Monday, July 3, 2017

Ernest Hemingway నవల The Old man and the sea సంక్షిప్తంగా (18 వ భాగం)



చూడటానికి చాలా పెద్ద గా ఉంది ఈ షార్క్.అయితేనేమి వేగంగా ఈదే చేప తో సమానంగా ఈదుతోంది.అది నోరు తెరిచినప్పుడల్లా దాని రంపపు పళ్ళు భీకరంగా అగుపిస్తున్నాయి.. అయితే మిగతా భాగాలన్నీ మాత్రం అందంగా ఉన్నాయి.పై భాగం అంతా స్వార్డ్ ఫిష్ కి మల్లే నల్లగా ఉంది.. పొట్ట మాత్రం వెండి రంగు లో ఉంది.చూపులు కి మహా నాజుకు గా ఉంది.దాని పళ్ళు రంపాల మాదిరి గా ఎనిమిది వరసల్లో ఉన్నాయి.మహా పదును గా ఉంటాయి.దానిలో సందేహం లేదు.సముద్రం లోని  చేపల్ని తిండానికి పుట్టిన పుటకాయే అది.వేగం లోను,శక్తి లోను దానికి ఎదురే లేదు.

తాను వేటాడి తీసుకొస్తున్న ఈ చేప యొక్క రక్తం ని పసిగట్టింది గదా ...అందుకే  ఈ షార్క్  వెంటబడి వస్తోంది.ముసలాయనకి బాగా తెలుసు..ఈ  జీవం అనుకున్నది చేసేదాకా  వదలని రకం. ఒకసారి చేప కేసి ,షార్క్ కేసి నిశితం గా చూశాడు.అంతా కలలా  అనిపించింది.నన్ను చికాకు చేసే అవకాశం దానికి ఇస్తానా..నీకు మూడింది లే పో అనుకున్నాడు.

షార్క్ పడవ కి చేరువ గా వచ్చింది.ఆ చేపని కొరకడానికి తన రంపపు పళ్ళ తో ప్రయత్నం చేస్తోంది.ఎట్టకేలకు అది విజయం సాధించింది.  మొత్తానికి కొంత భాగం ని కొరికి తిన్నది.ఆ షార్క్  తల భాగం    నీళ్ళ మీద ఉంది... మిగతా భాగం నీటిలో  ఉంది.ఇక జాగు చేయ దల్చుకోలేదు ముసలాయన.  హార్పూన్ కి  ఉన్న బల్లేన్ని సరిగ్గ షార్క్ కంటి మీద దిగేలా పొడిచాడు.దాని  కళ్ళు పెద్దగా ఉన్నాయి.దాని మెదడు లోకి దిగేల కొన్ని  పోట్లు వేశాడు. ఒక కసి తో ఉన్న శక్తిని అంతటిని ఉపయోగించి కీలకమైన దాని భాగాల్ని  పొడిచి పారేశాడు.

ఉన్నట్లుండి షార్క్ ఒక్కసారి గా పైకి ఎగిరింది. దానిలో ప్రాణం లేదు.  అయినా మళ్ళీ ఎగిరింది. హార్పూన్ కి ఉన్న తాడు ని లాగిపారేసింది.కాసేపు కొట్టుకున్న తర్వాత ఆ చలనమూ ఆగిపోయింది.దాని కళేబరాన్ని అలా చూడసాగాడు ముసలాయన... అంత తొందరగా చావు ని అంగీకరించే రకం కాదది.. అందుకే దాన్ని  అలాగే చూస్తున్నాడు. చివరకి  అది చనిపొయిందని నిర్ధారించుకున్నాడు.
రమారమి నలభై పౌండ్ల దాక చేప మాంసాన్ని గుంజేసింది  ఈ షార్క్.అంతే కాదు తన హార్పూన్  కి ఉపయోగించే తాడు ని సైతం లాగి  పారేసింది. మళ్ళీ  నా ఈ చేప  కి రక్తం కారడం షురూ అయింది...దీన్ని  పసిగట్టి వెంటబడే జీవాలు ఎన్నో ఈ సముద్రంలో.ఎందుకనో చేప వేపు చూడాలనిపించలేదు.  అదీ, నేను ఇద్దరమూ దెబ్బతిన్నవాళ్ళమేగా ఇపుడు అనిపించింది ముసలాయనకి.

"మొత్తానికి ఆ షార్క్ ని మట్టుబెట్టాను.అది మామూలుది కాదు.ఇది కల అయితే బాగుండు.నేను ఏ చేపనీ పట్టలేదు. ఏం లేదు.న్యూస్ పేపర్లు పరిచిన ఆ నా మంచం లో పడుకొని కంటున్న కల అయితే  బాగుండు ..ఇదంతా.."

మనిషి పుట్టింది ఓడిపోవడానికి కాదు.తన ప్రయత్నం లో భాగంగా నాశనమై పోవచ్చునేమో గాని మనిషి ఎప్పుడూ ఓడిపోడు.క్షమించు చేపా నిన్ను చంపినందుకు...ఇపుడు నాకు చెడు కాలం దాపురించింది.. హార్పూన్ ఆయుధం కి ఉన్న తాడూ పోయింది.ఆ షార్క్ మహా కౄరమైనది, తెలివైనది..అయితే అంతకి మించిన వాడిని నేను.కాకపోవచ్చునేమో..!ఇంకొన్ని ఆయుధాలు పట్టుకొస్తే బావుండేది.

" ఏ ముసలివాడా ...మరీ ఎక్కువ ఆలోచించకు..పడవ మీద అలా సాగిపోతూనే ఉండు.ఏదైనా వస్తే అప్పుడు చూసుకోవచ్చులే.."

" నేను ఆలోచించకపోతే ఎలా...నాకు మిగిలింది అదే గా.అన్నట్లు ఆ ఆటగాడు Dimaggio నేను షార్క్ ని చంపిన విధానాన్ని చూస్తే ఏమంటాడో...మెచ్చుకుంటాడా..?నీకు ఒకప్పుడు కాలికి దెబ్బ తగిలి ఎముక ఎలా చికాకు చేసిందో...ప్రస్తుతం నా  చేతులు గాయాలతో అలానే అయ్యాయి..అయితే అప్పుడెప్పుడో ...ఒకసారి తేలు నో దేన్నో తొక్కితే అది కుట్టింది చూడు..భరించరాని నొప్పి...అప్పుడు కలిగింది.

అవన్నీ ఎందుకు...కాస్తా సంతోషం కలిగించే విషయం ఆలోచించరాదు..ప్రతి నిమిషం ఇప్పుడు ఇంటికి దగ్గర గా వచ్చేస్తున్నావు గదా ..పోయిన చేప మాంసం గురుంచి ఎందుకు రంధి ..?ఓ నలభై పౌండ్ల మాంసం బరువు తగ్గింది కదా.. అలా అనుకోరాదూ..! ఈ విధంగా తనలో తాను మాటాడుకుంటూ సాగుతున్నాడు.  (సశేషం) 

No comments:

Post a Comment