Tuesday, November 3, 2020

లియో టాల్ స్టాయ్ నవల "అన్నా కెరినీనా" : ఒక పరిశీలన

 ప్రపంచ సాహిత్య చరిత్ర లో ఎవరూ ఎప్పటికీ విస్మరించలేని పేరు లియో టాల్ స్టాయ్. ఇక ఆయన రచనలు ఎన్ని భాషల్లోకి అనువాదమయ్యాయో,వాటి ప్రభావం సామాన్య పాఠకుల పైనే గాక మేధో వర్గం పైన కూడా ఎలాంటి ప్రభావం చూపాయో చెప్పాలంటే ఒక ఉద్గ్రంథమే అవుతుంది.


ఆయన పూర్తి పేరు కౌంట్ లియో నికోల్యవిచ్ టాల్ స్టాయ్.1828 లో రష్యా లోని తుల ప్రావిన్స్ లో ఒక భూస్వామ్య కుటుంబం లో జన్మించాడు.మాస్కో యూనివర్శిటీ లో న్యాయ శాస్త్ర విద్య అభ్యసిస్తూ మధ్య లోనే వదిలివేసి తమ కుటుంబానికి చెందిన యస్నయా పొల్యానా ఎస్టేట్ కి వచ్చి రకరకాల ప్రయోగాలు చేశాడు.13 పాఠశాలలు స్థాపించి తనదైన ఒక కరికులం ని తయారు చేసి నూతన భావజాలాన్ని పిల్లల్లో పాదుకొల్పడానికి కృషి చేశాడు.అప్పటి జార్ పాలకుల చర్యల వల్ల వీటిని మూసివేయవలసి వచ్చింది.


ఆర్దిక,సామాజిక,సాంఘిక,మత పరమైన విషయాల్లో నూతన పోకడలు రావలసిన అవసరాన్ని గుర్తించి ఎంతగానో పరితపించాడు,వాటిని తన రచనల్లో ప్రతిఫలింప చేయడమే గాక నిజ జీవితం లో సైతం ఆచరించడానికి పూనుకున్నాడు.దానివల్ల తను చివరి దినాల్లో సొంత ప్రాంతానికి,ఇంటికి దూరమై పోవలసివచ్చింది. 84 ఏళ్ళ జీవితం లో చివరి ఇరవై ఏళ్ళు ఆయనకి సంసార జీవితం లో కూడా కలతలు ఏర్పడ్డాయి.పర్యవసానం గా ఒక రైల్వెయ్ స్టేషన్ లో మరణించవలసి వచ్చింది.సరే,అదంతా పెద్ద కథ.

"అన్నా కెరినీనా" నవల గూర్చి చెప్పగానే చాలామంది పాఠకులు ఏమనుకుంటారంటే అది ఒక వైవాహికేతర సంబంధం ని ఉద్దేశించి రాసిన నవల గా భావిస్తారు.నిజానికి దానిని మించిన విషయం దీనిలో ఉంది.అందుకే అది ప్రపంచ సాహిత్యం లో ఒక ఆణిముత్యం గా నిలిచిపోయింది.ఇంతకీ ఏముంది..? అవకాశమున్నంతలో కొద్దిగా పరిశీలిద్దాము.ఆనాటి రష్యన్ ఆర్థోడాక్స్ చర్చ్ కి సమాజం లో ఉన్న పట్టు ఇంకా అప్పటి భూస్వామ్య,ప్రభు వర్గీయుల జీవిత శైలి,మాస్కో,పీటర్స్ బర్గ్ నగర వ్యవహారాలు,రష్యన్ గ్రామీణ,నగర వ్యవస్థల లో పొడసూపుతున్న నూతన ఆలోచనా ధారలు ఇలా ఒకటేమిటి గమనించే ఓపిక ఉండాలి గాని చాలా విషయాలు సినిమా చూసినట్లు చూడవచ్చు.


