Wednesday, August 15, 2018

ఒడిశా రాష్ట్రం లోని బరంపురం లో...


ఈ నెల 12 వ తేదీన అనగా గత ఆదివారం ఒడిశా రాష్ట్రం లోని  బరంపురం లో ఉప్పల లక్ష్మణ రావు గారి స్మారకోపన్యాసక సభ లో పాల్గొనే అవకాశం కలిగింది.సరే ఆ పట్టణాన్ని ఇప్పుడు బెర్హం పూర్ అని బ్రహ్మపూర్ అని వ్యవహరిస్తున్నారు.నేను వెళ్ళేసరికి ముఖ్య అతిథి కె.ఎస్.మల్లీశ్వరి గారిని విజయ చంద్ర గారు,మండపాక కామేశ్వర రావు గారు ఇంకా సభికులు అడుగుచున్న సాహిత్య పరమైన ప్రశ్నలు,వాటికి ఆమె యొక్క జవాబులు ..ఆ కార్యక్రమం జరుగుతోంది.ఈ కార్యక్రమాన్ని "వికాసం" సంస్థ వారు ఆంధ్ర భాషాభివర్దినీ పఠనాగారం లో నిర్వహించారు.
ఈ తెలుగు వారి భవనం  చాలా చరిత్ర గలది.ఒక చరిత్ర లోకి అడుగు పెట్టినట్లుగా ఉంటుంది లోపలకి వెళ్ళగానే.అది అనుభవించవలసిందే గాని చెప్పేది కాదు.సమధికోత్సాహం తో అనేక కార్యక్రమాలు ఇన్నాళ్ళనుంచి నిర్వహిస్తూ వస్తోన్న నిర్వాహకులను అభినందించవలసిందే.అసలు ఈ బరంపురం మొత్తం రెండు రకాలు గా ఉన్నదని చెప్పాలి.ఎక్కడ చూసిన 1909 లోనో..1925 లోనో ఇంకా పాతవి గానో ఉన్న భవనాలు చాలా కనిపిస్తాయి.ఇదే రోజున ప్రకాష్ జవదేకర్ గారి ప్రోగ్రాం ఉన్నందువల్ల రద్దీ గా ఉండే పూర్ణా బస్ స్టాండ్ లో అతి కష్టం మీద రూం దొరికింది.

అప్పటికీ విజయ చంద్ర గారు తమ ఇంటి కి రమ్మన్నారు.కానీ వారికి ఇబ్బంది కలిగించిన వాడినవుతానని వెళ్ళలేదు.దానికి ప్రతిఫలం ఇది.ఇదనే కాదు నేను ఎక్కడ ఎవరి ఆతిథ్యం ని పొరబాటున వద్దన్నా ఆ తర్వాత కొన్ని ఇబ్బందులు ఎదురవడం నా జాతకం లో ఓ భాగం.దీన్ని మరీ సీరియస్ గా తీసుకోకండి.

సరే..ఆ రోజు సాయంత్రం జరిగిన కార్యక్రమానికి శ్రోతలు బాగా నే విచ్చేశారు.మల్లీశ్వరి గారు రచయిత్రుల కృషి గురించి...ప్రాచీన కాలం నుంచి వారి పట్ల జరిగిన వివక్షాపూరిత విధానాల గురించి ఇలా వివిధ విషయాలు మాట్లాడారు.తడుముకోకుండా ,ఆవేశపడకుండా ,నిబ్బరం గా ఆమె మాట్లాడిన ధోరణి బాగా అనిపించింది.కొంతమంది మిత్రులు సేతుపతి ఆదినారాయణ గారి వంటి వారు  కొత్త గా పరిచయం అయినారు.వీరి గురించి విజయ చంద్ర గారు గతం లో తన పోస్ట్ లో రాసినప్పుడు చదివాను.

ఆ రాత్రి విజయ చంద్ర గారు,వారి ఇంటిలోని ఆతిథ్యానికి సర్వదా కృతజ్ఞతలు.ఉప్పల లక్ష్మణ రావు గారి కృషి ని వివరించే విధంగా వికీపిడియా ని గాని బ్లాగ్ ని గాని నిర్మించితే బాగుంటుంది.లక్ష్మణ రావు గారు తిరుగాడిన నేల లో నడవాలనే నా కోరిక తీరింది.అనువాదకులు ఎన్నో విషయాలు వారి అనువాద రచనల నుంచి నేర్చుకోవచ్చు.జమీల్యా,తొలి ఉపాధ్యాయుడు ఇంకా తల్లీ భూదేవి ఇలాటి తెలుగు అనువాదాలు చదివిన పిమ్మట నేను వాటి ఆంగ్ల వెర్షన్లను కూడా చదివాను.అద్భుతం అనిపించింది.ఒక్క పదాన్ని కూడా ఇంకో లా మార్చలేం.అంత అనుభూతి తో ఆయన చేశారు.సరి అయిన పదాన్ని ఒక తూకం తో వాడతారు.దాని గురించి నా వ్యాస సంపుటి మూర్తీస్ మ్యూజింగ్స్ లో ప్రత్యేకంగా రాశాను.
Tail piece : నా ప్రయాణం లో చూసిన ఒక సన్నివేశం ఇక్కడ చెప్పవలసిందే.రైలు కోసం ఆ స్టేషన్ లో ఎదురు చూస్తూ సిమెంట్ బెంచ్ మీద కూర్చొని ఉన్నాను.అప్పుడే ఏదో రైలు ఆగింది.జనాలు చాలామంది దిగి నడుచుకుంటూ వెళుతున్నారు.ఒక యాభ పైన వయసున్న వ్యక్తి భక్తుడి మాదిరి గా దుస్తులు ధరించి ఉన్నాడు.అతడిని ఉన్నట్టుండి అక్కడికి ఉరుక్కుంటూ వచ్చిన సన్నగా ఉన్న ఒక అమ్మాయి ..టప టప మని కొడుతున్నది ఆవేశం గా.అతనూ కొన్ని ఈ అమ్మాయిని కొన్ని దెబ్బలు వేసి దూరం గా పారిపోయాడు.ఏమిటా ..అని ఎదురు చూస్తున్నా ...అంతలోనే రైల్వే పోలీస్లు కొంతమంది జనాలూ మూగారు.రైలు లో కూర్చున్నప్పుడు వాడు ఇక్కడ చెయ్యి వేసి తడుముతున్నాడు అని ఆ అమ్మాయి ఆవేశం గా చెబుతోంది ఒడియా లో.సుభాష్ చంద్ర పట్నాయక్ అనే ఓ జర్నలిస్ట్ అన్నట్టు సగటు ఒరియా మనిషి కి లౌక్యం ,బేరీజు వేసి కొట్టడం అనేది తెలియదు.ఏది వచ్చినా తరువాత...ముందు ప్రతిఘటించడమే తెలుసును తనకి ఏ నష్టం జరిగినా తర్వాత..!

No comments:

Post a Comment