Sunday, February 5, 2017

Ernest Hemingway యొక్క నవల The Old Man and the Sea సంక్షిప్తంగా ...


ఆ ముసలాయన గల్ఫ్ స్ట్రీం గా పిలువబడే సముద్ర జలాల్లో చేపల్ని వేటాడుతుంటాడు..!ఆ రోజుకి ఎనభై నాలుగు రోజులు గడిచాయి.ఒక్క చేపా పడ లేదు.మొదటి నలభై రోజులు ఓ కుర్రవాడు సాయంగా వచ్చేవాడు.అంటే ఏం లేదు..ఆ కుర్రవాని తల్లి దండ్రులు కాస్త మెళుకువలు నేర్చుకుంటాడని ఇతని దగ్గర చేర్పించారు. ఇన్ని రోజులూ ఒక్క చేపా పడలేదు.చికాకు లేచి ఆ తల్లి దండ్రులు వేరే జాలరి వద్ద చేర్పించారు.మొదటి వారం లోనే మూడు మాంచి చేపలు పడ్డాయి.ఇకనేం..ఆ తల్లి దండ్రులు ఆ కుర్రవాణ్ణి Salao లాంటి ముసలివాణ్ణి వదిలి ఈ కొత్త పడవ మీదనే వేటకి వెళ్ళు అని చెప్పారు.

అయితే ఈ కుర్రవానికి ఆ ముదుసలి వ్యక్తి తో గల అనుబంధం అంత త్వరగా తెగిపోయేది కాదు. తల్లిదండ్రుల కన్నుగప్పి కూడా వచ్చి ఈ ముసలాయన బాగోగులు చూస్తూ ఉంటాడు.ఒక తాతా మనవల  బంధమేమో.ప్రతి రోజు ఆ కుర్రవాడు ఈ ముసలాయన పాకలోకి వస్తుంటాడు.చేపలు పట్టడానికి ఉపయోగించే సరంజామా అంతా..ఆ మొకులు..తాళ్ళు..గేలాలు...ఆ తెర చాపలు ఇలాంటివి అన్నీ ఏ రోజుకి ఆ రోజు సిద్ధం చేస్తూ ఆ ముసలాయనకి సాయం చేస్తుంటాడు.

ముసలాయన శరీరం లోని శక్తి క్రమేపి హరించుకు పోతుందా అన్నట్లు మోము నుంచి మెడ వెనుక దాకా ముడతలు పడుతున్న వళ్ళు.శరీరం మీద అక్కడక్కడ గోధుమ రంగు మచ్చలు..అంతాటా పాకుతున్నట్లు చెంపల మీది నుంచి ..కింది దాకా చేతుల మీద దాకా..ఒక లాంటి చారలు..ఆ సూర్య తాపం అదీ మామూలా.బలమైన చేపల్ని వేటాడం లో గాని,ఆ మోకుల రాపిడి తో గాని ..అవి చేసే దెబ్బలు అవి అన్నీ మామూలా.అతని శరీరం లో అవి అన్నీ ప్రతిఫలిస్తున్నాయి.ఇప్పటివి కావు అవి.

ఆ ముసలాయానికి సంబందించి చెప్పాలంటే అన్నీ పాతవే.ఒక్క అతని కళ్ళు తప్ప..సముద్రం మాదిరి గానే అవి నీలి వర్ణం లో ..ఆనందకరంగా ...ఓటమి ఎరుగని వారి లా గోచరిస్తుంటాయి.

"శాంటియాగో"  పిలిచాడు ఆ కుర్రవాడు.పడవని ఆపుచేసి ఉన్న ఒడ్డు కి సమీపంగా వెళుతుండగా.మళ్ళీ అతనే అన్నాడు ..!

" మళ్ళీ నీతో వేటకి వస్తాను...కొంత సంపాదించుకున్నాముగా ఇప్పటి కే" అని.

అసలు చేప వేట సముద్రం మీద ఎలా ఉంటుందో ..నేర్పించిందే ఈ ముసలాయన ..ఆ కుర్ర వానికి..!

" వద్దులే..నువ్వు ఇపుడు మంచి చేపలు పడే పడవల వాళ్ళ తో గదా ఉన్నది,అక్కడే ఉండు.." అన్నాడు శాంటియాగో..అదే ఆ ముసలాయన.

" మరి ఒకటి గుర్తుంచుకో..ఎన్ని రోజులు పాటు బడినా ఒక్క చేప కూడా మనం కలిసి పట్టలేకపోయాము.మరి ఇప్పుడేమో..ప్రతి రోజు ఓ పెద్ద చేప పడుతోంది..గత కొన్ని వారాలుగా.."

" నాకు తెలుసు..నీ అంతట నువ్వు నన్ను వదిలి వెళ్ళవు..కాని ఎక్కడో నీకు ఓ సందేహం..ఔనా.."

" ఏం చేయను..మా నాన్న చెప్పింది నేను కాదనగలనా..నేను చిన్న పిల్లవాణ్ణి గదా.."

" నాకు తెలుసు..అది సహజం లే.."

" ఆయనకి నమ్మకం లేదు నేను ఏమి చేసేది.."

"లేదు..మనలో మనకి ఉండాలి నమ్మకం ముందు..కాదా.."

" నిజమే..ఆ..అన్నట్టు నేను నీకు ఓ బీర్ ఇప్పిస్తాను..పద..ఆ టెర్రస్ వేపు..ఈ సామాగ్రి అంతా ఇంటికి తర్వాత తీసుకు పోవచ్చు.."

" సరే..కానీ ..ఇద్దరు జాలారుల మధ్య సహజమేగా.."

