భారతీయ ఆత్మ ని అర్ధం చేసుకున్న బ్రిటిష్ రచయిత : రుడ్ యార్డ్ కిప్లింగ్
------- ------- --------- ------------- ---------- ----------- ---------------- ------------
రుడ్ యార్డ్ కిప్లింగ్ , ఈ బ్రిటిష్ రచయిత పేరు వినగానే మనకి ఎన్నో జ్ఞాపకాలు ముసురుకుంటాయి.ప్రసిద్ధమైన " జంగిల్ బుక్ " దాని ద్వారా ఇంటింటి పేరు గా మారిన మౌగ్లీ పాత్ర తెలియనిదెవరికి..? ఈయన స్వతహాగా బ్రిటిష్ జాతీయుడే అయినప్పటికీ భారత దేశం తో ఆయనకి గల సంబంధం విడదీయరానిది.ఆయన నవలలు,కధలు,కవితలు వీటి అన్నిటి లోనూ భారత ఉపఖండం యొక్క ప్రభావం ప్రబలం గా ఉంటుంది.ముఖ్యం గా చిన్నపిల్లల కోసం కిప్లింగ్ రాసిన అనేక రచనలు పెద్దలు కూడా హాయి గా చదువుకోవచ్చు.అన్ని వయసుల వారిని అలరిస్తాయి.
ఇప్పుడు ఆయన రాసిన "Kim" అనే ఒక నవల గూర్చి చెప్పుకుందాము. ఈ నవల కిప్లింగ్ కి చాలా పేరు తెచ్చిపెట్టింది.అంతే కాదు చక్కటి గద్య రచన లో తనకంటూ ఒక శైలి ని ఏర్పరుచుకున్న దిట్ట గా విమర్శకులు దీని విషయం గా ప్రస్తావిస్తుంటారు. ఈ నవల లోని ప్రధాన పాత్ర పదమూడేళ్ళ కుర్రాడే అయినా అనేక ప్రత్యేకతలు ఉన్నవాడు.ఇతివృత్తం బ్రిటీష్ వారు మన ఉపఖండాన్ని పాలిస్తున్న రోజులనాటిది.ఆ రోజుల్లోకి మనల్ని అలా తీసుకు వెళతాడు.లాహోర్ నుంచి ప్రయాణించి అంబాలా మీదు గా వారణాసి చేరుకోవడం దీని లోని కధ.మన Kim ఇంకా అతనితో బాటు ఓ బౌద్ధ సన్యాసి చేసే ప్రయాణం ఇది.దీని వెనుక ఉన్న కధా కమామీషు తెలుసుకునే ముందు రచయిత రుడ్ యార్డ్ కిప్లింగ్ గూర్చి కొద్ది గా తెలుసుకోవాలి. ఎందుకంటే ఆయన జీవిత సంఘటనలు కొన్ని ఈ నవలలో ప్రస్ఫుటం గా కనిపిస్తుంటాయి.
రుడ్ యార్డ్ కిప్లింగ్ పూర్తి పేరు జోసెఫ్ రుడ్ యార్డ్ కిప్లింగ్.ఇప్పడు ముంబాయి గా పిలువబడుతున్న నగరం లో డిసెంబర్30 న ,1865 వ సంవత్సరం లో జన్మించాడు. ఆయన తండ్రి జె.జె. ఆర్ట్స్ కాలేజ్ లో ప్రిన్స్ పాల్ గా పనిచేసేవాడు. కిప్లింగ్ కి ఆరు ఏళ్ళు రాగానే ఆయన తల్లిదండ్రులు బ్రిటన్ లోని తమ ప్రాంతానికి చదువు నిమిత్తం పంపివేస్తారు.ఇండియా లో పెరగడం ఇష్టం లేక ఆ ఆంగ్ల దంపతులు అలా చేస్తారు. అయితే అక్కడ ఆయన బాల్యం బాధాకరం గానే గడుస్తుంది.చిన్నప్పటి నుంచి పుస్తకాల పురుగు గా మారిపోతాడు.అలాగే ఒంటరి గా ప్రయాణాలు అంటే బాగా ఇష్టం.అక్కడ స్కూల్ దశ అయిపోయిన తర్వాత ఇండియా కి తిరిగి వచ్చి పంజాబ్ నుంచి వెలువడే సివిల్ అండ్ మిలిటరి గజెట్ అనే పత్రిక కి విలేకరి గా పనిచేశాడు.
