ఒరియా మూలం: గౌరహరి దాస్
తెలుగుసేత : మూర్తి కెవివిఎస్
* * *
"ఏం భయపడకు,హాస్టల్ నుంచి వచ్చేటప్పుడు తెల్లటి గద్ద ఒకటి కనబడింది.అది మంచి శకునం.ప్రతిదానికి ఆలోచిస్తే ఈ ప్రపంచం లో ఏ పనీ చేయలేవు." లిటూ అన్నాడు పొలిటీషియన్ లా.
నందా,బగులీ,అలువా ముగ్గురూ లిటూ మొహం లోకి చూశారు.చెట్లు ఎక్కడం,తూనీగలు పట్టడం తప్పా దేంట్లోనూ ముందు ఉండని అలువా కి ఆ ఆలోచన అంతగా రుచించలేదు.
"ఇదేదో తలనొప్పి వ్యవహారం లా ఉంది" అన్నాడతను.
"నీకు తూనీగలు పట్టడం తప్పా ఏదీ చేత కాదు.ఇదిగో నే చెప్తున్నా...లిటూ చెప్పినట్లు చేస్తున్నాం ...అంతే !" అన్నాడు బగులీ బెదిరిస్తున్నట్లుగా.
నందా,అలువా ఏదో గొణిగారు తప్పా మారు మాటాడలేదు.
"ఇదిగో...ఈ డబ్బులన్నీ అడ్వాన్స్ గా ఉపయోగిద్దాం.మిగతావి కావాల్సిన సామాన్లు రాగానే సర్దుదాం,సరేనా ..." అన్నాడు లిటూ అయిదురూపాయల్ని తన జేబులో నుంచి తీస్తూ..!
"మరి ఎక్కడ వండేది..?" ప్రశ్నించాడు నందా.లిటూ కాసేపు పైకి చూశాడు.ఇది సమస్యే మరి.ఇదివరకు చేసుకున్న విందులన్నీ మామూలివి.బియ్యం,పప్పు,ఆలూ లాంటివి ఉపయోగించి చేసుకున్నవి.ఇంకా మహా అయితే చేపలు,బాయిల్డ్ ఎగ్స్...వాటిని ఎలాగో మేనేజ్ చేసేవాళ్ళు.ప్రస్తుతం వీళ్ళ ఆలోచన చికెన్ వండాలని..!
"లిటూ,మీ ఇంట్లో బియ్యం పెట్టుకునే రూం ఉంది గదా.పరీక్షలు దగ్గరకొస్తున్నాయి,చదువుకోవడానికి దాని తాళాలు ఇమ్మని మీ అమ్మని అడగరాదూ...లాంతరు కూడా సంపాదిస్తే రాత్రంతా అక్కడ చదువుకోవచ్చు" బగులీ ఇచ్చిన ఈ ఐడియా లిటూ కి నచ్చింది.
భలే బుర్ర వీడిది అనుకున్నాడు.చదువుకోడానికి అని చెప్తే వాళ్ళమ్మ పూజగది తాళాలు కూడా ఇస్తుంది.బియ్యం పెట్టే గదేం ఖర్మ..!
"ఎప్పుడూ అన్నం,పప్పు వీటితో మొహం మొత్తేసింది.చికెన్ వండుదాం ఈసారి.అది పెద్ద పనేం కాదు.మా నాన్న తో కటక్ వెళ్ళినప్పుడు వండే పద్ధతి చూశాను.చాలా ఈజీ..!" అన్నాడు బగులీ.
"బగులీ వాళ్ళు వైష్ణవ కుటుంబానికి చెందిన వారు కాదు. కాబట్టి చికెన్ వండటం,తినడం తనకి పెద్ద విషయమేమి కాదు.చాలా సహజం అది.కాని మా పెద్దవాళ్ళ కి తెలిస్తే కోప్పడతారు.ఇప్పుడు చికెన్ అదీ ఎందుకు లే,చేపల కూర ట్రై చేద్దాం..." అన్నాడు అలువా.లిటూ ని దారి మళ్ళించడానికి.
"ఎవరూ కనిపెట్టలేరు,నన్ను నమ్మండి. తెలివి...తెలివి గా వ్యవహరించాలి బాబూ...నేను చేస్తాగా జరిగేట్లు గా...చూస్తూండండి" లిటూ అభయమిచ్చాడు.
ఆ రోజంతా హడావిడి. బెహరా వాళ్ళ ముసలామె దగ్గరకెళ్ళి కోడిని బేరం చేసే డ్యూటీ ని అలువా కి ఒప్పజెప్పారు.ఎట్లానో పొద్దున పూట ఆ పని కానిస్తాలే అన్నాడు.కాని కొద్దిగా భయం వేసింది.లిటూ గాడు హాస్టల్ కి వెళ్ళిపోతాడు.బగూలీ కి ఏ సమస్యా లేదు. నేను కనక దొరికితే ఎలా అనుకున్నాడు తనలోనే.
