"హంగ్రీ టైడ్" : సుందర వనాల లోని జీవన చిత్రం
-------------------------------------------------------------------------
మనం ఎన్నోసార్లు చిత్తడి అడవుల గురించి చదివి ఉంటాము.ఇంకా చెప్పాలంటే ప్రపంచం లోనే అతి పెద్ద చిత్తడి అడవులు గా ప్రఖ్యాతి వహించిన సుందర్బన్స్ గురించి చదివి ఉంటాము. ఓ వైపు సముద్రపు అలల తాకిడి ఇంకో వైపు పైనుంచి వచ్చే నదులు ఇవన్నీ కలిపి కొన్ని చిత్రమైన ,భయంకరమైన ద్వీపాలను బెంగాల్ రాష్ట్రానికి కింద భాగం లో ఏర్పాటు చేసుకున్నాయి. ఆ అడవులు చాలా ప్రత్యేకమైనవి. అక్కడి చెట్ల ఆకులు మొరటు గా ఉంటాయి. ఆ చిత్తడి భూములు కొన్ని వందల ద్వీపాలు గా చీలిపోయాయి. కొన్ని చిన్నవి.కొన్ని పెద్దవి.అక్కడి పులి సంతతి కి ఓ ప్రత్యేకత ఉన్నది.ఆ జాతి పేరు రాయల్ బెంగాల్ టైగర్ ,వేటాడం లో గాని ,రూపం లో గాని దాని తీరు వేరు. బ్రిటిష్ పర్యావరణవేత్త ఫ్రెయర్ దీనికి ఆ పేరు పెట్టాడు.
ఇటువంటి దుర్గమమైన ఈ చిత్తడి అడవుల లో ఎక్కడైనా మానవ జీవనం ఉన్నదా ,ఉంటె వారి సాధక బాధకాలు ఏమిటి , అక్కడి విభిన్న భూ స్వరూపం వారికి ఎలాంటి అనుభవాల్ని కలుగ జేస్తున్నది ఇదీ ఈ "హంగ్రీ టైడ్" నవల లోని ఇతివృత్తం.దీని రచయిత అమితావ్ ఘోష్. ఆంగ్లం లోనే రాసే భారతీయ రచయిత. 1956 వ సంవత్సరం లో కలకత్తా లో జన్మించారు. మన దేశం లో అత్యున్నత సాహిత్య పురస్కారమైన జ్ఞానపీఠ్ బహుమతి ని ఇంతవరకు కేవలం భారతీయ భాషల్లో వెలువడిన సాహిత్యానికి మాత్రమే ఇచ్చారు.అయితే మొట్టమొదటిసారి గా ఆంగ్లం లో మాత్రమే సాహిత్య కృషి సలిపిన అమితావ్ ఘోష్ కి 2018 సంవత్సరం లో జ్ఞానపీఠ్ వరించి ఓ ప్రత్యేకత ని ఆపాదించింది. ఆ విధంగా ఆంగ్ల భాష లో రాసే భారతీయ రచయితలకి గుర్తింపునిచ్చినట్లయింది.
జీవనానికి కొంత అనుకూలం గా ఉన్న ఓ చిన్న ద్వీపం అది.దాని పేరు లూసిబారి గా మారుతుంది. బ్రిటిష్ వారు పాలిస్తున్న రోజుల్లో డేవిడ్ హామిల్టన్ అనే ఓ ధనికుడు ఈ ప్రాంతం లో ఆరువేల ఎకరాల స్థలం కొని బురద తోను,పాములతోను,తేళ్ళ తోను, రకరకాల విష పురుగులతోనూ నిండి ఉన్న కొంత ప్రాంతాన్ని బాగు చేయిస్తాడు.అక్కడ ఉండటానికి వచ్చే వారికి ఉచితం గా స్థలం ఇస్తానని చెప్పడం తో కొంత మంది మత్స్యకారులు ధైర్యం చేసి వస్తారు.వారు అక్కడ ఉంటూ సముద్రపు పీతల్ని ,చేపల్ని ,తేనె ను ఇంకా ఇతర ఉత్పత్తుల్ని సేకరించి బయట ప్రాంతం వారికి అమ్ముకుంటూ జీవనం సాగిస్తుంటారు. రాత్రి పూట పడుకున్నప్పుడు ఒక్కోసారి పక్కలోకే పాములు ,జలచరాలు వచేస్తుంటాయి . ఇంకో పక్క పులుల భయం ,అయినా ఓపిక తో కాలం వెళ్లదీస్తుంటారు.
అలాంటి లూసిబారి అనబడే ఓ చిన్ని ద్వీపం లో ఈ కథ అంతా సాగుతుంది. కాలం గడిచి కొన్ని మార్పులు వస్తాయి. అక్కడ నీలిమ బోస్ అనే ఒకావిడ బాడబోం ట్రస్ట్ అనే ఓ స్వచ్చంధ సేవా సంస్థ ని నడుపుతుంటుంది.ఆ సంస్థ తరపున ఓ ఆసుపత్రి ఉంటుంది. ఆమె తనకి కొడుకు వరస అయ్యే కనాయి దత్త ని ఓ మాటు ఇక్కడకి వచ్చి వెళ్ళమని కబురుపెడుతుంది. అతను ఢిల్లీ లో అనువాద సేవలను అందించే కంపెనీ ని నడుపుతుంటాడు. నీలిమ బోస్ భర్త తానుచనిపోయినతర్వాత ఓ పుస్తకాన్ని కనాయి దత్త కి ఇవ్వవలసిందిగా కోరుతాడు. అదిగో ఆ కారణం వల్లనే ఈయన లుసిబారి కి బయలుదేరుతాడు.
