Friday, May 6, 2016

ఎర్నెస్ట్ హెమింగ్వే నవల The old man and the sea...గురించి కొన్ని మాటలు !

ఎర్నెస్ట్ హెమింగ్వే నవల The old man and the sea...గురించి కొన్ని మాటలు !

మహోన్నతంగా నిలిచిపొయిన అనేక రచనలు చూసినట్లయితే దాని వెనుక ఆ రచయితల యొక్క జీవిత అనుభవాలు లీల గా తొంగి చూస్తుంటాయి.కొన్ని పాత్రల ద్వారా మరీను..ప్రవర్తనలు,వారి ఆదర్శాలు,ప్రభావాలు అన్నీ కలగలిసి కొన్ని కొత్త లోకాలకు మనల్ని తీసుకుపోతుంటాయి.అవి ఆ తర్వాత ఎంతోమందికి స్పూర్తి నిచ్చి మరింత ముందుకు కొనిపోతాయి. అమెరికన్ రచయితల్లో తనదైన ముద్ర తో పాఠకుల్ని అలరించిన ఎర్నెస్ట్ హెమింగ్వే రాసిన నవలల్లో చాలా ప్రత్యేకమైనది The old man and the sea.1954 లో ఆయనకి నోబెల్ బహుమతి ఇచ్చేటప్పుడు దీని ప్రాశస్త్యాన్ని కమిటీ వారు ప్రముఖంగా ప్రస్తావించడం జరిగింది.ఇంతకీ ఏమున్నది దీని లో..ఇప్పుడు కొద్దిగా చూద్దాము.మనిషికి ప్రకృతికి మధ్య  జరిగే పోరాటాన్ని సింబాలిక్ గా చెప్పడం జరిగింది.అదీ చాలా తక్కువ పాత్రలతో.నిజానికి ఒక్క పాత్ర నే బాగా కనిపిస్తుంది.

Santiago  అనే ముదుసలి వ్యక్తి ..అతను క్యూబా కి వచ్చి అక్కడి సముద్ర తీరం లోని ఓ గ్రామం లో నివసిస్తూ చేపలు పడుతూంటాడు.దాని లో మంచి ప్రావీణ్యం ఉన్న వాడు.అతనే ఈ నవలని అంతా నడిపించే హీరో.Manolin ఓ చిన్న కుర్రాడు    చేపలు పట్టే కళ లో పట్లు నేర్చుకుండానికి  Santiago దగ్గర చేరుతాడు.అంటే ఇతని తల్లిదండ్రులు చేర్చుతారు.వీళ్ళిద్దరకి మధ్య వయసు తేడా బాగా ఉన్నప్పటికి మంచి మిత్రులు అవుతారు.అదేమి దురదృష్టమో గాని ఇద్దరూ కలిసి 84 రోజులు వేటకి వెళ్ళినా ఒక్క చేపా పడదు.దానితో Manolin తల్లిదండ్రులు అక్కడినుంచి పని మానిపించి వేరే అతని దగ్గరకి పంపిస్తారు.ముసలాయన బాధ పడతాడు..ఒక రోజు ఆ కుర్రాడితో ఈ 85 వ రోజున నేను సముద్రం మీదికి వెళుతున్నాను..చాలా లోపలికంటా వెళతాను ఈసారి  అని చెపుతాడు.ఆ కుర్రాడు అతని పడవలోకి కావలసిన అన్ని సామాన్లు అంటే..మోకులు,కత్తి,హార్పున్లు ఇలాంటివి అన్ని చేర్చి ఆ ముదుసలికి వీడ్కోలు చెపుతాడు సముద్రం లోకి వెళ్ళడానికి..!

