Saturday, September 13, 2025

జైన రామాయణం లో రావణుడిని సంహరించేది లక్ష్మణుడు

 జైన రామాయణం లో రావణుడిని సంహరించేది లక్ష్మణుడు

-----------------------------------------------------------------------------

శ్రీమద్ రామాయణం ఎవరు రాశారు అంటే ఎంత ఆధునిక కాలం లో జీవిస్తున్న యువతరమైనా వాల్మీకి మహర్షి రాశాడని చెబుతారు. ఇప్పటికీ అంత ప్రాచుర్యం ఉంది. ఆయన తర్వాత అనేకమంది ఇంచుమించు అలాంటి పాత్రల్ని,సన్నివేశాల్ని తీసుకుని ఎవరిదైన శైలిలో వారు రాశారు. కాంబోడియా, వియాత్నం, ఇండోనేషియా , థాయ్ లాండ్ వంటి దేశాల్లో కూడా రామాయాణాన్ని పోలిన భక్తి పరమైన గ్రంథాలు వచ్చాయి. 

అవి చదువుతుంటే ఇతివృత్త నిర్మాణం, కథ నడిచే పద్ధతి అంతా రామాయణాన్నే తలపిస్తాయి. కాకపోతే పాత్రల పేర్లు కొంత వేరే రూపాన్ని సంతరించుకున్నట్లు కనిపిస్తాయి. వాల్మీకి మహర్షి 24 వేల సంస్కృత శ్లోకాల్లో ఈ మహత్తరమైన గ్రంథాన్ని వెలయించారు. క్రీ.పూ.7 నుంచి క్రీ.శ.3 శతాబ్దాల మధ్య కాలం లో వాల్మీకి రామాయణం రాయబడిందని ఆధునిక చరిత్రకారులు చెప్పారు.

అయితే ఈ ఇతిహాసం ఇంకా ప్రాచీనమైనదని మరికొందరు భావిస్తున్నారు. ఏది ఏమైనప్పటికి ఇన్ని వేల ఏళ్ళు భారతీయుల జీవితాల్లో ఒక భాగమై , మన సమాజాన్ని అనేక విధాలుగా ప్రభావితం చేసిన ఇంకా చేస్తున్న గ్రంథరాజం మరియొకటి ఉందా అంటే లేదనే చెప్పాలి. దానిలోని పాత్రల్ని , విలువల్ని మీరు నచ్చినా నచ్చకున్నా ఇన్ని వేల ఏళ్ళపాటు జీవించగలిగిఉన్నదంటేనే ఆ కథనం లోని సృజనాత్మకత లో దేనిలోనూ లేని ఏదో మార్మికశక్తి ఉన్నదని అర్థం. 

మన భారత దేశం లోనే అనేక మంది పండితులు వాల్మీకి రామాయణాన్ని తిరిగి తమదైన శైలి లో రాశారు. రమారమి 300 కి పైగా వివిధ రామాయణాలు సాధ్యమైనంతవరకు వాల్మీకి రామాయణానికి దగ్గరగా ఉండేలా రాశారు. మరికొందరు కొంతమేరా స్వతంత్ర్య భావనల్ని చొప్పించారు. అంతమాత్రం చేత వాల్మీకి రామాయణం యొక్క ప్రాభవం ఏ మాత్రం చెక్కు చెదరలేదు.

జైన మతం లో కూడా రామాయణం ఉంది. హిందూ మత వటవృక్షం లో ఒక శాఖ వంటిది జైన ధర్మం అని చెప్పవచ్చును. పాత్రల పేర్లు అన్నీ అలాగే ఉంటాయి. ఇతివృత్తం లో వారిదైన స్వేచ్చని ప్రదర్శించారు. వారి ప్రధాన సిద్ధాంతాలైన అహింస ని, తీర్థంకరుల బోధనల్ని దాంట్లో సమ్మిశ్రితం చేశారు. విమలసూరి అనే జైన పండితుడు ప్రాకృత భాష లో ఈ గ్రంథాన్ని క్రీ.శ. 3 లేదా 4 వ శతాబ్దం లో రాసినట్లు పరిశోధకులు చెబుతున్నారు. ఈ రామాయణాన్ని పౌమచరియ లేదా పద్మచరిత్ర అనే పేరు తో వ్యవహరిస్తారు.

