Tuesday, April 19, 2016

ఎన్నో .ఎన్నెన్నో..రత్నాల వంటి గుళికలు ఉన్నాయి కురళ్ లో.

ఈ మధ్య నే ఒక మిత్రుడు చెప్పాడు.తిరుక్కురళ్ ని తెలుగు లోకి అనువదించారని,ఒక కాపీ కొన్నానని.మళ్ళీ పాత జ్ఞాపకాలు ఒక్క సారి గా ముసురుకున్నాయి.దాదాపు గా పదిహేను ఏళ్ళ క్రితం అనుకుంటా చల్లా రాధాకృస్ణ శర్మ గారు చేసిన అనువాదం లో కొన్ని భాగాలు గుర్తుకొచ్చినయి.తమిళ జీవనం మీద కురళ్ యొక్క ప్రభావం చాలా ఉన్నది.క్రీ.పూ.3 శతాబ్దం పరిసరాల్లో జన్మించిన వళ్ళువర్ మానవ జీవితం లో ని అనేక కోణాల్ని వాస్తవానికి అతి దగ్గరగా చిత్రించాడు.విచిత్రంగా మోక్షం ఇంకా అలాంటి అంశాల్ని ఎన్నుకోకుండా ఉండడం అదీ ఆ కాలం లో ..ఆసక్తికరంగా అనిపిస్తుంది.ప్రేమ,ధన సంపాదన,స్నేహం,నిజాయితి,కష్టపడి పని చేయడం,విద్య,ధైర్యం,వైఖరులు,లక్ష్యం..ఇలా వివిధ అంశాల్ని ఎంతో లోక పరిశీలన చేసి రాసినట్లుగా అనిపిస్తుంది.ఆ పుస్తకం ని ఓ కవి మిత్రుడు తీసుకొని మళ్ళీ ఇవ్వలేదు.. అందుకని తమిళ భాష లోని ద్విపదల్ని ఉదహరించలేకపోతున్నాను.అయితే ఆ తెలుగు అనువాదం మాత్రం బాగా గుర్తున్నది.రెండు వరుసల్లోనే కురళ్ లోని పద్యం సాగుతుంది.కాని భావం అనంతం.హృదయ రంజకం.


" ధనమును బాగా అర్జింపుము.అది నీ శత్రువును వంచి వేయగల ఖడ్గము"  అని అంటాడు ఒక కురళ్ లో.ధనము ఉన్నవారి జీవితం ఎలా ఉంటుందో ఇంకో కురళ్ లో ఇలా అంటాడు." రెండు ఏనుగులు పోరాడుకుంటుంటే పెద్ద పర్వతం మీద నించుని చూస్తున్నట్లుగా ఉంటుదట జీవితం. నువు అర్జించిన దానికన్నా తక్కువగా ఖర్చు  చెయ్యడం నేర్చుకో అదే నీ ధనాన్ని రక్షించుకునే మార్గం అంటాడు మరో చోట.

ప్రయత్నం గూర్చి చెబుతూ ఏ పనినైనా సాధ్యమైనంత దాకా చెయ్యడానికి ప్రయత్నించు.కనీసం నువు చేసినంత వరకైనా ఆ పని అవుతుంది గదా అంటాడు.ఆపదల గురుంచి చెపుతూ శరీరం ఆపదలకి లక్ష్యమని గ్రహించిన విజ్ఞులు తమకి జరిగే ఆపద గురుంచి చింతింపరు...పని  విధానం గురుంచి వివరిస్తూ ఏదైనా ఒక పని చేసేటప్పుడు దాని వల్ల మరో పని చెయ్యడం ఎలా ఉంటుంది అంటే ఒక ఏనుగు ని బందించి దాని సాయం తో మరో ఏనుగు ని వశపరుచుకున్నట్లు ఉంటుంది అంటాడు.

స్నేహం పై చక్కని వ్యాఖ్య  చేస్తాడు..ఇద్దరి మధ్య సమాన భావాలు ఉన్నప్పుడు ఎంత దూరం లో ఉన్నా ఆ స్నేహం చిగురిస్తుంది అంటాడు ఓ కురళ్ లో.ఒకరి అంతరంగం తెలుసుకోవాలంటే వారి కళ్ళ లోకి చూడు అర్ధమవుతుంది..అని ఇంకో కురళ్ లో వక్కాణిస్తాడు.రాజు తన రాయబారి ని ఎలా ఎంచుకోవాలో చెపుతూ చక్కని మాటతీరు,ఎదుటి వారి కోపపు చూపులకు భయపడనివాడు,సంధర్భోచితంగా  ప్రవర్తించగలవానిని ఎంచుకోవాలంటాడు.ఆహార నియమాల గూర్చి చెపుతూ నీకు బాగా ఆకలి వేసినపుడు మాత్రమే భుజించు..దాన్ని మించిన ఆరోగ్య సూత్రం లేదు అంటాడు.ఇట్లా.....ఎన్నో .ఎన్నెన్నో..రత్నాల వంటి గుళికలు ఉన్నాయి కురళ్ లో.

No comments:

Post a Comment