Saturday, February 28, 2026

ఇబన్ బతూతా : ఒక అరుదైన ప్రపంచ యాత్రికుడు

 

ఇబన్ బతూతా : ఒక అరుదైన ప్రపంచ యాత్రికుడు

--------------------------------------------------------------------------

మనకి మార్కోపోలో తెలిసినంతగా ఇబన్ బతూతా అనే అరబ్బు యాత్రికుడు తెలియదు. దానికి అనేక కారణాలు. ముఖ్యంగా పాఠ్య పుస్తకాల్లో ఇబన్ బతూతా గురించి పెద్దగా ప్రస్తావించరు. అంతే కాదు ఇంకొక ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే మార్కోపోలో కంటే మూడు రెట్లు ఇబన్ బతూతా ప్రపంచాన్ని చుట్టివచ్చాడు. 


క్రీ.శ.1304 లో జన్మించి క్రీ.శ. 1369 లో కన్నుమూసిన ఈ మహా ప్రపంచ యాత్రికుని జీవిత గాథ తెలుసుకుంటే అతని స్మృతికి జోహార్లు అర్పించకుండా ఉండలేము.విజ్ఞానం సముపార్జించడానికి చైనా వరకు వెళ్ళినా ఫర్వాలేదు అనే మహమ్మద్ ప్రవక్త యొక్క వాక్కులతో ప్రభావితమయ్యి ఎక్కడో ఉత్తర ఆఫ్రికా లోని మొరాకో దేశం లోని టాంజిర్ లో పుట్టిన ఇబన్ బతూతా ప్రపంచ యాత్ర చేయడానికి బయలుదేరాడు.తన ఇరవైయో ఏటా ఇంటి నుంచి బయలుదేరి దాదాపు 25 ఏళ్ళు యూరపు,ఆసియా,ఆఫ్రికా ఖండాల్లోని 40 దేశాలు తిరిగి మళ్ళీ ఇంటికి చేరుకున్నాడు.

అప్పటి ప్రయాణ సాధనాలు కేవలం కంచర గాడిదలు,ఒంటెలు,గుర్రాలు,పడవలు ఇంకా నౌకలు మాత్రమే. వీటినన్నిటినీ ఇబన్ బతూతా సమయాన్ని బట్టి వాడుకుంటూ తన ప్రయాణాల్ని కొనసాగించాడు. తన ప్రయాణాల్లో కొన్ని చోట్ల అమీర్లు,సుల్తాన్లను మెప్పించి వాళ్ళ ఆదరణ పొందాడు. మరికొన్ని చోట్ల సరైన వసతులు,తిండి లేక బాధపడిన రోజులూ ఉన్నాయి.

అన్నిటినీ సహిస్తూ తను అనుకున్న ప్రదేశాలు తిరుగుతూ అనేక అనుభవాలను పొందాడు. తమ పూర్వికుడైన అల్ ఇద్రిసీ వేసిన పటాల్ని దగ్గర పెట్టుకున్నాడు.అవి ఆయనకి ఎంతో ఉపయోగపడ్డాయి. 

మనం ఈరోజున అక్షాంశాలు,రేఖాంశాలు అనే విభజన చేసుకుని భూమి మీద ఎంతో సులువుగా తిరగగలుగుతున్నాం అంటే అది అల్-ఇద్రీసీ మహాశయుని చలవ వల్లనే అని గుర్తుపెట్టుకోవాలి. డచ్ దేశానికి చెందిన మెర్కేటర్ లాంటి భూగోళ శాస్త్రవేత్తలని ఆయన పటాలు ప్రభావితం చేశాయి.