నేను చదివిన ఈ ఇంగ్లీష్ అనువాదం Constance Garnett చేసినది.నిజానికి టాల్ స్టాయ్ కి ఇంగ్లీష్,ఫ్రెంచ్,జర్మన్ భాషలు ధారాళం గా వచ్చును. ఈ నవల లో తక్కువ గాని "వార్ అండ్ పీస్" నవల లో చూసినట్లయితే ఫ్రెంచ్ సంభాషణల్ని వివిధ పాత్రలు తరచుగా మాట్లాడుతుంటాయి.కొన్నిసార్లు మనకి ఫ్రెంచ్ నేర్చుకోవాలనిపిస్తుంది.సరే.."అన్నా కెరినీనా " కి వద్దాము. ఈ నవల 1877 లో మొదటిసారిగా ప్రచురణ అయింది.రమారమి 800 పేజీలు ఉన్నది.ఈ నవల ప్రారంభానికి ముందు పేజీ లో  " Vengence is mine and I shall repay" saith the Lord (Romans 12:19)  అనే  బైబిల్ లోని కొటేషన్ ఉంటుంది.నవల మొత్తం చదివిన తర్వాత ఈ వాక్యాన్ని ఎందుకు ఉటంకించాడో అర్ధం అవుతుంది.     నవల లో మొదటి వాక్యం ఇలా ఉంటుంది." సుఖంగా ఉన్న సంసారాలన్నీ పోలికల్లో ఒకేలా ఉంటాయి.కాని సుఖం లేని సంసారాల గాథలన్నీ దేనికవే వేరు వేరు గా ఉంటాయి" అని. 


ప్రిన్స్ స్టెపాన్ అర్క్ద్యేవిచ్ ఒబ్లాన్స్కీ ఆ రోజు చాలా దిగులు గా ఉన్నాడు.కారణం భార్య డాలీ కి తనకి గొడవ అయింది. వేరే గది లో నుంచి బయటకి రావడం లేదు.ఇంట్లో పనిమనుషులు ఎంతకని చేస్తారు.తన పట్టుదల తనదే.పుట్టింటికి వెళ్ళిపోవడానికి రెడీ గా ఉంది. కారణం స్టెపాన్ తమ పిల్లలకి గవర్నెస్ గా నియమింపబడిన ఓ ఫ్రెంచ్ వనిత తో సంబంధం పెట్టుకున్నాడని అభియోగం.చివరి అస్త్రం గా తన సోదరి అన్నా కెరినీనా ని రమ్మని కబురు పెట్టాడు. ఆమే కధానాయిక.పీటర్స్ బర్గ్ లో ఉంటుంది.ఆమె వచ్చి తమ ఇద్దరి మధ్య సయోధ్య కుదుర్చుతుందని ఇతని ఆశ.


అన్నా కెరినీనా యొక్క భర్త అలెక్సీ అలెక్జాండ్రివిచ్ కెరినిన్.అతను పీటర్స్ బర్గ్ లో ప్రభుత్వ వ్యవస్థ లో ఉన్నత అధికారి.ఆయన సాయం తోనే ఈ ప్రిన్స్ స్టెపాన్ ప్రభుత్వానికి సంబందించిన ఓ కమిటీ లో మెంబర్ గా ఉంటాడు.అది గాక ఇంకా చాలా ఆస్తి పాస్తులు ఉంటాయి. ఇక్కడ కొన్ని సున్నితమైన రాజ్య వ్యవహారాలు తెలుసుకోవచ్చు.బావ సాయం లేకపోయిన తనంతట తాను ఈ పదవిని తెచ్చుకోగలడు.ఎందుకంటే అతని బంధువర్గం అంతా ప్రభుత్వ అధికారానికి సమీపం గా ఉండేవారే.


సరే...తన సోదరి అన్నా కెరినిన్ ని తోడ్కొని రావడానికి స్టెపాన్ రైల్వే స్టేషన్ కి వెళతాడు.ఈ సమయం లోనే రోన్స్కీ అనే యువ మిలటరీ అధికారి తన తల్లిని రిసీవ్ చేసుకోడానికి వస్తాడు.ఇక్కడ వీరిద్దరి పరిచయం జరుగుతుంది.అకస్మాత్తు గా రైలు కదిలి వెనకనున్న గార్డ్ మీదికి ఎక్కడం తో అతను మరణిస్తాడు.ఇలా వీరిద్దరి పరిచయాన్ని రానున్న ఉపద్రవానికి సూచనా అన్నట్లు గా చిత్రించాడు రచయిత.


