Saturday, May 9, 2015

సిడ్నీ షెల్డన్ మరో నవల "Master of the Game" గూర్చి కొన్ని సంగతులు (రెండవ భాగం)

సిడ్నీ షెల్డన్ మరో నవల "Master of the Game" గూర్చి కొన్ని సంగతులు (రెండవ భాగం)

గత భాగం లో Jamie McGregar గూర్చి,అతను వజ్రాల వేటలో విజయం సాధించి క్రగర్ అండ్ బ్రెంట్ అనే కంపెనీ స్థాపించడం గూర్చి తెలుసుకున్నాం గదా..!ఈ Jamie ఏదో భార్య తో ఇంట్లో ఉంటూ ఉంటాడు గాని హృదయకపూర్వకమైన సంబంధాలు ఉండవు.ఎప్పుడైనా అవసరమైతే తప్ప అదీ ఏమైనా ప్రశ్న అడిగితే జవాబు చెబుతాడు అంతే.కొడుకు మీద ప్రేమ కలిగి మంచి గా పెంచుతున్న తరుణం లోనే కంపెనీ లో జరిగిన సమ్మె పెద్దదై జాతి పోరాటాలకు దారి తీసి ఆ కుర్రాడు మరణిస్తాడు.Jamie కూడా ఆ తర్వాత పక్షవాతానికి గురయి కొన్ని రోజుల్లోనే చనిపోతాడు.అయితే తలవని తలంపుగా ఒకరోజు భార్య మార్గరెట్ తో జామీ కలుస్తాడు.దానివల్ల అతను చనిపోయిన తరువాత Kate అనే అమ్మాయి పుడుతుంది.ఆ విధంగా ఎంతో విలువైన సంస్థల్ని భార్యకి విడిచిపెట్టి చనిపోతాడతను.

ఇంత పెద్ద సంస్థల్ని ఎలా నడపాలా అని యోచిస్తున్న మార్గరెట్ కి అదృష్టవశాత్తు David Blackwell అనే తమ కంపెని లోని మేనేజర్ బాగా సహకరిస్తాడు.అతను ఒక అమెరికన్. చాలా ముందు చూపుతో ఇలాంటి విశ్వాసపాత్రుడైన ఒక వ్యక్తిని తన ఆంతరంగికుని గా ఎన్నుకున్నందుకు భర్త ని ఆమె లోలోపలే అభినందిస్తుంది.ఇక Kate గూర్చి చెప్పుకుందాము.తండ్రి లోని కార్యదక్షత ,ధైర్యం పుణికిపుచ్చుకున్నట్లుగా ఉంటుంది.కాని స్కూల్ లో చదువు కంటే అల్లరి బాగా చేస్తూ ఉంటుంది.ఈమె కి పద్ధతులు తెలవడానికి గాను బ్రిటన్ లోని ఒక మంచి పాఠశాలకి పంపిస్తారు.అక్కడా ఇంతే ..గుర్రాలు మైథునం చేస్తుంటే చూడటం ఒక ఆసక్తి ఈమెకి.ఇక్కడనుంచి ఆ పాఠశాల వాళ్ళు పంపించివేస్తారు.ఆ తర్వాత జోహెన్స్బర్గ్ లో బిజినెస్ కాలేజి లో చేరి మమ అనిపిస్తుంది.కొంచెం ఈడు రాగానే బిజినెస్ పగ్గాలు అప్పగించబడతాయి.ప్రపంచం లోని అనేక దేశాల్లోకి కంపెనీలని విస్తరిస్తుంది.ఆ విషయం లో ఆమెకి విపరీతమైన ఆసక్తి.

తమ ఫేమిలీ బిజినెస్ లో చేదోడు వాదోడు గా ఉండే David Blackwell ని ప్రేమించి పెళ్ళి చేసుకుంటుంది.నిజానికి David తనకన్నా ఇరవై ఏళ్ళు పెద్దవాడు.అంచేత ముందు అతను సుముఖుత చూపించడు.ఇంకో అమెరికన్ యువతి ని చేసుకుని శాన్ ఫ్రాన్సిస్కో వెళ్ళి పోవాలని ప్రయత్నిస్తాడు.అయితే ఆ సంబంధాన్ని మాయోపాయం చేత చెడగొడుతుంది Kate.తన బిజినెస్ కి సహాయకారిగా ఉండగల సమర్ధత అతనికి ఉంది.కాబట్టి అతను భర్త గా ఉంటే తన సంస్థలకి కూడా మంచి అభివృద్ది ఉంటుందని ఆమె ఆలోచన.

