Tuesday, December 17, 2024

డీప్ ఫేక్ సాఫ్ట్ వేర్ తో కొంతపుంతలు తొక్కుతున్న సైబర్ దొంగలు

 డీప్ ఫేక్ సాఫ్ట్ వేర్ తో కొంతపుంతలు తొక్కుతున్న సైబర్ దొంగలు

-----------------------------------------------------------------------------------------

ఆన్ లైన్ స్కాం లు చేయడం లో కొత్త పుంతలు తొక్కుతూ ఎంతో కొంత డిజిటల్ జ్ఞానం ఉన్నవారిని సైతం బురిడి కొట్టిస్తున్నారు సైబర్ మోసగాళ్ళు. డీప్ ఫేక్ అనే సాఫ్ట్ వేర్ ని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సహకారం తో డెవెలప్ చేసి ఫేక్ వీడియోల్ని తయారుచేస్తూ జనాల ఖాతాల్ని కొల్ల గొడుతున్నారు. 

ఇలాంటి ఓ గ్యాంగ్ ని ఇటీవల హాంగ్ కాంగ్ పోలీసులు పట్టుకోగా వాళ్ళు తైవాన్, సింగపూర్, ఇండియా దేశాల్లోని వారిని మోసగించి కోట్లాది రూపాయల్ని ఆర్జించినట్లు తేలింది. రొమాన్స్ స్కాంస్,ఇన్వెస్ట్ మెంట్ స్కాంస్ చేయడం ప్రస్తుతం ఓ రివాజు గా మారింది.వీళ్ళు మోసం చేసే విధానం తెలుసుకుంటే కళ్ళు బైర్లు కమ్ముతాయి. వీరికి ఎంత సృజనాత్మకత ఉంది అనిపించకమానదు.

ఉదాహరణకి ఓ స్కాం ఇలా ఉంటుంది. ఒక రోజున మంచి అందమైన అమ్మాయి ఒక వ్యక్తికి మెసేజ్ పంపిస్తుంది. ఇదేమిటబ్బా...అనుకుంటుండగా ఆ అమ్మాయి ఫోన్ చేసి తను పొరబాటుగా పంపించానని చెప్పి తన వివరాల్ని సందర్భానుసారం వివరిస్తూ ,క్రమేణా ప్రతిరోజు మాటాడేలా చేస్తుంది. డీప్ ఫేక్ సాఫ్ట్ వేర్ ద్వారా మీ అలవాట్లని,మీరు ఇతరులతో ఏం మాట్లాడతారు,ఏం చేస్తుంటారు ఇలాంటి మీ డేటా అంతా కనిపెడతారు. 

దానికి అనుగుణం గా మీకు కథలు వినిపిస్తూ చివరకి తాము చెప్పిన వెబ్ సైట్ల లో పెట్టుబడి పెట్టే విధంగా చేస్తారు.దానికి గాను ఆ అమ్మాయి మీకు ప్రేమ కబుర్లు చెబుతుంది.ట్రావెల్ ట్రిప్ కూడా ఆఫర్ చేస్తుంది. వాళ్ళ డీల్ పూర్తి అయిన తర్వాత అవతల వాళ్ళకి వినిపించరు.కనిపించరు. ఈ ఫ్రాడ్ లు చేసేవాళ్ళు ఇతర దేశాల్లో ఉండటం వల్ల అరెస్ట్ చేయడం సులువు కాదు. అనేక ఫ్రాడ్ యాప్ ల్లో వీళ్ళ మాట నమ్మి పెట్టుబడులు పెట్టిన వారున్నారు.

ఇక ఇంకో తరహా మోసం ఏమిటంటే డిజిటల్ అరెస్ట్. మిమ్మల్ని అరెస్ట్ చేశామని ,మీమీద వర్చ్యువల్ గా కోర్ట్ లో ఆర్గ్యుమెంట్ జరుగుతోందని కొన్ని వీడియోలు పంపుతారు.ఆ వీడియోల్లో జడ్జ్ లు,లాయర్లు అందరూ కనిపిస్తుంటారు.మీ పేరు కూడా ప్రస్తావిస్తుంటారు.ఇంకా విచిత్రం ఏమిటంటే మనకి తెలిసిన జడ్జ్ మొహం కనిపించినా బిత్తర పోనవసరం లేదు.ఆ మధ్య ఓ వీడియోలో జస్టిస్ వైవి చంద్రచూడ్ గారి నే వీడియోలో చూపించి బెదరగొట్టారంటే వాళ్ళ చాకచక్యం ఏవిధంగా ఉందో గమనించవచ్చు.

 ఇది మాత్రమే కాదు ప్రముఖ వ్యక్తులు విరాట్ కొహ్లీ,రతన్ టాటా, ముఖేష్ అంబానీ లాంటి వారు కొన్ని వీడియోల్లో కనబడి ఫలానా కంపెనీల్లో లేదా యాప్ లలో  పెట్టుబడి పెట్టండి అని చెబితే కూడా నమ్మకండి. ఇలాంటి వీడియోల్ని ప్రతిరోజు వెయ్యి వెబ్ సైట్ లలో ఆన్ లైన్ ఫ్రాడ్ స్టర్లు పెడుతున్నారు. డీప్ ఫేక్ సాఫ్ట్ వేర్ తో ఇలాంటి వీడియోల్ని తయారు చేస్తున్నారు.

గంధర్వులు తాము కోరిన రూపాన్ని ధరించగలరని మనం పురాణాల్లో చదువుకున్నాం. అయితే ఇప్పటి ఈ ఘరానా మోసగాళ్ళు మనుషుల్ని పోలిన మనుషుల్ని ఆన్ లైన్ లో ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ ద్వారా సృష్టించి డీప్ ఫేక్ సాఫ్ట్ వేర్ సాయంతో తాము అనుకున్న విధంగా వీడియోలు తయారు చేస్తూ ఎంతోమందిని మోసం చేస్తున్నారు. మరయితే వీటిని కనిపెట్టలేమా ? కృత్రిమ మేధ ని ఉపయోగించి వీడియోలు చేస్తున్నపుడు ప్రతి వీడియోకి ఓ "ఆర్టిఫేక్ట్" ని గుర్తుగా భద్రపరుస్తుంది.దీన్ని జెనెరేటివ్ ఏడ్వర్సరియల్ నెట్వర్క్ అని వ్యవహరిస్తారు.

 ఆధునిక డిటెక్షన్ సిస్టెంస్ తో వీటిని కనిపెట్టవచ్చు. ఎంతో విజ్ఞానం పెరుగుతూ మానవాళికి మేలు జరుగుతోందని ఓ వైపు భావిస్తుండగా దాన్ని దుర్వినియోగం చేసి అక్రమ మార్గాల్లో ఇతరులని దోపిడి చేస్తున్నవారు మరి కొందరు. ప్రతి ఒక్కరు సాధ్యమైనంతవరకు ఇలాంటి విషయాల్ని గమనిస్తూ తమని తాము ఈ నూతన తరపు దోపిడీ దొంగల బారి నుంచి కాపాడుకోవాలి.  

----- మూర్తి కెవివిఎస్ (చరవాణి : 78935 41003) 

ప్రస్తుత కాలం లో డిజిటల్ పత్రికల పాత్ర

 ప్రస్తుత కాలం లో డిజిటల్ పత్రికల పాత్ర

-------------------------------------------------------

 ప్రింట్ మీడియా , డిజిటల్ మీడియా ముందు నిలబడగలుగుతుందా ? ఈరోజున ప్రతి ఒక్కరి చేతిలో మొబైల్స్ ఉన్నాయి. క్షణాల్లో ఈ-పేపర్ గాని,వెబ్ సైట్ లేదా సోషల్ మీడియా లింక్ ని పంపించవచ్చు. అలాంటప్పుడు పేపర్ కొని చదవడం ఎవరు చేస్తారు అని చాలా మంది భావిస్తుంటారు. అయితే అది పూర్తిగా నిజం కాదు. ప్రింట్ లో వచ్చే పేపర్ యొక్క విశ్వసనీయత వేరు. 2023 లో తేలిన గణాంకాల ప్రకారం ప్రింట్ మీడియా ముందంజ లోనే ఉన్నదని చెప్పాలి.

 ఆ రంగానికి వచ్చిన మొత్తం రెవిన్యూ 260 బిలియన్ రూపాయలు అని , ఆ రకంగా చాలామంది అనుకున్న దానికి భిన్నంగా ప్రింట్ అయిన న్యూస్ పేపర్ తన ఆధిక్యత నిలుపుకుంటూనే ఉన్నది. డిజిటల్ మీడియా రంగ ప్రవేశం చేయడం తో స్థానిక వార్తా పత్రికలు వెల్లువెత్తుతున్నాయి. వాట్సాప్ గ్రూప్ ల ద్వారా ఇంకా సోషల్ మీడియా లో లింక్ లు షేర్ చేయడం ద్వారా అత్యంత త్వరగా పఠిత కి చేరువ అవుతున్నాయి.సమాచారం వేగంగా ప్రవహిస్తోంది. అది కాదనలేని వాస్తవం.

అంతేగాక పెద్ద మీడియా సంస్థల గుత్తాధిపత్యానికి తెరపడిందని చెప్పవచ్చు. వార్త కి ఉన్న బహుముఖాల్ని వివిధ ఆన్ లైన్ పత్రికలు బయటకి తెస్తున్నాయి. ఒక లాప్ టాప్ , రాయగలిగే సత్తా ఉంటే చాలు ... డిజిటల్ రూపం లో వార్తలు మోసుకువస్తోన్న పత్రికలు ఎన్నో. అయితే అన్నిటికీ ఒకే రకమైన ఆదరణ ఉండటం లేదు. విశ్లేషణ లోనూ,నమ్మకమైన వార్తల్ని ఇతర ఫీచర్స్ ఇవ్వడం లోనూ నిజాయితీ ని,నాణ్యత ని కలిగిఉన్న డిజిటల్ పత్రికలకి ఆదరణ ఉంటోంది. 