 రాముడికి , లక్ష్మణుడికి ఆ పేర్లతో పాటు బల్ దేవ్, వాసు దేవ్ అనే పేర్లు కూడా ఉంటాయి. రావణుడు విద్యాధర వంశానికి చెందిన రాజు. లంకా రాజ్యాన్ని పాలిస్తుంటాడు. రావణుడికి పది తలలు ఉండవు. కానీ ఆయన పుట్టిన తర్వాత శిశువు గా ఉన్న సమయం లో అతని శిరస్సు పది రకాలైన ఆభరణాల్లో ప్రతిఫలించినట్లు రాశారు. రావణుడు జైన ధర్మాన్ని పాటించే వాడైనప్పటికీ పూర్వ జన్మ కర్మల వలన సీతా దేవి ని అపహరిస్తాడు.  

విచిత్రం ఏమిటంటే జైన రామాయణం లో రావణుడి పాత్ర ని చంపేది లక్ష్మణుడు. ఎందుకంటే రాముడు స్వతహగా జైన దీక్ష తీసుకున్న రాజు కనుక తన చేతి తో హింస చేయడు. ఆ విధంగా రావణుడు,లక్ష్మణుడు మూడవ నరకానికి వెళతారు. హనుమంతుడు కూడా విద్యాధర వంశానికి చెందిన వాడే. ఈయనకి కొన్ని అతీత శక్తులు ఉంటాయి. 

మామూలు మనిషి లాగే ఉంటాడు. కోతి మూతి ఉన్నట్లు రాయలేదు.అయితే ఆయన రాజ్యం లో కోతులు ఉంటాయి. రావణుడు సీత ని తాకకుండా నే మాయోపాయం తో లంక కి తీసుకొస్తాడు. లక్ష్మణ రేఖ గీయడం, మారీచుని ఘట్టం వంటివి జైన రామాయణం లో లేవు. జైన ధర్మం ప్రకారం ఇష్టపడని స్త్రీ ని బలవంతం చేయకూడదు కనుక లంక లోనే ఒక వనం లో ఉంచే ఏర్పాటు చేస్తాడు.  

లక్ష్మణుడు చనిపోయిన తరువాత ఆయన దేహాన్ని ఖననం చేయకుండా, రాముడు ఎనిమిదేళ్ళపాటు ఉంచి ప్రతిరోజు స్నానం చేయించడం చేయిస్తుంటాడు. 24 తీర్థంకరులలో ఒకరైన ముని సువ్రత్ స్వామి రామునికి జ్ఞానబోధ చేసి తపస్సు చేయమని చెప్పి, అలాగే లక్ష్మణుడి దేహానికి తుది సంస్కారాలు చేయమని చెబుతాడు. ఆ విధంగానే చేసి రాముడు తన శేష జీవితాన్ని తపస్సు చేస్తూనే గడిపి స్వర్గం లో ఉన్న సీతా దేవి ని కలుసుకుంటాడు. 

సీతమ్మ అగ్నిప్రవేశం దీనిలో వేరుగా ఉంటుంది. నీరు వచ్చి అగ్ని ని ఆర్పేస్తుంది. అలాగే రామసేతు ని నిర్మించడం , వానర సేన లంక లో ప్రవేశించడం వంటి ఘట్టాలు లేవు. రాముడిని గొప్ప నిష్ఠాగరిష్ఠుడైన జైన ధర్మాన్ని గౌరవించే రాజు గా దీనిలో చిత్రించారు. జైనులు 24 తీర్థంకరులను , మళ్ళీ వారిలో మహావీరుడు,పార్శ్వనాధుడు, నేమినాథుడు, రిషభ నాథుడు వీళ్ళందరిని ఎంత పూజనీయులుగా చూస్తారో అలాగే రాముడిని కూడా భావిస్తారు.        

----- మూర్తి కెవివిఎస్ (7893541003)


No comments:

Post a Comment