Tuesday, August 6, 2024

మన దేవాలయాల్లో ఉన్న బంగారం అక్షరాల 22 వేల టన్నులు

 

మన దేవాలయాల్లో ఉన్న బంగారం అక్షరాల 22 వేల టన్నులు 

----------------------------------------------------------------------------------

తిరుపతి లేదా తిరువనంతపురం లేదా పూరి ఇలా ఎంతో ప్రసిద్ధి చెందిన పుణ్యక్షేత్రాలు అమేయమైన కనక,వజ్ర,వైఢూర్యాది సంపద తో ఈ రోజున ప్రజలందర్నీ అబ్బురపరుస్తున్నాయి. ఈ ఆలయాలన్నీ కొన్ని వందల ఏళ్ళ చరిత్ర కలిగినవి. పై మూడింటి గురించి చెప్పాలంటే వెయ్యి ఏళ్ళ క్రితమే వెలసి కాల పరీక్ష ని తట్టుకుని నిలబడినవి. వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ వారు 2016 లో వేసిన అంచనా ప్రకారం భారత దేశం లో గల మొత్తం ఆలయాల్లో రమారమి 22,000 టన్నుల బంగారం ఉన్నది. ఇతర విలువైన వజ్రాలు,వైఢుర్యాలు,పచ్చలు,గోమేధిక,పుష్యరాగాలు ఇంకా పురా వస్తు సంపద ని లెక్కగడితే అది ఎక్కడికి వెళ్ళి ఆగుతుందో చెప్పలేము.

ఇంత విలువైన సంపద ని దేవాలయాల్లో ఎందుకు భద్రపరిచారు పూర్వికులు అని ప్రశ్నించుకుంటే అనేక విషయాలు తెలుస్తాయి. ఉదాహరణకి తిరువనంతపురం లోని అనంత పద్మనాభ స్వామి వారి దేవాలయ నేలమాళిగల్లో దాచిన సంపద అంతా ఆనాటి ట్రావెంకూర్ రాజవంశీకులు తమకి విదేశీ వ్యాపారం ద్వారానూ పన్నుల ద్వారానూ ఇంకా ఇతరత్రా పద్ధతుల ద్వారా చేకూరినదే. ఆనాడు గుళ్ళు అనేవి కేవలం ఆధ్యాత్మిక కేంద్రాలు మాత్రమే గాక సామాజిక,విద్యా కేంద్రాలు కూడా!అక్కడ చర్చలు జరిగేవి.విద్య గరపబడేది. వివిధ సాంఘిక కార్యకలాపాలు చోటు చేసుకునేవి. అందుకే ప్రాచీన ఆలయాలు వేటిని పరిశీలించినా చాలా విశాలమైన స్థలం లో నిర్మించబడినట్లు అర్థమవుతాయి.

తిరుపతి స్వామి విషయానికి వస్తే 7,000 ఎకరాల భూమి దేశం లోని వివిధ రాష్ట్రాల్లో ఉండగా, 16000 కోట్ల రూపాయల నగదు బ్యాంక్ డిపాజిట్లు ఉన్నాయి.ఇవి గాక ఇతర మొత్తం ప్రోపర్టీ ని     లెక్కిస్తే 2.26 వేల కోట్ల రూపాయలని తేలింది. అయితే బంగారం,వజ్రాలు ఇంకా ఇతర విలువైన సంపద అది వేరేగా చెప్పాలి. అనంత పద్మనాభ స్వామి వారి నేల మాళిగలు తెరిచేవరకు మన ఏడుకొండల స్వామి యే సంపద లో నెంబర్ వన్ గా ఉండేవారు. వైష్ణోదేవి,సిద్ధివినాయక స్వామి (ముంబాయి),షిర్డీ సాయిబాబా,గురువాయూర్ , పూరి జగన్నాధ స్వామి,సోమనాధ ఆలయాలు దేశం లోని ధనిక ఆధ్యాత్మిక కేంద్రాల్లో కొన్ని. ఇవి గాక ఇంకా చాలా ఉన్నాయి.

దేవాలయాలకి నాటి పాలకులు విరాళాలు ఇచ్చినపుడు తప్పనిసరిగా వాటికి సంబంధించిన శాసనాలు వేయించేవారు.అలాగే ఇతర రాజులు ఆలయాన్ని సందర్శించినపుడు వారికి విలువైన కానుకలు ఇచ్చేవారు. ప్రాచీన తమిళ కావ్యం శిలప్పదిగారం లో చేర రాజు సెంగొట్టయన్ కి అనంత పద్మనాభ స్వామి ఆలయం లో  బంగారు కానుకలు ఇచ్చిన వైనాన్ని ప్రస్తావించారు. హైందవేతరుల్ని తిరువనంతపురం,పూరి వంటి ఆలయాల్లోకి అనుమతించకపోవడం అనేది కొన్ని వందల ఏళ్ళ నుంచి ఉన్నది.బహుశా దాని వెనుక ఉద్దేశ్యం సంపద ఉండే ప్రదేశాలు ఇతరులకు తెలియకూడదని కావచ్చును. ఇటీవల పూరీ క్షేత్రం లో జగన్నాథుని రత్నభండార్ ని 46 ఏళ్ళ తర్వాత మళ్ళీ తెరిచిన వైనాన్ని చూశాము. బంగారం విషయం లో మన అనంత పద్మనాభ స్వామి, తిరుపతి స్వామి అంత స్థాయి లో లేకపోయినా జగన్నాథుని ఆలయానికి 30,000 ఎకరాల స్థలం ఉన్నది.  

----- మూర్తి కెవివిఎస్ (చరవాణి : 78935 41003)  


(Printed in Aruna prabha daily on 6-8-2024)

No comments:

Post a Comment