నందా ని అడిగితే నో అన్నాడు. "చేప అయితే చచ్చి అలా పడి ఉంటుంది,కోడి ఒకటే అరుస్తుంది క్కో క్కో అంటూ.నా వల్ల కాదు,నన్ను మినహాయించినా ఫరవాలేదు " అని తప్పించుకున్నాడు.
బగులీ వాళ్ళిద్దర్నీ ఎలాగో సముదాయించాడు.సర్లెమ్మని భారం అంతా తన మీద వేసుకున్నాడు.అలా రోడ్ మీదు గా వెళుతున్నప్పుడు బెహరా వాళ్ళ ముసలమ్మ దగ్గర కోడిని బేరం చేశాడు. చీకటి పడుతుండగా,వాగు పక్కనున్న పొదల చాటుకు వెళ్ళి కోడిని కోసి,బూరు పీకడం చేసి పారేశాడు.ఆ ప్రాంతం లోకి నరమానవుడు రాడు అని అక్కడ కానిచ్చాడు.
"మా అమ్మ తాళాలు ఇచ్చేటప్పుడు చాలా జాగ్రత్తలు చెప్పింది.కింద ఆరబోసిన బియ్యం దైవ కార్యాలకి ఉపయోగించేవి. ఒకవేళ అన్నం,పప్పు లాంటివి వండినా రూం అంతా చికాకు చెయ్యకుండా ఓ మూలకి చేసుకొండి.నాన్ వెజ్ మాత్రం ఎట్టిపరిస్థితుల్లో తేవద్దని చెప్పింది" అన్నాడు లిటూ.
"నేను మొత్తం క్లీన్ చేస్తాను, మీ అమ్మ గారు ఎంతమాత్రం గుర్తుపట్టలేరు..." బగులీ సముదాయించాడు.
నందా వెళ్ళి మూడు రాళ్ళు తెచ్చి పొయ్యి లా పేర్చాడు.లాంతర్ వెలుగు లో చికెన్ కూర ఉడకసాగింది.ఎంతదాకా అయిందో చూద్దామని లాంతర్ పైకెత్తి చూడసాగాడు.ఆత్రుత గా లిటూ ముందు కి వచ్చాడు.
"ప్చ్...జాగ్రత్త.ఒక్క కిరోసిన్ చుక్క పడినా కూర అంతా పాడవుతుంది..." బగులీ హెచ్చరించాడు.
"చూశావా...ఎవరూ కనిపెట్టలేదు.అప్పుడప్పుడు మనం ఇలా చికెన్ తో విందు చేసుకుంటూండాలి..." మళ్ళీ తనే అన్నాడు.
ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా,అయితే ఆ తెల్లారే వాళ్ళ బాగోతం ఒకాయనకి తెలిసిపోతుందని లిటూ అసలు ఊహించలేదు. చెరువు దగ్గర నుంచి వస్తూండగా ఒక మనిషి అడ్డం గా నిలబడ్డాడు...తనని అటకాయిస్తున్నట్లుగా..!అతని పేరు నటదాది.
"ఏం...ఎన్నిరోజులనుంచి సాగుతోంది ఈ వ్యవహారం..?" అన్నాడు తను.లిటూ గుండె పై సుత్తి తో కొట్టినట్లయింది.గుటకలు మింగసాగాడు.
"ఏం మాట్లాడుతున్నావు నువ్వు..?" ప్రశ్నించాడు లిటూ.
"అదే...చికెన్ కర్రీ గురించి...ఇంకా ఏమిటని" జవాబిచ్చాడు నటదాది.
"ఏం చికెన్" బుకాయించాడు లిటూ.
"ఆ బగులీ కొనుకొచ్చాడే బెహరా వాళ్ళ ఇంటి నుంచి ...ఆ సంగతి నాకు తెలియదని అనుకుంటున్నావా..? నా కంతా తెలుసు,చికెన్ ని ఎంతకి కొన్నారు ...ఆరు రూపాయలకి...నూనె,మసాలా కాశీ కొట్టు దగ్గర కొన్నారు. కోడి ని కోసి బూరు పీకింది వాగు పక్క పొదల్లో,మసాలా నూరింది నందా,వాళ్ళ ఇంటి దగ్గరనుంచి కూడా కొంత తీసుకొచ్చాడనుకో,పరీక్షలకి చదువుకుంటామని రూం తాళాల్ని మీ అమ్మ దగ్గర నుంచి తీసుకున్నావు,చూస్తూండు..ఇదంతా గ్రామ పెద్దల ముందు పెడతా...అసలు వైష్ణవ కుటుంబాలు ఉండే కాలనీ యేనా ఇది,ఏ మాత్రం భయం భక్తి లేకుండా పోతున్నది" సీరియస్ గా అన్నాడు నటదాది.
ఓ దేవుడా..! ఈ మనిషి కి సర్వమూతెలిసినట్టుందే..!
