Tuesday, October 13, 2020

డ్రగ్స్ కి మనిషి ఎందుకు లొంగిపోతాడు..?

 ఇటీవల ఒక ప్రముఖ బాలీవుడ్ హీరో బలవన్మరణం చెందడం,ఆ తర్వాత డ్రగ్ వాడకం గురించి పెద్ద చర్చ లేవడం జరిగింది.ఎప్పుడూ డ్రగ్ వాడకం దారుల గురించి పేపర్ల లో ఇంకా పుస్తకాల్లో చదవడం తప్పా లోతు గా వెళ్ళింది లేదు. ఇంత వినాశహేతువైన డ్రగ్స్ కి ఎందుకని మానవ మేధస్సు బానిస అవుతుంది.వాళ్ళేమీ చదువూ సంధ్య లేనివాళ్ళు కాదు,తెలివితేటలు లేనివాళ్ళు కాదు.మరి ఏమిటని దాని శక్తి అని ఆలోచన మెదిలింది.


ఇంగ్లీష్ నవలల్లో వీటి వర్ణనలు చాలా చోట్ల తారస పడతాయి.ఆ మాటకి వస్తే చాలా మంది ప్రఖ్యాత అమెరికన్,యూరోపియన్ రచయిత లు ఈ డ్రగ్స్ ప్రపంచం లో మునిగితేలినవారే.అల్డస్ హక్స్లీ,జాన్ కీట్స్,చార్లెస్ బోదిలేర్,జార్జ్ బెర్నార్డ్ షా,మపాసా,జాక్ లండన్ నుంచి అయాన్ రాండ్ దాకా చాలామంది..ఈ లిస్ట్ చాలా పెద్దది.పుస్తకాల్లో వీటిని Pot,Weed,Grass,Herb అంటూ అబ్బో చాలా పేర్లు ఈ మత్తు పదార్థాలకి..!


వీటిని తీసుకున్నప్పుడు మనిషి లో ఏం జరుగుతుంది అంటే ఇంద్రియాల్ని దాటిన ఒక స్థితి కి తీసుకువెళుతుంది.అక్కడ సృజనాత్మకత స్థాయి అత్యున్నత దశ కి చేరి ఏ ఆటంకాలూ లేకుండా ప్రవహిస్తుందని జేంస్ జాయిస్ అంటాడు.ప్రతిదాన్ని గమనించే విధానం మామూలు మనిషి కంటే లోతు గా నిశితం గా ఉంటుంది.అందుకనే దీనికి చేరువ అయ్యారేమో అనిపిస్తుంది.పాఠకుడి కి సాధ్యమైనంత గొప్ప అనుభూతిని ఇవ్వడం లో భాగం గానే తాను త్రాగుతానని ఎర్నెస్ట్ హెమింగ్వే బాహాటం గానే వెల్లడించాడు.


నేను మొదటసారిగా ఇంగ్లీష్ రచయితల వర్ణనా శక్తి కి స్టన్ అయింది ఎప్పుడంటే జాక్ లండన్ రాసిన ద వైట్ ఫేంగ్ అనే నవలిక చదివినపుడు..! ఒక కుక్క జీవితం మీద రాసినది అది.నిజం గా ఒక కుక్క పుట్టినప్పటి నుంచి తాను చనిపోయేవరకు చేసిన జీవనయానం అది.ఎక్కడా కృత్రిమత్వం లేదు.కావాలని రాసిన వాక్యాలు లేవు.ఇంత ట్రాన్స్ లోకి ,కుక్క జీవితం లోకి ఎలా వెళ్ళి రాశాడబ్బా అని చాలానాళ్ళు ఆలోచించాను. తర్వాత దానిబాట లోనే మన తెలుగు తో సహా అనేక భాషల్లో కుక్క మీద,కోడి మీద రకరకాల వాటి మీద రాశారులే గాని ఎందుకనో అన్నీ నన్ను నిరాశపరిచాయి.ఏదో ఆత్మ మిస్ అయినట్లు తోచింది.


