Friday, January 15, 2021

"నోట్స్ ఫ్రం అండర్ గ్రౌండ్" దోస్తోవిస్కీ నవల, ఓ పరిశీలన


ప్రపంచ నవలా రంగం లో దోస్తోవిస్కీ స్థానం అద్వితీయమైనది. ఎన్నో విషయాల్లో ఆయన వేసిన నూతన పునాదులు ఈనాటికీ చదువరులను ఆశ్చర్యచకితుల్ని చేస్తూనే ఉన్నాయి. సిగ్మండ్ ఫ్రాయిడ్ కంటే ముందు కాలం లోనే మానవ మస్తిష్కాన్ని దాని కదలికల్ని అత్యంత సూక్ష్మంగా పరిశీలించి వాటిని తన పాత్రల్లో ప్రవేశపెట్టాడు. మానవ స్వభావాన్ని వానిలోని చొరరాని అంతస్సీమల్లోకి ఎంత దిగ్విజయం గా పయనించాడో దోస్తోవిస్కీ సృజించిన ప్రతి పాత్ర చెబుతుంది.

ఆయన పేరు చెప్పగానే సహజం గానే Brothers Karamazov,Crime and Punishment,The Devil  ఇంకా అలాంటి నవలలు గుర్తుకు రావడం మామూలే..! నిస్సందేహం గా అవి నిరుపమానమైన రచనలే. కాని వీటి అన్నిటికీ ఆధారభూతమైన ఆలోచనలను తన రచనా వ్యాసాంగాన్ని మొదలుపెట్టిన తొలి రోజుల్లో ఒక చిన్న నవలిక లో ప్రదర్శించాడని చెప్పాలి. ఆ తరువాత దోస్తోవిస్కీ రాసిన చాలా గొప్ప నవలలు వీటి పునాదుల పై నిర్మించాడని చెప్పాలి. అటువంటి అపురూపమైన నవలిక యే Notes from Underground.   

ఇది సుమారు గా 118 పేజీలు ఉన్న రచన. 1864 లో ఇది ప్రచురింపబడింది. ప్రధమ పురుష లో వర్ణన సాగుతుంది. అతనే రచయిత భావించే అండర్ గ్రౌండ్ మనిషి. ఇక్కడ ఒకటి అర్ధం చేసుకోవాలి. ఈ అండర్ గ్రౌండ్ మనిషి అనేవాడు ప్రతి ఒక్కరి లోనూ ఉంటాడు. బయటవారికి కంటికి కనిపించడు. ప్రతి దానికి ఓ సాక్షీభూతం వలె ఉంటాడు.ఎవరి ముందూ ఒప్పుకోని సంగతుల్ని తనలో తను ఒప్పుకుంటాడు. అలాంటి ఒక వ్యక్తి ఈ కథని చెబుతుంటాడు. దోస్తోవిస్కీ రచన ఏది గాని ఏదో కాలక్షేపం లా చదివి అవతల పారేద్దాం అంటే కుదరదు.కొన్నిసార్లు స్వగతం లాగానూ,కొన్నిసార్లు సుదీర్ఘ సంభాషణల లాగానూ,మరిన్నిసార్లు తత్వశాస్త్రం,మానసికశాస్త్రం కి సంబందించిన పాఠాల లాగానూ అనిపిస్తుంటాయి.

 కాని వాటి అన్నిటిలోనూ హృదయాన్ని బంధించే అంతస్సూత్రం ఉంటుంది. చదివిన తర్వాత జీవితం మొత్తాన్ని వెంటాడే ఓ మంత్రజాలం ఉంటుంది. కనుకనే 150 ఏళ్ళ క్రితం రాయబడిన ఈ నవల ఓ విశేష రచన గా నిలబడిపోయింది. మరెందుకనో తెలియదు గాని ఈ నవలిక గురించి పెద్ద గా ఎవరూ ఏ పత్రిక లోనూ మాట్లాడినట్లు కనబడదు.

