Wednesday, January 4, 2017

Paulo Coelho రాసిన The Winner stands alone నవల గురించి కొన్ని మాటలు..



పావ్లో కొయిలో రాసిన కొన్ని నవలలు గతం లో చదివిన పిమ్మట ..ఆ అనుభవం ని పురస్కరించుకొని ఈ సారి ఇది చదువుదాములే అని The Winner stands alone ని ఇటీవల చదివాను.మొత్తం మీద 372 పేజీల రచన ఇది.పావ్లో లో నచ్చే అంశం ఏమిటంటే ఎంతో లోతైన ,కదిలించే భావాన్ని చాలా చిన్న చిన్న మాటల్లో చెప్పేస్తాడు.అనేక కోణాల్లో జీవితానుభవమూ,పరిశీలన లో గొప్ప సూక్ష్మత లేనిదే అవి సాధ్యము కానేరవు. బ్రెజిల్ కి చెందిన అతను పోర్చుగీస్ లో నే రాస్తాడు...అవి ఇంగ్లీష్ లో తర్జూమా అవుతాయి..ఆ పిమ్మట అనేక ఇతర భాషల్లోకి వెళతాయి.ఈ అనువాదకురాలు మార్గరెట్ జల్ కోస్ట  కూడా చక్కని సరళమైన భాషలోకి  తెస్తుంది..అందుకు గాను అభినందించవలసిందే.

మొదట ఈ రచన ని వ్యక్తిత్వ వికాసం తరహా లో రాసి ఉంటాడేమో అనిపించింది.పేజీల్లో ముందుకి పోతున్న  కొద్దీ నా అంచనా వేరు అయింది.నాలుగు పాత్రలు ప్రధానమైనవి.Igor అనబడే రష్యన్ మిలియనీర్,Ewa అని ఒకామె ,Hamid అని ఒక అరబ్ ఫేషన్ డిజైనర్,Gabriela అని ఓ అమెరికన్ మోడల్ ..ఇంకా కొన్ని ఉన్నాయి ఇలా..! అసలు ఈ నవల రాయడం వల్ల ఏమి చెప్పదలుచుకున్నాడు రచయిత అని యోచించినపుడు...Cannes  ఫిల్మ్ ఫెస్టివల్ పేరిట ఫ్రాన్స్ దేశం లోని ఆ చిన్న పట్టణం లో ఏ తతంగాలు జరుగుతాయో ప్రధానంగా వర్ణించాడు.ఆసక్తి ఉండాలి గనక ఒక సీరియల్ మర్డరర్ నిని దీని లో ప్రవేశపెట్టాడు.అతనే Igor రష్యన్ వ్యాపారి ,గతం లో ఆఫ్ఘన్ ఆపరేషన్ ల లో ఫాల్గొన్నవాడు.Curare ఇంకా ఇలాంటి సీక్రెట్ మార్షల్ ఆర్ట్స్ ల లో ప్రవేశం ఉంటుంది అతనికి..!అతి తక్కువ సమయం లో ,వివిధ రకాలు గా నాలుగు మర్డర్లను ఎలాంటి ఆధారాలు దొరకకుండా చేస్తాడు.ఇది అంతా దేనికి అంటే Ewa అనే ఆమె  భార్యని వెనక్కి రప్పించడానికి,ఈమె Hamid అనే ఫేషన్ డిజైనర్ తో కేన్స్ కి వస్తుంది..Igor ని వదిలివేయాలని నిశ్చయించుకుని..!దానితో Igor సీక్రెట్ గా కేన్స్ కి వచ్చి ఒక్కో మర్డర్ ద్వారా  మెసేజ్ ఇస్తుంటాడు.

సరే...మిగతా మోడళ్ళు ..నలు దిక్కులనుంచి తమ సినిమాల్ని ప్రమోట్ చేసుకోడానికి వచ్చే సినిమా జనాలు,వివిధ అడ్వర్టైజ్ మెంట్ కంపెనీల నుంచి కాంట్రక్ట్ లు పొందటానికి వచ్చే నటీమణులు,మోడళ్ళు..వారి జీవిత విధానాలు సందర్భానుసారంగా చెప్పాడు.అధికారికంగా ఆహ్వానం పొంది వచ్చే వాళ్ళు కొందరైతే ,చాలా మంది ఏదో రకంగా ఆహ్వానాలు తెప్పించుకొని వచ్చేవాళ్ళు ఇంకొందరు.మొదటి వాళ్ళకి రాచ మర్యాదలు ఉంటాయి..మిగతా వాళ్ళు తమని ప్రమోట్ చేసుకోడానికి నానా తిప్పలు పడుతుంటారు. దానిలో భాగంగా అన్ని రసాలు ధారళంగా ప్రవహిస్తుంటాయి.

చివరకి ఇంతా చేసి ఈ Igor తన భార్యని వెనక్కు తెచ్చుకోవడం అటుంచి చివరి లో జరిగే నాటకీయ సన్నివేశం లో ఆమె ని,అతని అరబ్ ప్రియుడు Hamid ని చంపి వేయడం తో నవల ముగుస్తుంది. అసలు ఈ నవల మీద పావ్లో కొయ్లో  పేరు లేకపోయినట్లయితే అట్టర్ ఫ్లాప్ అయ్యేది కొనుగోళ్ళ పరంగా.అక్కడక్కడా పావ్లో మేజిక్ కనిపించినా  అది మొత్తంగా చూసినపుడు వ్యర్ధం అయింది అని చెప్పాలి.మొదటి సారిగా  2008 లో ప్రింట్ అయి ఇప్పటికి పది ముద్రణలు పొందినట్లు ఉన్నది గాని ,అన్ని విధాలా బోరుగా నే అనిపించింది నాకైతే.కొన్ని మాట్లు అనవసరమైన పేజీల సాగతీత కనిపిస్తుంది.

No comments:

Post a Comment