ఇహ ఆ తర్వాత నుంచి కధ ప్రారంభం అవుతుంది.ఆ కుర్రాడి పాత్ర మొదటి రెండు పేజీల్లో మాత్రమే ఉంటుంది.మళ్ళీ కొద్దిగా చివరి లో..!ఆ ముదుసలి సముద్రం లో ప్రయాణించే తీరు,అతని బాల్యం,యవ్వనం అన్నీ మనకి సందర్భోచితంగా కధ ముందుకు పోతున్న కొద్ది తెలుస్తుంటాయి.అతను ఒక్కడే ఆ సముద్రం లో అత్యంత దూరం వెళ్ళాలని నిర్ణయించుకుంటాడు.అతను తన దగ్గర పని చేసిన ఆ కుర్రాణ్ణి తలుచుకున్నప్పుడు తన బాల్యమూ,ఇంకా శారీరక బలము ఇలా గుర్తుకు వస్తుంటాయి.ఇప్పుడు తను ముదుసలి అయినప్పటికి  ఆ రోజుల్లో తాను చేసిన సాహస కృత్యాలు గుర్తుకు వచ్చి తాను ఎప్పటి పోరాటశీలినే అని  సమర్ధించుకుంటాడు.

అలా పోగా పోగా  ..మొత్తానికి ఒక పెద్ద చేప కనిపిస్తుంది.దానికీ పేరుంది.Marlin అన్నమాట.గేలం వేస్తాడు..దానికి చిక్కుతుంది.అది ఊరుకుంటుందా తప్పించుకుండానికి తెగ ప్రయత్నిస్తుంది.పైగా దాని మొత్తం రూపం అప్పుడప్పుడు పైకి ఎగిసినప్పుడల్లా కనిపించి ఆ ముదుసలి ఆశ్చర్యపోతాడు.తన జీవితం లో ఇంత పెద్ద చేపని చూడలేదు.తన పడవకంటే కూడా పొడవుంది.అది తన పట్టుకి చిక్కినట్లే చిక్కి తెగ ఆరాటపెడుతోంది.తన పడవని కూడా అతలా కుతలం చేస్తున్నది. కాని తాను అంత తొందరగా వదులుతాడా..?అలా ఆ చేప ఆ ముదుసలి రెండు రోజుల పాటు ఆ సముద్రం మీదనే ఒకరిని ఒకరు చంపుకోవాలని ప్రయత్నిస్తుంటారు.తను నిద్ర పోయినప్పుడల్లా ఒక్క కుదుపు తో చిక్కాకు చేస్తుందది..ముదుసలి కూడా తన అనుభవాన్ని అంతా రంగరించి కత్తి తోను,మోకులు తోను ఆలంబంగా చేసుకొని పోరాడుతున్నాడు. అతని కంటికి ,చేతికి కూడా  గాయాలయ్యాయి..ఆ చేప విసిరే మొప్పల దెబ్బలకి..! ఆ ముదుసలికి నివ్వెరమనిపించిది..ఆహా సృష్టి లో ప్రతి ప్రాణికి ఎంత సమర శీలత..అని అబ్బురమనిపించింది.నీ చేతి లో చావడం కూడా నాకు గౌరవమే..మన ఇద్దరి లో ఎవరో ఒకరు మాత్రమే ఈ రోజు..మిగలాలి..రా అనుకున్నాడు.చాలా ఆయాసంగా ఉంది..ఆ కుర్రవాణ్ణి కూడా రమ్మని అంటే బాగుండేది అనుకున్నాడు.వయసు మళ్ళిన వానికి అనుభవం ఉంటుంది..వయసు లో ఉన్న వానికి బలం ఉంటుంది.. ఈ రెండు ఒక్క మనిషి లో ఉంటే ఎంత బాగుంటుంది అనుకుంటాడు.మళ్ళీ అనుకుంటాడు..లేదు..లేదు..నేను బలహీనుడిని కాను..దీన్ని ఎట్టి స్థితి లోనూ నేను జయించుతాను..లేదా ఆ క్రమం లో ప్రాణం విడుస్తాను.మనిషి ఎప్పుడూ ఓడిపోడు..కాకపోతే మరణించవచ్చునేమో..!