ఆ సమయం లోనే విస్తృతం గా భారత దేశం అంతా తిరిగాడు. ఆ తరువాత ఆ అనుభవాలన్నీ తన రచనల్లో ఉపయోగించుకున్నాడు.Kim నవల లోని ప్రధాన పాత్ర స్థానిక విషయాల పై మాట్లాడేటప్పుడు కిప్లింగ్ ఎంత లోతు గా మన సామాజిక అంశాల్ని పరిశీలించాడో మనకి అర్ధం అవుతుంది.తన బాల్యం లోని చేదు అనుభవాల్ని కూడా రంగరించాడు. స్కూలు అది లేకుండా ఎప్పుడూ పక్షి లాగా తిరగడం అంటే ఆయన కి ఇష్టం.
సరే...ఇప్పుడు కధ లోకి వద్దాము.Kimball O'Hara అనే కుర్రాడు లాహోర్ లో ఉండే ఒక అనాధ.అతని తండ్రి బ్రిటిష్ ఆర్మీ లోనూ,రైల్వే లోనూ పనిచేసి ఆ తర్వాత చెడు వ్యసనాలకి బానిస అయి మరణిస్తాడు.తల్లి కూడా అంతకు ముందే చనిపోతుంది.తండ్రి శ్వేత జాతీయుడు కాగా తల్లి స్థానిక జాతీయురాలు.కాబట్టి చూపులకి వెంటనే స్థానికుడి గానే అనిపిస్తాడు.అందునా ఆలనా పాలనా తక్కువ,ఎండన తిరగడం కూడా ఒకటి.పెంపుడు తల్లి ఉంటుంది గాని పెద్దగా పట్టించుకోదు.ఆమె నల్లమందు కి బానిస అవుతుంది. ఈ Kimball O'Hara నే ముద్దుగా Kim అంటారు. ఏవో చిన్న చిన్న పనులు చేసుకుంటూ ఆటగోలు గా జీవిస్తుంటాడు. లాహోర్ లో ని మ్యూజియం దగ్గర ఉన్న ప్రదేశం లో అక్కడున్న పనికిరాని గుండ్లు పేల్చే తుపాకి బండ్ల మీద ఎక్కి ఆడుకుంటూ ఉంటాడు.
అయితే ఆ కుర్రాడి తండ్రి చనిపోయే ముందు ఒక పని చేస్తాడు. తాను పని చేసిన బ్రిటిష్ రెజిమెంట్ వివరాలు ,ఆ కుర్రాడి పేరు ,తన పేరు ఇలా వివరాలు అన్ని ఒక లోహపు పలక మీద రాసి వాడి మెడలో అంటే Kim మెడ లో వేస్తాడు.అది ఎప్పుడూ అలా ఉంటుంది.సరే... అలా అక్కడ ఆడుకుంటున్నప్పుడు ఒక బౌద్ధ బిక్షువు కనిపిస్తాడు.నవల లో లామా గా పేర్కొంటారు. ఈ ఇద్దరూ ఏదో పిచ్చా పాటి గా మాట్లాడుకుంటారు. తాను యాత్రా దర్శన నిమిత్తం ఇంత దూరం తిరుగుతున్నానని ముఖ్యం గా బుద్ధుడు తను బాణం వేసిన సమయం లో ఏర్పడిన పుణ్య నది ని చూడాలనేది తన కోరిక అని ఆ వృద్ధ లామా చెబుతాడు. ఈ Kim అనే కుర్రాడు మంచి తెలివైన మాటకారి అయిన కుర్రాడని లామా గమనిస్తాడు. దానిగూర్చిన వివరాలు నీకు తెలుసా అని లామా కుర్రాడి ని అడుగుతాడు.
