Sunday, June 1, 2014

కొన్ని దేవాలయాల వద్ద ఆ శక్తి ప్రకంపనలు ఉంటాయా..!

కొన్ని దేవాలయాల వద్ద ఆ శక్తి ప్రకంపనలు ఉంటాయా..!

నాకు పెద్దగా భక్తి లేదు.అంటే గుళ్ళకెళ్ళడం ,పూజలు గట్రా చేయించడం ఇలాంటివి.అయితే వెళ్ళే వాళ్ళని పనిగట్టుకొని ఆపడం,వాళ్ళకి ఏవో చెప్పి బోధ చేయడం కూడా నాకిష్టం ఉండదు.అదంతా పూర్తిగా వ్యక్తిగతం.మనకి హాని కలగనంతకాలం ఎవరి నమ్మకం వారిది. ఆటంకపరచకూడదు అనేది నాకు గల ఓ నమ్మకం. కొన్నాళ్ళు ప్రాణాయామం చేసి ఆపివేశాను.శరీరం మీద,మానసిక తలాల మీద అద్భుతంగా పనిచేస్తుందది.నాకు కలిగిన అనుభవమది.దానిని ఎట్టి పరిస్థితిలో నేను నిరాకరించలేను.వీటిల్లో కూడా ఈ మధ్య గురువులు ప్రొఫెషనల్ గా తయారయి ఈ పురాతన విద్యలకి తమవైన కొన్ని విధానాలని అద్ది బోధిస్తున్నారు.దీనివల్ల అసలు సారం ఏమీ ఉండదు దానిలో.నా దృష్టిలో ఎంత ప్రాచీన విధానమైతే ఇలాంటి అంశాలు అంత మంచివి.జనాలకి సులువుగా ఉండాలనో,ఆరోగ్యం కోసమనో పలుచన చేయడం తో దానిలోని అసలు సారం మరుగున పడుతున్నది.

ఏ దేవుని తోనూ,ఏ మూఢ భక్తి తోనూ సంబంధం లేని దాన్ని భారతదేశం అందించినది ఏమైనా ఉందంటే అది ఈ యోగవిద్య యే.అసలు ఆధ్యాత్మికత అంటే జనాల్లో ఏవగింపు కలగడానికి కారణం ఇలాంటి  విలువైన విషయాలను కిందికి తొక్కి వేసి ఫక్తు వ్యాపారశైలి లో పూజా కార్యక్రమాల తంతుకి లేని పోని ప్రాధాన్యత నివ్వడమే.చివరికి ఒక బిజినెస్ డీల్ మాదిరిగా తయారయింది.

అసలు విషయానికి వద్దాం..గుళ్ళు కేవలం బిజినెస్ కేంద్రాలు అని చెప్పి నాకు ఓ నమ్మకంగా ఉండి వెళ్ళడం మానేశాను.ఎన్నోసార్లు తిరుపతి నుండి చెన్నై కి బస్ లో  వెళుతూ కూడా గుడికి వెళ్ళేవాణ్ణికాదు.నా స్నేహితులు కూడా అనేవాళ్ళు..అంత దగ్గరగా వెళ్ళినప్పుడు పోయిరావొచ్చుగా అని.వినిపించుకొనే వాణ్ణికాదు.

ఎందుకనో గాని...ఓ సారి ఇలాగే ఏదో పర్యటన లో ఉన్నప్పుడు ..ఖాళీ ఉందిగా అనిచెప్పి కొండపైకి వెళ్ళాను.అప్పుడు రాత్రి ఎనిమిది అలా అవుతుంది.చల్లటి గాలి ఆహ్లాదంగా వీస్తోంది.బస్సు అలా కొండమీదికి పోతుంటే కూడా చాలా అద్భుతంగా అనిపించింది.అసలు ఈ అనుభవం కూడా ప్రజలు విపరీతంగా వస్తుంటారా అనిపించింది.చెప్పానుగదా..నేను భక్తుడిని కాను.అలాగని నాస్తికుడినీ గాను. నా చిన్నప్పుడెప్పుడో మా తాతయ్య తో తిరుపతి రావడం..మళ్ళీ ఇదే.నేను వెళ్ళిన ఆ రోజు విచిత్రంగా పెద్దగా జనాలు లేరు.