కేవలం సంచలనాలు మాత్రమే కాకుండా స్థానిక సంస్కృతుల్ని,కళల్ని,ప్రత్యేక లక్షణాల్ని వెలికితీసే దిశగా డిజిటల్ పత్రికలు కృషి చేయాలి. ప్రింట్ పత్రికలకి ఉండే స్పేస్ ప్రోబ్లం అనేది వీటికి ఉండదు. అది గమనించి వివిధ కళాకారుల,సాహితీకారుల ఇంటర్వ్యుల్ని ప్రచురించాలి. కేవలం స్టేట్ మెంట్లు ఇంకా రాజకీయ వార్తలకి మాత్రమే పరిమితం కారాదు. 

శ్వసనీయత లేని సమాచారం ఇచ్చినపుడు చదువరి కి ఆ డిజిటల్ పత్రిక పై సరైన అభిప్రాయం నెలకొనదు. ముఖ్యం గా ఈ తరహా పత్రికలపై చిన్నచూపు ఏర్పడటానికి కారణం ఇదే. ప్రింట్ మీడియా లోనూ ఇటువంటివి లేవా అంటే ఉన్నాయి. కాని సంఖ్యలో తక్కువే అని చెప్పాలి.ప్రింట్ అయిన పేపర్ ని ఒకటి రెండు సార్లు చదివే వీలుంది.దాన్ని దాచుకోవచ్చు,మళ్ళీ అనువుగా ఉన్నప్పుడు తిరగేయవచ్చు. కానీ డిజిటల్ రూపం లో ఉండే పత్రిక లింక్ పొరబాటున డిలీట్ అయితే మిగాతా వాటిల్లోనుంచి దాన్ని కనిపెట్టడం కష్టం. 

చదువరి కి మళ్ళీ దాన్ని చదివే ఆసక్తి కూడా పోతుంది. అదీగాక అంతర్జాల ప్రపంచం లో మహా సముద్రం లా ఉండే సమాచారాన్ని వెనుకా ముందూ చూడకుండా పేజీలకి పేజీలు కుమ్మరించినా ఫలితం ఉండదు. ఏది ఎంతవరకు అవసరమో అంతే ఇవ్వగలగాలి. ఎన్నికలకి ముందు వచ్చే పెయిడ్ ఈ పేపర్లు కొంత కాలం మాత్రమే మనగలగడం చూస్తూనే ఉన్నాం.

మనిషి ఉన్నంత వరకు వార్త పట్ల ఆసక్తి ఉంటుంది. అది కొన్ని కాల మాన పరిస్థితుల్లో వివిధ రూపాల్లో వ్యక్తం అవుతుంది. క్రీ.శ.200 సంవత్సరం లో మొట్టమొదటిగా చైనా దేశం లో వార్తా పత్రిక అనే భావన మొగ్గ తొడగగా యూరపు లోని వివిధ దేశాల్లో క్రీ.శ.1400 సంవత్సరానికి గానీ ప్రింట్ రూపం లో చదువరుల చేతుల్లోకి వెళ్ళింది. ప్రస్తుతం డిజిటల్ రూపం లో చేతి వేలు నొక్కితే చాలు అవతల వారిని చేరుకునే దశకి చేరుకుంది. 

ప్రస్తుతం ప్రపంచం లో 83 శాతం పైగా జనాభా స్మార్ట్ ఫోన్ లు కలిగి ఉన్నారు.సరిగా ఉపయోగించగలిగితే చాలా పెద్ద మార్కెట్ గా పరిణమిస్తుందని ఈపాటికే నిరూపించబడింది. 1966 లో పార్లమెంట్ ఆమోదం ద్వారా ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఆవిర్భవించి స్వయంగా ఓ రెగ్యులేటరీ వాచ్ డాగ్ గా పనిచేస్తోంది.అయితే ప్రింట్ మీడియాకే అది పరిమితమైంది. దానివల్ల ఆన్ లైన్ లో వెలువడే వార్తాపత్రికల కోసం 2000 సంవత్సరం లో ది ఇంఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ చేయబడింది.

ఆడియో,వీడియో, వెబ్ సైట్, సోషల్ మీడియా ల ద్వారా వెలువడే వార్తా పత్రికల విషయం లో ఖచ్చితమైన నియమ నిబంధనలు లేవని ,వీటిని మరింత స్పష్టం గా నిర్వచించవలసిన అవసరం ఉందని నిపుణులు కొంతమంది భావిస్తున్నారు. అయితే భావ స్వాతంత్ర్యం ని హరించి, స్వేచ్ఛ కి సంకెళ్ళు వేసే విధానం ప్రపంచం అంతా కుగ్రామం గా మారిపోయిన ఈ అంతర్జాల యుగం లో కుదరని పని అని మరికొంతమంది భావిస్తున్నారు.

పెట్టుబడిదారుల గుత్తాధిపత్యం నుంచి విముక్తి పొంది ఎందరో మేధావులైన పాత్రికేయులు సొంత మీడియా ని ఏర్పాటు చేసుకొని ముందుకు సాగుతున్నారు. అంతేగాక అసంఖ్యాక ప్రజల అభిమానాన్ని సైతం పొందగలుగుతున్నారు. యువత సైతం పెద్ద ఎత్తున ఈ రంగం లోకి ప్రవేశించి ఎన్నో ప్రయోగాలు చేస్తున్నారు. రానున్న రోజుల్లో ఈ డిజిటల్ పాత్రికేయం ఏ తీరాలకి చేరనున్నదో వేచి చూద్దాం. ఏది ఏమైనప్పటికి ప్రింట్ మీడియా సైతం మరో వైపున తన ప్రయాణం అది చేస్తూనే ఉంటుంది.


----- మూర్తి కెవివిఎస్ (చరవాణి : 78935 41003)  



Sunday, November 3, 2024

వ్యాపార యుద్ధం లో ఆరితేరిన మార్వాడీ లు

 వ్యాపార యుద్ధం లో ఆరితేరిన మార్వాడీ లు 

------------------------------------------------------- 

అసలు మార్వాడి వాళ్ళు అంటే ఎవరు, వాళ్ళు ఓ కులానికి చెందిన వాళ్ళా అని మనల్ని ఎవరైనా అడిగితే చప్పున మనకి స్ఫురించక పోవచ్చు. ఇంకా కొంత మందికి వారంతా ఉత్తరాది కి చెందిన సమూహం. అంతే, కానీ అంతకు మించి వాళ్ళు ఏ ప్రదేశం నుంచి బయలుదేరి దేశం లోని అనేక మూలలలోకి వెళ్ళి వ్యాపారాలు చేస్తూ ఎలా సక్సెస్ అవుతుంటారో తెలియదు. నిజం చెప్పాలంటే రాజస్థాన్ లోని బర్మార్,జోధ్ పూర్, నాగోర్, చూరు,పాలి,శిఖర్ ఈ జిల్లాల నుంచి వచ్చిన వారు. ఆ ప్రాంతాలు అన్నిటినీ కలిపి మార్వార్ అని వ్యవహరిస్తారు. అక్కడ నుంచి వచ్చారు కాబట్టి ఆ ప్రజల్ని అందర్నీ కలిపి మార్వాడీ లు అంటారు.

మార్వాడీల్లో ఎక్కువగా హిందువులు ఉంటారు. అలాగే జైనులు,ముస్లిం లు కూడా ఉంటారు. అయితే సంఖ్యాపరం గా తక్కువ గా ఉంటారు. అలాగే మర్వాడీ ల్లో బనియాలు ఉండవచ్చు గాక కాని అందరు మర్వాడీలు వ్యాపారం చేస్తారు కనక అందర్నీ బనియా లు అనడానికి వీల్లేదు. హిందువుల్లో వ్యాపార సామాజికవర్గాన్ని మాత్రమే నార్త్ లో బనియాలు గా వ్యవహరిస్తారు. మార్వాడీ ల్లో ఖండేల్వాల్,మహేశ్వరి,ఓస్వాల్ ఇలాంటి ఇంటి పేర్లు బాగా వినిపిస్తుంటాయి. చాలావరకు శాఖాహారులు. 16 వ శతాబ్దం నుంచే వీళ్ళు వ్యాపారాన్ని తమ ప్రధాన వృత్తిగా చేసుకున్నారు. దేశం లోని దాదాపు అన్ని రాష్ట్రాల్లోకి వ్యాపించారు. ఎక్కడికి వెళ్ళినా విజయవంతంగా వ్యాపారాల్లో ముందంజ లో ఉంటారు. మన దేశం లోని బిలియనీర్ల లో 42 శాతం మంది మార్వాడీలే ఉన్నారు.

బిర్లా కుటుంబం కూడా మార్వాడీ సమూహానికి చెందినదే. మార్వాడీలు మాట్లాడే భాష రాజస్థాన్ లోని మార్వార్ ప్రాంతానికి చెందినది.ముంబాయి,కలకత్తా,చెన్నయ్,ఢిల్లీ,బెంగుళూరు ఇలా దేశం లోని ఏ నగరం లో చూసినా మార్వాడీలు లేని ప్రాంతం లేదు. తాము ఉన్న మార్వార్ ప్రాంతం లో వ్యవసాయం తక్కువ. సారవంతమైన నేల లేకపోవడం తో వాళ్ళ దృష్టి వ్యాపారం వైపు మళ్ళింది. తమకి ఎక్కడ అనువుగా ఉంటే అక్కడ వ్యాపారాలు ప్రారంభిస్తూ దేశం నలుమూలలా విస్తరించారు. కష్టమర్ల తో చక్కటి సంభందాన్ని కొనసాగిస్తూ వ్యాపారాన్ని వృద్ధి చేయడం లో దిట్టలు. మనీ మేనేజ్ మెంట్ లో వారిది ప్రత్యేక శైలి. చిన్నతనం నుంచే పిల్లల్ని వ్యాపారాల్లో దించి శిక్షణ ఇస్తారు. వచ్చిన లాభాల్ని తెలివిగా మదుపు చేస్తారు.

