Monday, August 3, 2020

ప్రపంచ ప్రసిద్ధ నవల "బ్రదర్స్ కరమజోవ్" పై ఓ సమీక్ష

నా సమస్త జీవితం పెనుగులాడింది ఈ నవల రాయడం కోసమే : దోస్తోవిస్కీ
------------------------------------------------------------------------------------------------
"The Brothers Karamazov" ప్రపంచ సాహిత్యం లో ఆణిముత్యం వంటి నవల.ఇప్పటిదాకా,ఏ దేశం వారైనా సరే , ఏ కాలం లో నైనా సరే నవలాసాహిత్యం లో వచ్చిన గొప్ప రచనలు ఓ పది ఏరుదామని కూర్చుంటే దానిలో తప్పనిసరిగా ఫ్యొదోర్ దోస్తోవిస్కి రాసిన ఈ నవల ఉండితీరవలసిందే.రష్యన్ సాహిత్యం లోనే కాదు యావత్ ప్రపంచం లోనే వివిధ గొప్ప రచయితల పై,పాఠకుల పై అంత ప్రభావం చూపిన నవల అది.దాదాపు గా 140 ఏళ్ళ క్రితం రాయబడిన ఈ రచన 100 కి పైగా భాషల్లోకి అనువాదం చేయబడింది.

సిగ్మండ్ ఫ్రాయిడ్ అప్పటికి తన మనో విశ్లేషణా సిద్ధాంతాలతో ముందుకు రాని కాలమది. ఈ నవల రాయబడినది 1880 లో,అంటే ఫ్రాయిడ్ అప్పటికి మెడికల్ కాలేజీ లో చదువుతున్నాడు. సబ్ కాన్షియస్ మైండ్,కాన్షియస్ మైండ్,ఇడ్ వంటి పదాలు రచయితలకి చిరపరిచితం కాని రోజులవి.అటువంటి కాలం లోనే దోస్తోవిస్కీ మనిషి అంతరంగ ప్రపంచం లోనికి ,వాటిలో కనీ కనిపించని ఇంద్రజాలపు పొరల్లోకి వెళ్ళి తనదైన కధనం తో,సంభాషణా వైఖరులతో,భావ సంఘర్షణలను ఆవిష్కరించే పనిని మనుషులందరి తరపున తను చేశాడా అనిపిస్తుంది.

అందుకనే కాబోలు ఫ్రాయిడ్ తనకి బాగా నచ్చిన నవల గా The Brothers Karamazov ని పేర్కొన్నాడు,అంతేకాదు దీనిలోని అనేక పాత్రల వైఖరుల్ని పరిశీలించి దోస్తోవిస్కీ తన కాలం కంటే చాలా ముందు ఉన్నాడని,కొన్ని పాత్రల ని తీర్చిదిద్దిన విధానం తనకి కూడా అంతుపట్టలేదని అన్నాడు. అన్ని కాలాల్లోనూ ఇది ఒక మహోతృస్ట రచన అని Vonnegut అంటే జీవితం గూర్చి ఇంత గొప్పగా బోధించిన ఈ నవల సాహిత్య చరిత్ర లో మేరుశిఖరం వంటిదని ప్రఖ్యాత శాస్త్రవేత్త అల్బర్ట్ ఐన్స్టీన్ అభిప్రాయపడ్డాడు.

ఒక్కరేమిటి అనేక రంగాలకి చెందిన ఎంతోమంది పాఠకుల్ని ఆ విధంగా అలరించింది.ఈ నవల దోస్తోవిస్కీ యొక్క చివరి రచన.ఇది ప్రచురించబడిన మరుసటి ఏడాది లోనే ఆయన మరణించాడు.నా జీవితం మొత్తం అనేక అనుభవాల గుండా ప్రయాణించింది ఈ నవల రాయడానికే అని ఆయన తన చివరి రోజుల్లో వ్యాఖ్యానించాడు.మరి ఇంతగా కొనియాడబడి కాలపరీక్షకి నిలిచి ప్రపంచ ఉత్తమ సాహిత్యం లో ఓ భాగంగా మిగిలిపోయిన The Brothers Karamazov నవల లో ఏమున్నది..? దాని కధ ఏమిటి,అది చెప్పిన పద్ధతి ఏమిటి,అనుసరించిన వ్యూహాలు ఏమిటి అని అందరకీ సందేహం వస్తుంది.రావాలి కూడా.

