Friday, March 4, 2016

దోస్తొవిస్కి రాసిన నవల "Crime and Punishment"


దోస్తొవిస్కి రాసిన నవల "Crime and Punishment" 

దోస్తొవిస్కి రాసిన నవల "Crime and Punishment" చదువుతూ ఓ రెండు వందల పేజీలు చదివిన తర్వాత ఇది రాయాలనిపించింది.ప్రసిద్ధ రష్యన్ రచయితల్ని చదవడం నేను కొద్ది గా లేటు గానే మొదలెట్టాను.ఈ రష్యన్ నవలని మొత్తానికి ఇప్పటి దాకా ఆరుగురు అనువాదకులు ఇంగ్లీష్ లోకి అనువదించారు.నేను కొన్న ఈ పుస్తకాన్ని రూపా పబ్లికేషన్స్ వాళ్ళు వేశారు.అనువాదకుల పేరు కనబడలేదు..గాని ధనంజయ సింగ్ అనే ప్రొఫెసర్ ముందు మాట రాశారు. రిచర్డ్ పెవియర్ ఇంకా లారిస్సా వొల్ఖొస్కి అనే వారి లో ఏ ఒక్కరిదైనా అనువాదం  అయి ఉండవచ్చు.ఈ పుస్తక ఇంగ్లీష్ అనువాదం ఎక్కడా మనల్ని ఆపదు...తీసుకొని అలా ముందుకు తోసుకుంటూ పోతుంది.కొన్ని చోట్ల రష్యన్ భాషలోని పలుకుబళ్ళు,ఊత పదాలు,భాషలోని వ్యక్తిత్వం లీలగా అవుపడుతుంది.

సరళమైన ,అందమైన భావ స్ఫోరకమైన ఇలాంటి పద్దతి లో మన తెలుగు నవలలు ,కధలు తెలుగేతర పాఠకుల కోసం అనువాదం చేస్తే ఎంత బాగుంటుంది అనిపించింది.రష్యన్ల యొక్క ఆ పేర్లు మాత్రం కొంత గట్టిగానే గుర్తు పెట్టుకోవాలి.లేదా గందరగోళమే..!హీరో పేరు ని ఓ చోట Rodya అని,Rodian అని Roskolnikov అని వస్తూంటుంది.ఆయన పూర్తి పేరు Rodion Romanovich Roskolnikov అన్నమాట. 1866 ప్రాంతం లో రాయబడ్డ ఈ నవలని కొద్దిగా ఓపిక తోనే చదవాలి.పీటర్స్ బర్గ్ లో  లా చదువుతున్న హీరోకి అతని తల్లి రాసిన ఉత్తరం రమారమి అయిదు పేజీలు ఉంటుంది.అంతా మన సమాజం లోని మధ్య తరగతి కుటుంబం మాదిరిగానే ఉంటుంది..." My dear Rodya..It's two months since I last had a talk with you by letter which has distressed me and kept me awake at night...you know how I love you..you are all we have to look to,...our one hope..our one stay..how could I help you out of my hundred and twenty roubles a year pension.. అంటూ ఆమె కుదువబెట్టిన వస్తువుల సంగతి కూతురు ని ఒక వ్యక్తి పెళ్ళి చేసుకోబోఏ  సంగతి...ఆమె పనికి వెళ్ళిన చోట కలిగిన చేదు అనుభవాలు...అలా చెప్పుతూ పోతుంది.ఆ ఉత్తరం చదివి హీరో పాత్రకి బాగా కోపం వస్తుంది.ఒకప్పుడు తమని చులకన చేసిన ఆ లూషన్ అనే వ్యక్తిని చెల్లెలు పెళ్ళి చేసుకుంటూందని..కాని ఏం చేయగలడు..తను ఇక్కడ  ఉంటూ చదివేదే వాళ్ళ సహాయం తో..అలాగని ఊరికినే ఉండలేడు..అక్కడ ఆ సంఘర్షణని రచయిత బాగా వర్ణిస్తాడు.

