Friday, November 6, 2020

The Little Monk And Other Stories (కథా సంపుటి )-ఒక అభిప్రాయం


గౌరహరి దాస్ వెలయించిన కధలు ఇవి. మొదట ఈ కధలు అన్నీ ఒడియా భాష లో వచ్చాయి. ఆ తర్వాత ఆంగ్లం లోకి తర్జూమా అయినాయి.రూపా అండ్ కో వాళ్ళు ప్రచురించారు.రచయిత ఒడియా భాష లో సుప్రసిద్ధ రచయిత ఇంకా సంపాదకుడు కూడా.మొత్తం 14 కధలు ఉన్నాయి.


ఒరియా సమకాలీన జీవనాన్ని ప్రతిబింబించే విధంగా ఉన్నాయి.గ్రామీణ  ప్రాంతాల్లోని ఇంకా నగర ప్రాంతం లోని మనుషులు,వారి వైవిధ్యభరితమైన జీవిత శకలాలు ఈ సంపుటి లో చోటు చేసుకున్నాయి.అంతే గాక ఒరియా సంస్కృతి కి చెందిన విశేషాలు అంతర్లీనం గా దర్శనమిస్తాయి.


బహుశా రచయిత వైష్ణవ కుటుంబ నేపథ్యం నుంచి వచ్చినందువల్ల అనుకుంటా ఆ వాతావరణం స్పష్టంగా కొన్ని కధల్లో కనబడుతుంది.మొట్ట మొదటి కథ "The little monk" ,  ఇది ఒక బాల సన్యాసి గూర్చిన కథ.తల్లిదండ్రులకి ఎన్నో పూజల ఫలితం గా టుట్లూ పుడతాడు.పూరి వెళ్ళి జగన్నాధుని క్షేత్రం లో నిద్ర చేసి ,కుమారుడు జన్మిస్తే నీ సేవ నిమిత్తం అతడిని సన్యాసి గా చేసి సమర్పిస్తానని మొక్కుకుంటుంది. 


జగన్నాధ సంస్కృతి లో ఇది ఓ ఆచారం,అలా పుట్టిన పిల్లల్ని కొంత కాలం వారికి సంబందించిన ఆశ్రమం లో గురువుల వద్ద ఉంచి ఆ తరువాత వారిని వేలం పాట లో కొనుక్కుంటారు. అలా ఈ టుట్లూ ని కూడా బాల్యం లో ఇంట్లో కొంత కాలం పెరిగిన తర్వాత ఆశ్రమం కి పంపిస్తారు. అంతకాలం పాటు సొంత ఇంటి లో అల్లారు ముద్దు గా పెరిగిన పిల్లవాడి కి ఒక్కసారి గా కొత్త వాతావరణం లోకి వెళ్ళేసరికి విపరీతం గా బాధపడతాడు.పైగా ఆ ఆశ్రమం పతాపూర్ అని సొంత వూరు కి దూరం గా ఉండే ఊరు.


ఆ జైలు లా తోచే వాతావరణం నుంచి బయటకి రావడానికి పడే పాట్లు కొన్నిసార్లు జాలి పుట్టించే విధం గాను కొన్ని సార్లు నవ్వు తెప్పించే విధం గానూ ఉంటాయి. ఇంకొక కథ Ahalya's wedding , అహల్య అనే ఓ అమ్మాయి చిన్నతనం నుంచే ఒక కుటుంబం లో పనిమనిషి గా ఉంటుంది.చిన్నతనం లో ఆమెని తల్లి దండ్రులు తమ పేదరికం వల్ల ఇక్కడ చేరుస్తారు.నీ కూతురు గురించి మర్చిపో..అన్నీ మేం చూసుకుంటాం అని చెబుతారు యజమాని కుటుంబీకులు.పాపం ఈ అహల్య ..బండెడు పనీ చేస్తుంది అందరికీ. ఏళ్ళు గడుస్తుంటాయి. 