ఈ నవల తెలుగు లోనికి అనువాదం అయిందా అని ఎంతో వాకబు చేస్తే విచిత్రం గా లేదని తేలింది."కరమజోవ్ సోదరులు" అనే పేరు తో అనువాదం వచ్చిందని ఒకరిద్దరు చెప్పగా విని అది దొరుకుతుందేమోనని ప్రయత్నించగా అసలు అనువాదం కాలేదని ఫలితం వచ్చింది.సుప్రసిద్ధ పబ్లిషర్లను,అనువాదకులను సంప్రదించిన మీదట ఇది తప్పా మిగతా దోస్తోవిస్కీ రచనలు చాలా వరకు తెలుగు లోనికి వచ్చినట్లు తెలిపారు. నేను చదివింది బాంటం క్లాసిక్‌స్ వారు ప్రచురించిన ఇంగ్లీష్ వెర్షన్,ఇది రమారమి 1043 పేజీలు ఉన్నది,ముందు మాటలు వంటివి కాకుండా!ఇంగ్లీష్ లోనికి అనువాదం చేసిన వారు Andrew R. MacAndrew. ఇప్పటి మన తెలుగు పుస్తకాల ముద్రణ పరం గా చెప్పాలంటే ఇంచుమించు గా 1500 పేజీలు ఈజీ గా ఉంటుంది.సరే..ఇంతకీ ఏమున్నది దానిలో కొద్దిగా పరిశీలిద్దాము.

నిజానికి ఇది ఒక కుటుంబం గూర్చిన కధ.కరమజోవ్ కుటుంబం అది. దానిని ప్రధానం గా చేసుకుని మిగతా పాత్రలు అనేకం వస్తుంటాయి.దీనిలో హీరో ఎవరు ,విలన్ ఎవరు అంటూ చదివిన తరువాత విశ్లేషణ చేసుకుంటే ఎవరినీ పూర్తి హీరో గానూ ,పూర్తి విలన్ గానూ తీర్పు ఇవ్వబుద్ధి కాదు.ఆ విధంగా ఫిక్షన్ కి అప్పటిదాకా ఉన్న కొన్ని రూల్‌స్ ని దోస్తోవిస్కీ అతిక్రమించాడని చెప్పాలి.సరే...రష్యా దేశం లోని ఓ చిన్నపట్టణం లో ఫ్యోదోర్ కరమజోవ్ నివసిస్తూ ఉంటాడు. తన స్వార్ధం,సుఖం తప్పా మిగతా వాటికి దేనికి ప్రాధాన్యతనివ్వడు.వాళ్ళు సొంత భార్య అయినా సరే,సంతానం అయినా సరే..! ఆ తరహా అన్నమాట. ప్రతి రోజు మందు,విందు ఉండవలసిందే.అలాగే డబ్బుల్ని పొదుపు చేసుకొని వాటిని పెంచుకోవడం లో కూడా మహా తెలివిగలవాడు.అంటే ఓ వైపు దుర్వ్యసనాలు ఉన్నా ఇంకో వైపు తన సంపద పెంచుకోవడం లో కూడా గుంటనక్క లా వ్యవహరించగల వ్యాపారి. అవసరమైతే అప్పటికప్పుడే కాళ్ళు ,అవసరం తీరితే జుట్టు పట్టుకునే రకం.

అలాంటి ఫ్యోదోర్ కరమజోవ్ పోనీ సీనియర్ కరమజోవ్ అనుకుందాం,Adelaida అనే ధనిక కుటుంబానికి చెందిన యువతి ని పెళ్ళిచేసుకుంటాడు.చాలా తెలివి గా ఆమె కి చెందిన కొన్ని వేల రూబుళ్ళని తీసుకుని వ్యాపారం లో పెట్టుబడి గా పెట్టి బాగా సంపాదిస్తాడు.ఆ పరంపర అలా సాగుతూనే ఉంటుంది.ఈ సీనియర్ కరమజోవ్ బయట స్త్రీలతోనూ మిగతా మందు లాంటి వ్యవహారాల్లోనూ మునిగితేలుతూ భార్య ని పట్టించుకోడు.ఎంత ఇలాంటి యవ్వారాలు ఉన్నా డబ్బు సంపాదన లో మాత్రం చాలా జాగ్రత్త గా ఉంటాడు.పెద్ద మేడ కూడా నిర్మిస్తాడు.వడ్డీలకి కూడా డబ్బు తిప్పుతూ ఊరి లో చాలామందిని చేతి లో పెట్టుకుంటాడు.