ఇంటికి వచ్చి మరదలికి,తన సోదరునికి సయోధ్య చేస్తుంది.పిల్లలిద్దర్నీ మంచిగా పెంచాలంటే భార్యభర్తల్లు బాధ్యతాయుతం గా ఉండాలని బోధ చేస్తుంది.మొత్తానికి ఆ గొడవ సద్దు మణుగుతుంది. మళ్ళీ మాస్కో నుంచి పీటర్స్ బర్గ్ వెళ్ళడానికి రైల్వే స్టేషన్ కి వస్తుంది అన్నా.అక్కడ మళ్ళీ రోన్స్కీ కలుస్తాడు.ఈ రోన్స్కీ అప్పటికే కిట్టీ అనే అమ్మాయి తో చేరువ గా ఉంటాడు.ఆమె ని పెళ్ళి చేసుకోవాలని భావిస్తాడు.విధి వైపరీత్యమా అన్నట్లు,పెళ్ళయి ఒక పిల్లాడు కూడా ఉన్న ఈ అన్నా ని చూడగానే ఇతను ఈమె మీద మనసు పారేసుకుంటాడు.అన్నట్లు కిట్టీ అనే అమ్మాయి డాలీ కి చెల్లెలు అవుతుంది. 


అన్నా కి తొమ్మిదేళ్ళ కుమారుడు ఉంటాడు,అతని పేరు సెర్యోజ. అన్నా కి ఆమె భర్త కి ఇరవై ఏళ్ళ తేడా ఉంటుంది. ఇద్దరూ అన్యోన్యం గానే ఉంటారు. కాలక్రమేణా రోన్స్కీ కి అన్నా కి మధ్య ప్రేమ ముదిరి ఈమె గర్భవతి కూడా అవుతుంది.గుర్రపు పందేలు జరిగేప్పుడు రౌతు గా ఉన్న రౌన్స్కీ కి భార్య కి మధ్య జరిగే బాడీ లాంగ్వేజ్ ని గమనిస్తాడు భర్త కెరినిన్. ఆ తర్వాత అన్నా నిజం చెబుతుంది, తాను రోన్స్కీ ప్రేమ లో ఉన్నామని ,తాను గర్భవతి ని కూడానని చెబుతుంది.దీని తో అతను మౌనం గా ఉండిపోతాడు. 


రోన్స్కీ ఈమె ని పెళ్ళాడాలంటే ముందు వీళ్ళిద్దరూ చట్టబద్ధం గా విడాకులు తీసుకుంటేనే సాధ్యం.కనక సంప్రదింపులు జరిపితే రష్యన్ ఆర్థోడాక్స్ చర్చ్ కొన్ని నిబంధనలు పెడుతుంది.దానివల్ల విడాకులు తీసుకోవడం కష్టమవుతుంది.అప్పుడు కెరినిన్ తన భార్య కోరుకున్న రోన్స్కీ తోనే కలిసిఉండమని తనకి ఎలాంటి అభ్యంతరం లేదని చెబుతాడు.ఆ విధం గా అన్నా,రోన్స్కీ కలిసి జీవిస్తుంటారు.అయితే వీరికి పెళ్ళి అనే చట్టబద్ధత లేదు గనక వారి సొసైటీ లో గౌరవం లభించదు.దీనితో ఇటలీ వెళ్ళిపోతారు.అక్కడ కూడా అన్నా ఇమడలేదు.


తిరిగి రోన్స్కీ వాళ్ళ ఊరి లోని ఎస్టేట్ కి వస్తారు.అన్నా తనకి ఉన్న అందం తగ్గడం వల్ల రోన్స్కీ నిర్లక్ష్యం చేస్తున్నాడని భావిస్తుంది.ఇద్దరి మధ్య తగాదాలు వస్తుంటాయి.భర్త కెరినిన్ కూడా మీరిద్దరూ వచ్చి నా ఇంటిలో ఉండమని అంటాడు.కెరినిన్ కి విడాకులు ఇవ్వడం రకరకాల కారణం చేత కుదరదు.ఆమె పట్ల భర్త కక్ష తో వ్యవహరించడం ఉండదు. ఇది కూడా రోన్స్కీ లో తన పట్ల తనకి ఏహ్య భావం కలిగి ఆత్మహత్య కి పూనుకుంటాడు గాని అది సఫలమవదు.


