Sunday, January 24, 2021

సర్ జాన్ ఉడ్రోఫ్-భారతీయులు గుర్తుంచుకోవలసిన పేరు

   


సర్ జాన్ ఉడ్రోఫ్ , ఈ పేరు  ప్రస్తుత తరానికి ఎంత వరకు తెలుసో మనం ఊహించడం కష్టమే..!కాని ప్రతి భారతీయుడు తెలుసుకోవలసిన బ్రిటీష్ జాతీయుడు ఈయన. భారత దేశం లో వర్ధిల్లిన తంత్ర శాస్త్ర జ్ఞానాన్ని పాశ్చాత్య ప్రపంచానికి పరిచయం చేసిన రచయిత,న్యాయ నిపుణుడు అయిన వుడ్రోఫ్ దాదాపు గా 20 గ్రంథాల్ని రచించాడు. 1915 వరకు కలకత్తా హైకోర్ట్ లో ప్రధాన న్యాయమూర్తి గా పనిచేసిన ఈయన ఎందుకని భారతీయ తంత్ర శాస్త్రాన్ని శోధించాలని నిర్ణయించుకున్నారు అని తెలుసుకుంటే ఆసక్తికరం గా ఉంటుంది.


కలకత్తా హైకోర్ట్ లో ప్రధాన న్యాయమూర్తి గా పనిచేస్తున్న సమయం లో ఓ కేసు విషయమై తీర్పు వెలువరించే ప్రక్రియ లో తనకెదురైన కొన్ని సంఘటనలు ఆయన లో భారతీయ తంత్ర శాస్త్రం పై గొప్ప ఆసక్తి ని కలిగించాయి. శివచంద్ర విద్యారణ్య భట్టాచార్య అనే గురువు వద్ద దీక్ష తీసుకున్నారు.ఎన్నో ఏళ్ళు సాధనలో గడిపారు. సంస్కృత భాష లో ఉన్న ఎన్నో గ్రంథాల్ని ఇంగ్లీష్ భాష లోకి అనువదించారు. చాలా వరకు తంత్ర శాస్త్ర రహస్యాలు లిఖిత రూపం లో కంటే గురు శిష్య పరంపర గా కొనసాగుతున్నట్లు చెప్పారు. తన సాధన లో అనుభవానికొచ్చిన ఎన్నో విషయాల్ని తను రాసిన గ్రంథాల్లో పదిలపరిచారు. 


బౌద్ధ,జైన,హిందూ శాస్త్రాల పరం గా తంత్ర జ్ఞానాన్ని విశదీకరించారు.Introduction to the Tantra Sastra,Tantra of great liberation (Maha nirvana Tantra),Hymns to Goddess,Shakti and Shakta,The Serpent power,Hymn to Kali: Karpuradi Strotra,The World as Power,The Garland of letters,Principles of Tantra ఇలా అనేక రచనలు వెలువరించారు. అయితే ఆయన Arthur Avalon అనే కలం పేరు తో కొన్ని రాశారు. అటల్ బిహారీ ఘోష్ అనే మిత్రుడు ఈ ప్రయత్నం లో ఎంతో సహకరించినట్లు తెలిపారు. భారతీయ తంత్ర శాస్త్రాన్ని మొదటిసారి గా బయట ప్రపంచానికి తన రచనల ద్వారా తెలిపిన ఘనత సర్ జాన్ వుడ్రోఫ్ కే దక్కుతుంది. రిటైరైన తర్వాత బ్రిటన్ కి వెళ్ళి అక్కడ ఆక్స్ ఫర్డ్ యూనివర్శిటీ లో బోధించారు. అటు తరువాత ఫ్రాన్స్ దేశానికి వెళ్ళి Beausoleil అనే ఓ గ్రామం స్థిరపడి అక్కడే జనవరి 16, 1936 నాడు మరణించారు. కనుక ఆ మహానుభావుని జ్ఞప్తి కి తెచ్చుకోవడం మన బాధ్యత. 

   -------- మూర్తి కె.వి.వి.ఎస్. 

(Printed in Sakshi Telugu Daily, on 16.01.2021) 

No comments:

Post a Comment