ఇబన్ బతూతా సున్నీ మత శాఖకి చెందిన వ్యక్తి.అరబిక్ భాషలో పాండిత్యం సంపాదించి కాజీ గా పనిచేయడానికి తగిన విద్య అభ్యసించాడు.కైరో,జెరుసలేం,మక్కా లాంటి ప్రాంతాల్లో మూడేళ్ళు ఉన్నాడు బతూతా.కొన్ని నగరాలకి ఇప్పుడున్న పేర్లు అప్పటిలో లేవు అలాగే అప్పటి కొన్ని ప్రముఖ నగరాలు ఇప్పుడు లేవు.ఆ విషయం ఆయన వర్ణనల ద్వారా తెలుస్తుంది.ఆయన బయలు దేరిన ఆ కాలం లో మన దగ్గర ఎర్రాప్రగఢ మహాభారత అనువాదం చేస్తున్నాడు. ఇంగ్లండ్ లో చాసర్ కాంటర్బరీ టేల్స్ రాస్తున్నాడు. 

ఎడారుల్లో ,అడవుల్లో,జనావాసాల్లో ప్రయాణిస్తూ మసీదులు ఉన్నచోట స్థానికుల కోరిక మేరకు కాజీ గా పనిచేస్తూ ముందుకి సాగిపోయాడు.ప్రస్తుతం ఉన్న కాబుల్,అలెగ్జాండ్రియా , డమస్కస్,ఇట్లా ఎన్నో ప్రాంతాల్లో విడిది చేస్తూ మక్కా లో కొన్ని ఏళ్ళు గడిపి తన ప్రయాణాల్ని సాగించాడు.

అక్కడ తనకి కలిగిన ఎన్నో అనుభవాలను, సామాజిక స్థితిగతుల్ని విపులంగా రాశాడు. అయితే ఢిల్లీ వచ్చిన దగ్గరనుంచి కొన్నింటిని మనం చదివి తెలుసుకోవాలి.మధ్యయుగాల భారతం ని మన కళ్ళముందు ఉంచుతాడు.మహ్మద్ బిన్ తుగ్లక్ బతూతా ని కాజీ గా నియమించగా ఢిల్లీ లో ఏడేళ్ళు ఆ ఉద్యోగాన్ని చేసి,సుల్తాన్ యొక్క సాయం తో మలబార్ తీరానికి వస్తాడు. 

అక్కడి పరిస్థితుల్ని ఎంతో విపులంగా వర్ణించాడు. అక్కడి నుంచి మాల్దీవులకి పడవుల్లో బయలుదేరడం, ఆ అనుభవాలు మనకి ఆసక్తికరంగా అనిపిస్తాయి.కాశీ నుంచి దౌలతా బాద్ కి 40 రోజుల్లో వస్తాడు,అది చదివినపుడు ప్రస్తుత ప్రయాణ వేగాలు గుర్తు వచ్చి ఔరా ఎంత అభివృద్ది జరిగింది అనిపించక మానదు.              

మాల్దీవుల్లో చాలా వరకు ముస్లింలు ఉన్నప్పటికీ స్త్రీలకి బుర్ఖా పద్దతి లేదని చెబుతాడు. ఇక్కడి ప్రజలు నైతిక ప్రవర్తన గలవారని అంటూ కొబ్బరికాయలు,తమలపాకులు ,సుగధ ద్రవ్యాల్ని విదేశీయులకి అమ్మి ధనం ఆర్జించుచున్నారని రాశాడు బతూతా. మలబార్ దగ్గర లోని హిన్నావర్ సుల్తాన్ ఈయనకి భోజనం పెట్టి బాతు,కోడి మాంసాలు వడ్డిస్తాడు. 

అలాగే గడ్డ పెరుగు కూడా చాలా బాగుందని అంటాడు.చెట్ల కింద మామిడి కాయలు పడి ఉన్నా ఎవరూ దొంగతనం గా తీసుకోవడం లేదని వివరించాడు. మాల్దీవుల నుంచి సిమ్హళం చేరతాడు.మార్తాండ సింగై అరియార్ అనే హిందూ రాజు ఆ రోజుల్లో సిమ్హళాన్ని పాలించినట్లు రాస్తూ,విలువైన రాళ్ళు ఇక్కడ బాగా దొరుకుతున్నాయని చెబుతాడు. 

