Wednesday, September 24, 2025

వేలాది పుస్తకాలు ఉచితంగా చదువుకోవచ్చు

 ప్రపంచ సాహిత్యం లో ప్రసిద్ది వహించిన ఎన్నో పుస్తకాలు, ముఖ్యంగా ఆంగ్ల భాషలోనివి చదవాలని కొంతమందికి అనిపిస్తుంది. పుస్తకాల రేట్లు ఎక్కువ గా ఉన్నాయనో లేదా తమకి నచ్చిన పుస్తకం దొరకలేదనో నిరాశ పడుతుంటారు. సుమారుగా 75 వేల పుస్తకాల కి సంబంధించిన రాశి మనకి ఒక వెబ్ సైట్ లో లభిస్తుంది. అదీ ఉచితంగా నే సుమా. మీరు నెట్ లో వాటిని చదవ వచ్చు. లేదా పి.డి.ఎఫ్. లు గా డౌన్ లోడ్ చేసుకుని మీకు ఖాళీ ఉన్న సమయం లో చదువుకోవచ్చు. ఈ-పబ్, కిండిల్, హెచ్.టి.ఎం.ఎల్. ఇంకా టెక్స్ట్ రూపం లో సైతం మీకు అవి అందుబాటు లో ఉంటాయి. మీరు ఎలాంట్ ఫీజు చెల్లించనవసరం లేదు.

ప్రపంచ సాహిత్యం లో పేరున్న రచనలే కాకుండా వివిధ రకాల చదువరులకు ఆసక్తి ఉండే అన్ని రకాల పుస్తకాలు మనకి అందుబాటు లో ఉంటాయి.సాహిత్యం, చరిత్ర, సైన్స్, టెక్నాలజీ, సోషల్ సైన్స్, మతం, ఫిలాసఫీ, మెడిసిన్,హాబీస్ ఇలా ఇంకా అనేక రకాల పుస్తకాలు అందుబాటులో ఉంటాయి. ఎలాంటి రిజిస్ట్రేషన్ లేకుండా వెబ్ సైట్ లో కి వెళ్ళి మీకు నచ్చిన పుస్తకాన్ని చదవవచ్చు. లేదా డౌన్ లోడ్ చేసుకోవచ్చు. ఆ వెబ్ సైట్ పేరు గ్యూటెన్ బర్గ్ డాట్ ఆర్గ్. (www.gutenberg.org) దీంట్లో ఉంటే పుస్తకాలు కాపీరైట్ గడువు తీరిన పుస్తకాలు కాబట్టి మీరు ఇతరులకి బహుమతిగా కూడా పంపవచ్చు.

అనేకవేలమంది వాలంటీర్లు ఈ సైట్ లోకి పుస్తకాల్ని ఉచితంగా అప్ లోడ్ చేస్తుంటారు. నిజానికి ఇది ప్రయాస తో కూడుకున్నదే అయినప్పటికీ తమ అమూల్యమైన సమయాన్ని పుస్తక ప్రియులకోసం వెచ్చిస్తుంటారు. సెర్చ్ ఆప్షన్ ఉంటుంది కాబట్టి మీకు నచ్చిన పుస్తకం యొక్క వివరాల్ని సులభం గా తెలుసుకోవచ్చు. ఎలాంటి యాప్స్ అవసరం లేదు. మీకు వారి పని విధానం నచ్చితే చిన్న డొనేషన్ ఇవ్వవచ్చు.దాని కోసం పేపాల్ బటన్ ఉన్నది. డొనేషన్ తప్పనిసరి కాదు. మీ ఇష్టం మీదనే ఆధారపడి ఉంటుంది. ఈ ప్రాజెక్ట్ ని 1971 లో మైకేల్ ఎస్ హార్ట్ అనే పుస్తకప్రియుడు ఆరంభించాడు. ఆ తర్వాత ఇలాంటి వెబ్ సైట్ లు ఇంకొన్ని వచ్చినా ఈ గ్యూటెంబర్గ్ వెబ్సైట్ లో ఉన్న తేలికదనం వేరు.

----- మూర్తి కెవివిఎస్ (7893541003)


      

No comments:

Post a Comment