కొన్నిసార్లు మనకి ఇష్టం లేని వాళ్ళ మాటల్ని కూడా ఆలకించాలి.వారి రాతల్ని చదవాలి.అప్పుడే మన గురించి వాళ్ళు ఏమనుకుంటున్నారో అర్ధం అవుతుంది.అది మంచి అయినా చెడు అయినా ఓ విషయం అనేది మనకి తెలుస్తుంది.దాన్నిబట్టి భవిష్యత్ ప్రణాళిక తయారవడానికి వీలు కలుగుతుంది.
ముఖ్యంగా బ్రిటీష్ వారి రచనలు చదువుతుంటే వారి సం యమనం తో కూడిన ఆలోచనా విధానం లీల గా అర్ధం అవుతుంది.ముఖ్యం గా ఆ Tone ని జాగ్రత్త గా వినాలి. ఒక వ్యక్తి లో మనకి ఏదైనా ఒక విషయం నచ్చలేదనుకొండి. మొత్తం గుండు గుత్తగా అతను చేసే అన్ని పనుల్ని అసహ్యించుకుంటాం.అతనిలో ఉన్న మంచి లక్షణాల్ని సైతం నిరసిస్తాం.ఒక ఎమోషన్ లో అలా పోతాము.
కాని బ్రిటీష్ వారిలో ఏమంటే అంశాల వారీ గా ఓ వ్యక్తి ని నిరసించడం ,అభిమానించడం అనేది కనబడుతుంది.ఉదాహరణ కి మీకు బ్రిటీష్ రాణి అంటే ఇష్టం లేదు అనుకొండి.ఆ విషయం లోనే మిమ్మల్ని తను ద్వేషిస్తాడు.అదే సమయం లో మీకు చిత్రలేఖనం లో మంచి పనితనం ఉంటే ఆ విషయం లో అతను మీకు అభిమాని గా కూడా మారతాడు.అంటే దేనికి అదే.
సంపద వేట లో ప్రంపంచం అంతా తిరిగి నానా రకాల మనుషులతో వ్యవహరించడం వల్లనో ఏమో ఒకలాంటి"క్రీమీ" తెలివితేటలు ఉంటాయి.ఎక్కువ గా డైరక్ట్ గా కాకుండా ఒకలాంటి సింబాలిజం తో రాయడం చేస్తారు.ఆ టోన్ ని పట్టుకోగలిగితేనే దానిలోని ఇంకో విషయం అర్ధం అవుతుంది.వాళ్ళ మనసుల్లోకి పరకాయ ప్రవేశం చేయడమే అని చెప్పవచ్చు.
ఉదాహరణకి "kiM" అనే నవల లో Rudyard Kipling ఒక మాట ని ఆ పాత్ర తో అనిపిస్తాడు.ఎప్పుడైతే పచ్చటి బయలు లో ఎర్రటి ఎద్దులు మేస్తూ కనబడతాయో ఆ క్షణం లో నా జీవితం లోకి అదృష్టం ప్రవేశిస్తుంది అంటాడు.దీన్ని యధాతధంగా మక్కీ కి మక్కి తీసుకుంటే ఏమీ అనిపించదు.బ్లాంక్ గా ఉంటుంది.అక్కడ జరిగే దాన్ని బట్టి తీసుకుంటే పచ్చటి బయలు అనేది మన ప్రాంతం,అలాగే దాన్ని మేసే ఎర్ర ఎద్దులు అంటే బ్రిటీష్ వాళ్ళు అని అర్ధం ధ్వనిస్తుంది.
మరో చోట ఇదే నవల్లో ఇంకో డైలాగ్ ఇలా ఉంటుంది. నువ్వు బ్రాహ్మడిని నమ్మాలా పాము ని నమ్మాలా అని సమస్య వచ్చినప్పుడు పాము ని నమ్ము.పాముని నమ్మాలా,వేశ్య ని నమ్మాలా అని వచ్చినప్పుడు వేశ్య ని నమ్ము,వేశ్య ని నమ్మాలా ఒక పఠాన్ ని నమ్మాలా అని వచ్చినప్పుడు వేశ్య ని నమ్ము అని ఓ పాత్ర తో అనిపిస్తాడు.ఇలాంటివి చదివినపుడు ఇదేమిటబ్బా అనిపించింది.మరి ఆ బ్రిటీష్ వారి వైపు నుంచి చూస్తే వాళ్ళ అనుభవసారం ఏమిటో అనిపించింది.
ఏమాటకి ఆ మాట,బ్రిటీష్ రచయితల ఇంగ్లీష్ మాత్రం చాలా బిగి గా,ఓ గణిత సూత్రం ప్రకారం అక్షరాలు పేర్చారా అన్నంత ఇది గా ఉంటుంది.అమెరికన్ లు గాని ఇంకొకళ్ళు గాని subject అర్ధం కావడానికి కొంత మేరకు భాషానియమాల్ని కొద్దిగా అవతల పెడతారు గాని బ్రిటీష్ వారి శైలీ విలాసమే వేరు.మనదగ్గర అటు సంస్కృతం,ఇటు తెలుగు ని అవపోసన పట్టిన వారి ఆ పద్ధతి, ఆ precision ఎలా ఉంటుందో ఇంగ్లీష్ రచయితల ధోరణి అలాగే ఉంటుంది. ఇంకా కొన్ని ఆలోచనలు వస్తున్నయి గాని తర్వాత ఎప్పుడైనా..! -----Murthy Kvvs
No comments:
Post a Comment