చివరికి మానసిక వేదన కి గురయి రైల్వే ట్రాక్ మీద పడి అన్నా ఆత్మహత్య చేసుకుంటుంది.ఆ విధం గా ఎంతో అందగత్తె గా,పెద్ద కుటుంబానికి చెందిన స్త్రీ గా సొసైటీ లో పేరు ప్రఖ్యాతులు ఉన్న ఆమె జీవితం అలా ముగుస్తుంది.రోన్స్కీ కి అన్నా కి పుట్టిన అన్నీ అనే అమ్మాయిని కెరినిన్ పెంచడానికి తీసుకుంటాడు.      ఈ కథ కి సమాంతరం గా ఇంకో జంట గూర్చిన కథ జరుగుతుంది. అది లెవిన్,కిట్టీల ప్రేమ ఇంకా పెళ్ళి కధ.ఈ లెవిన్ మాస్కో కి దూరం గా ఉన్న ఓ గ్రామం లో నివసిస్తూంటాడు.ఆరువేల ఎకరాల భూస్వామ్య కుటుంబం లో పుట్టినవాడు.గ్రామీణ జీవితం పై మక్కువ ఎక్కువ.వ్యవసాయం లో రకరకాల ప్రయోగాలు చేస్తుంటాడు.అతని చిన్నప్పుడే తల్లిదండ్రులు మరణిస్తారు.తనకి వచ్చే భార్య తమ కుటుంబం పరువు ప్రతిష్టలు పెంచే వ్యక్తిగా,చదువు,అందం,సంస్కారం ఉన్న వ్యక్తి గా ఉండి తన తల్లి లా ఇంటి వ్యవహారాలు చక్కబెట్టేది గా ఉండాలని కలలు కంటూ ఉంటాడు.


అలా ఆలోచించి స్టెపాన్ వద్ద కి మాస్కో కి వస్తాడు.వీళ్ళిద్దరూ క్లాస్ మేట్స్. ఈ స్టెపాన్ మరదలు అయిన కిట్టీ ని పెళ్ళిచేసుకోవాలనేది ఇతని ప్రణాళిక.అదే విషయం మిత్రుని తో చెబుతాడు. నీ ఆలోచన మంచిదే గాని ఈ మాస్కో లో విభిన్న వాతావరణం లో పుట్టి పెరిగిన ఆ అమ్మాయి నీ ఎస్టేట్ కి అక్కడికి వచ్చి ఉండగలదా అదీ కాక రోన్స్కీ అనే వాడు ఆమె ని పెళ్ళి చేసుకోవాలని ప్రయత్నిస్తున్నాడు అని స్టెపాన్ చెబుతాడు. ఎందుకైనా మంచిది నీ ప్రపోజల్ నువు చెప్పు దానిలో తప్పేముంది అంటాడు.తీరా కిట్టీ కి చెబితే ఆమె తిరస్కరిస్తుంది.దానితో చేసేది లేక మళ్ళీ పల్లె కి వచ్చి తన పనుల్లో పడిపోతాడు లెవిన్.


అన్నా ప్రేమ లో పడిన రోన్స్కీ ఉన్నట్టుండి కిట్టీ ని తిరస్కరిస్తాడు.దీనితో ఈమె కి ఆరోగ్యం చెడి జర్మనీ లోని ఒక స్పా లో చేరుతుంది. ఇక్కడ వరెంకా అనే ఆమె పరిచయం వల్ల కిట్టీ తన ధృక్పథాన్ని మార్చుకుంటుంది.జీవితం అంటే పెళ్ళి ఒక్కటే కాదని సేవా మార్గం లోకి వెళ్ళిపోతుంది.లెవిన్ సోదరుడు కి ఆరోగ్యం బాగోలేనప్పుడు ఈమె తన సేవలు అందిస్తుంది.మళ్ళీ లెవిన్ కి ఈమె పట్ల ప్రేమ కలిగి ప్రపోజ్ చేయగా అంగీకరిస్తుంది.అలా ఇద్దరూ పెళ్ళి చేసుకుని గ్రామీణ ప్రాంతం లోని ఆ ఎస్టేట్ లో ఉంటూ పేద రైతుల ని మంచి గా చూస్తూ కాలం గడుపుతుంటారు.


