Monday, March 6, 2017

Ernest Hemingway నవల The Old man and the sea సంక్షిప్తంగా (ఆరవ భాగం)


సముద్రపు నీళ్ళ లో తేలియాడుతూ ఆ రంగు రంగు ల బుడగలు అందం గా కనిపిస్తున్నాయి.కాని అందం గా కనిపించేవి అన్ని మంచివి అని కాదు గదా..ఇవీ అంతే..!అయితే ఒకటి,సముద్రం లో తిరిగే పెద్ద తాబేళ్ళు వీటి లో గల పదార్థాల్ని తింటూ ఉంటాయి.చక్కగా కళ్ళు మూసుకొని ఆస్వాదిస్తూ..ఆనక వాటి కవచాల్లోకి ముడుచుకొని నిద్రోతుంటాయి.ఆ ముసలాయనకి ఆ తాబేళ్ళు తినే తీరు ముచ్చట గొలుపుతుంది.

పెద్ద తుఫాను వచ్చి వెలిసిపోయిన తర్వాత ఇవి సముద్రపు ఒడ్డున నిర్జీవంగా పడి ఉంటాయి ఒక్కోసారి.వాటి పెంకుల మీద నుంచి నడుస్తూంటే పట పట మని విరిగిన శబ్దం వస్తుంది.అది ఒక గమ్మత్తు గా ఉంటుంది.పచ్చ రకం తాబేళ్ళు ఇంకా Hawks-bills రకం తాబేళ్ళు చూడటానికి బాగుంటాయి.మంచి వేగంగా ఈదుతాయి.వాటిని చూస్తే స్నేహపూర్వకమైన శత్రుత్వం...మెదులుతుంది.ఆ పెంకు లోకి తలని ముడుచుకోవడం అనే కాదు వాటి ప్రణయమూ ఒక వింతే.చక్కగా కళ్ళు మూసుకొని Portugese men-of war అని పిలువ బడే నాచు వంటి పదార్ధాన్ని ఆరగిస్తున్నాయి.

చాలానాళ్ళు తాబేళ్ళు వేటాడే పడవల్లో కూడా వెళ్ళి ఉన్నాడు.ఒక్కో తాబేలు టన్ను బరువు అయినా ఉంటుంది.తాబేళ్ళ పట్ల చాలామంది కృరంగా వ్యవహరిస్తుంటారు.దాని గుండెని కోసిన తర్వాత కూడా అది కొట్టుకుంటూనే ఉంటుంది.నా గుండె కూడా అలాంటిదే.అదనే కాదు కాళ్ళు చేతులు కూడా అలాంటివే.అనుకున్నాడు ముసలాయన.మే నెల నుండి తాను తెల్ల గుడ్లు తినడం మొదలెడతాడు.అవి వంటికి బలాన్ని ఇస్తాయి.సెప్టెంబర్,అక్టోబర్ మాసాల్లో చేసే షికారు కి జవాన్ని చేకూర్చుతాయి.
జాలరులు వారి పనిముట్లని పెట్టుకొనే షెడ్డు లో షార్క్ నుంచి తీసిన లివర్ ఆయిల్ ని ఓ డ్రమ్ము లో పోసి పెడతారు.తాను రోజు ఓ కప్పు ఆయిల్ ని తాగుతాడు.కొంతమంది దాని వాసన బాగోదు అంటారు కాని తను అది సరకు చేయడు.ఆ ఆయిల్ జలుబు గిలుబులకి ఇంకా కంటి ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుందని  తన నమ్మకం.

ఉన్నట్టుండి ఓ సారి ఆకాశం వైపు చూశాడు.ఆ పక్షి మళ్ళీ కనిపించింది..చక్కర్లు కొడుతున్నది పైన..!" మొత్తానికి వాడికీ ఓ చేప దొరికింది" గట్టి గా అరిచాడు ముసలాయన.ఇది వరకు కనిపించిన ఎగిరే చేప ఇప్పుడు కనబడలేదు.గేలానికి కట్టబడిన ఎర చేపలు మామూలు గా నే ఉన్నట్లున్నాయి.ఏది ఇంకా పట్టుకున్న జాడ లేదు.కాసేపుండి చూస్తే ఓ చిన్న Tuna రకం చేప నీళ్ళ లోనుంచి పైకి ఎగురుతూ ,మునుగుతూ ముందుకు సాగుతున్నది.ఒక దిశ అని లేదు.దానిష్టం వచ్చినట్లు ఎగురుతున్నది.కిరణాలు తగిలి వెండి మాదిరి గా మెరుస్తోంది.అది బహుశా ఎర గా కట్టిన చేపల వెంట పడాలని ఏమో..!

