Saturday, September 5, 2020

ద వర్జిన్ అండ్ ద జిప్సీ (తెలుగు అనువాదం) Post no: 2

           

         ఆంగ్లమూలం: డి.హెచ్.లారెన్‌స్

         తెలుగు అనువాదం:మూర్తి కెవివిఎస్


Post No-2

--------------


ఆ ఇద్దరు చిన్నపిల్లలు ,వారికి తెలిసినంతలో కుటుంబనిర్ణయం తో ఏకీభవించారు.ఇహ ముసలావిడ,అదే Rector గారి తల్లి ,ఆ పిల్లల కి నాయనమ్మ సంగతి,ఆమె కి వయసు డబ్భై పైనే ఉంటుంది.ఆమెకి కనుచూపు కాస్త మందగించింది.అయితేనేం ఆ ఇంటికి ప్రధాన కేంద్రం లా అయిపోయింది.ఇక Cissyఆంటీ ...ఆమె వయసు నలభై పైనే ఉంటుంది.పాలినట్లుగా,భక్తిపరురాలిలా,ఏదో లోపల పురుగు తొలుస్తున్నావిడలా ఉంటుంది.ఇంటిని చూసుకోవడం లో ఆమె పాత్ర ఆమెది.ఇహ Fredఅంకుల్ ..నలభై ఏళ్ళవాడు.ఆయనకోసమే ఆయన జీవిస్తున్నట్లుగా ఉంటాడు.ప్రతిరోజు టౌన్ కి వెళ్ళిరావడం ఆయనకి పరిపాటి.ఇహ Rector గారి సంగతి చెప్పేది ఏముంది,ఆ ముసలావిడ తర్వాత ఈయనే ప్రధానవ్యక్తి ఆ ఇంటిలో..!


ఆ ముసలావిడ ని అంతా Mater (మాతృమూర్తి) అని పిలుస్తుంటారు.చూడటానికి అసహ్యం గా ఉన్నా,మహా తెలివైనది.జీవితం లో రకరకాల మగవాళ్ళ బలహీనతల్ని చూసి,వాటితో ఆడుకొని పండిపోయినావిడ..!ఏదైనా అర్ధం చేసుకోవడం లో మంచి చురుకు.Rector గారు ఇంకా తనకి దూరమైన ఆ భార్య ని ప్రేమిస్తూనే ఉన్నాడు.ఆమె పోయేదాకా అలా చేస్తూనే ఉంటాడు.కాబట్టి ఇక అక్కడ ఆగడం మంచిది.ఆయన భావం లో పవిత్రత ఉంది.ఆయన ఎంతో ఆరాధించి ,పెళ్ళాడిన నాటి భార్య రూపమే ఆయన గుండెలో కొలువుదీరింది. 

బయటలోకానికి సంబంధించి చెప్పాలంటే, ఒక ప్రతిష్ఠ లేని స్త్రీ Rector గారిని ,ఆ చిన్నపిల్లని వదిలేసిపోయింది.ఇపుడు ఒక గర్హించదగిన యువకుని తో వెళ్ళిపోయి,ఎంత అపకీర్తి తేవాలో అంతా తెచ్చింది.ఇది బాగా అర్ధం చేసుకోవాలంతే.ఆ హిమపుష్పం వంటి ఆ వధువు Rector గారి హృది లో స్వచ్చంగా వికసించిఉంది ఇప్పటికీ..! ఆ హిమపుష్పం వాడిపోదు.ఎవరైతే అవతల మనిషి ఉన్నాడో వాడితో తనకనవసరం..!


ఇక మాతృమూర్తి,ఆ ముసలావిడ,ఒకానొకప్పుడు చిన్న ఇంటిలో వితంతువు గా ఏదో తన జీవితం అలా జీవిస్తూండేది.అయితే ప్రస్తుతం ఆమె ఈ ఇంటిలో ప్రధాన నాయకురాలు అయిందని చెప్పాలి.Rector గారి ఇంటిలో పెద్దకుర్చీలో తన వృద్ధశరీరాన్ని స్థిరంగా కూలేసి కూర్చుంటుంది.ఆమె ని సిమ్హాసనం దింపేవాళ్ళు ఎవరూ లేరిప్పుడు.Rector గారి స్థితి పట్ల ,ఆయన హిమపుష్పం పట్ల ఎంతో జాలి గా నిట్టూర్చుతుంది.నిజానికి లోపల ఉండేది వేరు.ఎందుకైనా మంచిదన్నట్లు లేని గౌరవాన్ని తన కొడుకు ప్రేమ హృదయానికి ఆపాదిస్తూ,పాడులోకం లోని ఈ దరిద్రపు వ్యవహారాల పట్ల ఏమీ మాట్లాడ్కుండా మిన్నకుంటుంది.