బెంగాల్ కి వెళ్ళి,అక్కడి నుంచి బర్మా ప్రాంతం, మళ్ళీ కిందికి సుమత్రా దీవులకి చేరి అక్కడి నుంచి కాంబోడియా వెళతాడు. అక్కడ నుంచి క్వాన్ జౌ అనే చైనా ఓడరేవు కి చేరతాడు.అక్కడ అనేక దేశాల నౌకలు ఉన్నట్లు చెబుతాడు.

ఎన్నో ఎన్నెన్నో చిన్న పట్టణాలు ,అక్కడి అనుభవాలు ఆసక్తిగా ఉంటాయి. చైనా లోని ఆలయాలు తమకి దానాల ద్వారా వచ్చిన సంపద ని ముసలివారికి,పేదవారికి వినియోగిస్తున్నట్లు తెలుసుకుంటాము. ఆ తర్వాత చైనా నుంచి తిరుగు ప్రయాణం మొదలుపెడతాడు.

 అప్పటికీ తనకి 45 ఏళ్ళు వచేస్తాయి. ఇంటికి చేరుకునే లోపులోనే తల్లి,తండ్రి ఇద్దరు మరణిస్తారు. వాళ్ళ సమాధుల్ని దర్శించుకుని నిర్వేదం గా జీవితం గడుపుతున్న ఇబన్ బతూతా ని తన అనుభవాల్ని రాయవలసిందిగా స్నేహితులు కోరుతారు. 

మార్కోపోలో కంటే మూడు రెట్లు ప్రపంచ దేశాల్లో తిరిగి,లక్షా ఇరవై వేల కిలో మీటర్లు చుట్టి వచ్చిన నువ్వు మన అరబ్బుల యొక్క గొప్పదనాన్ని చాటడానికయినా ప్రయాణ అనుభవాల్ని రాయమని స్థానిక సుల్తాన్ ఇబన్ బతూతా కి చెప్పి మాట తీసుకుంటాడు. ఒక లేఖకుడిని కూడా సాయం గా ఇస్తాడు.

ఏడు భాగాలుగా ఈ గ్రంథాన్ని రిహ్లా అనే పేరుతో రాయడం జరిగింది. దురదృష్టవశాత్తు  ఈ గ్రంథం అల్జీరియా లో మూడు వందల ఏళ్ళ కి పైగా ఎవరికీ కనిపించకుండా పోయింది.చివరకి దీని ఫ్రెంచ్ అనువాదం 1853 -58 మధ్య కాలం లో రావడం తో , ఆ తర్వాత ఇంగ్లీష్ లోకి కూడా తర్జూమా చేశారు.మొరాకో లో ఇబన్ బతూతా స్మృత్యర్ధం ఒక మ్యూజియం నిర్మించారు.

ఎన్నో శిల్పాలు పెట్టారు.అక్కడి ఓ విమానాశ్రయానికి కూడా ఆయన పేరు పెట్టారు.దుబాయ్ లో కూడా బతూతా మాల్ అని ఓ పెద్ద నిర్మాణం చేశారు. మన తెలుగు పాఠకులకి ఇబన్ బతూతా ప్రయాణాల్ని అందించడానికి కృషి చేసిన మాచవరపు ఆదినారాయణ ఎంతో అభినందనీయులు. 272 పేజీల ఈ పుస్తకాన్ని "సాహితి" సంస్థ ప్రచురించింది.వెల రూ.300/- అమెజాన్ లోనూ, అన్నీ ప్రముఖ పుస్తకాల షాపుల్లోనూ లభ్యమవుతోంది.

----- మూర్తి కె.వి.వి.ఎస్. (7893541003)                

No comments:

Post a Comment