వ్యసనాలకి దూరం గా ఉంటారు. వాళ్ళు గుట్ఖా వ్యాపారం చేసినా జనాలకి అమ్ముతారు తప్పా తమ కుటుంబం లోకి రానివ్వరు. తమ సమూహం లో ఎవరికైనా అవసరం అయితే పెట్టుబడి కి సాయం చేస్తారు. మిట్టల్ గ్రూప్,హిందూజా గ్రూప్,బిర్లా గ్రూప్ ఇలాంటి వ్యాపార దిగ్గజాలు ఎందరో దేశ విదేశాల్లో మార్వాడీ ల వైభవాన్ని ఇనుమడింప జేస్తున్నారు. చిన్న పట్టణాల్లో సైతం వీళ్ళు అనేక రకాల వ్యాపారాలు నిర్వహిస్తుంటారు. వాచ్ మెన్ దగ్గర్నుంచి సర్వెంట్ ల వరకు తమ వాళ్ళకి మాత్రమే ఉద్యోగ అవకాశాలు కల్పిస్తుంటారు తప్పా స్థానికులకి ఉద్యోగాలు ఇవ్వరని వీరి మీద ఒక ఆరోపణ వినిపిస్తుంది. ఆ మధ్య చెన్నయ్ లాంటి నగరాల్లో మార్వాడీలకి వ్యతిరేకం గా స్థానిక వ్యాపారులు గళం ఎత్తినప్పటికీ అవి ఎందుచేతనో సద్దుమణిగిపోయాయి. బిజినెస్ ఈజ్ ఏ వార్ అని మేరియో ప్యూజో అనే ఆంగ్ల రచయిత అంటాడు. ఆ యుద్ధం లో గెలవడానికి కావలసిన అన్ని ఎత్తుజిత్తులు వాళ్ళ దగ్గర పుష్కలంగా ఉన్నాయని చెప్పాలి. 


----- మూర్తి కెవివిఎస్ (చరవాణి : 7893541003)     

  



Friday, October 4, 2024

గోపీనాథ్ మొహంతి "అమృత సంతానం" నవల పై ఓ రివ్యూ

 గోపీనాథ్ మొహంతి "అమృత సంతానం" నవల పై ఓ రివ్యూ

--------------------------------------------------------------------------------

గోపీనాథ్ మహంతి గారు ఒరియా భాష లో కోంధ తెగ పై రాసిన అద్భుతమైన నవల ని పురిపండా అప్పలస్వామి గారు "అమృత సంతానం" పేరు తో అనువదించారు.ఆ రకంగా మన తెలుగు అనువాద సాహిత్యం లో ఓ మణిపూస వచ్చి చేరింది.543 పేజీలు గల ఈ పుస్తకాన్ని కాస్త మెల్లగానే చదవ వలసి వచ్చింది.మిగతా లౌకిక వ్యవహారాల సందడి లో బడి..!


నా అభిప్రాయాన్ని పంచుకోవాలని ఎంతో ప్రయత్నించగా ఇప్పటికి పడింది.ఒక మహా తేజస్సు ని కంటి తో చూసినప్పుడు ఒక్కసారి గా మ్రాన్ పడిపోతాము.దాని గురించి ఎక్కడ మొదలు పెట్టి ఏమి చెప్పాలో అర్ధం కాని స్థితి ఉంటుంది. ఈ నవల చదివిన తర్వాత సరిగ్గా అలాగే అనిపించింది.దేనిని వదిలి వేయాలి దేనిని చెప్పాలి అలా అయింది నా పరిస్థితి.

 ఎక్కడో అవిభక్త కోరాపుట్ జిల్లా లోని ఓ మారు మూల అరణ్య వాసాల్లోకి వెళ్ళిపోతాము.అక్కడి చెట్లుపుట్టలు,రుతువులు,జంతువులు,కోంధ జీవనం లోని ఎగుడు దిగుళ్ళు ఇంకా అది ఒక్కటే కాక సగటు మానవ జీవనం లోని రంగులు..ఎన్నని ? అన్నిటిని మహంతి గారు రాశారు అనడం కంటే తాను సాక్షి గా నిలిచి మనకి చూపించారు అనాలి.ఆయన లియో టాల్స్ టాయ్ ని అనువదించారు.గొప్పగా అర్ధం చేసుకున్నారు.కనుకనే ఒక సౌందర్యాన్ని ,దాని రెండు వైపుల్ని ఎంతో నేర్పు గా మన కళ్ళముందుంచారు.

ఎంత చిన్న వాక్యాలు.ఎంత గుండెల్ని పట్టి ఊపి వేసే నేర్పు.ఏ పాత్ర స్వభావం దానిదే,ఎక్కడా తెచ్చిపెట్టుకున్న శైలి లేదు.అంత అందం గానూ పురిపండా వారి అనువాద నైపుణ్యం సాగింది.ఒరియా సొబగులు క్షుణ్ణం గా ఎరిగిన కళింగాంధ్రుడు ఆయన. వాడ్రేవు చిన వీరభద్రుడు గారి చొరవ వలన అనేక మంది ఈ నవల పై తమ అభిప్రాయాల్ని రాశారు.అది ఒక చక్కని ప్రయోగం.అక్కడ ప్రస్తావించినవి కాక ఇంకొన్ని ఇతర విషయాలు ముచ్చటించ యత్నిస్తానుసరే..నా వల్ల అయినంత మేరకు రాస్తాను. 

ఊరి పెద్ద ,వయో వృద్దుడు అయిన దివుడు సావోతా తండ్రి మరణం తో కధ మొదలవుతుంది.దివుడు ఒక ప్రధాన పాత్ర అనాలి.ఎవరినో ఒకరిని నాయకీ నాయకులు గా  ఊహించలేము. చాలా పాత్రలు పోటీకి వచ్చి నిలుస్తాయి.అదే దీనిలోని గమ్మత్తు.దివుడు భార్య పుయు గాని,మన తెలుగు నేల మీద పెరిగి అచటికి వెళ్ళి కొంధ సమాజం లో కలిసిపోవడానికి ప్రయత్నించి చివరికి దివుడిని చేసుకున్న పియోటి గాని,పుబులి అనబడే దివుడి చెల్లెలు గాని,వయస్సు పరం గా తానే తన అన్న తర్వాత ఊరి పెద్ద కావాలని తపించే లెంజు కోదు గాని,ఇంటిలో వెలితి తో బయటికి చూసే సోనా దేయి గాని ఇలా ఏ పాత్ర స్థానం దానిదే.ఇంకా చాలా చిన్న పాత్రలు తారసపడతాయి.

ఒక ముఖ్య విషయం చెప్పాలి.మహాంతి గారు ఎక్కడ కూడా ఎవరి వైపూ నిలబడి తీర్పు ఇవ్వడు.అలాగే శృంగార సన్నివేశాలు కూడా ఒక పరిధి దాటి వర్ణించడు కాని ఆ అనుభూతిని కొన్ని మాటల్లోనే చెప్పి ఆ సంఘటన ని బలపరుస్తాడు.సోనా దేయి ని సోదా చేయడానికి అధికారులు వచ్చినప్పటి సన్నివేశాన్ని దీనికి ఉదాహరణ గా చెప్పవచ్చును.అలాగే దివుడికి,అతని భార్య కి మధ్య వచ్చే ఎడం కూడా ఎంత సున్నితం గా  ఉంటుందో.అక్కడ ఆ యిద్దరి లో ఎవరిని తప్పని అనలేము.ఎంతో ఏరి కోరి దివుడు ఆమె ని చేసుకుంటాడు.పిల్లవాడు పుట్టినతర్వాత భార్య భర్త మీద కాక ధ్యాస ని ఎక్కువ పిల్లవాడైన హాకినా మీద పెట్టడం,తన సొగసు మీద కూడా దృష్టి పెట్టకపోవడం ,భర్త దగ్గరకి వచ్చినప్పుడు దూరం పోవడం ఇవన్నీ దివుడు లో ఆ భాష లో చెప్పాలంటే సిర్ర పుట్టిస్తుంది.

అందువల్ల తను  బయట కి చూడటం మొదలవుతుంది.మళ్ళీ ఒకవైపు భార్య ని చూసినప్పుడు తన లో ఆత్మశోధన మొదలవుతుంది. ఎంత బక్క గా అయిపొయింది, పిల్లవాని ఆలనా పాలనా ,ఇంటి పనులు ఇవన్నీనూ ఆమెకి అని దివుడు మరోవైపు ఆలోచిస్తాడు.ఊరు కి పెద్ద తలకాయ తను కొరితే ఎంతో మంది వస్తారు కాని అప్పటికీ ఎంతో సమ్యమనం తో వ్యవహరించినట్లే అనుకోవాలి.పియోటి వంటి జాణతనం ఉన్న స్త్రీ తో కూడా ఎంతో జాగ్రత్త గా వ్యవహరిస్తాడు,ఆమె ఇతడిని పెళ్ళి చేసుకోవాలని ప్రయత్నిస్తున్నప్పటికీ.
సరే..చివరకి ఆమె సఫలమవుతుంది.