ఆ తర్వాత జాక్ లండన్ యొక్క జీవితం చదివిన తర్వాత బహుశా డ్రగ్ అనేది ఇలా కూడా పనిచేస్తుందన్నమాట అనిపించింది.ఇక జేంస్ జాయిస్,ఎఫ్.స్కాట్ ఫిడ్జ్రాల్డ్,ఓ.హెన్రీ లాంటి గొప్ప రచయితలు కూడా విపరీతమైన ఆల్కాహాల్ వల్లనే మరణించారు.ఒకరకం గా కొవ్వొత్తుల్లా కరుగుతూ పాఠక ప్రపంచానికి అమూల్యమైన నిధులు అందించి పోయారు.


కృత్రిమంగా తయారు చేసే డ్రగ్స్ ఉన్నాయిలే గాని గంజాయి దే అగ్ర తాంబూలం ఏ రకంగా చూసినా.దాని ఆకులు,విత్తనాలు,పువ్వులు వీటి అన్నిటి నుంచి రకరకాల డ్రగ్స్ తయారు చేస్తారు.చరస్ అనేది జీవించి ఉన్న మొక్క నుంచి తయారిస్తే,హషిష్ అనేదాన్ని కోసేసిన మొక్క ల భాగం నుంచి తయారు చేస్తారు. భంగ్ అనేదీ దానినుంచి తయారించేదే. మన సౌథ్ లో తక్కువ లే గాని నార్త్ లో భంగ్ అనేది చాలా కామన్ గా అమ్ముతుంటారు.హోలీ,శివరాత్రి పండుగల సమయం లో సహజ ప్రసాదం.


 లైసన్స్ ఇవ్వబడిన షాప్ లు రాజస్థాన్,ఉత్తర్ ప్రదేశ్ వంటి రాష్ట్రాల్లో ఉన్నాయి. కొన్ని వందల ఏళ్ళ నుండి సంప్రదాయ పరమైన అంశాలతో ముడిపడి ఉన్నందున దీనికి వ్యతిరేకత ఉన్నట్లు లేదు. తగు మోతాదు లో తీసుకుంటే దాని ప్రభావం లాంగ్ రన్ లో శరీరం మీద కూడా ఉంటుందా అనిపిస్తుంది.పెద్దగా విశాలమైన కాంతివంతమైన కళ్ళు,శరీర వర్ణం,వీటి అన్నిటి మీద దీని ప్రభావం ఉన్నదా అనిపిస్తుంది.అక్కడ చాలా మందిని చూసినపుడు.


డ్రగ్స్ యొక్క ప్రభావాన్ని వర్ణించే కొన్ని ఘట్టాల్ని ఒక ఆంగ్ల నవల లో ఇటీవలనే చదివాను.దాంట్లో ఒక పాత్ర కొత్త గా డ్రగ్ తీసుకుని ఫ్లింక్ లాయిడ్ పాటల్ని వింటూ ఉంటుంది. కాసేపయిన తర్వాత ,సరే నేను వెళతాను పావు గంటే కదా అయింది అంటుంది.అప్పుడు మరో పాత్ర 'లేదు మధ్యానం నుంచి సాయంత్రం దాకా వింటూనే ఉన్నావు.కాకపోతే సమయం అలా తగ్గిపోతుంది అంతే అంటుంది.అదీ దాని మహిమ.జాజ్ ,గిటార్ కళాకారులు వంటి వారు తదేక ధ్యానం తో అలుపు తెలియకుండా వాయించడానికి దీని ఆశ్రయిస్తుంటారు.ఇలాంటివి అన్నీ దానిలో వస్తాయి.ఇంకొన్ని డ్రగ్స్ తీసుకుంటే భ్రాంతి ప్రపంచం లో రరకాల దృశ్యాలు కనిపించడం ఇలా ...పెద్ద సబ్జెక్ట్ అది.


మోతాదు దాటి అలవాటు పడితే స్వర్గమే నరకమవుతుంది.ఈ సృష్టి లో ప్రతి మొక్క ఏదో దానికి ఉపయోగపడినట్లే గంజాయి మొక్క కూడా అనేక ఔషధ గుణాలు కలిగి ఉంది.ఆయుర్వేదం లోనూ,ఇప్పుడు ఆధునిక వైద్యం లోనూ ఉపయోగిస్తూనే ఉన్నారు. ఎప్పుడైనా ఇక మిగతాది.






    




 

No comments:

Post a Comment