అలా ఉండగా ద్మిత్రీ అనే కొడుకు పుడతాడు. వాడిని కూడా పెద్దగా పట్టించుకోడు. భార్య కి చికాకు పుట్టి సెమినరీ కాలేజి కి చెందిన ఓ విద్యార్థి తో లేచిపోతుంది.వాళ్ళు వేరే నగరం కి వెళ్ళిపోతారు.దీనితో ఈ బాలుడు ద్మిత్రి తండ్రి ఉన్నా అనాధ లా అయిపోతాడు. సీనియర్ కరమజోవ్ ఇప్పుడు ఇంకా స్వేచ్చ పొంది వెలయాళ్ళ ను ఇంటికే ఆహ్వానిస్తూ పొందు విందు ల్లో మునిగి ఆనందిస్తూంటాడు. ద్మిత్రీ ఇంటి లోనే అటూ ఇటూ తిరుగుతూ దొరికింది తింటూ ఆలనా పాలనా లేకుండా మాసిన బట్టల తో,స్నానాలు అవీ కూడా లేకుండా అలా కాలం గడుపుతుంటాడు.ఈ బాలుడు ని తల్లి వైపు బంధువు ఒకామె చూసి,జాలిపడి తండ్రి ని నాలుగు తిట్లు తిట్టి బాలుడిని పెంచుకుండానికి తీసుకువెళుతుంది.ఏమిటి..నాకు ఓ కొడుకు ఉన్నాడా...సరే తీసుకువెడితే తీసుకు పో అని అంటాడు ఈ సీనియర్ కరమజోవ్,అంటే ఆ రేంజ్ లో కొడుకుల ఆలనా పాలనా చూస్తుంటాడీయన.

ఆ తర్వాత సీనియర్ కరమజొవ్ ఇంకో పెళ్ళి చేసుకుంటాడు. ఆ భార్య పేరు సోఫియా.పాపం ఈమె మొదటి భార్య తో పోల్చితే బాధల్ని సహించే ఓర్పు ఉన్న మనిషి.ఈమె కి పుట్టిన కొడుకులు ఇద్దరు ,వారి పేర్లు ఇవాన్ ఇంకా అలెక్సీ.ఇక్కడ ఒకటి చెప్పాలి.ప్రతి ఒక్కరికీ ఇంకో మారు పేరు ఉంటుంది.చాలా రష్యన్ నవలల్లో అంతే అనుకోండి.ఆ సమాజం లో అలా ముద్దు పేర్లు లేదా నిక్ నేంస్ తో పిలవడం ఓ అలవాటు అనుకుంటాను. ఇవాన్ ని వన్యా అని, అలెక్సీ ని అల్యోషా అని, ద్మిత్రీ ని మిత్యా అని కూడా పిలుస్తుంటారు.అలాంటి వాటి వద్దనే కొద్ది గా జాగ్రత్తగా ఉండాలి పాఠకులు,కొన్ని పేజీలు చదివిన తర్వాత అలవాటు అయిపోతుంది అనుకొండి.లేదా రాసుకోవడం మంచిది.లేకపోతే తికమక అయి కధాగమనం లో తడుముకుంటాము.