ఎంత అనుకున్నా మనిషిని నడిపించే చోదకశక్తుల లో ప్రధానమైనది శృంగారమే,అది ఏ సమాజమైనా.డబ్బు మీద ప్రేమ బయటకి కనబడుతుంది.దాన్ని బయటకి చూపించడం లో తప్పు లేదనుకుంటాడు మనిషి.కాని మొదటి దాన్ని ఉన్నది ఉన్నట్లు ఒప్పుకోడానికి సంఘ నీతి గట్రా అడ్డం గా నిలుస్తాయి.మళ్ళీ ఇంకో కోణాన్ని చూడవచ్చు.సోనా దేయి దివుడు పట్ల ఆసక్తి చూపించి,రెచ్చగొట్టి చివరకి అతను ఆమె ని చేరుదామన్న తరుణం లో ఆమె రచ్చ చేయడం తాను ద్వేషించిన తన మగడిని పైకెత్తినట్లు చేయడం ఒక్కసారిగా నివ్వెరపరుస్తుంది.ఈ పాత్ర స్వభావం ని మనం ఎన్నో చోట్లా చూశామా అనిపిస్తే మన తప్పు కాదు.అలాగే వయసులో నలభై అయిదు దాటి ,భార్య చనిపొయి ఇంకో తోడు కోసం చూసే లెంజు కోదు తో సైతం ఈమె చనువు చూపుతుంది.శృంగార భావనలు రేపడమే తప్పా శృంగారం నెరిపినట్లు ఎక్కడా ఉండదు,ఆ చెకింగ్ అధికారి వచ్చిన సందర్భం లో తప్పా.

బాగా తరచి చూస్తే  ప్రతినాయకుల్లాంటి వారు తెలుగు వారే అని తేలుతుంది.దక్షిణాది నుంచి వచ్చిన వారని వ్యాపారస్తుల గురించి చెప్పడం ,ఆ పేర్లు అవీ ..ఇంకా పియోటి పెరిగిన,ఎరిగిన ఊర్లు మనుషులు గూర్చి రచయిత చెపుతున్నప్పుడు ఈ భావన  మనకి కలుగుతుంది.బారికి వంటి వారు ఆ కొంధ సమాజం లో దళారి వంటి వారే.బెజుణి,డిసారి వంటి వారు ఆ సంస్కృతి లోని భాగాలు.పులి అనేది ఎంత గొప్ప భాగమో ఆ జీవితంలో.అచటి కొంధ ప్రజలు  వేటకి తుపాకులు ఉపయోగించడం మన జీవనం తో పోల్చితే కొత్త గా అనిపిస్తుంది.

సరే..మిగతా సంప్రదాయ ఆయుధాల తో పాటు. దీనిలో చాలా వర్ణనలు అనేక ఏళ్ళ పాటు మనలో నిలిచిపోతాయి.ఎప్పటికప్పుడు కొత్తగా తోస్తాయి.దానికి కారణం రచయిత జీవితాల్ని మన ముందు ఉంచుతాడే తప్పా ఏ రకమైన గ్లాసు ల్లో నుంచి చూడకపోవడం అని భావిస్తాను.ఈ నవల లోని కొన్ని చక్కటి భాగాల్ని మీ ముందు ఉంచుతాను.వీలు కుదిరినప్పుడల్లా.వాటిని  చదివినప్పుడల్లా మహంతి గారి ఆలోచనా విధానమూ,ప్రత్యేకత మనకి అవగతమవుతాయి.

1955 లో ఈ నవల కి సాహిత్య అకాడెమి బహుమతి ప్రదానం చేయడం వలన ఇతర భాషల్లోకి ఆ సంస్థ కృషి చే వెళ్ళగలిగింది.అందుకు గాను ఆ సంస్థ ని అభినందించవలసిందే.ఆ రకంగా మనం తెలుగు లో చదవగలిగాము.కాని ఒకటి కటక్ లోని రావెన్ షా విశ్వ విద్యాలయం ఎంత గొప్పది అనిపిస్తుంది,అటు ఒరియా సాహిత్యం లో గాని ఇటు ఆంగ్ల సాహిత్యం లో గాని తారా తోరాణాలు గా నిలిచిన జయంత మహా పాత్ర,మనోజ్ దాస్ ఇంకా ఈ గోపీనాథ్ మహంతి  ఇలాంటి వారు కొన్ని డజన్ల మంది అక్కడ ఆంగ్ల సాహిత్యం,ఇతరములు చదువుకుని బయటకి వచ్చారు.ఒక ప్రాంతానికి గాని,ఊరికి గాని ,విద్యాలయానికి గాని వన్నె తెచ్చేది అక్కడినుంచి వచ్చిన మహానుభావులవల్లనే గదా.  

------   మూర్తి కెవివిఎస్ (7893541003)

-

మన ఆన్ లైన్ డేటా అంతా ఏమవుతుంది ?

 


మనం చనిపోయిన తర్వాత మన ఆన్ లైన్ డేటా అంతా ఏమవుతుంది ?

--------------------------------------------------------------------------------------------------

 ఇది డిజిటల్ యుగం. అనేక సోషల్ మీడియా వేదికల పైన ఇంకా వెబ్ సైట్ ల మీదమన అభిప్రాయాలు వ్యక్తపరుస్తుంటాం. అంతే కాదు ఎంతో సమాచారాన్ని మనం అనేక ప్లాట్ ఫాం ల మీద నిక్షిప్తపరుస్తుంటాం. మరి ఆ సమాచారం అంతా మనం చనిపోయిన తర్వాత ఏమవుతుంది. అది ఎవరి సొంతమవుతుంది అనే సందేహం రాకమానదు. అదంతా మన వారసత్వ సంపద గా ఎవరికైనా ఇద్దాం అనుకుంటే పొరబాటే కాగలదు. చాలా సోషల్ మీడియా వెబ్ సైట్ లు అంత తొందరగా అంగీకరించవు. పైగా తమ ప్లాట్ ఫాం ల మీద ఉన్న ప్రతి అక్షరం తమ స్వంతమని అవి భావిస్తాయి.

స్ బుక్, ఇన్స్టాగ్రాం, ఈ మెయిల్ అకౌంట్స్, ఆన్ లైన్ బ్యాంకింగ్ వివరాలు, గూగుల్ డ్రైవ్, డ్రాప్ బాక్స్ లో ఉన్న డేటా (క్లౌడ్ స్టోరేజ్) ఇదంతా ఏమవుతుంది అనే సందేహం రావచ్చు. ఫేస్ బుక్ విషయానికి వస్తే మన తదనంతరం అకౌంట్ కొనసాగించడానికి ఎవరికైనా వారసులకి యాక్సెస్ ఇవ్వవచ్చు. అయితే వాళ్ళు ప్రవేట్ మెసేజ్ లు పంపలేరు,చదవలేరు. ఫ్రెండ్ రిక్వెస్ట్ లు మేనేజ్ చేయవచ్చు. చనిపోయిన వారికి నివాళి సందేశాలు పోస్ట్ చేయవచ్చు. గూగుల్ కూడా ఇన్ యాక్టివ్ అకౌంట్ ని మేనేజ్ చేయడానికి అవకాశం ఇస్తుంది.వాళ్ళు చనిపోయిన వ్యక్తి డేటా ని మేనేజ్ చేస్తూ లెగసీ ని కొనసాగించవచ్చు.

ప్రస్తుతం ఎక్స్ గా పిలువబడుతున్న ట్విట్టర్ విషయానికి వస్తే కుటుంబ సభ్యులు ఎవరైనా తగు ప్రూఫ్ చూపించి అకౌంట్ ని కొనసాగించవచ్చు. లేకపోతే ఆరు నెలల తర్వాత ఆటోమేటిక్ గా అకౌంట్ ఇన్ యాక్టివ్ అయిపోతుంది. ఇక యాపిల్ ఐడి కి యాక్సెస్ కావడం కొద్దిగా కష్టమే. లీగల్ డాక్యుమెంట్లు సమర్పించకపోతే ఐక్లౌడ్ అకౌంట్ కి యాక్సెస్ ఇవ్వదు.ఇలాంటి విషయాలు ముందే తెలుసుకుని ఉండటం మంచిది. పైగా రకరకాల దేశాల్లో డేటా రైట్స్ చట్టాలు వేరు వేరుగా ఉంటాయి.ఉదాహరణకి 2012 లో  జర్మనీ దేశానికి చెందిన  దంపతులు తమ చనిపోయిన కుమార్తె యొక్క  చివరి క్షణాల్ని అర్థం చేసుకోవడానికి ఫేస్ బుక్ ప్రొఫైల్ యాక్సెస్ అడిగితే నిరాకరించింది. చివరకి వాళ్ళు కోర్ట్ కి వెళ్ళి ఆ రైట్స్ సాధించుకున్నారు.

కాబట్టి మనకి సంబంధించిన ఆన్ లైన్ అకౌంట్ల అన్ని వివరాల్ని ఓ లిస్ట్ గా రాసిపెట్టుకోవడం చేయాలి.ఏ అకౌంట్ ని డిలిట్ చేయాలి,ఏ అకౌంట్ ని కొనసాగించాలి లాంటివి ముందే ఆలోచించుకోవడం మంచిది.వివిధ వెబ్ సైట్ లు,ఆన్ లైన్ ప్లాట్ ఫాం లు రకరకాల నిబంధనలు కలిగిఉంటాయి.ఆ విషయాన్ని గుర్తుంచుకోవాలి. ద ఆఫ్టర్ లైఫ్ ఆఫ్ డేటా అనే పుస్తకం లో కార్ల్ ఓమన్ మన డేటా పై మనకి గల హక్కుల్ని గుర్తు చేస్తూ మనం ఎంతో కష్టపడి ఆన్ లైన్ పై సృష్టించిన సమాచారాన్ని కార్పోరేట్ కంపెనీలు హస్తగతం చేసుకోవడానికి అనుమతించకూడదు అని హెచ్చరిస్తాడు.కనుక ఈ విషయాలన్నిటిని గమనిస్తూ మన డిజిటల్ ప్రయాణాన్ని సాగించాలి.

