Tuesday, May 30, 2017

ఆర్.కె.నారాయణ్ గృహ సందర్శన...


ఆర్.కె.నారాయణ్ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు.భారతీయ ఆంగ్ల సాహిత్యం లో ఆయనది ఒక విలక్షణమైన ఒక సంతకం.మాల్గుడి అనే కాల్పనిక పట్టణాన్ని సృష్టించి సగటు దేశీయ మానసిక భావనల్ని అనేక పాత్రల ద్వారా ప్రపంచం లోకి వెదజల్లిన ఆ పరిమళం ఎప్పటికీ అజరామరం గా ఉంటుంది.ఆయన పాత్రలన్నీ మనం ఎక్కడో చూసిన మనుషుల వలెనే ప్రవర్తిస్తాయి.దానిలోనే కాసింత వ్యంగ్యం,హాస్యం,అమాయకత్వం,మాయకత్వం ఇంకా  ఎన్నెన్నో రుచులు.ఇక మాల్గుడి కధలు గా దూరదర్శన్ లో మనల్ని ఒకప్పుడు అలరించిన ఆ ధారావాహికల్ని మరిచిపోగలమా..?


ముల్క్ రాజ్ ఆనంద్,రాజా రావు ల తర్వాత ఆర్.కె.నారాయణ్ భారతీయ జీవితాన్ని ఆంగ్లం లో రాసి గుర్తింపు పొందిన రచయిత.ఒక రకంగా వారి ముగ్గురు ని త్రిమూర్తులు గా పేర్కొంటారు.ఆ రోజులకి సంబందించి..!ఆర్.కె.నారాయణ్ అసలు పేరు రాశిపురం కృష్ణస్వామి అయ్యర్ నారాయణ స్వామి.అయితే గ్రాహం గ్ర్రీన్  అనే బ్రిటీష్ రచయిత సలహా మేరకు తన పేరు ని అలా మార్చుకున్నాడు.అందరకి పలకడానికి వీలుగా ఉంటుందని.


మాకు డిగ్రీ లో ఇంగ్లీష్ బోధించిన రామసుబ్బారావు గారి వల్ల నారాయణ్ విశిష్టతలు తెలుసుకోగలిగాను.లైబ్రరీ లో ఉన్న The Guide,Swami and his friends,The English teacher  ఇత్యాదులను చదివిన తరువాత ఆయనకి అభిమాని గా మారాను.ముఖ్యంగా భాష చాల సరళంగా ఉండి విసుగు లేకుండా కధ నడిపించే తీరు అతుక్కుపోయేలా చేస్తుంది.ఏ పాత్రలు నేల విడిచి సాము చేయవు.మనదైన సహజ వాతావరణం ని ఇంగ్లీష్ భాష లో ఇలా కూడా వ్యక్తం చేయవచ్చునా అనిపిస్తుంది.


అసలు మాల్గుడి లో ఆ కధ నడిచే తీరు సగటు దేశీయ వాతావరణాన్ని గమ్మత్తు గా తలపిస్తుంది.వచ్చే మార్పులను ఆ ఊరు ఎలా పుణికి పుచ్చుకుంటుందో ప్రతి కధ లో గమ్మత్తు గా చెబుతాడు.ఇటువంటి కాల్పనిక పట్టణాన్ని విలియం ఫాల్కనర్ తన రచనల్లో ప్రవేశపెట్టాడు.నారాయణ్ మద్రాస్ లో పుట్టినా తండ్రి మైసూర్ సంస్థానం లో ఉద్యోగి కావడం వల్ల ఎక్కువ కాలం ఇక్కడే నివసించాడు.చదువు లో సగటు విద్యార్థి గా ఉండేవాడు..అయితే డికెన్స్,వుఢౌస్,థామస్ హార్డీ ల రచనల్ని బాగా చదువుతుండేవాడు.యూనివర్శిటీ విద్య కోసం జరిగిన ప్రవేశ పరీక్ష లో తప్పడం తో ఒక ఏడాది ఖాళీ గా ఉండిపోయాడు.ఆ సమయం లోనే రాయడం మీద దృస్టి సారించాడు.