ఈ ఇద్దరు కొడుకులు పుట్టినతర్వాత సోఫియా అంటే రెండవ భార్య కూడా మరణిస్తుంది. ఆ ద్మిత్రీ ఒక బంధువు వద్ద పెరిగితే ఇవాన్ ని మరో బంధువు తీసుకెళ్ళి పెంచుతాడు.గుడ్డిలో మెల్ల లా సీనియర్ కరమజోవ్ వంట చేయడానికి ఇంట్లో పని చేయడానికి ఓ జంట ని పనిలో పెట్టుకుంటాడు.వాళ్ళ పేర్లు గ్రెగరి ఇంకా అతని భార్య మార్త.ఈ ఇద్దరు చాలా నమ్మకంగా ఉంటారు.ఇంటిని ఓ క్రమం లో ఉంచుతారు. ద్మిత్రీ ని పెంచే బంధువు చనిపోయినప్పుడు ఇంకా ఆ తర్వాత కాలం లోనూ ఈ ముగ్గురు కరమజోవ్ కుమారుల్ని వీళ్ళు ఎంతో ప్రేమ గా చూస్తారు.అలా తండ్రి ఇంటి లో ఉండి కొన్నాళ్ళకి ద్మిత్రీ సైన్యం లోకి వెళ్ళిపోతాడు. ఇవాన్ మాస్కో వెళ్ళి బాగా చదువుకుంటాడు,ఎన్నో వ్యాసాలు పేపర్ల లో రాసి మేధావి గా పేరు తెచ్చుకుంటాడు. దేవుడు లేడు అనే తాత్వికతని తన రచనల్లో ప్రతిఫలింప చేస్తుంటాడు.ఇక అందరికంటే చిన్నవాడైన అల్యోష ఆధ్యాత్మికత వైపు మళ్ళుతాడు. అంత చిన్నవయసులోనే ఒక క్రైస్తవ మఠం లో చేరి సన్యాసి గా ఉండి జోసిమా అనే పెద్దాయన వద్ద శిష్యరికం చేస్తుంటాడు.

 ఇలా ఉండగా...అసలు కధ మొదలు అవుతుంది. కొన్నాళ్ళకి ఈ ముగ్గురు తిరిగి వారి ఊరి కి వస్తారు.ఈ ముగ్గురు అన్నదమ్ములు ఒకరికొకరు చాలా ప్రేమ భావం తో ఉంటారు.అనేక విషయాల్లో సహకారం తో మెలుగుతుంటారు. అయితే ఈ ముగ్గురు కి ఉన్న ఒక పోలిక ఏమిటంటే తండ్రి పై ఒకలాంటి కక్ష అనండి లేదా అలాంటిది ఉంటుంది.దానిని ముగ్గురు మూడు తీరుల్లో వ్యక్తం చేస్తారు.ద్మిత్రీ దుడుకు గా ఉంటాడు.ఊళ్ళోని పానశాలల్లో మద్యం తాగుతూ గొడవలు పెట్టుకుంటూ అందిన చోటల్లా అప్పులు చేస్తుంటాడు. కేథరిన్ అనే తన మొదటి ప్రియురాలికి మూడువేల రూబుళ్ళు బాకీ కూడా పడతాడు.అది తీర్చే క్రమం లో తన తండ్రి వద్ద కి దూత గా ఒక సోదరుడిని పంపడం అదంతా కొన్ని ఎపిసోడ్లు గా నడుస్తుంది.తన తల్లి ధనం తీసుకునే తండ్రి వ్యాపారం చేసి సంపాదించాడు కనుక దానిలో తనకి భాగం ఉందని ద్మిత్రీ వాదిస్తాడు. కాని తండ్రి విషయం తెలిసిందేగదా పైసా రాల్చడు ఎవరకీ.

పైగా ఇవాన్ ని, అల్యోషా ని దువ్వుతూ ద్మిత్రీ తో పోల్చుతూ మీరే మంచి పుత్రులు రా అంటూ ఎక్కించాలని చూస్తాడు గాని ఈ కొడుకులు అంతకంటే తెలివైన వారు. వీడు చస్తే తప్పా మనకి ఆస్తిపాస్తులు దక్కవని వారికి బాగా తెలుసు.పైగా ఆ వయసు లో కూడా ఈ సీనియర్ కరమజోవ్ చిత్తచాంచల్యం చావదు. గృషెంకా అనే అందాల యువతి ఆ ఊరికి వస్తుంది.ఈమెని సాంసనోవ్ అనే సైనికాధికారి ఆమె కి ఎవరూ లేకపోవడం తో చేరదీస్తాడు. ఆ తర్వాత అతను వేరే పనిలో బయటి ప్రాంతానికి వెళ్ళిపోతాడు. ఈ సీనియర్ కరమజోవ్ ఆమె పై కన్నువేస్తాడు.అయితే ఆమె కూడా ఇంతకు సమానమైన జాణ. ఊరిస్తూ సొమ్ము చేసుకోవడం లో దిట్ట.ఈ యువతి కి ఒకసారి హెచ్చరిక చేయడానికి వెళ్ళిన ద్మిత్రీ ఈమె అందం చూసి పరవశించి ,తండ్రి మోజుపడిన ఈ అమ్మాయినే తన సొంతం చేసుకోవాలని తీర్మానించుకుంటాడు.

