతా వ్యాపారం గల్ఫ్ దేశాల్లో చేసి ఆ తర్వాత మన దేశం లో విస్తరించినవారే. ఇప్పటికీ వారి ప్రధాన కేంద్రాలు అక్కడే ఉన్నాయని చెప్పాలి. కేరళ ప్రభుత్వానికి రెవెన్యూ ద్వారా ఒక ఏడాదికి ఎంత ధనం వస్తుందో దానికి రమారమి రెండింతలు గల్ఫ్ నుంచి ధనం వస్తుంది.గల్ఫ్ నుంచి వచ్చీ పోయే ప్రయాణీకుల కోసం కేరళ లో నాలుగు అంతర్జాతీయ విమానాశ్రయాలు ఉన్నాయి. వారి బాగోగులు చూడటానికి ప్రత్యేకం గా ఒక మంత్రిత్వ శాఖ ఉంది. కొచ్చి,కోజీకోడ్,మలప్పురం,కన్ననూర్ వంటి ప్రాంతాలు గల్ఫ్ నుంచి వచ్చే అనేక వస్తువుల్ని ధారళంగా అమ్ముతుంటారు.

గల్ఫ్ నుంచి వచ్చే ధనం వల్ల కన్స్యూమరిజం బాగా పెరిగిందనే ఒక ఆరోపణ ఉన్నది. గల్ఫ్ నుంచి వచ్చిన లేదా అక్కడ పనిచేసే యువకులకి పెళ్ళి విషయం లో మంచి డిమాండ్ ఉన్నది. మరి అక్కడ విషాధ గాధలు లేవా అంటే ఉన్నాయి. స్థానికం గా ఉన్న ఆస్తి తాకట్టు పెట్టి గల్ఫ్ వెళ్ళి అనుకున్న పని దొరక్క పడరాని పాట్లు పడే వారూ ఉన్నారు. అక్కడి పత్రికల్లోనూ, టీ.వి. చానెళ్ళ లోనూ అలాంటి వారి కోసం ప్రత్యేకం గా కొంత స్పేస్ కేటాయిస్తారు. ఇటీవల వచ్చిన ఆడు జీవితం (గోట్ లైఫ్) సినిమా అలాంటి వారి బాధల్ని చిత్రించినదన్న సంగతి తెలిసిందే.ఏది ఏమైనా కేరళ రాష్ట్ర ఆర్దిక వ్యవస్థ కి దన్ను గా నిలిచి, లక్షలాది మధ్య తరగతి ప్రజలకి ఉపాధి చూపిన గల్ఫ్ దేశాల చమురు నిల్వలు ఇంకా చాలా కాలం ఉండాలని ఆశిద్దాం.

----- మూర్తి కెవివిఎస్ (చరవాణి: 78935 41003)    


(Printed in Janam Sakshi daily, 20.8.2024)

No comments:

Post a Comment