----- మూర్తి కెవివిఎస్ (చరవాణి : 78935 41003) 



Wednesday, September 4, 2024

చైనా అంత చౌకగా తమ ఉత్పత్తుల్ని ఎలా అమ్మగలుగుతుందో తెలుసా?

 

చైనా అంత చౌకగా తమ ఉత్పత్తుల్ని ఎలా అమ్మగలుగుతుందో తెలుసా?

-------------------------------------------------------------------------------------------------

మేడ్ ఇన్ చైనా అనే అక్షరాల్ని ఎన్నిసార్లు చదివి ఉంటాము ? చౌక గా ఎన్ని రకాల వస్తువులు ఆ దేశం నుంచి మన దేశానికి దిగుమతి అవుతున్నాయో ఎప్పుడైనా ఆలోచించారా ? మన దేశం మాత్రమే కాదు సుమా దాదాపు ప్రపంచ దేశాల్లో ఎక్కడికి వెళ్ళినా అక్కడ చైనా ఉత్పత్తులు స్వాగతం పలుకుతాయి. మరి అందుచేతనే ఆ దేశాన్ని ప్రపంచపు కర్మాగారం అని పిలుస్తారు. అంత చౌకగా ఆ దేశం వాళ్ళ ఉత్పత్తుల్ని ఎలా ఇవ్వగలుగుతోంది అనే సందేహం ఎవరికైనా రాక మానదు. 

చైనా లో చవకగా తక్కువ వేతనాలతో పని చేయడానికి ముందుకు వచ్చే శ్రామికులు ఎక్కువ గా ఉంటారు. దానితో బాటు ఆ దేశం  యొక్క పారిశ్రామిక విధానం కూడా మరో కారణం. తక్కువ టాక్స్ లు,దిగుమతి సుంకాలు, తమ కరెన్సీ యువాన్ విలువ ని 30 శాతం వరకు తగ్గించడం ఇలాంటి ఉత్పత్తి పోకడలతో పెద్ద ఎత్తున తమ వద్ద ఉన్న మానవ వనరుల్ని ఉపయోగించి మిగిలిన వారి కంటే తక్కువ రేటు కి వస్తు విక్రయం చేస్తూ మార్కెట్ లని కంట్రోల్ చేస్తుంది.

ఏ ప్రాంతం లో ఏ పరిశ్రమ పెట్టాలో నిర్ణయించుకున్న తర్వాత సప్లయ్ చేసే నెట్వర్క్, డిస్ట్రిబ్యూటర్లు, ఉత్పత్తి చేసే ఉద్యోగ గణం అందరూ ఉమ్మడిగా పనిచేస్తారు. ప్రభుత్వం వారికి అన్ని విధాలా చేదోడుగా ఉంటుంది. పర్యావరణ సమస్యలు,పారిశ్రామిక అనుమతులు,వేతనాల విషయం లో సమస్యలు ఇలాంటివి ఏమీ ఉండవు. అనవసరమైన ఖర్చులు కూడా పెట్టరు.దానితో చాలా చవకగా వస్తూత్పత్తి జరుగుతుంది. 

ఏ వస్తువు అయినా ఇతర మార్కెట్ లతో పోలిస్తే తక్కువ ధరకి  లభ్యమవుతుంది. ఇంకో ఆసక్తికరమైన అంశం ఏమిటంటే తమ కరెన్సీ విలువ ని కృత్రిమంగా తామే తగ్గించుకుంటారు. మెజారిటీ శ్రామికులు గ్రామీణ ప్రాంతానికి చెందిన మధ్య మరియు క్రింది తరగతి కి చెందినవారై ఉంటారు. బాల కార్మికుల విషయం లో కూడా అంత పట్టింపులు ఉండవు. గంటకి కనీస వేతనం లేదా నెల కి కనీస వేతనం రెండు రకాలుగా శ్రామికులకి జీతాలు ఇస్తారు. చైనా లో 31 ప్రావిన్స్ లు ఉన్నాయి. షాంఘై ప్రావిన్స్ లో గంట కి ఇచ్చే కనీస వేతనం మిగతా ప్రావిన్స్ లతో పోలిస్తే ఎక్కువ.     

చైనా ప్రపంచం లోనే రెండవ అతి పెద్ద ఆర్ధికవ్యవస్థ. 20,985 ప్రాజెక్ట్ ల్ని 165 దేశాల్లో నిర్వహిస్తూ వాటికి అప్పులు,గ్రాంట్లు ఇస్తూ వాటి అర్ధిక వ్యవస్థ ల్ని ప్రభావితం స్తుంది.ఆసియా,ఆఫ్రికా,యూరప్ వంటి ఖండాల్లో పెట్టుబడులు పెడుతుంది. 1.34 ట్రిలియన్ డాలర్ల పెట్టుబడులు పెట్టడమే కాకుండా అమెరికా,హాంగ్ కాంగ్,జపా  న్, కొరియా,వియాత్నం  వంటి దేశాలతో వ్యాపార భాగస్వామ్యం కలిగిఉంది. 

ఇండియా లో కూడా అనేక స్టార్టప్ ల్లో చైనా పెట్టుబడులున్నాయి.ఎలెక్ట్రానిక్స్,ఎలెక్ట్రికల్స్,టెక్స్ టైల్స్,ఆటోమొబైల్స్,కెమికల్స్,కంప్యూటర్ ,ప్లాస్టిక్స్,మెడికల్ ఎక్విప్మెంట్ ఇలా ఒకటేమిటి అనేక ఉత్పత్తుల్ని ఇబ్బడి ముబ్బడిగా తయారుచేసి ప్రపంచ దేశాలకి చౌక గా అందిస్తుంది చైనా దేశం.ఇలా తనదైన మార్గంలో పయనిస్తూ ప్రపంచ దేశాల్లో తనదైన ముద్ర వేస్తోంది ఆ దేశం.

----- మూర్తి కెవివిఎస్ (చరవాణి : 78935 41003) 




Friday, August 30, 2024

డిజిటల్ డిమెన్షియ అంటే ఏమిటి ? దాని పరిణామాలు ఎలా ఉంటాయి ?

 "డిజిటల్ డిమెన్షియా" అంటే ఏమిటి ? దాని పరిణామాలు ఎలా ఉంటాయి ?

------------------------------------------------------------------------------------------------

టెక్నాలజీ మానవ జీవితాన్ని సుఖమయం చేసిన మాట వాస్తవం. కాని అదే టెక్నాలజీ ని అవసరానికి మించి అధికంగా ఉపయోగిస్తే మనం ఊహించని పరిణామాలు ఎదురవుతాయి. వాటిని మొదట గుర్తించడం కూడా కొంత కష్టమే! కాని కాలం గడుస్తున్న కొద్దీ మన శరీరం ఇచ్చే సంకేతాలు నిరాకరించలేని స్థాయి లో ఉంటాయి. విపరీతం గా స్మార్ట్ ఫోన్ లో స్క్రీన్ టైం ని వెచ్చించి గంటల కొద్దీ చూసే వారికి ఈ డిజిటల్ డిమెన్షియా అనే మానసిక రుగ్మత కలుగుతుందని న్యూరోశాస్త్రవేత్తలు అంటున్నారు. 

దీని లక్షణాలు ఎలా ఉంటాయంటే ముఖ్యమైన విషయాల్ని మర్చిపోవడం,వస్తువుల్ని ఒకచోట పెట్టి మరో చోట వెదకడం, మాట్లాడే సమయం లో చెప్పాలనుకున్న పదాలు నోటికి రాకపోవడం,క్రమేపి కాగ్నిటివ్ స్కిల్స్ బాగా తగ్గిపోవడం ఇలాంటివి అన్నీ డిజిటల్ డిమెన్షియా లో భాగాలే! జర్మన్ శాస్త్రవేత్త మన్ ఫ్రెడ్ స్పిజర్ ఈ మానసిక వ్యాధి లక్షణాల్ని మొదటిగా గుర్తించి దానికి ప్రత్యేకంగా ఈ పేరు ని పెట్టాడు.

దీంట్లో ఏడు స్థాయిలు ఉన్నట్లుగా పరిశోధనలు చెబుతున్నాయి. మొదటి దశ లోనే గుర్తించి జాగ్రత్త పడితే ఫలితం ఉంటుంది లేదా అల్జీమర్స్ , ఫ్రంట్ టెంపోరల్ డిమెన్షియా కి దారి తీస్తుంది. ఈ వ్యాధి లక్షణాలు మరికొన్ని ఏమిటంటే విపరీతంగా నిద్రపోవడం ఇంకా శ్వాసకోశపరమైన ఇబ్బంది కలగడం, యూరినరీ ట్రాక్ ఇన్ ఫెక్షన్ రావడం ఇలాంటివి సంభవిస్తాయి. మన మెదడు కి ఇవ్వవలసినంత పని రోజూ ఇవ్వాలి. 

టెక్నాలజీ ఉంది గదాని దాని పనితనాన్ని నిద్రబుచ్చితే సహజంగా మన మెదడు కి ఉండే కాగ్నిటివ్ స్కిల్స్ తగ్గిపోవడం ప్రారంభమవుతాయి. నేర్చుకునే శక్తి సన్నగిల్లడం, ఏకాగ్రత ఉండకపోవడం,జ్ఞాపక శక్తి దెబ్బతినడం జరుగుతాయి.ఇవి ఒకేసారి జరగకపోవచ్చు,కాలం గడుస్తున్నకొద్దీ ఇవి మనలో చోటుచేసుకుంటాయి.చివరి స్థాయి చేరే వరకు గుర్తించకపోతే రోజువారీ పనులు చేసుకోలేని దశకి చేరుకోవడం జరుగుతుంది.