అందుకోసం తనని ప్రేమించిన కేధరిన్ ని కూడా కాదనుకుంటాడు. ఇక తండ్రీ కొడుకులకి మధ్య ఈ యువతి ని సొంతం చేసుకోవడానికి,ఎత్తులు పై ఎత్తులతో, పెద్ద పోరాటమే జరుగుతుంది. సిగ్మండ్ ఫ్రాయిడ్ ప్రతిపాదించిన ఈడిపస్ కాంప్లెక్‌స్  దీనిలో అంతర్లీనం గా గోచరిస్తుంది. ఇక ఇవాన్ ...మేధావి వర్గం కి చెందిన వాడు.తండ్రి అంటే కోపం ఉన్నా బయటకి వ్యక్తం చేయడు.ద్మిత్రీ లా కాకుండా పరోక్షం గా తన వ్యవహారశైలి ఎలా ఉంటుంది అంటే తండ్రి అంటే గిట్టని వారికి తెలిసీ తెలియనట్లు గా సాయం చేస్తుంటాడు.ఉదాహరణకి అనాధ లా పెరిగి తమ ఇంట్లోని మరో పనివాడి గా ఉండే స్మెర్ద్యకొవ్ లో సీనియర్ కరమజోవ్ ని హత్య చేసినా పరవాలేదనే తలంపు ని కలిగిస్తాడు.అయితే ఎక్కడా మాటల్లో ఆ ప్రస్తావన రాదు.ఈ స్మెర్ద్యకోవ్ బయట లోకానికి అనాధ అయినా నిజానికి ఇతను సీనియర్ కరమజోవ్ యొక్క అక్రమసంతానమనే సంగతి లోపలి విషయంగా ఇవాన్,స్మెర్ద్యకోవ్ లకి తెలుసు.స్మెర్ద్యకొవ్ కి తండ్రి పై కోపం ఉన్న విషయాన్నీ పసిగడతాడు. ఇక అల్యోష..తండ్రి పై గల నిరసన ని తెలియజేయడానికే ఆ మార్గం ఎన్నుకున్నట్లు కనబడుతుంది. ఇతను ప్రేమ,క్షమాగుణం లో,ఓర్పు లో జీసస్ ని ఆదర్శం గా తీసుకున్నట్లు గమనించవచ్చు.తండ్రి పై చెలరేగే మంట తో లోకాన్ని ,తనను కాల్చుకోవడం కంటే అందరి రక్షణ కోసం కరుణమార్గం లో వెళ్ళడమే ఉత్తమమని తన ని ఆ వైపు మళ్ళించుకుంటాడు.

ఇలా ఉండగా సీనియర్ కరమజోవ్ ఒక రాత్రి హత్య చేయబడతాడు.ఈ హత్య చేసింది ఎవరు ? ముగ్గురు కొడుకుల్లో ఎవరూ కాదు.కాని ముగ్గురూ దానికి కారణమేనని ఎవరకి వారు భావించుకుంటారు.ఇక్కడి దాకా చూస్తే ఒక క్రైం నవల లా ఉంది గదూ..! ఇది కేవలం పైన కనబడే ఒక మిష మాత్రమే.అంతకి మించిన విషయం కేవలం నవల చదివితేనే పూర్తి గా అనుభూతించగలము. మానవ సంబంధాలను ఒక కారణం గా ఎంచుకుని మానవ ప్రపంచం లోని అంతర్పార్శ్వాలను శిఖారాయమానం గా చూపించిన నవల ఇది.

