Wednesday, September 23, 2015

అది ఒక తీపి గుర్తు గా మిగిలిపోయింది.

ఇంటి బయట ఉండే సైన్ బోర్డ్...చూసినప్పుడల్లా ఎప్పుడో పాతికేళ్ళ క్రితం చదివిన ఆర్.కె.నారాయణ్ రాసిన The painter of signs  గుర్తుకు వస్తుంది.ఎన్ని మార్పులు వచ్చాయి వీటిల్లో కూడా.ఒకప్పుడు ఆర్టిస్ట్ చక్కగా ఆ  WOOD PLATE మీద రకరకాల స్టయిల్స్ లో రాయడం ..దాన్ని తీసుకొచ్చి ఇంటి ముందు గోడకి తగిలించుకోవడం ..ఇప్పుడదంతా తల్చుకుంటే గమ్మత్తుగా ఉంటుంది.ఈ కంప్యూటర్లు...ఫ్లెక్సీ లు గట్రా  వచ్చినతర్వాత ఆర్టిస్ట్ ల బ్రష్ లకి పని చాలా తగ్గిపోయింది.

మాల్గుడి లో ..ఆ నదికి దాపునే ఉండే రామన్ ఇల్లు...రాసిన సైన్ బోర్డ్ ల్ని ఆ ఇసుక లో ఆరబెట్టుకుంటూ ..ప్రశాంత వాతావరణాన్ని  ఆస్వాదించే తీరు..ఆ ఎల్లమ్మాన్ స్ట్రీట్ లో ఇళ్ళు..!దక్షిణాది   భారతం కి దగ్గరగా ఉండే ఓ మాదిరి ఊహా  పట్టణం మాల్గుడి.సాయంత్రం కాగానే సెంటర్ లోని Boardless హోటల్ లో స్థానిక సమస్యల దగ్గర్నుంచి అంతర్జాతీయ సమస్యలదాకా జతగాళ్ళతో బాతాఖానీ వేసుకోవడం.. అవన్నీ గుర్తుకొచ్చి ఆహ్లాదంగా అనిపిస్తుంది.దాంట్లో ఎక్కడో అక్కడ మనని మనం చూసుకుంటాము.

కొత్తగా లా డిగ్రీ తీసుకున్న యువకుడు రామన్ ని ఓ సైన్ బోర్డ్ రాయమంటాడు తనకి.అక్షరాలు ఒంపు తిరిగి ఎడమకి వంగి ఉండాలని అంటాడు.కిరోసిన్ హాకర్స్ కి సోప్ మర్చంట్స్ కి ఆ స్టయిల్ బావుంటుంది...అంటూ కాలీ గ్రఫి ని రామన్ వివరించడం ..చిరునవ్వు తెప్పిస్తుంది.ఆ మాట కొస్తే R.K.NARAYAN నవలలన్ని ఏది చదివినా మన ఇంటి చుట్టారా పరిసరాల్లో తిరిగినట్లు ఉంటుంది.సంభాషణలు కూడా సహజంగా ఉంటాయి.  ఆంగ్ల భాష లోని ఆ  శైలి కూడా ఎక్కడా ఇబ్బంది పెట్టదు.సులభంగా కరకర లాడే బిస్కెట్ వలె ఉంటుంది.ఆ విధంగా అంతర్జాతీయ పాఠకునికి ,భారతీయ పాఠకునికి ఒక ప్రపంచాన్ని చేరువ చేశాడు.అవకాశం ఉన్నప్పుడల్లా తమిళదనాన్ని చొప్పిస్తాడు.వళ్ళువర్ నుంచ్చి ఐన్స్టీన్ దాకా ఎవరొచ్చినా ఒప్పించడం కష్టం అంటాడు రామన్ ఓ చోట.ఇంకా చిన్న చిన్న పదాల్ని కూడా.ఎక్కడా కృత్రిమత్వం ఉండదు.