ఇద్దరు కూర్చుని బీర్ సేవిస్తుండగా ఇంకా కొంత మంది జాలరులు వచ్చారు.ముసలి వాని వేపు చూసి ఏదో ఎగతాళి గా అన్నారు.అయితే శాంటియాగో అది పట్టించుకోలేదు.ఆ రోజు సముద్రం తీరు గురించి,వాతావరణం గురుంచి..బోటు లో నుంచి వదిలే తాళ్ళ గురుంచి ఇలా పిచ్చాపాటి మాట్లాడుకున్నారు.ఆ రోజు బాగా షికారు చేసిన వాళ్ళు తమ చేపల్ని అమ్మడం కోయడం ..ఇలాంటి వాటిల్లో బిజీ గా ఉన్నారు.కొన్ని ఏమో రాజాధాని హవానా కి తరలిస్తున్నారు.శీతల పేటికల్లో. షార్క్ లు పడిన వాళ్ళు ముందు గా వాటి ప్రాణాలు తీసి మాంసాన్ని చక్క గా పేర్చుతున్నారు.మొప్పల్ని వాటిని వేరు చేసి.

గాలి తూర్పు వైపు గా ఉన్నట్లుంది,వాసన గుప్పున కొట్టింది.కాసేపు ఆగి గాలి దిశ మారింది..ఆ వాసన తగ్గింది..హాయిగా ఉంది..సూర్య కాంతి లో ఆ టెర్రెస్ మీద ..!
" శాంటియాగో"  ఆ కుర్రవాడు పిలిచాడు.

" ఆ..చెప్పు.." ముసలాయన ఏదో ఆలోచిస్తూ అన్నాడు.

" నేను బయటకి పోయి నీ కోసం కొన్ని Sardines( ఒక రకం చేపలు) తీసుకు వచ్చేదా"

" నీకెందుకులే..పోయి నువు బేస్ బాల్ ఏదో ఆడుకో..నాకు రోజ్లియో సాయం చేస్తాడు లే " అన్నాడు ముసలాయన.

" నీతో చేపలు పట్టడానికి రాలేకపోయినా కొద్ది గా అయినా నన్ను సాయం చేయనీ "

" నాకు బీర్ ఇప్పించావు గదా..నువు ఇపుడు పెద్దాడి కిందే లెక్కా"

" నువు మొట్ట మొదటి గా నన్ను షికారు కి తీసుకెళ్ళినప్పుడు నా వయసు ఎంత  ఉండి ఉండవచ్చు.."

" అయిదు ఏళ్ళు ఉండవచ్చు.. అప్పుడు గుర్తుందా..ఆ పచ్చ చేప సముద్రం లో మన పడవ ని ముక్కలు చేసినంత పని చేసింది.జ్ఞాపకం ఉందా" అడిగాడు ముసలాయాన.

" ఔను..ఆ తోక తో బాదడం..అప్పుడు నన్ను పడవ చివరి అంచు కి నువ్వు  తోసి వేయడం..ఆ పిమ్మట నువ్వు కత్తి తో వేసిన వేటుకి అది మొదలు తెగిన చెట్టు లా పడిపోవడం..దాని రక్తం నా మీదికి సైతం చిమ్మింది.."

" నిజమా..లేదా నేను చెప్తున్నానా"

" లేదు..ప్రతిది నాకు గుర్తె..మనం మొదటిసారి షికారు వెళ్ళినప్పటి నుంచి ప్రతిది.."

ఆ ముసలాయన కళ్ళ లో ఆరాధన ,ప్రేమ నిండి అలాగే ఉండిపోయాడు.సూర్యకాంతి కళ్ళ లో మెరిసి తళుకు మన్నది.

" నువ్వు గనక నా మనవడివే అయితే నిన్ను తీసుకు పోయి ఎక్కడనో ఆడుకునేవాడిని..కాని నువ్వు పరాయిల బిడ్డవి గదా..అదీ వేరే పడవ లో షికారు కి పోతున్నవాడివి.."

" సరే..ఆ Sardines తెచేదా..నాకు తెలుసు అవి ఎలా అమర్చాలో " కుర్రవాడు అన్నాడు.

" నావి నాకు ఉన్నాయిలే..పెట్టె లో ఉంచాను"

" నేను ఫ్రెష్ వి తెస్తాను..అలా ఉండు"

" ఒకటి చాల్లేవయ్యా.." ముసలాయన చెప్పాడు.గాలి హాయి గా వీస్తోంది.సేద తీరుతున్నట్లుగా ఉన్నది.

" లేదు ..రెండు తెస్తాను.. " అరిచాడు కుర్రవాడు.

" సరే..రెండు..మరి ఎక్కడా దొంగిలించినవి అయి ఉండకూడదు.."

" అయ్యో..అవి నేను కొన్నాను..తెలుసా.."

" థాంక్యూ.."  చెప్పాడు ముసలాయాన.ఎక్కువ ప్రేమ ముంచుకొచ్చినా అతను ఎక్కువ మాట్లాడలేడు.

"రేపు మొత్తానికి ఒక గొప్ప సుదినం కాబోతున్నది..సముద్రం మీద.. " అనుకున్నాడు తను లోలోపల.

" రేపు ఏ వైపు కి వెళుతున్నావు వేట కి ..సముద్రం లో.." అడిగాడు కుర్రవాడు.

" చాలా దూరం.. పవనాలు మళ్ళీ వెనక్కి మళ్ళినా ..వెంటనే రాలేనంత దూరం.. ! తెల్లవారకముందే బయలుదేరుతా..సముద్రం లోకి ఈసారి..!

( సశేషం...)

No comments:

Post a Comment