Thursday, June 15, 2017

తలకావేరి ఇంకా ఇతర ప్రాంతాల సందర్శన



మళ్ళీ ఓ రోజు సెలవు దొరికినపుడు మైసూర్ లో ఖాళీ గా ఉండటం ఇష్టం లేక కొడగు నాడు లోని కొన్ని ప్రాంతాలు చూడాలని బయలు దేరాను.పశ్చిమ కనుమలు ..ఎన్ని మనోహరమైన విషయాలకి ఆలవాలమో... ఎటు చూసినా దట్టమైన పచ్చదనము,పర్వతాలు...ఆ మధ్య లోనే అక్కడక్కడ కనిపించే జనావాసాలు..వారి వైన భాషలు..సంస్కృతులు... దూకే జలపాతాలు...ఆహ్లాదకరమైన వాతావరణము.దీనికి కేంద్ర స్థానము మడికేరి. అరణ్యాలవంటి ప్రదేశాలలోను చక్కని రోడ్లు,బసకి వసతులు ..బాగా ఉన్నాయి.టూరిస్ట్ లు కూడ బాగా ఉన్నారు..!



కావేరి నది ఆవిర్భవించే తలకావేరి అనే ప్రదేశానికి బయలుదేరాను. ఇది మైసూర్ నుంచి గంటం బావు ప్రయాణం లో ఉంటుంది.కొన్నిసార్లు బస్సు ప్రయాణం వల్ల ఏమిటంటే ..అక్కడ సగటు మనుషుల ప్రవర్తన  ,సామాన్యుల జీవితము దగ్గర గా మనము గమనించవచ్చు. ఇంకా ఎక్కడ పడితే అక్కడ ఆగవచ్చు.. అక్కడినుంచి మళ్ళీ ఆ తర్వాత బయలుదేరవచ్చు. తాపీ గా చూడటము లోనే కొత్త ప్రదేశం లోని ఎతుపల్లాలు లోతుపాతులు అర్ధమవుతాయి.  కొన్ని ఇబ్బందులు ఆ క్రమం లో కలుగుతాయి కాని..వాటిని కూడా పాఠాల మాదిరి గానె స్వీకరించాలి. గుంపు గా వెళ్ళడం నా వల్ల గాని పని.


సరే...తలకావేరి ప్రత్యేకత ఏమిటంటే  కావేరి నది అక్కడ పురుడు పోసుకోవడమే కాదు...అద్భుత దృశ్య మాలికలకి ఆటపట్టు ఆ ప్రదేశము.సముద్రమట్టానికి 1276 అడుగుల పైన ఉండే ఈ ఊరు లోకి అడుగుపెట్టగానే ..మబ్బులు వేగంగా మన ముందుకి వచ్చినట్లు అనిపిస్తాయి.ఒక్కోసారి మనకి ముందు ఉన్న వారు మనకి కనపడరు .మళ్ళీ కాసేపట్లో యధావిధి గా  అయిపోతుంది.మనసు అంతా తేలికబడి హాయిగా అయిపోయింది.ప్రకృతి లో ఎంత మహిమ.


 ఆ ప్రదేశం లో కావేరీ అమ్మ వారికి ఒక గుడి ఉంది.అలాగే దాని ముంది చిన్న కోనేరు లా ఉంది.దానిలోని నీరు భూమి లోనుంచి..ఇంకా పైని పర్వత సానువుల్లొనుంచి వచ్చి చేరుతుంది.కావేరి నది యొక్క మొదటి స్వరూపం ఇక్కడ రూపు దిద్దుకుని అలా ప్రవహిస్తూ వెళుతుంది.అగస్త్య మునికి,గణపతి కి కూడా ఇక్కడ ఆలయాలున్నాయి.దానికి కొన్ని స్థలపురాణాలు ఉన్నాయి.ఇక్కడ చల్లని ఆ చల్లని ఈదురు గాలి లో  ఎంతసేపున్నా తనివి తీరదు.ఈ గుట్ట పైన కొన్ని చిన్న షాపులు ఉన్నాయి.కింద కి పోతే విలాసవంతమైన హోటళ్ళు ఉన్నాయి.



దారిపొడుగూతా కాఫీ తోటలు..ఇంకా యాలకులు,దాల్చిన చెక్క,మిరియాలు  ఇలాంటి సుగంధ ద్రవ్యాలు   బాగా పండుతున్నాయి. మడికేరి లో భోజనం చేస్తూ గమనించాను.వీటికి సంబందించి హోల్ సేల్ షాపులు ఉన్నాయి. ఈ ప్రాంతం లో ప్రసిద్దమైన కొడగు లు గూర్చి చెప్పవలసిందే.ఒక సైనిక జాతి వంటిది..మగ,ఆడ వారి సంప్రదాయ  డ్రస్సులు గమ్మత్తు గ ఉంటాయి.వ్యవసాయ రంగం లోను,సైనిక రంగం లోను వీరికి ఓ ప్రత్యేకత ఉన్నది.


ఈ ప్రాంతం లోనే  నిసర్గ ధామ అనే పేరుగల జలపాతం ఉంది.కొండలమీదినుంచి దూకుతూ వస్తుంది.దీన్ని కూడా సందర్శించాము.పిచ్చిగాని పశ్చిమ కనుమల్లో జలపాతాలు అడుగడుగునా కానవస్తూనే ఉంటాయి.దేని శోభ దానిదే. ఇంకో దానితో పోల్చరాదు.అక్టోబర్ మాసం లో ఈ తలకావేరి లో పెద్ద ఉత్సవం జరుగుతుందని చెప్పారు. ఈ  గుడి ఉండే ప్రాంతాన్ని భాగమండల  అని పిలుస్తారు.

వచ్చేప్పుడు చీకటి పడింది.దీపాలు పెట్టే వేళ. రోడ్డు మీద బసు పోతోంది.అటూ ఇటూ  దట్టమైన అడవి.రాక్షసుల్లాంటి పొడవైన వృక్షాలు.కాని అక్కడక్కడ ఒకటి రెండు ఇళ్ళు ..!రోడ్డు పక్కనుంచే ఏనుగులు వెళుతున్న అలికిడి. ఈ రాత్రి పూట ఇక్కడున్న మనుషుల మీద ఇవి దాడి చేయవా అని అడిగితె... వాటి  జోలికి మనుషులు పోనంత కాలం అవి ఏమీ అనవు..వాటి దారిన అవి పోతుంటాయి అంతే అన్నాడు ఒకాయన.

No comments:

Post a Comment