మ్యూజియం లోని క్యూరేటర్ ని అడిగితే బహుశా తెలియవచ్చునేమో అని అంటాడు Kim. సరే అని చెప్పి లోపలికి వెళ్ళి క్యూరేటర్ తో చాలా సేపు మాట్లాడతాడు లామా.వారణాసి కి వెళ్ళే దారి లో కనిపించవచ్చునేమో ఆ నది అని అతను అంటాడు.ఆ తర్వాత లామా బయలు దేరే సమయం లో Kim తాను కూడా వస్తానంటాడు.మీతో పాటూ ఉంటూ మీకు బిక్ష ని ప్రజల వద్ద అడుగుతూ మీ శిష్యుని మాదిరి గా ఉంటాను.అదీ గాక మా నాన్న నా మెడ లో వేసిన పలక లో రాసిన ప్రకారం ఎర్రటి ఎద్దు పచ్చటి బయలు లో మేస్తున్న సన్నివేశం కనిపించినప్పుడు నాకు అదృష్టం కలిసివస్తుందట. ఏమో మీతో కలిసి తిరుగుతుంటే ఆ ప్రయాణం లో నాకు అది కనిపించవచ్చును గదా అంటాడు.సరే..నీ యిష్టం అయితే అంటాడు లామా.
మీరు ఎలాగూ పంజాబ్ లోని అంబాలా మీదు గా గదా వెళ్ళేది నా కోసం ఒక పని చేసి పెట్టు,గుర్రాల గురించిన వంశ చరిత్ర ని ఒక బ్రిటిష్ అధికారి కి ఇవ్వాలి,నేను రాసి ఇస్తా,అది పట్టుకెళ్ళివారి ఇవ్వు అని ఒక గుర్రాల వ్యాపారి Kim కి ఉత్తరం ఇస్తాడు. అతని పేరు మెహబూబ్ అలీ ,ఆఫ్గాన్ అశ్వ వ్యాపారి. కొంత డబ్బు కూడా ఇస్తాడు కుర్రాడికి.సరే అని బయలు దేరుతారు. వారు ఇరువురు చేసే ప్రయాణం లో చిన్న చిన్న స్థానిక రాజ్యాలు తగులుతుంటాయి.రైతులు,వారి కుటుంబాలు, వారి దైనందిన వ్యవహారాలు,స్థానిక ఉద్యోగులు, ప్రజలు ఆ రోజుల్లోని బ్రిటీష్ పాలన లో ఎలా ఉన్నారో ఈ ప్రయాణం లో మనం చక్కగా గ్రహించవచ్చు. కిప్లింగ్ ఆనాటి భారతీయ సామాజిక,సాంస్కృతిక ముఖ చిత్రాన్ని మన ముందు ఆవిష్కరింపజేస్తాడు.
మొత్తానికి అంబాలా కి చేరుకొని ఓ బ్రిటిష్ అధికారికి మెహబూబ్ అలీ ఇచ్చిన చీటీ ని ఇస్తాడు Kim. అది ఏమిటి అనేది తెలుసుకోవడానికి కిటికీ పక్కనే ఓ చెవి వేస్తాడు. ఆ బ్రిటిష్ అధికారి కోడ్ రూపం లో ఉన్న సందేశాన్ని అర్ధం చేసుకుని ఉత్తరాది కి వెంటనే మన సైన్యాలు పంపాలి,ఏడుగురు స్థానిక రాజులు మనకి వ్యతిరేకం గా గూడుపుఠాణి చేస్తున్నారటా అంటాడు.ఈ Kim కి చాలా సంతోషం వేస్తుంది అంటే నేను చాలా ముఖ్యమైనవాడినన్నమాట. నా వార్త వల్ల నే గదా యుద్ధం జరగబోతున్నది అనుకుంటాడు.