మరి దీనికి తరుణోపాయం ఏమిటి అంటే, టెక్నాలజీ ని అవసరం మేరకు మాత్రమే వాడాలి. కాలక్షేపానికి గంటల కొద్దీ స్మార్ట్ ఫోన్ లో కాలం గడపకుండా ఇతర వ్యాపకాలు పెంచుకోవాలి. పుస్తకాలు చదవడం , తగు వ్యాయామం చేయడం చాలా అవసరం. అలాగే మెదడు కి మేత కల్పించే జీవన విధానం లోకి వెళ్ళాలి. గ్రీన్ టీ తాగడం కూడా మంచిది. ముఖ్యంగా మనుషులతో ప్రతిరోజూ ఎంతో కొంత సమయం మాట్లాడుతుండాలి. 

స్మార్ట్ ఫోన్ ని చూసే సమయం మీ చేతిలో ఉంచుకోవాలి.అవసరమైతే పొద్దున లేదా సాయంత్రం ఏదో ఖచ్చితమైన ,మీరు నిర్దేశించుకున్న సమయం లో మాత్రమే చూడాలి. మీరు ఫేస్ బుక్ లోనో,ఇంకే సోషల్ మీడియా లోనో చేసిన కామెంట్ కి ఎన్ని లైక్ లు వచ్చాయి అనే ఆత్రుత ని పూర్తిగా వదలిపెట్టాలి. ఇవన్నీ కూడా మన మెదడు యొక్క ఆరోగ్యం కంటే ఎక్కువేమీ కాదుగదా!

స్మార్ట్ ఫోన్ ని వదిలిపెట్టాం గదాని కంప్యూటర్ ని, టెలివిజన్ ని గంటలకొద్దీ చూద్దాం అనుకోవద్దు. అవి కూడా మన మెదడు లోని గ్రే మేటర్ పైనా,వైట్ మేటర్ పైనా చూపే ప్రభావం తక్కువేమీ కాదు. మన లోని ఉద్రేకాల్ని,కదలికల్ని,ఆలోచనా విధానాల్ని ఆ రెండు నిర్దేశిస్తాయనే సంగతి తెలిసిందే. మీరు ఏ స్థాయి లో ఉన్నారో తెలుసుకోవడానికి ఓ చిన్న పరీక్ష చేసుకోవచ్చు. 

 ఏవైనా అయిదు పదాల్ని ఒక క్రమం లో ముందు మనసు లో అనుకోండి. ఆ తర్వాత కొన్ని నిమిషాల తర్వాత వాటిని అవే క్రమం లో జ్ఞాపకం తెచ్చుకోవడానికి ప్రయత్నించండి. అలాగే ఇతరులతో మాట్లాడేటప్పుడు ఒక విషయాన్ని మాట్లాడుదామని అనుకుని , తీరా మరో విషయాన్ని పొంతన లేకుండా మాట్లాడటం చేస్తున్నారా ఇలాంటి వాటిని పరిశీలించుకోవడం వల్ల మనల్ని మనం అంచనా వేసుకోవచ్చు.మన దేశం లో దీనిని డయగ్నస్ చేసి వైద్యం చేసే స్పెషలిస్ట్ లు ప్రస్తుతానికైతే లేరు అని నిపుణులు చెబుతున్నారు. సాధ్యమైనంత వరకు ఎవరి జాగ్రత్త వారు తీసుకోవడమే మనం చేయగల పని!  


----- మూర్తి కెవివిఎస్ (చరవాణి : 7893541003) 




Sunday, August 25, 2024

గల్ఫ్ దేశాల్లో మళయాళీలు ఎక్కువ... కారణమేమిటి?

 కేరళ రాష్ట్రం కి చెందిన ప్రజలు అత్యధికం గా గల్ఫ్ దేశాల్లో ప్రవాసం ఉండే విషయం అందరకీ తెలిసిందే. కువైట్ లో ఉండే విదేశీయుల్లో 80 శాతం దాకా మన దేశం లోని కేరళ నుంచి వెళ్ళిన వారే. గల్ఫ్ దేశాల్లోని అవకాశాల్ని మొట్టమొదటిగా గుర్తించి వాటిని అందిపుచ్చుకోవడం వల్ల వారి ఆధిపత్యం అక్కడ అనేక రంగాల్లో అలా కొనసాగుతూనే ఉంది. 1972 నుంచి 1983 మధ్య కాలం లో వచ్చిన గల్ఫ్ బూం ని మళయాళీలు బాగా వినియోగించుకున్నారు. అక్షరాస్యత ఎక్కువ గా ఉండటం ,సాంకేతిక నైపుణ్యం గల కోర్సులు చేయడం వల్ల చాలా మంది క్లర్కులు గా, ఆర్కిటెక్ట్ లుగా,నిర్మాణ రంగం లో సూపర్వైజర్ లుగా,ఇంజనీర్లుగా ఇలా మంచి అవకాశాల్ని పొందగలిగారు. మొదటి తరం వారు ఆ తర్వాత తమ బంధువుల్ని,స్నేహితుల్ని ఇక్కడకి తీసుకువచ్చారు.

ప్రస్తుతం వాళ్ళ సంఖ్య గల్ఫ్ దేశాల్లో ఎలా ఉందంటే యు.ఏ.ఈ.లో 7,73,624 మంది, కువైట్ లో 6,34,728 మంది,సౌదీ అరేబియా లో 4,47,440 మంది,ఖతర్ లో 4,45,000 మంది,ఒమన్ లో 1,34,019 మంది,బహ్రైన్ లో 1,01,556 మంది ఉన్నారు. అక్కడి నుంచి వాళ్ళు పంపించే విదేశీ మారకద్రవ్యం వల్ల కేరళ రాష్ట్రం యొక్క ఆర్ధిక చిత్రపటం మారిపోయిందని చెప్పాలి. ప్రతి ఏటా రమారమి 60,000 కోట్ల రూపాయలు కేరళ రాష్ట్రానికి వస్తుంటాయి.తాము ఆ దేశాల్లో పనిచేసి సంపాదించిన ధనం లో ప్రతి ఒక్కరు కొంత వెనక్కి తమ కుటుంబాలకి పంపిస్తుంటారు. మిగతా దేశాలతో పోలిస్తే మళయాళీ ప్రజలు గల్ఫ్ లో ఎక్కువ గా ఉండటానికి అనేక  కారణాలు ఉన్నాయి. ఎన్నో శతాబ్దాల నుంచి అరబ్బు దేశాలతో కేరళ రాష్ట్రానికి సముద్ర మార్గాల ద్వారా వ్యాపారం జరగడం ప్రధాన కారణం.

కేరళ రాష్ట్రం లో పెద్ద పరిశ్రమలు తక్కువ. పర్యావరణం పై ప్రజల చైతన్యం ఎక్కువ గా ఉంటుంది. ట్రేడ్ యూనియన్ ల ప్రభావం వల్ల పెద్ద పెట్టుబడిదారులు రావడానికి వెనకడుగు వేస్తుంటారు. కాబట్టి మంచి సంపాదన ఎక్కడ ఉన్నా సగటు మళయాళీ ప్రవాసి గా వెళ్ళడానికి సిద్ధం గా ఉంటాడు. యువతులు కూడా దూర ప్రదేశాలు వెళుతుంటారు.కోల్కతా,ముంబాయి,ఢిల్లీ ఇంకా దేశం లో ఎక్కడ అవకాశాలు ఉన్నా వెళుతుంటారు. ముఖ్యం గా నర్సింగ్ వృత్తి పరం గా చూస్తే దేశ విదేశాల్లో కేరళ నర్స్ లకి మంచి డిమాండ్ ఉంది. దేశం లో ఏ కార్పోరేట్ ఆసుపత్రి ని చూసినా అత్యంత ఎక్కువ సంఖ్య లో కేరళ రాష్ట్రానికి చెందిన నర్సు లే ఉంటారు. గల్ఫ్ సంపద ఎంత ప్రధాన పాత్ర కలిగి ఉందంటే చాలామంది మళయాళీ బిలియనీర్లు ఆ దేశాల్లో నే వ్యాపారం చేసి తర్వాత మిగతా దేశాల్లో తమ బిజినెస్ ల్ని విస్తరించారు.

ముథూట్ గోల్డ్ ఫైనాన్స్ గానీ, జాయ్ అలుక్కాస్ గోల్డ్ కంపెనీ గానీ గల్ఫ్ దేశాల సంపద తో విస్తరించినవే. యూసుఫ్ ఆలీ (లూలూ గ్రూప్) ,షం షేర్ వయలిల్ (విపిఎస్ హెల్త్ కేర్), సన్నీ వర్కీ (జెంస్ ఎడ్యుకేషన్), పిఎన్సి మీనన్ (శోభ గ్రూప్), జార్జ్ ముథూట్ ఇలాంటి మళయాళీ కుబేరులంతా వ్యాపారం గల్ఫ్ దేశాల్లో చేసి ఆ తర్వాత మన దేశం లో విస్తరించినవారే. ఇప్పటికీ వారి ప్రధాన కేంద్రాలు అక్కడే ఉన్నాయని చెప్పాలి. కేరళ ప్రభుత్వానికి రెవెన్యూ ద్వారా ఒక ఏడాదికి ఎంత ధనం వస్తుందో దానికి రమారమి రెండింతలు గల్ఫ్ నుంచి ధనం వస్తుంది.గల్ఫ్ నుంచి వచ్చీ పోయే ప్రయాణీకుల కోసం కేరళ లో నాలుగు అంతర్జాతీయ విమానాశ్రయాలు ఉన్నాయి. వారి బాగోగులు చూడటానికి ప్రత్యేకం గా ఒక మంత్రిత్వ శాఖ ఉంది. కొచ్చి,కోజీకోడ్,మలప్పురం,కన్ననూర్ వంటి ప్రాంతాలు గల్ఫ్ నుంచి వచ్చే అనేక వస్తువుల్ని ధారళంగా అమ్ముతుంటారు.