రెండవ ప్రపంచ యుద్ధం జరుగుతున్న సమయం లో కూడా ఆయుధాల వ్యాపారం లో కి వెళ్ళి పెట్టుబడులు పెట్టి మంచి లాభాలు పొందుతుంది. David వాటిని ఆమోదించడు.ఎందుకు అనవసరమైన కొత్తరంగాల్లోకి అంటాడు.దక్షిణాఫ్రికా నుంచి తమ కార్పోరేట్ల హెడ్ క్వార్టర్ ని న్యూయార్క్ కి మార్చుతుంది. కొన్ని ఏళ్ళ తర్వాత Antony అనే కొడుకు పుడతాడు.అతన్నే Tony అని పిలుస్తారు.ఇతణ్ణి బిజినెస్ లో ఆసక్తిపరునిగా తీర్చిదిద్దాలని తపన పడుతుంది Kay.అయితే అతనికి మాత్రం కళా పిపాస ఎక్కువ.ప్రపంచం లోని గొప్ప చిత్రకారుల్లో ఒకనిగా పేరుతెచ్చుకోవాలని తపిస్తుంటాడు.ఆ బిజినెస్ లు అవీ ఏమైనా కానీ నాకనవసరం...నేను పేయింటర్ గా మాత్రమే జీవిస్తాను..అదే నా కిష్టం అని మొండిగా తల్లిని వ్యతిరేకించి పారిస్ కి వెళ్ళి తనకి బాగా నచ్చిన Ecole des Beaux Arts అనే చిత్ర కళాశాలలో చేరుతాడు.

సరే.. ఇ లోపులో భర్త David ఒక గని ప్రమాదం లో మరణిస్తాడు.ఇక వ్యాపార సంస్థల్ని అన్నిటిని ఈమె ఒక్కతె బాగా నిర్వహిస్తుంది.Kate Blackwell పాత్రని వాస్తవానికి దగ్గరగా తీర్చిదిద్దాడు రచయిత.తనకి కావాలసిన పని కోసం ఎంత దూరమైన వెళుతుంది ఈమె.జనరల్ మేనేజర్ ర్యాంక్ లో తన సంస్థ లో నే పని చేసే Brad Rogers తన విధుల్లో అలసత్వం వహిస్తున్నాడని తెలుసుకున్న ఆమె అతని కార్యకలాపాల్ని అన్నిటిని పరిశీలిస్తుంది.బాగా ఆలోచించి చివరకి ఒక ఎత్తుగడ వేస్తుంది.ఒకసారి ఉన్నట్టుండి వచ్చి నాతో పడుకో అని అతన్ని ఆజ్ఞాపిస్తుంది.ఆ పని అంతా అయిపోయిన తరువాత అంటుంది..ఎందుకు ఎవరో ఒక ఆడదాని కోసం చింతిస్తూ బిజినెస్ కార్యకలాపాల్ని నిర్లక్ష్యం చేస్తున్నావు..అంతా చేసి దీనికోసమేనా ..మంచిగా కష్టపడితే అందరకీ అన్నీ సమకూరుతాయి  అని అడుగుతుంది..!ఇక అప్పటినుంచి అతను కుక్క మాదిరిగా సంస్థ లో విశ్వాసంగా చివరి దాకా పనిచేస్తుంటాడు.అయితే Kate మళ్ళీ చాన్స్ ఇస్తుందేమోనని ఇతగాడు చూస్తాడు గాని ఇహ జీవితం లో చస్తే ఇవ్వదు.అలా ఒక మైండ్ గేం తో ఎవరిని ఎలా ఆడుకోవాలో అలా ఆడుకుంటూ ప్రపంచం లో ఒక ఆసక్తిదాయకమైన  బిలియనీర్ గా  పేర్తెచ్చుకుంటుంది..!

సరే..అటు పారిస్ లో Tony చాలా సామాన్యమైన జీవితం గడుపుతుంటాడు.చిన్న కిచెన్,చిన్న బెడ్ రూం ఉన్న ఇల్లుని అద్దెకి తీసుకుంటాడు.తన తిండిని తానే వండుకుంటూ అంట్లు కడుక్కుంటూ ఆర్ట్స్ స్కూల్ కి వెళుతూ ఒక సాదా జీవితం గడుపుతుంటాడు.ఖాళీగా ఉన్నప్పుడు పారిస్ వీధుల్లో చక్కెర్లు కొడుతూ ఆనందం గా తనకి నచ్చిన జీవితాన్ని గడుపుతుంటాడు.ఒక్కొసారి ఏదైనా రెస్టారెంట్ కి వెళ్ళినపుడు పాబ్లో పికాసో కాఫీ తాగుతూ కనిపించేవాడు.అలాగే మార్క్స్ ఎర్నెస్ట్ రోడ్డు వారగా ఉన్న కేఫ్ లోని కుర్చి లో కూర్చుని మిత్రులతో మాట్లాడుతూ కనిపించేవాడు.ఓసారి అల్బర్టో జియాకొమెట్టి తనతో పాటు రోడ్డు దాటుతూ కనిపించాడు.ప్రపంచం ఆరాధించే ఇటువంటి గొప్ప చిత్రకారులున్న ఈ ప్రదేశం లో నేను నివసిస్తున్నా గదా అని గర్వంగా అనిపించేది Tony కి. పారిస్ రెండు పార్శాల్ని కలిగి ఉన్నట్లు అనిపించేది.ఒకటి కళాకారుల నగరం రెండవది మిగతా ప్రజలకి చెందినట్టిది.హిట్లర్ లాంటి వాడు కూడా పారిస్ ని ఆక్రమించినా దాని అందాన్ని చెడగొట్టే పని ఒక్కటి కూడా చేయలేదు అందుకేనేమో.