ఇంకా కొన్ని ఉప కథలు సమాంతరం గా ముడివేసుకొని నడుస్తుంటాయి.ఇవన్నీ ఒకదానికొకటి సంబంధం కలిగినవే.టాల్ స్టాయ్ తన విస్తృతమైన పరిశీలన వల్ల మానవ జీవితాల్ని దానిలో ఏర్పడే సంఘటనల వైరుధ్యాల్ని వివిధ పాత్రల ద్వారా వివరించాడు. రచయిత గా పరిణితి చెందాలంటే ఎవరైనా సరే టాల్ స్టాయ్ రచనలు తప్పక చదవాలి.ఒక క్లిష్టమైన భావాన్ని చిన్న చిన్న మాటల్లో చెప్పడం అలాగే మనుషుల ప్రవర్తనల్ని ,బయటకి వ్యక్తం చేయడానికి వీలుపడని భావాల్ని అపరోక్షం గా చెప్పడం,ఒక త్రీడి సినిమా చూస్తున్నట్లుగా అక్కడి భవనాల్ని ప్రకృతిని వర్ణించడం ఇవన్నీ చదువుతుంటేనే దానిలోని కమ్మదనం అర్ధమవుతుంది.


ముఖ్యం గా బాల్ రూంల లో మర్కుజ అనే నాట్యం సాగే సన్నివేశాలు, అక్కడ ఒకరితో ఒకరు మాట్లాడే విధానం కొన్ని మార్లు పాత్రల శరీర కదలికల ద్వారా వ్యక్తపరిచే భావాలు ఇంకా అనేక టెక్నిక్ లు నేర్చుకోవచ్చును.లెవిన్,స్టెపాన్ ఫ్రెంచ్ హోటల్ లో భోజనం చేస్తున్నప్పుడు ఆ పదార్థాలన్నీ మనకళ్ళ ముందు మెదిలినట్లు అవుతుంది. అది యుద్ధ సన్నివేశం గాని,ప్రేమ భాషణ గాని,డిప్లమసీ గానీ ప్రతి దాన్ని ఎంతో జాగ్రత్త గా శిల్పం చెక్కినట్లు గా చెక్కుతాడు.మనం ఎంత కాదనుకున్నా భారత,రామాయణాది గ్రంధాల యొక్క ప్రభావం మన సామాజిక జీవనం మీద ఎలా ఉందో అలాగే క్రైస్తవ మత ప్రభావం ఆయా దేశాల మీద ఉన్నది.అదే అంతర్లీనం గా అన్నా కెరినీనా లో ప్రవహించింది.


స్టెపాన్ కి గల వైవాహికేతర సంబంధం కుటుంబం లో నే సమసిపోగా అదే అతని సోదరి అన్నా కి ఏర్పడినప్పుడు ఆమె ఆత్మహత్య కి దారితీసింది ఒక మాటలో చెప్పాలంటే..!పురుషుని యొక్క మరియు స్త్రీ యొక్క వైవాహికేతర సంబంధాల్ని సమాజం ఒకే మాదిరి గా చూడదు అని ఈ నవల లో చెప్పినట్లయింది.ఇంకా ఈ రచన పై ఎన్నో విశ్లేషణలు వెలువడ్డాయి.చెఖొవ్ అన్నట్లు టాల్ స్టాయ్ ఏది రాసినా చాలా ఇష్టం తో హృదయం అంతా పెట్టి రాసినట్లుగా ఉంటుంది అని. దానిని కాదనే వారెవ్వరు..?

        

      -----మూర్తి కెవివిఎస్


(Printed in Nava Telangana Daily. Dt 2.11.20)


  






    

No comments:

Post a Comment