గల్ఫ్ నుంచి వచ్చే ధనం వల్ల కన్స్యూమరిజం బాగా పెరిగిందనే ఒక ఆరోపణ ఉన్నది. గల్ఫ్ నుంచి వచ్చిన లేదా అక్కడ పనిచేసే యువకులకి పెళ్ళి విషయం లో మంచి డిమాండ్ ఉన్నది. మరి అక్కడ విషాధ గాధలు లేవా అంటే ఉన్నాయి. స్థానికం గా ఉన్న ఆస్తి తాకట్టు పెట్టి గల్ఫ్ వెళ్ళి అనుకున్న పని దొరక్క పడరాని పాట్లు పడే వారూ ఉన్నారు. అక్కడి పత్రికల్లోనూ, టీ.వి. చానెళ్ళ లోనూ అలాంటి వారి కోసం ప్రత్యేకం గా కొంత స్పేస్ కేటాయిస్తారు. ఇటీవల వచ్చిన ఆడు జీవితం (గోట్ లైఫ్) సినిమా అలాంటి వారి బాధల్ని చిత్రించినదన్న సంగతి తెలిసిందే.ఏది ఏమైనా కేరళ రాష్ట్ర ఆర్దిక వ్యవస్థ కి దన్ను గా నిలిచి, లక్షలాది మధ్య తరగతి ప్రజలకి ఉపాధి చూపిన గల్ఫ్ దేశాల చమురు నిల్వలు ఇంకా చాలా కాలం ఉండాలని ఆశిద్దాం.

----- మూర్తి కెవివిఎస్ (చరవాణి: 78935 41003)    


(Printed in Janam Sakshi daily, 20.8.2024)

Thursday, August 15, 2024

నిజమైన స్నేహం అంటే ఏమిటి?

 జూలై 30 వ తేదీన అంతర్జాతీయ స్నేహితుల దినోత్సవం కాగా ఆగస్ట్ నెల లో గల మొదటి ఆదివారం నాడు మన దేశం లో స్నేహితుల దినోత్సవం జరుపుకున్నాము. ఆ రోజు జరిగిందేమిటి? అనేక మెసేజ్ లు మనం అందుకున్నాం అలాగే స్నేహితులు అనే వారికి మనం కూడా శుభాకాంక్షలు తెలియజేశాం. 

ఆ విధం గా సోషల్ మీడియా లో హోరెత్తించాము. అసలు స్నేహం అంటే ఏమిటి? స్నేహితులు అనబడే వారు అంతా నిజం గా స్నేహితులేనా? పరాగ్వే దేశానికి చెందిన జోయస్ హాల్ కృషి మేరకు 1958 లో మొదటి అంతర్జాతీయ స్నేహితుల దినోత్సవం జరిగింది. 

జీవితం లో బాసట గా నిలిచి సహకరించిన ఎందరో మంచి వ్యక్తులకి కృతజ్ఞత తెలుపడానికి ఆయన ఈ దినోత్సవాన్ని ప్రతిపాదించాడు. 

మరి మన దేశం లో ఈ పండగ ని జరుపుకుంటున్న స్నేహ ప్రియులకి ఎంతమందికి మనకి ,పాశ్చాత్య దేశాల వారికి స్నేహం అనే విషయం లో గల నిర్దిష్ట భావనలు తెలుసు? 

అసలు ఎన్నిరకాలు స్నేహాలున్నాయి,దేన్ని మనం నిజాయితీ గల స్నేహం అనవచ్చు. ఈ విషయాల్ని మనం కొద్దిగా లోతు గా వెళ్ళి పరిశీలిద్దాం. 

చిన్నప్పుడు స్నేహాలు మధురం గా ఉంటాయి. అక్కడ కొన్ని కేలిక్యులేషన్లు తెలియని ప్రాయం. అదే లోకం గా అనిపిస్తుంది. ప్రాణ స్నేహితులు ఉంటారు.

కలిసి ఎన్నో పనులు చేయడం ,భావాలు పంచుకోవడం ఇలా కాలేజ్ ప్రాయం వరకు సాగిపోతుంది. స్నేహితుల ప్రభావం మనకి తెలియకుండానే మన జీవితాంతం ఉండిపోతుంది.


జీవన యాత్ర లో ముందుకు సాగుతున్న కొద్దీ రకరకాల వాళ్ళు స్నేహితులు అవుతారు. ఈ వ్యక్తి ద్వారా నాకు ఏదైనా ప్రయోజనం ఉంటుందా అనే ఆలోచన ప్రతివారి లోనూ ఏదో మూలన ఉంటుంది.ఉద్యోగ పరంగా, సంఘ జీవన పరంగా బతుకు సాఫీగా సాగాలంటే కొన్ని స్నేహాలు తప్పనిసరి.
ఈరోజుల్లో స్వచ్చమైన స్నేహం ఎక్కడుంది అంటారు కొంతమంది...గుండె మీద చెయ్యి వేసుకుని చెప్పాలంటే దాంట్లో మనం కూడా ఉంటాం. ఫలానావాడితో పని లేదు అనుకుంటే ఫోన్ కూడా ఎత్తము.

అయితే మనది మనకి గుర్తు రాదు. అదే మనిషి తత్వం. పరస్పర ప్రయోజనాల కోసం సాగేది బిజినెస్ టైప్ ఫ్రెండ్ షిప్ అంటారు. దాంట్లోనూ కొంత నిజాయితీ ఉంటుంది,పరిశీలిస్తే..!
దీనికంటే ఘోరమైనది ఏవిటంటే స్నేహం పేరు తో మన వల్ల ప్రయోజనం పొంది మళ్ళీ మనకి ఏదైనా అవసరం వచ్చి చేయమంటే ముఖం చాటు చేసుకుంటారు కొంతమంది.

అది ఒక్క ధనం గురించే కాదు సుమా...ఏదో మాటసాయం కూడా కావచ్చును కొన్నిసార్లు.

కొంతమంది బిజినెస్ చేసే వారిలోనూ నాకు బాగా తెలిసినవారు ఉన్నారు. వాళ్ళకి ఎప్పుడైనా మాటసాయమైన,పోనీ రికమండేషన్ లాంటిదే అనుకోండి... చేసినట్టయితే , వాళ్ళు తిరిగి నాకు ఏదో సాయం ఏదో సందర్భం లో తప్పనిసరిగా చేసిన జ్ఞాపకాలు నాకు ఉన్నాయి.

కానీ స్నేహం గురించి దాని స్వచ్చత గురించి పుంఖానుపుంఖాలుగా చెప్పేవాళ్ళు చేయడం వరకు వచ్చేసరికి ఏవో కుంటి కారణాలు చెప్పి కనిపించకుండాపోతారు. సాయం చేసిన వాళ్ళకి తిరిగి సాయం చేస్తే విలువ ఏముంది,చేయని వాళ్ళకి సాయం చేయడం గొప్ప అని వింత హిపోక్రసీ ని చూపెడతారు.

ఏమి ఆశించకుండా ఎదుటివారికి సాయం చేయడం దైవ లక్షణం. అది మానవ జన్మకి చెప్పుకోవడానికే తప్పా ఆచరించడం అంత సులువు కాదు. కనీసం మనకి ఏదైన ఒకటి చేసిన వారికి తిరిగి చేయాలనుకోవడం మానవత్వం.

ఆ మాత్రం చేయగలిగితే చాలా గొప్ప విషయమేనని చెప్పాలి.అది డబ్బు పరంగా అనే కాదు కొన్నిసార్లు దాన్ని మించిన సహానుభూతి కావచ్చు. ఇంకోటి కావచ్చు. వెస్ట్రన్ మైండ్ సెట్ కి మనకి ఉన్న తేడా ఏమిటంటే, రెసిప్రొకేషన్ అనేది ఓ జీవన శైలి గా ఉంటుంది.

ఎదుటి వారి సాయం అందుకున్నవారికి తప్పనిసరిగా కృతజ్ఞతా భావం ఉంటుంది. మళ్ళీ దాన్ని ఏదో రకం గా తీర్చుకోవాలి అనుకుంటారు. ఉదాహరణకి గాడ్ ఫాదర్ నవల లోని పాత్రలు చూడండి.

ప్రధాన పాత్ర కార్లియోన్ తను సిసిలీ ఇంకా ఇటలీ ప్రాంతాల నుండి వచ్చిన వారిని మాత్రమే ముఖ్యమైన అనుచరులుగా నియమించుకుంటాడు.వారి అవసరాలను తీర్చుతుంటాడు.తనకి అవసరం వచ్చినపుడు సాయం అడుగుతాడు.వాళ్ళు కూడా అలాగే చేస్తారు.

ఎందుకంటే మనకి సాయం చేసిన వారికి తిరిగి సాయం చేయడం ధర్మం అని వాళ్ళు నమ్ముతారు.అది ఒమెర్తా అనే ప్రాచీన సంప్రదాయం నుంచి వచ్చిన అలవాటు. అమెరిగో బోనసెర కుమార్తె ని కొట్టి గాయపరిచిన ఇద్దరు యువకులు న్యూయార్క్ లో చాలా పలుకుబడి ఉన్న కుటుంబాలకి చెందినవారు.

కోర్ట్ లో కూడా శిక్ష ని తప్పించుకుంటారు. అయితే బోనసెరా ఆవేదన విన్న కార్లియోన్ వాళ్ళిద్దర్నీ తన కుర్రాళ్ళతో ఒక బార్ లో కొట్టిస్తాడు. కాలం తిరగబడి కొన్నాళ్ళకి కార్లియోన్ పెద్ద కొడుకు ని శత్రువులు చంపివేస్తారు , తను కూడా రహస్యంగా సంచరిస్తుంటాడు.

