Wednesday, May 29, 2013

నా భువనేశ్వర్ యాత్రా విశేషాలు (మొదటి భాగం)

భువనేశ్వర్ వెళ్ళాలని ఎప్పటినుంచో అనుకొంటున్నప్పటికీ ఇటీవలనే కుదిరింది. ఏ పుణ్యక్షేత్రాన్ని దర్శించాలన్నా ఆ క్షేత్ర పాలకుని అనుమతి రావాలని అంటుంటారు కొంతమంది..అది మరి ఎంతదాకా నిజమో తెలియదు.గతంలో ఓసారి పశ్చిమ బెంగాల్ వెళ్ళినప్పుడు ఆగాలని అనుకున్నా ఏవో అవాంతరాల వల్ల కుదరలేదు. సాధ్యమైనంతవరకు నేను ఒంటరిగానే ప్రయాణిస్తుంటాను.రైలు ప్రయాణం నిజంగా జీవిత ప్రయాణాన్నే తలపిస్తుంది.ఏవో భాషల వాళ్ళు ఎక్కుతుంటారు.దిగుతుంటారు.ఎవరి స్టేజీ వాళ్ళది.


అసలు ప్రతి విధ్యార్థి ఖచ్చితంగా ఓ ఇతర రాష్ట్రాన్ని ఒంటరిగా తిరిగి తన అనుభవాలని project report  రాసే విధంగా ఓ సబ్జక్ట్  వుంటే బాగుంటుందని నా అభిప్రాయం.అసలు దేశంలో మనల్ని కలిపి వుంచుతున్న ఆత్మ ఏమిటో బాగా అర్ధమవుతుంది.


నా దృష్టిలో యూరపు ఖండం మొత్తంలో ఎంత వైవిధ్యం వుందో అంతకంటే ఎక్కువ వైవిద్యం ఒక్క మన దేశంలోనే వుంది. భువనేశ్వర్ లో కొన్ని వందల ప్రాచీన  దేవాలయాలు వున్నాయి.బౌద్ద నిర్మాణాలు కూడా బాగా వున్నాయి.చారిత్రక ప్రాధాన్యం గలవాటితో ప్రారంభించాలని ముందు రాజా రాణి టెంపుల్ కి వెళ్ళాను.అది 11 వ శతాబ్దం లో నిర్మించబడిది.ఒడిషా ఆలయ నిర్మాణ శైలి చాలా ప్రత్యేకంగా వుంటుంది.పైని గోపురాలు లింగాకారంలో వుండి మంచి శిల్ప సంపద వుంటుంది.


ఇప్పుడు ఆ ఆలయం చుట్టూతా మంచి తోట పెంచుతున్నారు.ఆలయం గోడల పైన రకరకాల శిల్పాలు వున్నాయి.సర్పాలు,ద్వార పాలకులు,పాపని  లాలిస్తున్న తల్లి,అద్దంలో తమని చూసుకొంటున్న అతివలు,లతలు,ఇంకా రకరకాల చెక్కబడివున్నాయి.కొన్ని సర్పాలు పడగ విప్పి కపాల మాలలు ధరించి వున్నాయి.


విచిత్రంగా ఈ గుళ్ళో ఏ దేవుని ప్రతిమా ప్రస్తుతం లేదు.లోపలికి వెళ్ళగానే వళ్ళు గగుర్పొడిచినట్లయింది.చాలా నిశ్శబ్దంగా..చల్లగా అనిపించిది ఆ లోపల..!కొద్దిగా అక్కడక్కడ మూలల్లో బూజు పట్టి కూడా వుంది.గర్భ గుడి లోపల గుండ్రంగా వుంది ...వెలుతురు వుంది.అయితే కిరణాలు లోపలకి రావడం లేదు.


                          (సశేషం)



            

No comments:

Post a Comment