ఒక Tavern లోకి పోయినప్పుడు Marmeladov అనే త్రాగుబోతు పరిచయం అవుతాడు.అతను తన గాధని అంతా హీరోకి బలవంతం గా వినిపిస్తాడు.చాలా దీనంగా ఉంటుంది..ఆ చెప్పే విధానం.ఈ పాత్ర గుర్రాల తొక్కిడివల్ల ఓ రోడ్డు మీద మరణిస్తుంది.హీరో అతన్ని ఇంటికి చివరి క్షణాల్లో తీసుకు వెళతాడు.  ఆ భార్య Katerina Ivanova ..మొదడి భర్త పోవడం తో ఇతణ్ణి చేసుకుంటుంది.ఒక ఇంట్లో ఉన్న ప్పటికి సరైన అనుబంధం ఉండదు.అది ఒక ఎపిసోడ్.

హీరో Roskolnikov కి ధనవంతులై వడ్డీ వ్యాపారం  చేస్తూ  అందరి వస్తువుల్ని తాకట్టు పెట్టుకునే  ఇద్దరు సోదరీమణుల్ని  హత్య చేయాలనిపించి ఒక గొడ్డలిని కోటు లో దాచుకుని వెళ్ళి హత్య చేస్తాడు. ఆ తర్వాత అతను మానసికంగా చాలా వ్యధ చెందుతూంటాడు.హత్య దగ్గర కొంత డబ్బు దస్కం తీసుకుని వచ్చేస్తాడు..కాని ఖర్చు పెట్టుకునే సుఖం కూడా ఉండదు..చివరికి కొంత చనిపోయిన తాగుబోతు కుటుంబానికి ఇస్తాడు.పులి మీద పుట్ర లా ఇతణ్ణి అనుమానించే వారు కొందరు.పిచ్చి ఎక్కి పోయి న స్థితి లోకి నెట్టబడతాడు.అలా సాగుతూన్నది ప్రస్తుతం.

డైలాగులు కోసం డైలాగులు రాసినట్లుగా ఉండదు ఎక్కడ....కధ ని నడపడం లో దొస్తోవిస్కి తీరు ప్రత్యేకమైనది. అంతర్మధనాన్ని చిత్రించిన తీరు అమోఘం.లియో టాల్స్ టాయ్,నీషే,సార్త్రే,చెకోవ్ హెమింగ్ వే లాంటి ఎందరో రచయితల్ని ఇన్స్ పైర్ చేసిన దోస్తొవిస్కి  పోకడ లో ఒక విశిష్టత ఉన్నది. రష్యన్ రచయితలు గావచ్చు..ఇతర యూరపు దిగ్గజ రచయితలు కావచ్చు..వారి జీవితాల్లో ఉన్న గొప్ప వైవిధ్యాలు  వారి రచనల్లో తొంగిచూసినవా అన్నట్లుగా ఉంటాయి.ఏదో ఒక కారణంగా రాజ్యం యొక్క ఆగ్రహానికి గురయి జైలు శిక్ష అనుభవించడం గాని..లేదా యుద్ధాలలో  ప్రత్యక్షంగా ఫాల్గొనడం గాని...తీవ్రమైన వ్యసనాలకి లోబడి పైకి తేలిన వారు గాని, ఇట్లా నలగగొట్టబడిన వారు ఎక్కువగా కనిపిస్తారు.అందుకనేనేమో పాత్రలు జీవం పోసుకుని ఉన్నట్లుగా ..నిజంగా మనం ఎక్కడో చూసిన వాళ్ళ లాగా ఉంటాయి.

దీనిలో ఒక తాగుబోతు పాత్ర ఉంటుంది...ఒక మనిషి తీవ్రమైన డిప్రెషన్ లో ఉండి తాగి నప్పుడు మాట్లాడే విధానం  ..ఒక్క వాక్యం కూడా కృతృమత్వం గా  ఉండదు..ఎంత నిశిత పరిశీలన..అనిపిస్తుంది.అలానే మిగతావి.170 భాషల్లోకి దోస్తొవిస్కీ అనువదింపబడినాడు.  

No comments:

Post a Comment