ముఖ్యం గా తన కోడలు Mrs.Arthur Saywell ...ఒకప్పుడు ఏమోగాని ...ఇప్పుడలా చెప్పుకోవడానికి ఆమె కి ఆ అర్హత ఉందా..? ఎంతమాత్రం లేదు.స్వచ్చమైన హిమపుష్పం బాగా విరబూసింది.దానికి పేరేమిటి...ఏమీలేదు...కుటుంబం ఆమె ని Cynthia అనే పుష్పం తో పోల్చవచ్చును గాక..!


ఇదంతా ఆ ముసలావిడ ఊహాశక్తి కి తోడ్పడేదే..!దీనివల్ల ఏమిటయా అంటే తన కొడుకు Arthur మళ్ళీ పెళ్ళి చేసుకోకుండా ఆపడమే అనుకోవాలి.అతని బలహీనత ఇపుడు ముసలావిడ కి బాగా అర్ధమయింది.ఒక పిరికి ప్రేమ అది.అంతే.అతను పెళ్ళాడింది వాడిపోయే హిమపుష్పాన్ని.అదృష్టవంతుడు.గాయపడ్డాడు.అంతే.సంతోషం లేదు,బాధ మరో వైపు.ఏమి ప్రేమ హృదయం..!తను క్షమించేశాడు.తెల్లని హిమపుష్పం క్షమించబడింది.  విల్లు లో కూడా ఆమెది ఆమె కి రాశాడు.మరి అవతల వాడు..?చీ ...అనుకోవడమే అనవసరం.ప్రపంచం లోని ఆ భయంకరమైన విషయాన్ని గురించి అసలు ఆలోచించకూడదు.ఆ Cynthia పుష్పం ఉన్నదే...ఆ గతం లో అక్కడెక్కడో ఎవరకీ అందని,ఆ ఎత్తుల్లోనే వికసించనీ..!వర్తమానం వేరు.!


ఆ ఇద్దరు చిన్నపిల్లలు ఇటువంటి పవిత్రచింతనల మధ్యనే పెరిగారు.బాహాటం గా కొన్ని విషయాలు ఎవరూ బయటకి అనేవారు కాదు.ఆ హిమపుష్పం అందరాని ఎత్తుల్లో ఉందన్నసంగతి వాళ్ళూ గుర్తెరిగారు.వాళ్ళ జీవితాల్లో ఎక్కడో,స్పృశించ వీలుగాని చోట...ఆ విలువైన అంశం ప్రతిష్ఠితమైంది.


అదే సమయం లో ఎంతకాదనుకున్నా ఈ దరిద్రపు ప్రపంచం లో స్వార్ధం,నైచ్యం అనే వాటి వాసన వస్తూనే ఉంటుంది.ఆ Cynthia గురించే చెప్పేది.ముసలావిడ అప్పుడప్పుడు కావాలనే ఆ పిల్లల దృష్టికి వాళ్ళమ్మ గూర్చిన ప్రస్తావన ని తెస్తుంటుంది.ముగ్గుబుట్ట లాంటి జుట్టు ఉన్న ఆ ముసలావిడ అప్పుడు అసహ్యం తో ఊగిపోతుంది లోలోపల..!


ఒకవేళ ఆ Cynthia తిరిగివచ్చినా ,తన స్థానానికి వచ్చిన ఢోకా ఏమీ లేదు. చాలా ప్రణాళిక ప్రకారం ఈ ముసలి నాయనమ్మ ఈ భావజాలాన్ని పిల్లల్లో ప్రవేశపెట్టింది.వాళ్ళ అమ్మ ఎంత చెడ్డదో అన్నట్లుగా చెబుతూంటుంది.ఇదంతా ఇలా ఉండగా,అసలు తమ ఇంట్లోని పరిస్థితులు ఏమిటి అనేది ఆ పిల్లలు కూడా బాగానే గ్రహిస్తున్నారు.తమ తల్లి ఆకర్షణీయమైనదేగాని అంత ఆధారపడదగినది కాదు అని వారికి తెలుసు.ఆమె తెచ్చిన గొప్పకాంతి ప్రమాదకరమైన సూర్యుని లా వచ్చి వారి జీవితం లో వేగం గా ప్రసరించిపోయింది.ఆ కిరణాలు ఎప్పటికీ వస్తూ పోతుంటాయి.ఉన్నంతసేపు వెలుతురు.కాని ఒక ప్రమాదం..కూడా ఉంది.ఆకర్షణ,భయంకరమైన స్వర్ర్ధం అనీ ఉన్నాయందులో..! (సశేషం)     




 

No comments:

Post a Comment