అసలు కీలకం ఎక్కడుంది..? అదే అర్ధమై అర్ధం కానట్లు ఉంటుంది. మనం ఒక విషయాన్ని చూసే దృక్కోణం లో ఉంటుందేమో. నాకు ఇంగ్లీష్ లో ఓ రెండు బ్లాగు లు ఉన్నాయి.అప్పుడప్పుడు రాస్తుంటాను.చాలా మంది ఇతర రాష్ట్రాల వాళ్ళు ఆ విధంగా పరిచయం అయ్యారు.నేను వాళ్ళ బ్లాగ్ పోస్ట్ లు చదివి కామెంట్ చేస్తుంటాను.అలాగే వాళ్ళు కూడా నా బ్లాగ్ కి వచ్చి చదివి వాళ్ళ అభిప్రాయం వెలిబుచ్చుతుంటారు. మన తెలుగు బ్లాగర్లకి వాళ్ళ కి ముఖ్యమైన తేడా ఏమిటంటే నచ్చితే దానికికారణం చెబుతారు లేకపోతే మిన్నకుంటారు.Sarcastic గానో Argumentative గానో ఉండటం చాలా అరుదు.ఒక వేళ చెప్పదలుచుకున్నా మర్యాద ఇచ్చి చెప్పడం ఉంటుంది.
నాకు తెలిసినంత లో బెంగాలీ బ్లాగర్లు ఒక పదిమంది ఉన్నారు.వాళ్ళ లో కుగ్రామం లో ఉండేవారు దగ్గర నుంచి కోల్కతా లో ఉండేవారూ ఉన్నారు.చాలా సరళమైన భావ వ్యక్తీకరణ శైలి లొ మంచి ఇంగ్లీష్ లో రాస్తారు.మరీ పాషాణ పాకం గా ఉండకుండా అదే సమయం లో భాష స్వభావ సిద్ధం గా వచ్చినట్లు ఉంటుంది. కృత్రిమత్వం అనిపించదు. ఎందుకని ఆ సమాజానికి మనకి అంత భిన్నత్వం ఉంది..? అని ఆలోచించేవాడిని.
తెలుగు రాష్ట్రాల్లో ఆంగ్ల సాహిత్యం (B.A.OR M.A.) చదివి ఇంగ్లీష్ ఉపాధ్యాయులు గానో లెక్చరర్ ల గానో వచ్చిన వారిని గమనిస్తే కేవలం ఉద్యోగానికి ఉపయోగపడుతుందని తప్పా ఒక ఆసక్తి తో అభిరుచి తో ప్రేమ తో ఆ ఆంగ్ల సాహిత్యాన్ని చదువుకొని వచ్చిన వారు కాదని మనకి అనిపిస్తుంది. అయితే ఒక 20 శాతం మందిని దీనిలోనుంచి మినహాయించవచ్చు.అలాంటి మహానుభావులకి అభివందనములు.
భాషోపాధ్యాయుడు ఎంత ఎప్పటికప్పుడు చదువుతుంటే అంత ప్రయోజనం తనకి మాత్రమే కాదు ఆ ప్రభావం అక్కడ చదువుకునే పిల్లల మీద సైతం పడుతుంది. చేతన్ భగత్ అంటే ఎవరు అని అడిగిన ఇంగ్లీష్ ఒజ్జలు నాకు తెలుసు.నిజం గా ఆంగ్ల సాహిత్యం మీద ప్రేమ ఉన్నవాడు దానిని కొనసాగిస్తూనే ఉంటాడు.అసలు ఆంగ్లం అనే కాదు తెలుగు భాష అయినా సరే దానికి సంబందించిన సాహిత్యపరమైన పుస్తకాలు చదవడం నిరంతరం కొనసాగిస్తూనే ఉండాలి ఒక తెలుగు ఒజ్జ. నిజం చెప్పాలంటే ఈ విషయం లో తెలుగు బోధకులు చాలా మిన్న అని చెప్పవచ్చు.సాహిత్యం పై అనురక్తి తో చదవడం,అవీ బాగా చేస్తుంటారు.రచనలు కూడా చేస్తూ తమ భాషా జ్యోతి ని నిలుపుకుంటూంటారు.మరీ అలాంటి కృషి మన ఆంగ్ల బోధకుల దగ్గరనుంచి ఎందుకు రాదు..? కేవలం అభిరుచి అనురక్తి లేకపోవడమే కారణం.దాని ప్రభావం పిల్లవాని పై కూడా అలానే ఉంటుంది.
-------Murthy Kvvs
No comments:
Post a Comment