ఉపాధ్యాయుని గా కొంత కాలం ఓ స్కూల్ లో పనిచేసి అక్కడ ప్రధానోపాధ్యాయుని తో కుదరక దాన్ని వదిలి పెట్టాడు. ఒక పత్రిక కి విలేకరి గా పనిచేశాడు.ఏ గవర్నమెంటు ఉద్యోగం చేయడం అతనికి ఇష్టం లేక రచయిత గానే చివరి దాకా కొనసాగాడు.మొదట్లో కొన్ని ఆర్దిక ఇబ్బందులు పడినప్పటికి క్రమేణా కాలమిస్ట్ గా ,రచయిత గా రాణించాడు.హిందూ దినపత్రిక లో ఆయన జీవించి ఉన్నత కాలం ఏవో వ్యాసాలు,కధలు రాస్తూనే ఉండేవారు.ముఖ్యంగా గ్రాహం గ్రీన్ అనే ఆంగ్ల రచయిత ప్రోత్సాహం బాగా ఉపకరించింది.


ప్రతి రోజు 1500 పదాలు తప్పక రాయడం అనేది దిన చర్య గా ఉండేది.
ప్రఖ్యాత కార్టూనిస్ట్ ఆర్.కె.లక్ష్మణ్ ఈయనకి సోదరుడనే సంగతి తెలిసిందే.అన్ని వయసుల వారు  నారాయణ్ రచనలు హాయిగా చదవవచ్చు. The Dark Room,Waiting for mahatma,The man eater of malgudi,The vendor of sweets,A tiger for malgudi,Talkative man   ఇలా ఎన్నో.. కనుకనే అతని రచనలు లేని లైబ్రరీ అంటూ ఉండదు.అలా ఉంటే అది ఒక లోటే.మా డిగ్రీ లెక్చరర్ రామసుబ్బారావు గారి ఇన్స్పిరేషన్ తో నారాయణ్ రచనలు చదివి ఆ కాలం లో నే ఏదైతే అది అయిందని ఆయనకి ఒక కార్డ్ రాశాను.నా అభిమానాన్ని ప్రకటిస్తూ..! ఆర్.కె.నారాయణ్ ,మైసూర్ ,కర్నాటక రాష్ట్రం అని చెప్పి అడ్రెస్ రాశాను.దాని గురుంచి

మరిచిపోయాను.అందుతుందో లేదో అనే అనుమానంతో..! ఆశ్చర్యంగా సుమారు ఒక నెల గడిచిన ఒక తెల్లని కార్డ్ మీద ఆయన చేతి రాత తో ఒక పోస్ట్ అందింది.దానిలో ఆయన పూర్తి అడ్రెస్ కూడా ఉంది.ఎప్పటికైనా మైసూర్ లోని ఈ యాదవ గిరి లోని ఈయన ఇంటికి వెళ్ళి ఆయన రచనలు గూర్చి మాట్లాడాలని అనుకున్నాను.కాని కాలం ఇన్నేళ్ళకి ఆ అవకాశం ఇచ్చింది.ఆయన ఇప్పుడు  భౌతికంగా లేనప్పటికి ఆ ఇంటిలోని ప్రతి అంగుళం ఆయన స్పర్శ ని కలిగి ఉన్నట్లు అనిపించింది.కొన్ని ఫోటోలు తీసుకున్నాను...ఈ విధంగా ఇలా పంచుకోవడానికి..!

1 comment:

  1. నేను మొదట కొన్న ఇంగ్లీషు నవల ఆయనదే "bachelor of arts" బెజవాడ రైల్వే స్టేషన్ లో హిగ్గిన్బాథమ్స్ లో కొన్నాను. మర్చేపోలేని అనుభూతులు.

    ReplyDelete