మళ్ళీ శ్రీ లంక లోకి వెళదాం.అపుడే చెప్పాను గదా వీలున్నప్పుడల్లా రాస్తుంటాను గదా..!ఈ సారి కాండీ కి కొంత దూరం లో గల బండారగామ అనే ఊరి లోకి వెళదాము.ఇక్కడ కూడా అంతే ప్రకృతి అందాలు.ఎటు చూసినా చక్కని పచ్చదనం.శుభ్రం గా ఉన్న రోడ్లు.జనాలు కూడా పెద్ద గా లేరు.రోడ్ల మీద.ముందే చెప్పినట్లు గా ఒక చిన్న సైజు కేరళ మాదిరి గా ఉన్నది ఈ ప్రదేశమంతా.నే అనుకోవడం ఇక్కడ ఉండే స్లోప్ గా ఉండే ఇళ్ళు, పచ్చదనం మీద ప్రేమ అదంతా ఇక్కడి నుంచే అక్కడికి పాకిందేమోనని.పెద్ద దూరం ఏముందని.ఇప్పుడంటే పాస్ పోర్ట్లు అవీ గాని...ఒకానొక సమయం లో నావల తో ఈ సముద్రాన్ని దాటి రాకపోకలు సాగించేవారు.
ఒక సమావేశం కి వెళ్ళాము.అది ప్రపంచ శాంతి కి సంబందించినది.అక్కడి సర్వోదయ సంస్థ దాన్ని నిర్వహిస్తున్నది.ఇక్కడ అనేక దేశాల మరియు మన దేశం లోని రాష్ట్రాల వారిని కలిసే అవకాశం కలిగింది.విచిత్రం ఏమిటంటే ఈ సర్వోదయ సంస్థ మన గాంధీజీ యొక్క ఆశయాలతో ప్రభావితమైనది.ఇక్కడి యువత కి ఎంతో తోడ్పాటు అందిస్తున్నది.ఆ రోజు ఆ కార్యక్రమాలు ప్రారంభం అయ్యే ముందు దానికి ముఖ్య అతిధి గా ఆ దేశ సాంస్కృతిక మరియు ఉన్నత విద్యా శాఖా మంత్రి విజేదాస రాజపక్సే విచ్చేశారు.
ఆ సందర్భంగా ఒక మంచి నాట్యాన్ని చూడగలిగాను.ఆయన్ని స్వాగతిస్తూ చేసిన ఆ నాట్యం కొహోంబో కంకారియా గా పేర్కొన్నారు. దీనిలోని నర్తకులు తమ చాతి పై ,నడుము పై,శిరస్సు పైన వెండి తో చేసిన నగలని ధరించారు.ఇది కాండీ మధ్య పర్వత భూముల్లో నుంచి వచ్చిన నాట్యం గా చెబుతారు.చాలా పురాతమైన ఈ నాట్యం ఈ శ్రీ లంక లోని రాజు పాండువసుదేవ అనే అతనికి మానసిక దౌర్బల్యం కలిగినపుడు మన భారత దేశం నుంచి వచ్చి ప్రదర్శించినదట. ఆ తర్వాత ఇది ఎంతో ప్రాచుర్యం పొంది మిగిలిన శ్రీలంక లోని అన్ని ప్రాంతాల లోకి పాకింది.కాండీ లోని బుద్ధ దేవుని గుడి లోనూ దీని ప్రతి యేడు ప్రదర్శిస్తారు.
మనం మన దగ్గర లో ఉన్న దేశాల తో పోలిస్తే ఎంతో దగ్గర తనం సాంస్కృతిక ఐకమత్యం కనిపిస్తుంది.అది పెద్ద గా మన దేశీయులు పట్టించుకోకపోవడం వల్ల ఎంతో నష్టం కలుగుతుంది.ఈ సారి ఈ ద్వీపాన్ని సందర్శించినప్పుడు ఇవన్నీ పరిశీలించండి.అద్భుతం గా అనిపిస్తుంది.ఇంకా ఆసియా లోని ఎన్నో దేశాల్ని ఇలా దగ్గరగా పరిశీలించాలనేది నా కోరిక.యూరపు,అమెరికా కంటే కూడా వీరి గురించి మనకి తెలిసింది తక్కువ.అది నిజంగా సిగ్గుపడవలసిన అంశమే.
No comments:
Post a Comment