ఇటీవల మదనపల్లి లో జరిగిన ఉదంతం పైన రెండు ముక్కలు రాయాలనిపించింది.ఏదో నాకు తోచింది.అలా రాస్తాను.ముఖ్యంగా రకరకాల వాళ్ళు రకకాల వ్యాఖ్యానాలు చేస్తోంటే,రాస్తూంటే నాకు నా అభిప్రాయాలు రాయాలనిపించింది.
---అంత విద్యాధికులు,స్థితిమంతులు అయి వుండి వాళ్ళకి అదేమి పోయే కాలం -అదేమి మూఢ భక్తి- అదేమి -క్షుద్ర పూజలు ఇలా నానారకాల మాటలు వస్తున్నాయి,ఇంకొంతమంది సందట్లో సడేమియా లా చూశారా హిందూమతం లో ని ఈ మూఢ నమ్మకాలు అంటూ సన్నాయినొక్కులు.
---అసలు హిందూమతం అంటే ఏమిటో నిజం చెప్పాలంటే హిందువుల్లోనే చాలా మందికి తెలియదు.శాక్తేయులు,కాపాలికులు,శైవులు,వైష్ణవులు ఇలా ఎన్నో నమ్మకాలతో,పూజా విధానాలతో సాగిపోయేదే ఇది.ఇంకా చెప్పాలంటే అసలు ఏ దేవుడిని నమ్మను పో అనే వాడిని కూడా మతం లోనుంచి అవతలికి పో అని బహిష్కరించే వాడు కూడా ఎవడూ ఉండడు.అసలు అంత తీరిక ఎవరికి ఉంది. ఇంత ప్రజస్వామికమైన మతం ఇంకోటి ఉండదు. మరి ఏమయ్యా దీనిలో చెడు లక్షణాలు లేవా అంటే, ఎందుకు లేవూ అవీ సలక్షణం గా ఉన్నాయి. కాలం చెల్లిన,బూజుపట్టిన కొన్ని వాటిని పట్టుకొని వేలాడటం ...అందుకే మూల్యం చెల్లించింది విదేశీ పాలనలో బడి.
సరే...విషయానికొద్దాం. నిజం చెప్పాలంటే ఈ జీవితాన్ని ,మనం చూసే ప్రపంచాన్ని దాటి ఇంకా ఏమన్నా ఉందా అనే ఆలోచన ఎంతో కొంత జ్ఞానము పెరిగిన తరవాతే వస్తుంది.మనం అనుకునే ఈ డిగ్రీలు ,డాక్టరేట్లు వగైరా వగైరా సమాచారాన్ని వొక చోట వేసుకోవడం దాన్ని చదువుకోవడం ,వినిమయం చేసుకోవడం..అంతే.అంతకు మించి ఏమీ కాదు.అదే అల్టి మేట్, అదే గొప్ప అనే భ్రమ లో ఉన్నాం.
కాని మనిషి మెదడు అంతటి తో ఊరుకోదు.దానికి ఇంకా ఇంకా ఏదో కావాలి.దాని దాహం తీరదు.సమాజం విధించే కట్టుబాట్లు వల్ల కొన్నిమెదడులు మనకిక్కడితో చాల్లే అనుకుంటే ఇంకొన్ని దూర తీరాలకి చాలామందికి తెలియని తీరాల్ని అన్వేషించాలని అనుకుంటాయి. అక్కడే వస్తుంది చిక్కు.
ఇక్కడ నానా రకాల మార్గాలు తారసపడతాయి. ఆత్మ మార్గం తెలుసుకుంటే ,అక్కడికి చేరుకుంటే సకలం తెలుసుకున్నట్టే,మోక్షం పొందడానికి మాత్రమే దాన్ని సాధించడానికే ఈ మానవ జన్మ ఎత్తింది,మనిషి కి ఎదురయ్యే సకల అనుభవాలు ఆ వైపు కి మళ్ళడానికే అని భారతీయ తత్త్వ శాస్త్రాల సారం,సింపుల్ గా చెప్పాలంటే.