 ప్రపంచం లో ఎందుకు మనుషులు వివిధ సందర్భాల్లో అలా ప్రవర్తిస్తారు,దేవుడు ఏమిటి,దెయ్యం ఏమిటి,మనసు ఏమిటి,దేవుడే ఉంటే ఎందుకు ఏమీ ఎరుగని జీవులు సైతం చిత్ర హింస అనుభవిస్తున్నాయి,పశ్చాత్తాపం,అపరాధభావం ఇలాంటి భావాలు మనిషి పై ఎలా ప్రభావం చూపుతాయి..ఇట్లా ఒకటేమిటి సమస్త ప్రశ్నలకి దీనిలో సమాధానం తనదైన శైలి లో ఇచ్చాడు దోస్తోవిస్కీ.ముఖ్యం గా పాత్రలు మాట్లాడుతున్నప్పుడు వారి హావభావాలు,సూక్ష్మ స్థాయి లో వ్యక్తం చేసే వైఖరులు నిశితం గా గమనిస్తే ఏదో సినిమా చూస్తున్న అనుభవం కలుగుతుంది. గృషెంకా ,కేథరిన్ ఇంటిలో అల్యోష తో మాట్లాడుతున్నప్పుడు ఆమె శబ్దం లేకుండా అడుగులు వేసే సన్నివేశం ని చదివి పఠిత ఏదో ఊహించుకుంటాడు.మళ్ళీ అదే యువతి తన ఇంటిలో నడిచేప్పుడు ఉండే తేడాని చదివినప్పుడు మానసిక స్థితి శరీర కదలికల పై ఎలా ప్రభావం చూపిస్తుంది అని ఆశ్చర్యం కలుగుతుంది.

మనిషికి వివిధ సందర్భాల్లో కలిగే మానసిక భ్రాంతులని నాకు తెలిసి ఇంత గొప్పగా ,సహజం గా వర్ణించిన నవల మరొకటి లేదు.లైస్ అనే వికలాంగయువతి, అల్యోష రెండవ పర్యాయం ఇంటికి వచ్చినప్పుడు మాట్లాడే మాటలు,చేష్టలు విభ్రాంతి కి గురిచేస్తాయి.అలాగే ఇవాన్ కి స్మెర్ద్యకొవ్ ఆత్మ కనబడి మాట్లాడటం వంటివి ఇలా ఎన్నైనా చెప్పవచ్చు.సంభాషణలు తట్టుకున్నటుగా,ఒక పదాన్ని రెండేసి సార్లు గబ గబా వత్తిడి తో మాట్లాడటం మళ్ళీ కొన్నిసార్లు వారి మానసిక స్థితికి పోలిన మాడ్యులేషన్ తో మాట్లాడటం చేసే పాత్రల్ని పరిశీలిస్తే రచయిత మానవ కదలికల్ని ఎంత గొప్పగా వర్ణించాడు అనిపిస్తుంది.

  ఒక రచయిత యొక్క సంస్కారం ఒకలా రూపు దాల్చినదీ అంటే దానికి కారణం,అతని పై జీవితం వర్షించిన వివిధ రంగులలోని అనుభవాల,అనుభూతుల సమాహారమే..! ఇక్కడ దోస్తోవిస్కీ గూర్చి కొద్దిగా చెప్పాలి.తను రచయిత గా అవతరించికమునుపు జార్ వ్యతిరేక భావాల్ని కలిగిఉన్నందుకు ఎనిమిది నెలల పాటు జైలు శిక్ష అనుభవించాడు.ఈ ఎనిమిది నెలల కాలం లోనూ అతనికి సైలెంట్ ట్రీట్ మెంట్ ఇచ్చారు.అంటే మాట్లాడటానికి ఒక్క మనిషిని కూడా కనబడకుండా చేశారు.ఆ తర్వాత రెండు ఏళ్ళ పాటు సైబీరియా ప్రవాసం,అది ఇంకా ఘోరం. ఇలాంటి శిక్షలు అనుభవించితే బుద్ధిజీవి అనేవాడు మానసిక వేదన తో మతిభ్రమించి,తనంతట తానే మరణిస్తాడని తలచేవారు.అలా ఎంతోమందికి జరిగింది కూడా.అయితే అశేష పాఠక లోకానికి తమ అంతర్లోచనామృత జలధి లోని కనబడని లోతులని చూపించడానికి ఒక మనిషి కావాలి.అందుకే దోస్త్యోవిస్కీ ని కాలం ఎన్నుకున్నదేమో..!

                 ------మూర్తి కె.వి.వి.ఎస్. (చరవాణి: 7893541003)     


(The essay above printed in Nava Telangana Daily of 3.8.2020)













 
















   














 


































































































































   









 











































     










 














 



































 


























 
























































 







































   

No comments:

Post a Comment