అదే రైలు లో పియా రాయ్ అనే ఓ పరిశోధక విద్యార్థిని కూడా ఎక్కుతుంది.ఆమె తండ్రి బెంగాలీ,తల్లి అమెరికన్. స్కాలర్షిప్ మీద ఇరవాడి డాల్ఫీన్ ల గురించి పరిశోధించడానికి ఈ ప్రాంతం వస్తోంది.వీరిద్దరి కి రైలు లో పరిచయం అవుతుంది.ఎప్పుడైనా కుదిరితే తాను ఉండబోయే ట్రస్ట్ భవనం వద్ద కి రమ్మని చెబుతాడు.బంగాళాఖాతం సముద్ర జలాలలో ,మళ్ళీ దీనిలో వచ్చి కలిసే సన్నని నీటి పాయల లో ఎన్ని రకాల జీవజాలమో !
పియా ముందు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వారి బోట్ లో ఎక్కుతుంది గాని దానితో సరిపడక ఫకీర్ అనే మత్స్యకారుని పడవ ని కుదుర్చుకుంటుంది.అతని భార్య మోయన, ట్రస్ట్ ఆసుపత్రి లో నర్స్ గా పనిచేస్తుంది.వీరిద్దరి కి పొసగక వేరు గా జీవిస్తుంటారు.సముద్ర జలాల్లో కి వెళ్లడం, వివిధ పరికరాల తో డాల్ఫీన్ ల జీవన శైలి ని రికార్డ్ చేయడం చాలా విపులం గా రాశారు.ఇక కనాయ్ దత్త తన బాబాయ్ వదిలి వెళ్లిన నోటు బుక్ ని తీసుకొని చదువుతూంటాడు. అతని పేరు నిర్మల్ ,చనిపోవడానికి ముందు రోజు మోరిస్ ఝాపి అనే ద్వీపం లో శరణార్ధుల పై జరిగిన అణచివేత గురించి చాలా వివరం గా రాస్తాడు. నవల లో చాలా భాగం ఇదే ఆక్రమిస్తుంది.
నిర్మల్ విశ్రాంత ప్రధానోపాధ్యాయుడు . తాను ఆ శరణార్ధుల గూర్చి పోరాడాలని ప్రయత్నిస్తాడు గాని ఇంట్లో భార్య వ్యతిరేకిస్తుంది.ప్రజలు కూడ పెద్దగా సహకరించరు. దీనితో నిరాశ చెంది ఆ గాథని అంత నోటు బుక్ లో రాసి మరణిస్తాడు. మరి ఈ కథ ప్రచురించబడిందా ,మోయనా ఫకీర్ లు మళ్ళీ ఎందుకు కలవలేక పోయారు ,ఫకీర్ తుఫాన్ లో ఎలా చనిపోయాడు ,పియా ఆ ఫకీర్ పేరు మీద ఎందుకు డాల్ఫీన్ రీసెర్చ్ సెంటర్ నెలకొల్పింది ఇవన్నీ తెలియాలంటే ఈ హంగ్రీ టైడ్ నవల చదవవలసిందే.
ఈ రచన ఎందుకు ఓ ప్రత్యేకత సంతరించుకున్నదంటే చిత్తడి అరణ్యప్రాంతం లో జరిగే మానవ జీవితాన్ని విపులం గా చర్చించింది.అక్కడ బురద తో కూడిన నేలలు, విలక్షణమైన జంతుజాలం వాటి తో సావాసం,పోరాటం అన్నీ కొంగ్రొత్త గా అనిపిస్తాయి.అక్కడి జానపద కథలు ఆలోచింపజేస్తాయి.ఎటువంటి కఠినమైన వాతావరణం లోనైనా మనిషి ఏ విధం గా తన మనుగడ కోసం ఎదురీదుతాడు అనేది ఈ నవల లో మనం గ్రహించవచ్చు.
అమితావ్ ఘోష్ యొక్క శైలి ప్రౌఢం గా ఉన్నదనే చెప్పాలి. మొదటి భాగాన్ని"Ebb" అని రెండవ భాగాన్ని "Flood" అని విభజించి రాశాడు.రచయిత చిత్తడి అడవులలోకి వెళ్లి ఎన్నో విషయాలు పరిశోధించి రాసినట్లు అనిపించింది.అయితే ఈ అరణ్యాలు మూడు వంతులు కి పైగా ప్రస్తుతం బంగ్లాదేశ్ లోకి వెళ్లిపోయాయి.ఈ కథ1979 ఆ తర్వాత జరిగినట్లు అర్ధం అవుతుంది.మరి ఇలాంటి ప్రాంతం లో కి డేవిడ్ హామిల్టన్ అనే ఆ బ్రిటిష్ వ్యక్తి 1939 సమయం లో వచ్చి ఈ లూసిబరి గ్రామానికి పునాది వేశాడు అంటే ఆ రోజుల్లో ఇంకా ఎంత భయానకం గా ఉండేదో పరిస్థితి. ఈయన పేరు మీద ఇప్పటికి ఒక పాఠశాల అక్కడ ఉన్నదని ఈ నవల ద్వారా తెలిసింది. వాస్తవం,కల్పన రెండు కలగలిసిన నవల ఇది. పుస్తకం అమెజాన్ లో లభ్యం అవుతోంది.
------ మూర్తి కె.వి.వి.ఎస్.
( Article published in Nava Telangana Daily dated,31-8-2020)
No comments:
Post a Comment