అయితే ఇది అనుకున్నత సింపుల్ గాదు.ఈ ఆత్మ సాక్షాత్కార మార్గం లో వెళుతున్నప్పుడు సాధకుని కి రకరకాల సిద్ధులు కలుగుతుంటాయి.లోక భాష లో చెప్పాలంటే అతీంద్రియ శక్తులు కలుగుతుంటాయి.దీనికి ఆకర్షింపబడి కొందరు ఇక్కడే నిలిచిపోతారు.సాటి మనుషుల మధ్య సూపర్ బీయింగ్ గా చలామణీ అవడం లోని మజా ని అనుభవిస్తూ ఇక్కడే ఉండిపోతారు. ఈ స్థితి ని అనేక మార్గాల ద్వారా సాధించవచ్చునని విజ్ఞులు అంటారు. అసలు గమ్యమైన ఆత్మ ని ఉద్ధరించుకునే పనిని కొన్ని జన్మలు అలా వాయిదా వేసుకుంటూంటారు.
ఇలాంటివాటికి లోబడని వారు తమ పనిని తాము నిశ్శబ్దం గా చేసుకొని,ఆ తర్వాత ఎందరో సాధకులకి మార్గదర్శనం చేస్తుంటారు.దీనికి పబ్లిసిటీలు పెద్ద గా ఉండవు.కనుక అక్కడ జరిగేది చాలామందికి తెలియదు.ఎందుకని అంటే అది మన కంటికి కనిపించే ప్రపంచం లో జరగవు. కంటికి కనిపించనిది ఏదీ లేదు,నమ్మనవసరం లేదు అంటారు భౌతికవాదులు.ఓ రకంగా అదీ నిజమే.ప్రతీదీ ఓ దశ. ఓ దశ దాటినతర్వాతనే మరో దశ లోకి దాటివస్తాడు మనిషి. --మొదట్లో చాలామంది లాగే నేను కూడా ఇది పరువు హత్య లాంటిదే అనుకున్నాను. కాని రోజుకి కొన్ని విషయాలు బయటకి వస్తున్న కొద్దీ దీనికి చాలా లోతు ఉందని అనిపిస్తున్నది.ఇంకా ముందు ముందు ఏమి తేలనున్నాయో ఊహించడం కూడా కష్టం. ఆ తేలేవన్నీ ఎలా బయట ప్రపంచం అర్ధం చేసుకుంటుందో అదీ చెప్పడం కష్టమే. ఇవన్నీ భౌతికం గా కనిపించే ప్లేన్ లో జరిగేవి కావు.కంటికి కనిపించే కోణం ఐస్ బెర్గ్ లో జస్ట్ టిప్ వంటిది మాత్రమే.
--- ఇంత విద్యాధికులై ఆ మాత్రం అవగాహన లేదా అనే వారికి చెప్పేదేమంటే మీరు వాళ్ళ State of mind లోకి వెళితే ఆ కోణం ఏమిటో తెలుస్తుంది. లేదా అక్కడ ఏమి జరిగే అవకాశం ఉందో నెమ్మెది గా సానుభూతి తో యోచిస్తే తెలుస్తుంది.
--- అదేం ఉంది,ఇదేం ఉంది ...అంతా ట్రాష్ అంటూ జడ్జ్మెంట్ ఇచ్చేవాళ్ళు ఇలాంటి వాటిల్లో ఏ మాత్రం అవగాహన లేనివాళ్ళు. అంత ఎందుకు ఎంతో కొంత సమయం తీసుకుని అలాంటి విద్యలు వచ్చిన వాళ్ళదగ్గరకి పోయి ఎటువైపు సైడ్ తీసుకోకుండా ఒక మాటు వాళ్ళ దృష్టి కోణం ని కూడా పరిశీలించండి. అప్పుడు ఏం జరుగుతుందో వాళ్ళ అనుభవం ఏమిటో చెపితే బాగుంటుంది. లేదా కొన్నాళ్ళు ఎక్స్పెరిమెంట్ చేస్తే అబద్ధమో నిజమో తేలిపోతుంది గదా.