మొత్తానికి అలా పోరాడి..చివరకి దానిని కత్తి తో కావలసిన చోట గాయపరచి ..తన పడవకి కట్టేసుకొని తీరం సాగిపోతుంటాడు.బాగా అలసిపోయాడేమో వెంటనే నిద్ర పట్టింది.ఇంతలో ఆ చేప రక్తాన్ని పసి కట్టిన షార్క్ లు ఈ పడవ వెంటపడతాయి.ఆ ముదుసలి మేలుకొని మళ్ళీ  పోరాటం మొదలుపెడతాడు. ఈ షార్క్ లు ఇంకా తెలివి గలవి..ఒకటి పైకి ఎగబడుతుంటే ..మరొకటి చేప మాంసాన్ని తినడం మొదలు పెడుతున్నాయి.ముదుసలి బాగాడస్సిపోయాడు..ఎలాగో తీరం చేరుకునేసరికల్లా ..అతనికి చేప యొక్క అస్థిపంజరం మాత్రం కనిపించింది.నీరసించి వచ్చి ఒక పాక లో పడిపోయి ఆదమరిచి నిద్రపోతాడు. ఆ చిన్న కుర్రాడు మళ్ళీ చివరిలో ఆ ముదుసలి వద్దకి వచ్చి చెబుతాడు..చేప తల మాత్రం  ఉందని..తినడానికి పనికివస్తుందని..! దాన్ని పట్టుకెళ్ళి ఆ కాఫీ  షాపు లో ఇచ్చెయ్యి.. ఆ అన్నట్టు వచ్చేప్పుడు పేపర్ కూడా తీసుకురా అని చెప్పి ..అలసట తో ..గాఢ నిద్ర లోకి జారుకుంటాడు.ఒక కల వస్తూ ఉంటుంది ఆ కలలో అతనికి ..ఆఫ్రికా వెళ్ళినట్లు ,అక్కడి సిం హాల్ని  వేటాడుతున్నట్లు ..అలా వస్తూ ఉండగా ..కధ సమాప్తమవుతుంది.

ఈ నవల మొత్తం 124 పేజీలు ఉంటుంది.మనిషి యొక్క సంకల్ప బలం ముందు ఏదీ సరితూగదని సింబాలిక్ గా దీనిలో రచయిత చెపుతాడు.కధలో గమ్మత్తు ఏమిటంటే ముదుసలి ఆ చేప తో మాట్లాడుతుంటాడు..మళ్ళీ తన లో తాను మాట్లాడుకుంటూంటాడు.అట్లా సంభాషణలు నడుస్తూ ఇతివృత్తం పురోగమిస్తూ ఉంటుంది.Descriptive పద్ధతి లో చెపితే బోరు కొడుతుందని హెమింగ్వే అనుసరించి ఉంటాడు.ఎక్కడా బోరు కొట్టదు..ఒక్క పాత్ర ఉన్నప్పటికి..అదీ సముద్రం లో..ఆ పెను చేప తో పోరాటం లో.

నిజ జీవితం లో కూడా హెమింగ్వే  ఇటువంటి సాహసికుడేనని చెప్పాలి.రెండవ ప్రపంచ యుద్ధం లో ఫాల్గొన్నప్పుడు శరీరానికి గాయాలు అయినాయి.ఒక కన్ను కూడా దెబ్బ తిన్నది.ఫిషింగ్ అంటే కూడా ఇష్టం ..క్యూబా కి వెళ్ళి చేపలు పడుతూ ఆనందించేవాడు.స్పెయిన్ అంతర్యుద్ధం లో ఆ దేశం తరపున స్వచ్చందం గా యుద్ధ భూమి లో ఫాల్గొన్నాడు.కారణం ఆ దేశం పట్ల ప్రేమ కాదు...కేవలము రక్త ,భీభత్సాలు  చూడటం..చేయడం అతనికి ఒక అలవాటు.దానిలో ఆనందించే వాడు.వీటినే For whom the bell tolls లో చిత్రించాడు. 

No comments:

Post a Comment