Friday, January 15, 2016

చింగిజ్ ఐత్మతోవ్ దే మరియొక నవల "తొలి ఉపాధ్యాయుడు" గురుంచి (రెండవ మరియు చివరి భాగం)

చింగిజ్ ఐత్మతోవ్ దే మరియొక నవల "తొలి ఉపాధ్యాయుడు" గురుంచి (రెండవ మరియు చివరి భాగం)

సరే..గతం లో ఎందాకా వచ్చాము..అల్తినాయ్ అనే ఆ అమ్మాయి కుర్కురేవ్ గ్రామం లో పాఠశాల లో చదువూతూంటుంది గదా.అలా కాల క్రమం లో ఆ పదిహేనేళ్ళు వస్తాయి.ఈ అమ్మాయిని అప్పటికే బహూ భార్యలున్న ఓ వ్యక్తి కి అమ్మేసి తన బరువు తీర్చుకోవాలని పిన తల్లి ప్రణాళిక వేస్తుంది.ఆ విధంగా చిన్న వయసులో పిల్లల్ని చదువుకి పంపకుండ పెళ్ళి చేయడం ప్రభుత్వ శాసనానికి విరుద్ధమని డ్యూషేన్ మేష్టారు చెబుతాడు.అయినా ఆ పిన తల్లి లక్ష్య పెట్టకుండా కొంత మంది రౌతుల తో  వచ్చి దుడ్డు కర్ర ల తో దాడి చేసి ఆ పిల్లని బళ్ళోనుంచి తీసుకెళ్ళిపోతుంది.డ్యూషేన్ కి వళ్ళంతా రక్త సిక్తమవుతుంది ఆ దాడిని ప్రతిఘటించడం తో..!

అంతకు ముందే అతను చెబుతాడు అల్తినాయ్ కి" నేను పట్నం లో అక్కడి సంబందీకుల తో మాట్లాడాను.చక్కగా నువు అక్కడి కి వెళ్ళి చదువుకో..నిన్ను ఆటంకపరిచే వారు ఎవరూ ఉండరు లే " అని.

దానితో ఆ అమ్మాయికి పట్నం ఎలా ఉంటుందో తెలియకపోయినా  ఆ జీవితాన్ని ఊహించుకోడానికి డ్యూషేన్ మాటలు  చాలినాయి.మర్నాడు ఒకటే ఆలోచన.పట్నం లో ఎలా ఉంటానో ,ఎవరింట్లో ఉంటానో ..అని..!ఎవరైనా సరే నన్ను వారింట్లో ఉండనిచ్చితే చాలు..వాళ్ళ ఇంట్లో అన్ని పనులు చేస్తా ..పొయ్యి లోకి పుల్లలు చీరతా,నీళ్ళు మోస్తా ,గుడ్డలు ఉతుకుతా,ఏ చాకిరి చేయమన్నా చేస్తా..." ఇలా ఊహించుకుంటూ బళ్ళో కూచునుండగానే గుర్రపు డెక్కల శబ్దం హఠాత్తుగా ప్రతి ధ్వనించింది.ఆమె పిన తల్లి మరో ఇద్దరు వ్యక్తులు మేష్టారి పై  దాడి చేసి ఆ పిల్లని ఎత్తుకెళ్ళిపోయారు.

కొన్ని రోజుల్లోని ఆశ పెట్టిన వ్యక్తి తో ఆమె కి మొదటి రాత్రి జరిపించింది.నలుగురు భార్యల్లో ఒకరి గా రోజులు భారంగా గడప సాగింది.ఉన్నట్టుండి కొన్ని రోజుల తర్వాత తలకి తగిలిన గాయాలకి కట్లు కట్టుకొని డ్యూషేన్  ఇద్దరు మిలీషియా జవాన్ లతో ఊళ్ళోకి వచ్చాడు.ఆమె ని ఆ కసాయి నుంచి విడిపించి రైలు స్టేషన్ దాకా  తీసుకొచ్చాడు." అల్తినాయ్ ..నిన్ను ఆ రోజు రక్షించలేకపోయాను..క్షమించు " అన్నాడు డ్యూషేన్.ఆమె వెక్కి వెక్కి ఏడ్చింది.