అలాంటి సమయం లో ఓ రాత్రిపూట బోనాసెరా ని కలిసి చనిపొయిన కుమారుడికి కాఫిన్ తయారు చేయమని చెప్పగా, బోనసెరా సంకోచిస్తాడు,ఎందుకంటే ఈ సంగతి తెలిస్తే కార్లియోన్ శత్రువులు తనను బతకనివ్వరు.
చ..నా కూతురు కోసం అంత రిస్క్ తీసుకున్న ఆ మనిషి విషయం లో ఇలా ఆలోచిస్తున్నానేమిటి ...అనుకుని చివరకి ఏదయితే అది కానీ కాఫిన్ తయారు చేస్తాను అంటాడు. అంటే రుణం తీర్చుకోవడం అనే గా భావన కి ఎంత విలువ ఇస్తారో మనకి అర్థం అవుతుంది.

స్నేహం అంటే అది ...పరస్పరం సహకరించుకోవడం. పాశ్చాత్యుల కుట్రలు ఎంత subtle గా long-sighted గా ఉంటాయో ,వాళ్ళ సహకరించుకునే పద్ధతులు కూడా అంత లోతు గా ఉంటాయి. ఆ సహకారాన్నే వాళ్ళు స్నేహం అనుకుంటారు.

ఉదాహరణకి ఫ్రాన్స్ కి ఏదైనా అరబ్బు దేశానికి యుద్ధం జరుగుతుంటే స్పెయిన్ దాన్ని ఖండిస్తుంది. బయటకి చూసే వాళ్ళకి అది నిజమనిపిస్తుంది.

అరబ్బుదేశాల నుంచి ఫ్రాన్స్ కి రావాలసిన ఆయిల్ ని లోపాయికారిగా స్పెయిన్ సప్లయ్ చేసి వాళ్ళ కమీషన్ వాళ్ళు తీసుకుంటారు.అవతలివాడు కూడా ఆనందం గా ఇస్తాడు. ఇలాంటి వ్యవహారాలు తీరిక ఉండి విశ్లేషించి చదవాలే గాని చరిత్రలో బోలెడన్నీ. !!

----- మూర్తి కెవివిఎస్ (చరవాణి: 78935 41003)

ఆన్ లైన్ మోసాలకి అంతం ఎప్పుడు ?

  జంతారా అనే పేరు సైబర్ నేరాలు అనే పదానికి ప్రత్యామ్నాయం గా మారింది. ఆ ఊరు ఎక్కడ ఉందో చాలా మందికి తెలియకపోవచ్చు. కాని సెల్ ఫోన్ ఉన్న భారతీయులందరూ ఏదో ఓ సమయం లో ఆ ఊరి నుంచి ఒక్క కాల్ అయినా అందుకుని ఉంటారు. 

మీకు లాటరీ తగిలిందనో,మీకు వచ్చే ఓటిపి నెంబర్ చెప్పమనో,బ్యాంక్ మేనేజర్ మాట్లాడుతున్నట్లు గానో ఇలా అనేకమైన తీపి కబుర్లతో జనాల సొమ్ము ని కొల్లగొట్టడం లో ఇక్కడి ఆన్ లైన్ నేరగాళ్ళది అందె వేసిన చెయ్యి. 

నిరుద్యోగులైన యువతీ యువకుల్ని రిక్రూట్ చేసుకుని ,ఆ పైన వీళ్ళకి తగిన ట్రైనింగ్ ఇచ్చి ఓ కుటీర పరిశ్రమ లా ఈ చీటింగ్ కార్యకలాపాల్ని కొనసాగిస్తుంటారు. ఇంతకీ ఈ జంతారా అనేది జార్ఖండ్ రాష్ట్రం లో ఓ చిన్న పట్టణం. 

భారతదేశపు ఆన్ లైన్ నేరాలకి రాజధాని లాంటిది. ఈ పట్టణం నుంచి జరిగే ఆన్ లైన్ నేరాల మీద నెట్ ఫ్లిక్స్ లో ఓ వెబ్ సిరీస్ వచ్చిందంటే ఇక అర్థం చేసుకోవచ్చు. వీళ్ళ కార్యకలాపాలు ఎలా ఉంటాయో !

భారతదేశం లో జరిగే సగానికి పైగా ఆన్ లైన్ స్కాం లు రాంచీ నగరానికి 210 కి.మీ. ఉండే ఈ జంతారా నుంచే జరుగుతుంటాయి. ఫిషింగ్ లింక్ లు పంపి తద్వారా జనాల సమాచారాన్ని సంపాదించి సొమ్ము కొల్లగొట్టడం లో వీరికి ప్రత్యేక నైపుణ్యం ఉంది. 

ఇతర రాష్ట్రాల నుంచే కాదు ఇతర దేశాల నుంచి కూడా ఇక్కడి నేరస్థుల కోసం పోలీసులు వస్తుంటారు. ఇప్పటి దాకా 28000 కప్లైంట్స్ ఈ జంతారా కి చెందిన నెట్ వర్క్ మీద వచ్చాయి. 

జంతారా లో ఉన్న నేరగాళ్ళ మీద పరిశోధన చేస్తున్నప్పుడు దీన్ని మించిన ఆన్ లైన్ స్కాం లు చేసే భరత్ పూర్ వెలుగు లోకి వచ్చింది. ఈ పట్టణం రాజస్థాన్ లో ఉంది. 

యోగేశ్వర్ మీనా అనే యువకుడు ఏకంగా 500 మంది నిరుద్యోగుల్ని నియమించుకుని ఈ దందా నడిపిస్తున్నాడు. ఇతగాడు స్టాక్ ట్రేడింగ్ ఇన్వెస్ట్ మెంట్ స్కాం లు చెయ్యడం లో దిట్ట. దానికి ప్రత్యేకం గా టెలి గ్రాం గ్రూపు లు కూడా ఉన్నాయి. 

ఇక అదే రాష్ట్రం లో ఉండే మేవాట్ అనే పట్టణం భారతదేశపు నూతన ఆన్ లైన్ స్కాంల రాజధాని గా అవతరించింది. వీళ్ళు ఆన్ లైన్ నేరాలు చేయడం లో కొత్త పుంతలు తొక్కి దేశం లోని జనాల సొమ్ము ని మొత్తం 7000 కోట్ల రూపాయలకి పైగా లూటీ చేశారు.

 ఒక్క ఈ ఏడాది లో ఇప్పటిదాకా ఏడున్నర లక్షల కంప్లైంట్స్ ఇక్కడి వాళ్ళ మీద వచ్చాయంటే ఏ రేంజ్ లో వీరి పనితనం ఉందో అర్థం చేసుకోవచ్చు. ప్రజలు ఆకర్షణీయం గా వచ్చే మెసేజ్ ల్ని నమ్మడం మానుకోనంత వరకు వీరి ఆగడాలకి హద్దు లేకుండా పోతూనే ఉంటుంది. 

ఎన్ని దాడులు నిర్వహించినా తమ ప్రదేశాల్ని మార్చుకుని యధావిధిగా నేరస్థులు తమ పని చేసుకుపోతూనే ఉన్నారు. 

కేవైసి అప్ డేట్స్ గురించి మెసేజ్ లు పంపడం,న్యూడ్ వీడియోలు పంపి చూసినందుకు మిమ్మల్ని అరెస్ట్ చేస్తారని బెదిరించడం,ఫిషింగ్ లింక్ ల ద్వారా మాల్ వేర్ ని పంపి పాస్ వర్డ్ ల సమాచారం దొంగిలించడం ఇలా ఎన్నో విన్నూత్న పోకడలతో ఆన్ లైన్ నేరాలకి పాల్పడుతున్నారు.

ఈమధ్య కాలం లో విపరీతం గా ఫేస్ బుక్ అకౌంట్ లు హ్యాక్ కావడం మనం చూస్తూనే ఉన్నాం. మీ మిత్రుల పేరు తో మిమ్మల్ని డబ్బులు అర్జంట్ గా పంపించమని మెసేజ్ లు పెట్టడం కూడా చూసే ఉంటారు. 

ఏ అకౌంట్ ని హ్యాక్ చేయాలన్నా ముందు దానికి నమ్మకం గా అనిపించే ఫిషింగ్ లింక్ ని ఆకర్షణీయమైన యాడ్స్ రూపం లోనో మెసేజ్ రూపం లోనో పంపిస్తారు.

పొరబాటున ఒకసారి క్లిక్ చేస్తే ఇక అంతే. ఆ ఫేస్ బుక్ అకౌంట్ వాళ్ళ చేతికి వెళ్ళిపోయినట్లే. హ్యాక్ అయిన అకౌంట్ తేడా కనిపిస్తూనే ఉంటుంది. 

బర్త్ డే, ఈమెయిల్, పాస్ వర్డ్ లాంటివి మారిపోతాయి. కొన్నిసార్లు పాస్ వర్డ్ మారదు.అలాంటప్పుడు వేరే సిస్టం లోనుంచి అకౌంట్ లోకి ప్రవేశించి పాస్ వర్డ్ మార్చుకుంటే మంచిది. అలాగే ఫేస్ బుక్ కి రిపోర్ట్ పెట్టడం మంచిది. 

మిగతా నేరాల విషయం లో తీసుకున్నంత శ్రద్ధ ఈ ఆన్ లైన్ గ్యాగ్ స్టర్ ల మీద మన వ్యవస్థ తీసుకోవడం లేదనిపిస్తుంది. అరెస్ట్ చేసినా మళ్ళీ బయటకి వచ్చి ప్రొఫైల్ మార్చుకుని అవే పనులు చేస్తున్నారు. సాధ్యమైనంతవరకు ప్రజలు తమ జాగ్రత్తలు తాము తీసుకోవడం మంచిది.         

----- మూర్తి కెవివిఎస్ (చరవాణి: 78935 41003)