Friday, April 3, 2015

ఆయన పేరు మైనేని శంకర రావు గారు అని ఒక రైతు...!



ఈ రోజు ఒక వ్యక్తి గురించి చెబుతాను.ఆయన ఏ రంగం లోనూ ప్రసిద్దునిగా పేరు తెచ్చుకోలేదు.పేరు గురుంచి పెద్దగా తాపత్రయపడింది లేదు.కాని అంతు లేని జ్ఞాన తృష్ణ కలిగిన మనిషి.ఇంచు మించు ప్రతి శాస్త్రం లోను ఆసక్తి కలిగి దానికి సంబందించిన ఏ వివరాన్ని వదలకుండా చదివి ఆకళింపు చేసుకుని మళ్ళీ స్వయంగా కొన్ని యోచనలు చేసి వాటన్నిటిని భద్రంగా తెల్ల కాగితాలపై,నోడ్ బుక్ ల లోను రాసి పెట్టుకునేవారు.అది కెమిస్ట్రీ గాని,ఫిజిక్స్ గాని,గణితం గాని,తెలుగు కవిత్వం గాని,సంస్కృత శ్లోకాలు గాని,యోగశాస్త్రం గాని అవి ఏవైనా గాని తన దృష్టికి వస్తే వాటిని అర్ధం చెసుకుని జీర్ణం అయ్యేదాక నిద్రపోయేవారు కాదు.ఆయనతో మాట్లాడితే కొన్నాళ్ళపాటు ఏ లైబ్రరీ కి వెళ్ళనవసరం లేదు.

ఇంతకీ ఆయన ఎవరంటారా....ఆయన పేరు మైనేని శంకర రావు గారు అని ఒక రైతు.ప్రాధమిక స్థాయి విద్య.ఖమ్మం జిల్లా లోని చర్ల గ్రామం లో ఉండేవారు.ఇటీవల 2013 లో మరణించారు.నాకు ఆయన నరేంద్ర బాబు  అనే మా కాలేజీ మేట్ ద్వారా పరిచయం.చాలా లోతైన పరిజ్ఞానం తో ఏ విషయాన్నైనా వివరించేవారు.న్యూటన్ గమన సూత్రాల్ని ,ఐన్ స్టీన్ యొక్క సాపేక్ష సిద్ధాంతాల్ని ఎంత సుఖంగా చెప్పేవారో కాళిదాసు ని కావ్య విశేషాల్ని అంత ఆనందంగా వర్ణించేవారు.వ్యవసాయం కూడా అందరి లా కాకుండా చాలా ప్రయోగాలు చేసేవారు.వెళ్ళినప్పుడల్లా ఆయనతో మాట్లాడటం నిజంగా ఒక ఎడ్యుకేషన్..!అయితే ఊళ్ళో చాలామందికి మాత్రం ఆయన ఓ వింత మానవుడు.

యోగశాస్త్రం లో నాకు గల చాలా అనుమానాలను కొన్ని ఉదాహరణలతో చెప్పారు.అసలు ఇలాంటి ఒక ఆలోచనావేత్త ఈ దేశం లో ఇలా మిగిలి పోవలసిందేనా అనిపించేది. ఎందుకనో ఓసారి అయొడైజ్డ్ ఉప్పు ప్రస్తావన వచ్చినప్పుడు అది మనిషికి చాలా కీడు చేస్తుంది వ్యాపారులు తమ లాభాల కోసం జనాలతో ఆడుకుంటున్నారు అన్నాడాయన.ఎందుకని అలా ..చాలామంది మంచిది అనే అంటున్నారుగా అన్నాను.మంచిదని చెప్పే వాళ్ళంతా ఎవరు..ఎమెన్సి లకి వంత పాడే పరిశోధకులే గదా..ఈ భూమి లో ఉండే ప్రతి గుణం ,పదార్థం మన శరీరం లోనూ ఉంది.సముద్రం లోనుంచి వచ్చే ఆ ఉప్పే మన శరీరానికి కరెక్ట్ గా సూటవుతుంది అని అన్నారు.!ఇట్లా చాలా విషయాల్ని ఖండన ముండన లతో చర్చించుకునే వాళ్ళం.

ఒకటి మాత్రం చెప్పగలను.మైనేని గారు ఏ శాస్త్రం గురించి చెప్పినా దాంట్లో బాగా ప్రిపేర్ అయి చెప్పే లెక్చరర్ లా అనిపించేవారు.స్థానిక లైబ్రరీ లోని పుస్తకాలు చదవడమే గాక అవి  చాలక పోస్ట్ ద్వారా కూడా తెప్పించేవారు.వివిధ వన మూలికల మీద ,ఇంకా ఇతర అనేక విషయాల మీద వందలాది పేజీలు రాసి తన కి దీని కోసమే కేటాయించిన ఒక చెక్క పెట్టె లో పెట్టుకునేవారు.ఏ పత్రికకి పంపే వారు కాదు.

గత సంవత్సరం వారి ఇంటికి వెళ్ళినప్పుడు వాళ్ళమ్మాయి పద్మజ నా కోరికపై అవన్నీ చూపించింది.చాలా వరకు చెదలు తిని వేశాయి.బిటి విత్తనాలు దగ్గర్నుంచి వాల్మీకి రామాయణం దాకా,కుండలినీ ప్రక్రియ సాధనలగురించి ,ఆయన చేసిన సాధనలు, కలిగిన ఫలితాలు,లెవోయిజే,మైఖేల్ ఫేరడే ఇంకా ఇట్లాంటి వాళ్ళ పరిశోధనలు దాని మీద ఆయన అభిప్రాయాలు,ఇట్లా ఒకటేమిటి ఎన్నో రకాలు.దాంట్లో నే ప్రసిద్ధ సాహిత్య వేత్త సంజీవ్ దేవ్ గారు ఈయనకి రాసిన లేఖలు బయటబడ్డాయి.ఒకసారి ఆయన ఇంటికి వచ్చినట్లుగా పద్మజ గారు చెప్పారు. కొన్నిటిని నేను ఒక వెబ్ సైట్ లో భద్రపరిచాలని ప్రయత్నించాను.అయితే అక్షరాలు రాత ప్రతులు గదా మాగ్నిఫై గాక కొన్ని చేసి తాత్కాలికంగా విరమించాను.  శంకర రావు గారు మీరు ఏ జర్మనీ లోనో పుడితే ఐన్ స్టీన్ కి వచ్చినంత ఖ్యాతి వచ్చేదేమో అని అంటే జ్ఞానం విశ్వం లో పెల్లుబకడానికి రకరకాల మార్గాల్ని వెదుక్కుంటుంది..మనిషి మీడియం అంతే దానికోసం వెంపర్లాడకూడదు అనేవారు. నాకు తారసపడిన గొప్ప వ్యక్తులలో ఒకరైన ఆయనకి నా నివాళి ,1937 లో జన్మించిన ఆయన తన పుట్టిన రోజు కూడా వెల్లడించేవారుకాదు.Click here 

No comments:

Post a Comment