"సంభాళించుకో అల్తినాయ్ ...నేను అన్ని ఏర్పాట్లు చేసి వచ్చాను పట్నం  లో...ఇక ముందర ఉన్న భవిష్యత్ అంతా నీదే..మరి ఇదే నీకు వీడ్కోలు..శుభం..క్షేమంగా వెళ్ళిరా ,నా తల్లీ ..నా ఉజ్వల తార..ఏం భయపడకు..ధైర్యం వహించు"  అంటూ అనునయించాడు.

అల్తినాయ్ ని ఎక్కించుకొని రైలు సాగిపోతూన్నది.కనుమరుగు అయ్యేదాకా అలా చూస్తూనే ఉన్నారు ఇరువురు.ఒక టన్నెల్ గుండా రైలు ప్రవేశించిది.ఇప్పుడు తన గ్రామం మొత్తం కనుమరుగైంది..కజాహ్ సైప్ మైదానాల వెంట ఆమెని నూతన జీవితానికి కొని పోయింది.

" మేస్టారు...మీ కిదే వీడ్కోలు,నా తొలి పాఠశాల నీకిదే వీడ్కోలు,నా లోనే దాచుకున్నా నా తొలి వలపా నీ కిదే వీడ్కోలు "  ఆమె హృదయం లో అనుకున్నది.

*  *  *
ఆ తర్వాత అల్తినాయ్ డ్యూషేన్ కలలు గన్న విశాల గవాక్షాలు గల విద్యాలయాల్లో చదువుకున్నది. కార్మిక ఫేకల్టీ గా పని చేసింది.మాస్కో యూనివర్శిటి నుంచి తత్వ శాస్త్రం లో డాక్టరేట్ పొంది ..అకడమీషియన్ గా ఎన్నో పత్రాల్ని వివిధ విశ్వ విద్యాలయంలలో సమర్పించింది.

ఆ తర్వాత కొన్ని ఏళ్ళకి తన స్వగ్రామం వస్తుంది..ఊరి రూపు రేఖలు అన్నీ మారిపోయి ఉంటాయి.వీధులు కొత్తవి వెలుస్తాయి.మనుషులు అంతా కొత్తగానే ఉన్నారు.ఎవరో కొంతమంది తప్ప.అప్పటి పాఠశాల వద్దకి వెళ్ళింది..ఆ రోజుల్లో డ్యూషేన్ మేష్టారు తో కలిసి నాటిన ఆ పోప్లార్ మొక్కలు ఈ రోజున మహా వృక్షాలు అయిపోయినాయి.కాల ప్రవాహం లో అక్కడ ఎంత నీరు పారిందో గదా అనుకున్నది అల్తినాయ్.డ్యూషేన్ గురుంచి ఆ ఊరి లో తారసపడిన ప్రజల్ని అడగ్గా అలాంటి వ్యక్తి తామెవరికి తెలియదని సమాధానమిస్తారు.

ఆ తర్వాత మాస్కో కి వచ్చేస్తుంది.పెళ్ళి చేసుకొని ఇద్దరు పిల్లల్ని కని హాయిగా జీవితం గడుపుతున్నది.అయితే మరో సందర్భం లో  ఆ ఊరి లోని పునర్నిర్మాణపు  పాఠశాల కి అథితి గా హాజరైనపుడు పోస్ట్ మేన్ రూపం లో వృద్ధుని గా డ్యూషేన్ మేష్టారు దర్శనమిస్తాడు.ఆ చివరన ఏం జరిగింది..అదంతా ఎవరికి వారు చదివితేనే బాగుంటుంది.ఉప్పల గారి తెలుగు అనువాదం  చాలా హాయిగా సాగిపోతుంది.ఇంగ్లీష్ నుంచే వారు తెనిగించి ఉండవచ్చును..ఇంగ్లీష్ లో ది మక్కీ కి మక్కీ కాకుండా ఆ భావ సౌందర్యానికి అతి దగ్గరగా  ఉండేలా రాశారు.వారి కృషికి వందనాలు. చక్కటి పదాలు ఎంతో తూచి మూల రచయిత యొక్క ఆత్మకి న్యాయం చేశారు.దీని ఆంగ్ల అనువాదం ,తెలుగు అనువాదం రెండూచదివే అవకాశం నాకు కలిగింది.

No comments:

Post a Comment