ఇక్కడి చిత్రకళ లో నిష్ణాతుడని పేరుతెచ్చుకున్నవారికి ప్రపంచం అంతా నీరాజనాలర్పిస్తుంది.మానవ శరీర శాస్త్రాన్ని క్షుణ్ణంగా అభ్యసించిన తరువాతనే అక్కడ ఆర్ట్స్ స్కూల్ లో పాఠాలు మొదలెడతారు.కనీసం ఐదు ఏళ్ళు గురువు శిక్షణ లో ఉండాలని భావిస్తారు వాళ్ళు.Tony కి ఒక గురువు ఉంటాడు అతని పేరు Maitre Cantal. మీ అమెరికన్ లు ఇన్నేసి ఏళ్ళు ఆర్ట్స్ మీద ఉండటానికి ఇష్టపడరు.నువ్వు తేడా గా ఉన్నావే అంటాడితను ఓసారి Tony..! కాలం గడుస్తున్న కొద్దీ మిగతా విద్యార్తులు అందరి కంటే మిన్నగా రాణిస్తుంటాడు ..అది చూసి ఒక సారి గురువు అంటాడు..Tony గీసిన బొమ్మ నిజం గానే ఊపిరి పీలుస్తున్నంత గొప్ప గా ఉందని మిగతావారికి చెపుతుంటాడు.

ఇదిలా ఉండగా ఆ స్కూల్ లోనే మోడల్ గా కొత్త గా వచ్చిన Dominique అనే యువతి Tony అభిమానిగా మారి అతనితో ప్రేమలో పడుతుంది.ఒకరోజు ఆమె అడుగుతుంది నీ బొమ్మలు అన్నిటిని గ్యాలరీ లో ప్రదర్శనకి పెట్టమని.దానికి అతను అంగీకరించడు ఈ పారిస్ నగరం గొప్ప కళాకారులకి పుట్టినిల్లు.నావి ఎంత అంటాడు.లేదు నీవు కూడా అంతటి గొప్ప వాడివే అంటుంది ఆమె.సరే అని ఒక గ్యాలరి లో ప్రదర్శన కి పెడతాడు.దానికి ప్రముఖులంతా వస్తారు.ముఖ్యంగా ఆండ్రీ అనే విమర్శకుడు దాన్ని తూర్పార పడతాడు.పేపర్లలో కూడా చులకనగా రాస్తాడు.దానితో Tony కి మనసు విరిగిపోతుంది.ఇంత మంచి చిత్రాల్ని కాదని అన్నప్పుడు నేనిక్కడ ఎందుకు ఉండాలి అని కోపం తెచ్చుకొని తల్లి దగ్గరకి న్యూయార్క్ కి వచ్చేస్తాడు.తల్లి చెప్పినట్లే విని బిజినెస్ కార్యకలాపాల్లో మునిగిపోతాడు.ఉన్నట్లుండి ఒక రోజున అనుకోకుండా Dominique అనే యువతి(పారిస్ లో కలిసినావిడ)  తమ సంస్థ లోని ఉద్యొగిని అని తెలిసి ఆశ్చర్యపడి నిజం చెప్పమని బెదిరిస్తాడు. తనని ఆ చిత్ర కళ నుంచి దూరం చేయడానికే తన తల్లి Dominique ని రంగం లోకి దింపిందని ,ఆ విమర్శకునికి డబ్బిచ్చి అలా రాయించిందని తెలుసుకుని ..ఇంటికొచ్చి తల్లి Kate ని బాగాతిట్టి ..అసలు ఈ ఇంట్లో నివసించను చెప్పి దూరం గా వెళ్ళిపోతాడు.ఆ తర్వాత అతనికి మతి భ్రమిస్తుంది.అయితే అప్పటికే అతని  భార్య గర్భవతి.ఇద్దరు కవలల్ని (ఆడపిల్లల్ని) ప్రసవించి మరణిస్తుంది.వాళ్ళిద్దరి పేర్లే Eve,Alexandra లు.వీళ్ళు కధని ఇంకో మలుపు తిప్పుతారు.వచ్చే భాగం లో అదంతా చివరికంటా స్పీడుగా లాగించేద్దాము.లేకపోతే ఎంత చెప్పినా తరిగేది కాదు.Click here

                                   

No comments:

Post a Comment