Thursday, July 1, 2021

ద వర్జిన్ అండ్ ద జిప్సీ (తెలుగు అనువాదం)-POST NO:35

 ఆంగ్ల మూలం: డిహెచ్.లారెన్స్

తెలుగుసేత : మూర్తి కెవివిఎస్


ఆ శూన్యాన్ని ఛేదించడం అంత తేలిక అనిపించలేదు. చివర కి ఆమె రెక్టార్ వైపు చూసింది.తండ్రి పట్ల తనకే అర్ధం కాని ఓ అయిష్టత.అతనికి అది మెడ చుట్టూ బిగిసిన చట్రం లా ఉంది.


"అంటే ఈస్ట్ వుడ్ వాళ్ళ గురించి నీకెందుకు అనా మీ ఉద్దేశ్యం?" అడిగిందామె.


"నీకు కావాలంటే అక్కడికి వెళ్ళవచ్చు. అయితే నువు నాయనమ్మ తో గాని,సిస్సీ ఆంటీ తో గాని,లూసీ తో గానీ కలవకూడదు. నీ మూలంగా వాళ్ళకి చెడు పేరు రాకూడదు. మీ నాయనమ్మ మంచి భార్య,తల్లీ కూడా..! ఇప్పటికే ఆమె కి ఓ అవమానం జరిగింది.మళ్ళీ ఇంకొకటా..?" అన్నాడతను.


Yvette వినీ విననట్లు గా వున్నది.


"సరే...ఆ ఈస్ట్ వుడ్ వాళ్ళకి ఓ ఉత్తరం పంపిస్తాను,నేను వారి తో సన్నిహితం గా ఉండడం నీకు ఇష్టం లేది" అంది Yvette.  

" సరే...నీ యిష్టం. ఒకటి జ్ఞాపకం ఉంచుకో. ఇవతల నాయనమ్మ లాంటి మంచివాళ్ళు ఉంటారు.అవతల అలాంటి వాళ్ళూ ఉంటారు.ఎవరు కావాలి అనేది ఎన్నుకోవడం నేర్చుకో.."


మళ్ళీ కాసేపు నిశ్శబ్దం. ఆమె తండ్రి వేపు చూసింది. ఆమె కి కలవరం కలిగినట్లయింది.ఎక్కడో ఆమె లో ఉన్న స్వేఛ్చా విహంగానికి ఇవన్నీ కంపరం పుట్టిస్తున్నాయి. ఆమె బయటకి ప్రశాంతం గా ఉన్నా,లోపల మాత్రం ఏదో కలత గా ఉంది. 

" సరే... మీ అసమ్మతి ని వాళ్ళకి రాస్తాను.." అన్నదామె. అతను జవాబివ్వలేదు. తను విజయం సాధించినట్లు గాదీని ఫీలయ్యాడు రెక్టార్.


"సరే...నాయనమ్మ కి,సిస్సీ ఆంటీ కి ఈ విషయం చెప్పకుండా ఉండేందుకు ప్రయత్నిస్తాను.ఇది అందరకీ తెలియవలసిన అవసరం లేదు. నీ పనికిరాని స్నేహాలూ ...అవీనూ.." అన్నాడు.


కాసేపు భయంకరమైన నిశ్శబ్దం.


"సరే...నేను వెళ్ళి ఆ ఉత్తరం రాస్తాను." అందామె.


మెల్లగా ఆమె గది బయటకి వెళ్ళిపోయింది. " ప్రియమైన మిసెస్ ఈస్ట్ వుడ్ ...మీ ఇంటికి నేను రావడం మా నాన్నగారికి ఇష్టం లేదు. క్షమించి,అర్ధం చేసుకోగలరు" అంటూ Yvette ఉత్తరం రాసి దాన్ని ఆ రోజే పోస్ట్ చేసింది. 

ఆమె లోని భావాలు ఆమెకే భయం కలిగించసాగాయి. నాజుకు గా ఉండే ఆ జిప్సీ ఎద పై వాలిపోవాలని తోచింది.అతను తన చెయ్యి ఒక మారు పట్టుకుంటే బాగుండునని అనిపించింది. నీ తండ్రి చెప్పింది తప్పు అని తను చెబితే ఎంత బాగుంటుంది.


భయం తో నీరస పడిన ఆమె కి నడవాలన్నా ఓపిక లేకుండా పోయింది.నడిస్తే కాలికి దెబ్బ తగులుతుందేమో అన్నట్లు అనిపించింది.ఏదో బురద గుంటలో దిగినట్లుగా,మోకాళ్ళ లో బలహీనత తోచింది. ప్రతివారు తనని ద్వేషించుతున్నట్లు ఫీలయ్యింది.


చివరకి ఎలాగో సర్దుకుంది.ఇంట్లో తనని పోషించేవారితో పనికిమాలిన గొడవలెందుకు అనిపించింది.జీవితం నుంచి ఏదో గొప్ప గా పిండుకోవాలనేది కూడా అంత పరిణితి గల ఆలోచన కాదు. తప్పదు...పై పై హంగుల కోసమైనా కొన్ని చేయక తప్పదు మరి.


(సశేషం)   

No comments:

Post a Comment