ఎందుకని మనలోనుంచి ఒక ఆర్.కె.నారాయణ్ రాలేదు అనిపిస్తుంది.అటువంటి సునిశిత వ్యంగ్యం తో ,అలతి పదాలతో పండితుని నుంచి పామరుని దాకా అలరించే రచనలు తెలుగు లో కూడా ఎన్నో వచ్చాయి.మరి ఎందుకు ఆంగ్లం లో రాయలేదు...బయట కి ఇంకా wider range of readers కి మనము చేర్చలేకపోయాము.అనుకున్నప్పుడు తోచేది ఏమంటే ఇంగ్లీష్ భాషకి సంబందించిన ఒక కల్చర్ అనేది మనకి మొదటి నుంచి లేదని చెప్పాలి.ఒక్క కోస్తా అనేకాదు హైద్రాబాద్ కి కూడా ఇది లేదు.ఎక్కువ లో ఎక్కువ హిందీ ,ఉర్దూ లతో ఆగిపోతాము.నేను చెప్పేది వేష భాషణ లకి సంబందించిన ఇంగ్లీష్ కల్చర్ గురుంచి కాదు,విస్తారంగా రచనాభివేశం తో నిండి ఉండే ఇంగ్లీష్ కల్చర్ గురుంచి నేను చెప్తుంటా.తెలుగు లో నుంచి ఇంగ్లీష్ లోకి వచ్చే రచనలు కూడా అనువాద శైలి మరీ అకడమిక్ గా ఉంటుంది.సమకాలీన ఫిక్షన్ విస్తారంగా చదివే వారి శైలి ఈ తరానికి పడుతుంది.భాష కూడ సులువు గా ఉంటుంది.హ్మ్మ్...చేతన్ భగత్ లాంటి వారు సక్సస్ అవ్వడానికి ఇది కూడా ఓ కారణమే.

చిన్నప్పటినుంచి పిల్లలకి ఎంత కాన్వెంట్ లో చదివినా సరే...మంచి ఫిక్షన్ ని చదవడం రాయడం అలవాటు చేయాలి.అభివ్యక్తీకరణ ల్లోని విభిన్నత ని పరిచయం చేయాలి..అంతేగాక ఇండో ఆంగ్లికన్ రచయితల్ని తెలుగులలోనుంచి ప్రోత్సహించాలి.  సరే...ఆ నవల లోకి పోదాము.రామన్ ఆ సైన్ బోర్డ్ లు రాసే క్రమం లో డైసీ అనే సోషల్ వర్కర్ తో పరిచయం అవుతుంది.ఆమె గ్రామసీమలు తిరుగుతూ ఫేమిలీ ప్లానింగ్ ప్రోగ్రాం ని పల్లెలకి తీసుకువెళుతూంటుంది.దానికి సంబందించిన వాల్ రైటింగ్ కోసం రామన్ ని పల్లెలకి   తీసుకుపోతుంది.అక్కడ ఎదురయ్యే వివిధ అనుభవాలు వాటి తో కధ నడుస్తూ ఉంటుంది. అక్కడ పాత్రలు కూడా సహజంగా ఉంటాయి.ఇలాంటి వాళ్ళని చూశామే అనిపిస్తుంది.డైసీ తో ప్రేమలో పడి పెళ్ళి చేసుకోవడం తో ఇంట్లో పెద్దావిడ కాశీ కి వెళ్ళిపోతుంది.డైసీ కూడా దూరమవుతుంది.చివరకి విషాదాంతమే..అవుతుంది.

ఈ నవల చదివి ఆర్.కె.నారాయణ్ గారికి  1986 ప్రాంతం లో ఒక ఉత్తరం రాశాను.మా ఇంగ్లీష్ లెక్చరర్ రామసుబ్బారావు గార్ని అడిగితే ఆయన పేరు రాసి మైసూర్ ,కర్నాటక అని రాసెయ్ చాలు వెళ్ళిపోతుంది ఉత్తరం అన్నారు. నాకు నమ్మకం కుదరలేదు గాని సరేలెమ్మని పోస్ట్ లో వేశాను జాబు.ఆశ్చర్యకరంగా నెల లోపులోనే ఆయన నాకు ఒక కార్డ్ రాశారు.చాలా ఆనందమనిపించింది.అది ఒక తీపి గుర్తు గా మిగిలిపోయింది. Click here 

No comments:

Post a Comment