జీన్ పాల్ సార్త్రే వంటి వాడు ఈ నవలికని మొట్ట మొదటి Existentialism ని ప్రతిపాదించిన రచన గా పేర్కొన్నాడు. టాల్ స్టాయ్ తనకి నచ్చిన దోస్తోవిస్కీ రచనల్లో ఒకటి గా రాశాడు. మరి ఇంతగా మేధావి వర్గాన్ని కదిలించిన దీనిలో ఏమున్నది..? అది కొద్దిగా చూద్దాము. అండర్ గ్రౌండ్ మేన్ తో పాటు జ్వెర్కొవ్,సిమనోవ్,ఫెర్విష్కిన్,లిజా ఇవి ఇతర పాత్రలు అయితే అన్నీ సమ ప్రాధాన్యత ని కలిగిఉండవు. లిజా పాత్రకి కొంత ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది.

 ఈ నవలిక ప్రారంభం లో అండర్ గ్రౌండ్ మనిషి తన వివరాలు చెబుతుంటాడు. అతను ఓ చిరు ప్రభుత్వ ఉద్యోగి, ప్రస్తుతం రిటైర్ అయి పీటర్స్ బర్గ్ కి కొద్ది దూరం లో ఉన్న చిన్న ఊరి లో నివసిస్తూంటాడు. తను ఉద్యోగి గా ఉన్నప్పుడు ఎలా ప్రవర్తించేవాడు,సాటి ఉద్యోగుల తోనూ మిగతా అధికారులతోనూ ఎలాంటి సంబంధాలు నెరిపేవాడు ఇవన్నీ జ్ఞప్తి కి తెచ్చుకుంటూ ఉంటాడు. తన వద్దకి పనుల కోసం వచ్చే జనాల తో పరుషం గా ఉండేవాడు.అయితే ఒకటి ఎప్పుడూ తను లంచం తీసుకునేవాడు కాదు. కనుక దానికీ దీనికీ సరిపోయింది గదా అని సంతృప్తి పడతాడు.

రమారమి ఓ నలభై పేజీల దాకా ఇలా తన గురించిన జ్ఞాపకాలు సాగుతుంటాయి.దానిలో తాను ఎందుకు పెళ్ళి చేసుకోలేదు,పీటర్స్ బర్గ్ లో నివాసం ఎందుకు ఉండటం లేదు,తన పనిమనిషి కి ఏడు రుబుళ్ళ జీతం ఎందుకు ఇస్తున్నాడు ఇలాంటివి అన్నీ ఉంటాయి. ఆ తర్వాత భాగం లో తన క్లాస్ మేట్స్ తో చిలికి తగాదాలు.ఒకప్పుడు తనతో పాటు చదివిన ఓ క్లాస్ మేట్ విదేశాలకు వెళుతుంటే అతని కోసం అనిచెప్పి ముగ్గురు పాతమిత్రులు పార్టీ ఇస్తారు.దానికి హాజరైన మన అండర్ గ్రౌండ్ మనిషి చిన్న విషయం లో గొడవపడతాడు. ముఖ్యం గా జ్వెర్కొవ్ అనే వాడితో..అని చెప్పాలి.అక్కడ బాగా మద్యం సేవించి ద్వంద్వ యుద్ధానికి సై అంటాడు.మిగతా స్నేహితులు ఎలాగో మెల్లగా తప్పించుకొని లిజా అనే వేశ్య దగ్గరకి చేరుకుంటారు. అక్కడ కొంతమంది తో గడిపి వాళ్ళు వెళ్ళిపోతారు.