---- అసలు దీనిలో ఇలాంటి విద్యల్లో ఏమైనా సరుకు ఉందా అని అనుమానం వచ్చే పాల్ బ్రంటన్ లాంటి వాళ్ళు కేవలం సొంత అభిప్రాయాలతో సరిపుచ్చుకోకుండా అనేకమంది అతీంద్రియ విద్యల్ని సాధన చేసిన వాళ్ళని కలిశాడు.వాళ్ళతో ఉన్నాడు.తన అభిప్రాయాల్ని రికార్డ్ చేశాడు ఎటువైపు ఎగతాళి చేసే టోన్ లో కాకుండా ఒక మధే మార్గాన్ని అనుసరించి రాశాడు.భారత దేశం లో నే కాదు,ఈజిప్ట్ ఇంకా ఇతర ఆసియా దేశాల్లో కూడా తిరిగాడు.
---అది ఒక పద్ధతి.కాని ఊరికే ఒడ్డున నిల్చుని అలా ఈదితే బాగుంటుంది అని సలహా ఇవ్వడం లో ఏమి ఉంటుంది. అంటే మీరు సైన్స్ కి వ్యతిరేకమా అంటారు కొందరు.అదేం వాదమో అర్ధమో కాదు.మనకి తెలియని దాన్ని సాధ్యమైనంత లోతుకి వెళ్ళి తెలుసుకోవాలి.లేదా నాకు దీని మీద అవగాహన లేదు అని చెప్పి ఊరుకోవాలి.కాని ఎక్కడ లేని సలహాలు ఇస్తుంటారు.
--- ఈ అనంతమైన సృష్టి లో మనకి తెలియనివి ఎన్నో ఉన్నాయి.కొన్ని మనకి పక్కనే ఉంటాయి కాని అవి పేలే వరకు వాటి స్వరూపం తెలియదు. ఇలాంటి సాధనలు ఈరోజున కొత్తగా రాలేదు.అందునా ఈ ఒక్క దేశం లోనే లేవు. ఎంతో అభివృద్ధి చెందిన యూరోపియన్ దేశాల్లోనూ ఉన్నాయి.కొన్ని సీక్రెట్ సంఘాలు గా ఉన్నాయి.కొన్ని బాహాటం గా ఉన్నాయి.రష్యా లో పేరా నార్మల్ యాక్టివిటీస్ మీద చాలా పరిశోధనలు జరిగాయి.
----అంతదాకా ఎందుకు మీరు కేరళ వెళ్ళండి.దీనికి సంబందించి ఇప్పటికీ మంచి జ్ఞానం ఉన్నవాళ్ళు ఉన్నారు.ప్రాక్టికల్ గా కూడా ..! ఫణిక్కర్ అనే ఇంటిపేరు వినే ఉంటారు. వీళ్ళు ఇలాంటి అక్కల్ట్ విద్యల్లో ఆరితేరిన వారు.ఇంకా కొంతమంది ఉన్నారు.
--- క్లాస్,మాస్ రెండూ ఉన్నాయి దీనిలో. ముఖ్యంగా వామాచారం (క్షుద్రం అంటూంటారు) ఇలాంటి మార్గాన్ని బ్రాహ్మణేతరులు ఎక్కువ గా ఫాలో అవుతుంటే ,కౌలాచారం అనేదాన్ని బ్రాహ్మణులు ఇంకా ఇతరులు ఫాలో అవుతుంటారు అని వువాచ.
---- ఇలాంటి ప్రయోగాలు,సాధనలు అన్నీ ప్రాంతాల్లోనూ ఉన్నాయి.అరబ్బు దేశాల్లోనూ ఉన్నాయి,అవి మన వద్దకి కూడా చేరుకున్నాయి.సర్ జాన్ ఉడ్రోఫ్ మీద ఓ ఆర్టికల్ రాసినపుడు హారున్-ఉల్-రషీద్ అనే యువకుడు నాకు ఫొన్ చేసి మాట్లాడాడు.నేర్చుకునే వాళ్ళు లేక ఇవన్ని క్షీణిస్తున్నాయని తన అయిదేళ్ళ కుమార్తె కి అనారోగ్యం వచ్చినపుడు ఎంతమంది డాక్టర్ల ని కలిసినా ప్రయోజనం లేకపోయిందని పాతబస్తీ లోని ఒక వృద్ధ మాంత్రికుడు ఏ విధంగా నయం చేసింది ఉద్వేగంగా తెలిపాడు.