యజమాని కూతురు కి పెళ్ళవుతుంది.మళ్ళీ ఆ కూతురు కూతురికి కూడా పెళ్ళి ఘడియ వస్తుంది కాని ఈ అహల్య సంగతి ని మాత్రం పట్టించుకోరు.తన తల్లిదండ్రులకి అన్నీ చూసుకుంటామని వీళ్ళు మాట ఇచ్చారు గదా అని అహల్య బాధపడుతూ ఉండగా కథ సమాప్తమవుతూంది.


తమ పిల్లల్ని చూడటానికి,ఇతరుల పిల్లల్ని చూడటానికి గల తేడాని ఈ కథ లో బాగా చెప్పాడు రచయిత.ఆ ఇంటి లోని ఆడవాళ్ళు సైతం ఈమె ఒక స్త్రీ అని కాక కేవలం పని చేసే మరమనిషి గా చూడటం కదిలిస్తుంది. "Crime and Punishment" అనేది మరో కథ.యశోద అనే ఓ వృద్ధురాలు , ఆమె కి ఓ కూతురు ..కూతురు కి ఇద్దరు పిల్లలు పుట్టిన తర్వాత అల్లుడు ఎటో వెళ్ళిపోతాడు.చాలా పేద కుటుంబం.వృద్ధప్య పెన్షన్ మీద బతుకు బండి అలా సాగిస్తుంటారు.ఇక బాధలు భరించలేక పిల్లలు అయినా సుఖం గా బతుకు తారని మధు సాహు అనే వ్యాపారి కి ఓ పిల్లాడిని అమ్ముతుంది ఆ వృద్ధురాలు. ఆ వ్యాపారి కి పిల్లలు ఉండని కారణం గా తను కొంటాడు.

ఈ వార్త ఒక్కసారి గా మీడియా లో రావడం తో కలకలం రేగుతుంది.కలెక్టర్ వెంటనే సబ్ కలెక్టర్ కి ఫోన్ చేసి ఆ వివరాల్ని ఏమిటని అడుగుతాడు.ఈ యువ సబ్ కలెక్టర్ దేబ బ్రత ఆ వృద్దురాలికి  పెన్షన్ రాకపోవడం ఇదంతా బయటకి వస్తే గొడవ అవుతుందని మీడియా ని మేనేజ్ చేసి ఆ పిల్లాడు ఆ మధు సాహు అక్రమ సంతానమని అమ్మడాలు ఏమీ జరగలేదని మీడియా లో చెప్పిస్తాడు.దానితో అవమానం గా ఫీలయి ఆ పేద తల్లి ఆత్మహత్య చేసుకుంటుంది.


దీనికి శిక్ష నా అన్నట్లు ఈ సబ్ కలెక్టర్ భార్య కి నెలలు నిండకుండానే శిశువు పుట్టి మరణిస్తుంది. ఈ కథ లో అధికార యంత్రాంగం తమ వైపు తప్పు లేకుండా చేసుకోవడానికి ఎలా ప్రయత్నిస్తారు అనేది చెప్పబడింది.  ప్రస్తుతానికి ఈ మూడు కథలు గూర్చి చెప్పుకున్నాం గదా.మళ్ళీ వచ్చేసారి మిగతా కథల్లో కొన్నివాటిని గూర్చి చెప్పుకుందాం.గౌరహరి దాస్ కథ చెప్పే విధానం లో సౌమ్యత,సూటిదనం ఉంది.ఎన్నుకున్న వస్తువు దైనందిన జీవితం లో ఎక్కడో తారస పడే విషయం గా అనిపిస్తుంది.కొన్ని వాటిల్లో చురుక్కుమనే మలుపులు ఉంటాయి.రచయిత మౌలికం గా జర్నలిస్టు కావడం వల్ల కొన్ని పరిశోధనాంశాలూ మనల్ని పలకరిస్తాయి.మొత్తం 

 ఏడుగురు అనువాదకులు వీటిని ఆంగ్లం లోకి అనువదించారు. సరే...తరువాయి భాగం లో చూద్దాము,మిగతా వాటిని..!

------Murthy Kvvs




No comments:

Post a Comment