జ్వెర్కొవ్ అనే వాడిని కనీసం చెంపదెబ్బ అయినా సరే వెయ్యవలసిందే అని తీర్మానించుకుని అండర్ గ్రౌండ్ మనిషి వేశ్యావాటిక కి చేరుకుంటాడు.ఈలోపు వాళ్ళు జారుకుంటారు. ఏం చెయ్యలో తోచక ఓ సుదీర్ఘ ఉపన్యాసం వంటిదాన్ని ఆ వేశ్య కి ఇస్తాడు. దానిలో చాలా నిజాయితీ ఉన్నట్లు అనిపిస్తుంది. ఇతను తన ఇంటికి వెళ్ళిన తరువాత ఈమె అక్కడికి వస్తుంది.అక్కడ జరిగే మెలోడ్రామా ఓ సినిమా వలె ఉన్నా దానితో చదువరి మమేకం అవుతాడు. ఆ విధం గా నవలిక పూర్తి అవుతుంది. దీనిలో దోస్తోవిస్కీ మనసు చేసే ఇంద్రజాలం,దానివల్ల సమాజం తో మనిషి పడే బాధ ని ప్రధానం గా చెపుతాడు. 

ఎవరైతే ఎక్కువ ఆలోచనాపరులో ప్రతిదాన్ని లోతుగా చూస్తుంటారో అలాంటి వారు కార్యక్షేత్రం లో దిగాలు పడుతుంటారని,ఎవరైతే తప్పో ఒప్పో పెద్దగా ఆలోచించకుండా ఉంటారో అలాంటివాళ్ళే కార్యకలాపాల్లో చురుగ్గా ఉంటారని చెబుతాడు. కథ లో గొప్ప మలుపులు అనేవి ఉండవు గాని రోజువారీ జీవితం లో నే మనిషి తనకి తెలియకుండానే పరిస్థితులకి ఎలా ప్రభావితుడవుతాడో అంతర్లీనం గా చెబుతాడు.

దోస్తోవిస్కీ మానవ స్వభావాన్ని విశదీకరించే తీరు చదువుతుంటే ఒక్కొక్క పొర ఏదో తొలిగిపోతున్నట్లుగా ఉంటుంది.అయితే దాన్ని ఏదో నీతి సూత్రాలు వల్లించినట్లుగా చేయడు.మన గురించి మనం చెప్పుకున్నట్లుగా ఉంటుంది.కొన్నిమార్లు చిన్న నవ్వు మన పెదాల పై కదులుతుంది.ఉదాహరణకి ప్రేమ గురించి ఒక పేజీ లో ఇలా అంటాడు." ప్రేమ లో పడటం నా వల్ల కాని పని. నా దృష్టి లో ప్రేమ అంటే ఏమిటి అంటే మనసు పరం గా వేరొకరి పై ఆధిపత్యం కలిగియుండటమే, లేదా ఆ దిశ గా ప్రయత్నించి విజయం సాధించడము అని చెప్పాలి. ఒక్కసారి ఆ మనిషి వశీకృతుడైన పిమ్మట తన తో ఇక నేను ఎలా ప్రవర్తించాలో నాకు అర్ధం కాదు..!"  

ఈ నవల చదువుతుంటే అప్పటి రష్యన్ సమాజం లో గల వైరుధ్యాలు తెలుస్తుంటాయి.అంతేగాక  సివిల్ సర్విస్ లో గల హోదాలు వారి వైఖరి అవగతమవుతాయి.యధాప్రకారం ఫ్రెంచ్ ఇంకా జర్మన్ సంభాషణలు అవసరాన్నిబట్టి అక్కడక్కడ దొర్లుతుంటాయి.దోస్తోవిస్కీ ఎంతో లోతు గా యూరోపియన్ సాహిత్యాన్ని చదువుకున్నాడు.కాని రష్యన్ సమాజం లోని సమస్యలకి పరిష్కారాలు చూపడం లో పాన్ స్లావనిక్ దృక్పథాన్ని అవలంబించాడని విమర్శకులు భావిస్తారు. ఏది ఏమైనా మంచి అభిరుచి గల పాఠకులు తప్పక చదవ వలసిన నవల ఈ నోట్స్ ఫ్రం అండర్ గ్రౌండ్ అని చెప్పాలి. 
   ----------మూర్తి కె.వి.వి.ఎస్. 

( Printed in Nava Telangana Daily dtd. 04.01.2021)

No comments:

Post a Comment