---- ఏది ఏమైనా ప్రతి దాంట్లో ఉన్నట్లే దీనిలోనూ కొన్ని నకిలీలు ఉండవచ్చుగాక కాని బయటకి అగుపడని ఏదో శక్తులు ఉన్నట్లు అనిపిస్తుంటాయి.మనకి తెలిసినది చాలా తక్కువ.తెలుసుకోవలసింది ఎంతో.కొట్టి పారేయడం సులువు,దానికి ఎంతోమంది ఆమోదం కూడా పక్కనుంచి ఉంటుంది.ఒక్కసారి అనుభవం కి లోనైనవారు ఎంతమంది చెప్పినా హ్మ్ అన్నట్లు ఉండిపోతారు.ఏమి చెప్పాలో అర్ధం కాక.
---- పేరు చెప్పడం బాగుండదు కాని ,నేను ఒకసారి ఓ మిత్రుని తో ట్రెక్కింగ్ చేశాను.కొన్ని అంశాలు కూడా చర్చించాను. అవి ఏమిటంటే...తనకి అప్పుడప్పుడు ఒక చిన్న అమ్మాయి తన పక్కనే కనపడుతుందట.కనబడి ఏవోవో విషయాలు చెబుతూ ఉంటుందట,మొదట నేను నమ్మలేదు.రెట్టించి ఒకటికి రెండు సార్లు అడిగాను.ఆయన చాలా నిజాయితీ గా నే చెప్పాడు.సందేహం లేదు అనిపించింది. తను ఎయిర్ ఫోర్స్ లో పనిచేసే వాడు.మిలిటరి హాస్పిటల్ లో చూపించుకున్నాడు.సైకాలజిస్ట్ ల్ని, మెడికల్ కాలేజ్ ప్రొఫెసర్ ల్ని ఇంకా ఎంతోమందిని కలిశాడు.కొన్నాళ్ళు మామూలు గా ఉండి మళ్ళీ షరా మామూలే..!
ఇంకా విచిత్రం ఏమిటంటే అతను పరమ నాస్తికుడు.దేవుడిని అసలు నమ్మడు.
---- పాపం మానసిక వేదన చాలా పడుతున్నట్లు అర్ధం అయింది.ఇంకొకరు అయితే తప్పక సూసైడ్ చేసుకునేవారేమో.కాని సైనికుడు అవడం వల్ల ఓర్పు తో భరిస్తున్నట్లు ఉన్నది.ఎన్నో యుద్ధాల్లో ఫాల్గొన్న నెపోలియన్ ని ఒకసారి ప్రశ్నించారట...సైనికుడికి ఉండాల్సిన లక్షణం ఏమిటి అని...ముందుగా ఉండవలసింది Endurance (తట్టుకుని నిలబడటం) , ఆ తర్వాత ధైర్యం (Courage) అన్నాడుట.
---- ఏతావాతా చెప్పవచ్చేదేమంటే సరైన గురువులు,మార్గదర్శకులు లేకుండా క్షుద్ర విద్యల జోలికి పోరాదు.ముఖ్యంగా యూ ట్యూబుల్లో చూసి అసలు ఫాలో అవకూడదు. పరిణితి కలిగిన గురువులు ఎంతో దగ్గరగా ఉండే శిష్యుల తో తప్పా సామాన్య భక్తుల వద్ద ఇలాంటివి చర్చించరు. దానివెనుక చాలా ఆలోచన ఉంటుంది.మిగతాది ఇంకెప్పుడైనా....అంతం లేని టాపిక్ ఇది.
---మూర్తి కెవివిఎస్
No comments:
Post a Comment