Monday, July 18, 2016

చింగీజ్ ఐత్మతోవ్ "తల్లి భూదేవి" లో నుంచి ఇంకొన్ని విషయాలు


చింగీజ్ ఐత్మతోవ్ లో ప్రస్ఫుటంగా కనిపించేది,చదివించేది అతని రచన లో అంతర్లీనంగా ఉండే ప్రేమ గుణం,అది పాత్రల మాటల్లోను ..ప్రకృతి వర్ణన లోను మిళితమై ఉంటుంది.తన జీవితం లోకి వచ్చి ,బలంగా ముద్ర వేసుకున్న సంఘటనల్నే కధలు గా మలిచినట్లు అనిపించింది.తొలి ఉపాధ్యాయుడు లోని ప్రధాన పాత్ర చింగీజ్ జీవితానికి చాలా దగ్గర గా అనిపిస్తుంది.ఆ పాత్రకి వలెనే  ఈయన కూడా పోస్ట్ మేన్ గా,రైతు గా,గ్రామ కార్యదర్శి గా,ఉపాధ్యాయుని గా ఇంకా ఇతర వృత్తులను నిర్వహించాడు.గ్రామీణ జీవితాన్ని ,అక్కడి పని జరిగే విధానాల్ని,వాతావరణాన్ని కళ్ళకి గట్టినట్లు చూపిస్తాడు.ఒక్కోసారి అక్కడి మహా తరువులు,పర్వతాలు, ఇతర కనిపించే జీవులు అవి కూడా మనుషుల్లాగే నే తమ పాత్రల్ని పోషిస్తూ గుర్తుండి పోతాయి."తల్లి భూదేవి " లో ఒక మాట వాడతాడు. తెల్లని రోజు అని,ఇంగ్లీష్ లో White day అని వస్తుంది.ముందు అదోలా అనిపిస్తుంది గాని క్రమేణా ఆ పదం ఎంత చక్క గా వాడాడు అనిపించింది.

మధ్య ఆసియా లోని ఆ పల్లె లో ఆ రోజు అంతా.. మనకి వాన కి మల్లే నే మంచు తెగ పడుతూ ఉంటుంది.దాన్ని వర్ణించే సందర్భం లో ఆ మాట అంటాడు.చింగీజ్ వర్ణించిన ఇంకా జీవించిన సమాజం ప్రధానంగా కొండ ప్రాంతం లో నివసించే ముస్లిం కుటుంబాలకి చెందినది.పాత్రల పేర్లు కొంత స్థానికీకరణ చెంది ఉంటాయి.సువన్ కూల్,ఖాసిం,జైనాక్,అలిమోన్,ఆయ్ షా ,ఉసేన్ బాయ్ ఇలా ..!

 అవసరమైన కొన్ని చోట్ల సిద్ధాంత పరమైన భావ జాలాన్ని సున్నితం గా తిరస్కరించి మానవీయత కే మొగ్గు చూపడం కానిపిస్తుంది.ఇదే నవల లో రెండవ ప్రపంచయుద్ధం జరుగుతున్న రోజులవి.సమిష్టి వ్యవసాయ క్షేత్రాల్లో పండిన పంట అంతా యుద్ధ భూములకే రైళ్ళ ద్వారా సరఫరా చేస్తుంటారు.గ్రామం లో కి తిండానికి దొరకని పరిస్థితి.ఎక్కువ పండించాలన్నా జిల్లా కమిటీ ఆమోదించవలసిదే.తొల్గొనాయ్ ..వారిని ఎంతగానో బతిమిలాడుతుంది..అదనంగా పండించడానికి పర్మిషన్ ఇమ్మని.అక్కడి వ్యక్తి అంటాడు " స్టాలిన్ తెచ్చిన చట్టాల్నే వ్యతిరేకిస్తావా..పరిణామాలు ఎలా ఉంటాయో నీకు తెలుసా " అంటాడు. "తిండి లేక గ్రామం లో చిన్నా పెద్దా పోయినాకా...ఆ సమిష్టి క్షేత్రాల్లో విత్తనాలు ఎవరు నాటుతారు...యుద్ధ భూములకి గింజలు ఎవరు పంపిస్తారు..పద నన్ను అతని వద్ద కి తీసుకు వెళ్ళు..నేను మాట్లాడతా .." అని మొత్తానికి అనుమతి సాధిస్తుంది.

ఈ పుస్తకాన్ని అంకితం ఇవ్వడం లో కూడా ఎంత చక్కని పదాలు భావ గర్బితమైనవి వాడాడో రచయిత అనిపించక మానదు.ముందు పేజీ లో ఇలా ఉన్నది..దీన్ని ఆంగ్లం లోను,దానికి అనువాదకుడు చేసిన తెలుగు మాటలను ఇక్కడ ఇస్తాను.

"Father, I know not where you lie buried.I dedicate this to you,Torekul Aitmatov.Mother,You brought us up ,the four of us,I dedicate this to you,Nagima Aitmatova. (నాన్నా,తొరెకుల్ ఐత్మతోవ్,నిన్నెక్కడ భూస్థాపితం చేశారో నాకు తెలియదు.దీనిని నీకు అంకితం చేస్తున్నాను.అమ్మా,నజీమా ఐత్మతోవ,నువ్వు మమ్ములను నలుగురిని పెంచి పెద్దవాళ్ళను చేశావు.దీనిని నీకు అంకితం చేస్తున్నాను...CHINGIJ AITMATOV. )

No comments:

Post a Comment