ఆ తర్వాత లామా,ఈ కుర్రాడు నడుస్తూ ఓ ఊరికి చేరుకుంటారు. ఆ పొలిమేరలో ఇద్దరు సైనికులు తమ రెజిమెంట్ కి చెందిన గుడారాలు వేస్తూ దానితో బాటూ వారి జెండా కూడా ఎగురవేస్తారు.ఈ Kim ని అనుమానించి ఆ రెజిమెంట్ కి సంబందించిన ఆంగ్లికన్ చర్చ్ ప్రీస్ట్ దగ్గర కి తీసుకువెళతారు.Kim మెడలో ఉన్న లోహపు పలక పై గల వివరాలు చదివి ఈ కుర్రాడు బ్రిటీష్ వాడే అని నిర్ధారించుకుంటారు.లామా ని వెళ్ళిపొమ్మని చెప్పి ఈ Kim ని లక్నో గల ఓ స్కూల్ లో చేరుస్తారు. అయితే ఈ స్కూల్ లో చదవడం ఈ కుర్రాడికి ఇష్టం ఉండదు.తనని తీసుకువెళ్ళవలసింది గా మెహబూబ్ అలీ కి,లామా కి ఉత్తరాలు రాస్తుంటాడు.వీడికి ఇక్కడ కాదు అని చెప్పి సింలా లో గల గూఢచారుల కి తర్ఫీదు నిచ్చే బ్రిటీష్ వ్యాపారి వద్ద చేర్చుతారు.
ఆ విధంగా నైపుణ్యం గల గూఢచారి గా తయారయి ఒక ఆపరేషన్ ని విజయవంతం గా ముగిస్తారు.హరీ అనే ఇంకో ఏజెంట్ సాయం తో. ఆ రోజుల్లో బ్రిటన్ కి వ్యతిరేకం గా ఉండే స్థానిక రాజుల్ని తమవైపు తిప్పుకోవడానికి ఫ్రెంచ్,రష్యన్ దేశాలు కృషి చేస్తుంటాయి.వారికి సంబందించిన వ్యూహలను అమలు చేసే ఏజెంట్ల నుంచి ఏ విధం గా కీలక పత్రాల్ని చేజిక్కించుకున్నారనేది ఆ తర్వాత జరిగే కధ. దీనినే Great Game అనే పేరు తో వ్యవహరిస్తాడు రచయిత. ఈ పేరు ఆ తర్వాత చాలా ప్రఖ్యాతమైనది.
ఇది పైపైన చూస్తే స్పై థ్రిల్లర్ గా అనిపించవచ్చు గాని లోపలికి వెళ్ళి గమనిస్తే ఇంకా చాలా విషయాలు తెలుస్తాయి. నాటి స్థానిక వ్యవహారాల లో బ్రిటీష్ వారి పాత్ర ఎలా ఉండేది,ఏ విధం గా వివిధ వర్గాల వారిని గూఢచారు లు గా
నియమించుకునేవారు,కుల ప్రాంత విభేదాలు ఏ విధంగా ఉండేవి ఇవన్నీ చాలా విశదం గా తెలుసుకోవచ్చు.ముఖ్యం గా ఒక బ్రిటీష్ రచయిత మన సమాజం లోనికి ఎలా చొచ్చుకి పోయి సూక్ష్మ అంశాల్ని సైతం ఎలా గమనించాడు అనుకున్నఫ్ఫుడు ఆశ్చర్యం కలుగుతుంది.
ఈ Kim నవల 20 శతాబ్దం లోని ఉత్తమ నవల ల్లో ఒకటి గా ప్రాచుర్యం పొందినది.అలాగే 2003 లో BBC వారు నిర్వహించిన సర్వే లో గ్రేట్ బ్రిటన్ లో బాగా ఇష్టపడే కిప్లింగ్ రచన గా నిలిచింది.1950 లో ఈ నవల ఆధారం గా ఓ సినిమా కూడా వచ్చింది. అత్యంత పిన్న వయసు లో అంటే 41 వ ఏట నే కిప్లింగ్ నోబెల్ బహుమతి ని సాధించాడు.జంగిల్ బుక్ (రెండు భాగాలు), ద వైట్ మేన్స్ బర్డెన్,రిక్కీ టిక్కీ,జస్ట్ సో స్టోరీస్,ది ఎలిఫెంట్ చైల్డ్ ఇంకా అనేక ఇతర రచనలు రుడ్ యార్డ్ కిప్లింగ్ కి మంచి పేరు తెచ్చిపెట్టాయి.
-----మూర్తి కెవివిఎస్
(Article printed in Nava Telengana Daily, dated 30.6.2020)
No comments:
Post a Comment