ఆ చేపలు చాలానే కనిపిస్తున్నాయిప్పుడు..మందలు గా సాగుతున్నాయి.అన్నీ తెల్లగా అనిపిస్తున్నాయి.ఆ పక్షి మళ్ళీ తన ప్రయత్నాలు మొదలు పెట్టింది.నీళ్ళని తాకుతూ, గాలి లో లేస్తూ సాగుతున్నది.ఈ పిట్ట కూడా నాకు సాయం గానే ఉంది.అనుకున్నాడు ముసలాయన.కాలి దగ్గర గా ఉన్న గేలాన్ని ఏదో లాగినట్లు తోచింది.తెడ్లు వేయడం ఆపాడు.తన చేతి తో ఆ గేలాన్ని పట్టుకొని దాని బరువు ని అంచనా వేయడానికి ప్రయత్నించాడు.చిన్న బరువు తోచింది.ఆ Tuna చేప నా ..? గేలపు తాడు ని ఊపినప్పుడు ఒక ప్రకంపనం లాంటిది కింద  జరుగుతున్నది.ఉన్నట్లుండి ఒక చేప భాగం నీళ్ళ పైన ఆడినట్లు అనిపించింది.మళ్ళీ నీటి లో మునిగిపోయి అగుపడటం లేదు.దాని మొప్పలు ..ఇరు వేపు లా బాగున్నాయి.అయితే పూర్తి గా కనబడలేదు.ఆ పడవ దరి నుంచే లోపలికి మునిగిపోయింది.
పడవ వెనక భాగానికి వెళ్ళి వెల్లకిలా పడుకున్నాడు.మళ్ళీ ఒక వేగవంతమైన ప్రకంపన తన పడవ ని తాకింది.ఓ పెద్ద చేప దాని తోక ని వేగంగా కదిపినప్పుడు అయ్యే అలజడి అది.కిందికి ఒంగి దాని తల మీద సరదా గా అన్నట్లు గా ఒక దెబ్బ వేశాడు.అతని వొళ్ళు వణికినట్లు అయింది. ఇది  Albacore రకం చేప అనుకుంటా..దాదాపు పది పౌండ్ల బరువు ఉంటుంది..ఎర గా కట్టడానికి బాగుంటుంది అనుకున్నాడు.

అవును..ఇప్పుడు తన తో తానే  గట్టి గానే మాట్లాడుకుంటున్నాడు.ఈ చర్య ఎప్పుడు మొదలయింది..గుర్తు రావడం లేదు.కొన్ని సార్లు రాత్రుళ్ళు పడవ మీద ఒంటరి గా ఉన్నప్పుడు పాటలు కూడా గట్టి గా పాడుకుంటుంటాడు.కుర్ర వాడి తో కలిసి షికారు చేసేప్పుడు మాత్రం కొద్ది గా మాట్లాడేవాడు..ముఖ్యంగా వాతావరణం బాగో లేనప్పుడు...  సముద్రం మీద ఉన్నప్పుడు అనవసరంగా మాట్లాడడం అంత పద్ధతి గాదు అని ముసలాయన అభిప్రాయం.మరి ఇప్పుడు తాను అన్నీ బయటకే వాగేస్తున్నాడు.అవును లే ఇక్కడ వినే వాళ్ళు ఎవరని..బాధపడే వాళ్ళు ఎవరని ...!

ఈ విధంగా మాట్లాడుకోవడం ఎవరైనా చూస్తే తనని పిచ్చి వాడు అనుకోవడం ఖాయం..ఆ ప్రమాదం ఉంది.అయినా నేను పిచ్చి వాణ్ణి కానుగా,అలాంటప్పుడు ఎవరు ఏమని అనుకుంటే నాకేంటి ..అలా సముదాయించుకున్నాడు.కాస్త డబ్బున్న వాళ్ళు రేడియోలు ఉన్న మంచి బోట్లు వేసుకొని వస్తారు కాలక్షేపానికి..అయినా అవన్నీ ఆలోచించడానికి అంత సమయం లేదిప్పుడు.తాను ఎందుకు పుట్టాడో ఆ పని చూసుకోవడమే తన కర్తవ్యం.ఈ చుట్టు పక్క ల ఓ పెద్ద చేప ఉండే ఉండాలి.కొన్ని సంగతులు ఇవేళ వేగంగానే జరుగుతున్నాయి.ఈశాన్య దిక్కు కి వేగంగా వెళుతోంది పడవ..అలానే అనిపిస్తోంది..ఇది వాతావరణ జాలమా..ఇంకొకటా..?

తీరం వైపు చూస్తే ఇదివరకు లా లేదు.పర్వతాల మీద మేఘాలు టోపీలు మాదిరి గా ఉన్నాయి.సూర్యుని కిరణాలు నీటి మీద పడి మిల మిల మెరుస్తున్నాయి.గేలాలు ఉన్న తాళ్ళని చూసుకున్నాడు.కిందికి స్థిరంగా ఉన్నాయి చాలా లోతున.Tuna చేపల్లో చాలా రకాలు ఉన్నాయి..అయితే గుండు గుత్త గా ఆ ఒక్క పేరు తోనే పిలుస్తుంటారు.వేడి బాగా నే ఉంది.ముసలాయన మెడ వెనుక నుంచి చెమట చుక్కలు దారలు గా కారుతున్నాయి.కాసేపు నిద్ర పోతే బాగుండు అనిపించింది.గేలం తాడు ఒకదాన్ని కాలి కి కట్టుకొనికొద్ది గా ఒరుగుదాం అనుకున్నాడు.ఈ రోజు కి 85 రోజులు.ఏమైనా ఓ మంచి షికారు చేయాల్సిందే అనుకున్నాడు.

అలా అనుకుంటూ ఉండగా కర్ర పుల్ల ఉన్నట్లుండి వేగంగా మునిగి లేచింది. " ఔనోను..ఇది..అదే..! " అంటూ ఆ గేలపు తాటి ని బొటన వేలు,చూపుడు వేలు మధ్య లోనుంచి లాగుతూ మళ్ళీ చూశాడు.బరువు లా తోచ లేదు.తాడు ని అలాగే పట్టుకున్నాడు.మళ్ళీ ఏదో వచ్చి లాగిన అనుభూతి...మళ్ళీ ఉన్నట్టుండి గట్టి ఊపు లా ఊపింది కిందన.ఆహా..ఇది ఖచ్చితంగా...అదే..దాని పనే..ఇంచు మించు ఆరు వందల అడుగుల లోతున Marlin అనబడే ఆ చేపయే.. అది ఎరలు గా కట్టిన Sardines చేపల్ని తింటూనదన్నమాట అనుకున్నాడు ముసలాయన. (సశేషం)

No comments:

Post a Comment