ఆ క్యూ లో ఆలోచించకుండా అలా వెళ్తూ  మలుపులు తిరగ్గానే జనాలు తలనీలాలు సమర్పించుకొనే వ్యవహారం ఉంది అక్కడ. ఏవిటా చేయడం...అని ఆలోచిస్తుండగానే ఒకతను ..సార్ రండి..అంటూ నా వెంట్రుకలు తీయనారంభించాడు.సరే..కానీ అవే మొలుస్తాయిగా..ఈ సమ్మర్ లో కాస్త చల్లగానైనా ఉంటుంది  అని ఊరుకున్నాను.దర్శనానికి వెళ్ళేప్పుడు ఆ తర్వాత ఎక్కడ పొయిందో నాకు అర్ధం కాలేదు గాని నా మొబైల్ ఫోన్ పోయింది. ఇండియా లో ఇన్ని రాష్ట్రాలు ఒంటరిగా తిరుగుతున్నాను.ఎక్కడా నాది నయాపైసా పోలేదు.  ఇదేమిటబ్బా అనిపించింది.నిలువు దోపిడి అంటే ఇదేనా..!ఏమో..!

ఆ తరువాత రెండు రోజులకి చాలాకాలం బట్టి కాదులే అని వదిలేసుకున్న ఓ పని అతి విజయవంతంగా ముగిసి చాలా ఆనందమనిపించింది.ఒక రకంగా ఆ పని నా జీవితాన్ని మలుపుతిప్పిన సంఘటన అని చెప్పాలి.ఆశ్చర్యంగా అనిపించింది.అది తిరుపతి స్వామి చేసిన అద్భుతమా...లేక అన్నమయ్య వంటి సాధకులు నడయాడిన భూమి మహిమా ...?

అన్నమయ్య ని కేవలం నేను ఒక వాగ్గేయకారునిగా మాత్రమే చూడలేను.గొప్ప మానసిక అంచులని చూసిన సాధకుడని నమ్మకం.మనం ఇప్పుడు  సర్రియలిజం అనే భావాన్ని చెప్పుకుంటామే అలాంటి పద చిత్రాల్ని,భావాన్ని గుప్పించే విధానాన్ని అన్నమయ్య అన్ని వందల ఏళ్ళ క్రితమే చేశాడు.

"మొలిచిన దేహము ముగియుటతో సరి..తలచిన దైవము తన లోనే " ఎటువంటి భావం..!చెట్టు లా ఒక దేహం మొలవడం..అది మళ్ళీ పడి పోవడం ...అయితే తలచిన దైవం నీలోనే..అంటే ఎప్పటికీ పడిపోని ఆ శాశ్వతమైన ఆ భావం అది నీతోనే(?) ఉంటుంది అంటాడు ఆ మహానుభావుడు.ఇట్లా ఎన్నైనా చెప్పవచ్చు.ఇది రమారమి అయిదేళ్ళ క్రితం జరిగింది.రాయాలనిపించి రాశాను.అలాగే ఖమ్మం జిల్లా ,బూర్గం పాడు మండలం లోని పెద రావి గూడెం అనే గ్రామం లోని కేదారేశ్వర స్వామి గుడికి వెళ్ళినప్పుడు కూడా ఒక ఆశ్చర్యకరమైన విషయం జరిగింది. నాకు అంతుపట్టనిది ఏమంటే ఈ గుళ్ళకి వెళ్ళినప్పుడు అక్కడ ప్రత్యేకమైన పూజలు చేయించడం గాని..ఇంకా ఏ కోరికలు కోరడం గాని నేను చేయలేదు.సరే దాన్ని గురించి మళ్ళీ ఓ సారి రాస్తాను....!Click here    

   

No comments:

Post a Comment