అంత రాత్రి లోనూ చూశాడా..? రాత్రంతా తిరిగాడా ఇదంతా కనిపెట్టడానికి..!
లేకపోతే తమ లోనే ఎవరైనా ఉప్పందించారా..? లిటూ అటూ ఇటూ చూశాడు ఎవరైనా వింటున్నారా అని. సిగ్గు,అవమానం చుట్టుముట్టాయి.గట్టిగా అరవాలనిపించింది.అరచేతులు చెమట పట్టాయి.ఒకటే భయం.గబగబా నటదాది ని తప్పించుకుని దౌడు తీశాడు.అక్కడుంటే నటదాది కొట్టినా కొడతాడు.
జతగాళ్ళు నందా,అలువా,బగులీ ల తో చెప్పకుండానే హాస్టల్ కి వెళ్ళిపోయాడు లిటూ..!ఇంకా సెలవులు ఉన్నాయి గదరా అని వాళ్ళ అమ్మ అన్నా వినకుండా వెళ్ళిపోయాడు.ఎటూ అర్థం కాలేదు ఆమెకి.తమ వైష్ణవ కుటుంబాల్లో చికెన్ తినడం అనేది మహా పాపం.తండ్రికి గాని ఈ సంగతి తెలిసిందో చెమడాలు తీయడం ఖాయం.
లిటూ, ఈసారి దసరా సెలవులు గురించి పెద్దగా పట్టించుకోలేదు.గత కొన్ని నెలలుగా నటదాది గురించి ఆలోచించడమే సరిపోయింది.ఈ పాటికి ఆ రహస్యాన్ని నటదాది తమ గ్రామం లో అందరికీ చెప్పే ఉంటాడు.చదువు లోనూ,ఆటపాటల్లోనూ,పురాణ పఠనం లోనూ లిటూ కి గల ప్రత్యేక నైపుణ్యం వల్ల ఊళ్ళో అందరూ తనని ఎంతో మెచ్చుకుంటూంటారు.ఈ నటదాది వల్ల అదంతా పోయినట్లేనా..?అంతా అవమానమేనా..?తల్లిదండ్రులు తన వల్ల తలవంచుకుంటారు.
ఒక వైష్ణవ కుటుంబం లో పెద్ద కొడుకు గా పుట్టి చికెన్ తింటావా...ఎంత అవమానం...అంటూ నాన్న తిడతాడు.మార్కెట్ లో నడుస్తూన్న లిటూ కి అడుగులు భారం గా పడుతున్నాయి.వాళ్ళ నాన్న కోపం ఎలా ఉంటుందో తనకి బాగా తెలుసు.బయట వాళ్ళు ఏది చెప్పినా వెంటనే నమ్మేస్తాడు.ఆ విషయం లో బగులీ వాళ్ళ నాన్న నయం.అసలు చెయ్యెత్తడు,ఏదైనా ఉంటే నోటి తో చెబుతాడు,అంతే..!
పైకి ఆకాశం లోకి చూస్తే బాగా బూడిదరంగు లో ఉన్న ఓ గద్ద చెరువు మీద గిరికీలు కొడుతూ కనిపించింది.అడుగులు త్వరత్వరగా వేశాడు. నటదాది,నటదాది...అతన్ని తల్చుకుంటేనే కోపం వస్తోంది.అతని గొప్పేమిటట..?ప్రతి ఒక్కరు అతని మాటను ఎందుకు నమ్మేయాలి..?తను ఏమైనా దేవదూత నా..?అయినా రాత్రిపూట తాము ఏదో రహస్యం గా చికెన్ తింటే అతగాడు కనిపెట్టడం ఏమిటి..?
తనకి ఏమైనా కావాలీ...అపుడు చెబుతాడు,నటదాది కి కూడా పూయవలసినంత మసి పూసి వదిలిపెడతాడు.ఎంతసేపు ఎదుటి వాళ్ళ లోపాలు వెతకడం కాదు,ఎవరివి వాళ్ళు కూడా చూసుకోవాలి.నటదాది చేసిన తప్పులు ఏమున్నాయా అని ఆలోచించసాగాడు లిటూ.అతగాడు ఎప్పుడూ గంజాయి తాగుతుంటాడు.ఇంట్లో ఎవరూ లేని ఒంటిగాడు.ఎప్పుడు తలుపులు మూసుకుని ఇంట్లో చేసే పని ఏమిటి..?నటదాది అనబడే ఈ నటబర్ దాస్ కి చుట్టుప్రక్కల గ్రామాల్లో నికార్సయిన వైష్ణవుని గా పేరుంది.అష్టప్రహరి సంకీర్తన కార్యక్రమాల్లో ఫాల్గొనటానికి అతనికి ఆహ్వానం వస్తూంటుంది.అయితే ఒకటి అతని స్వరం మంచి వినసొంపు గా ఉంటుంది.
"భజ నితాయ్ గౌర్ రాధే శ్యాం,జప హరే కృష్ణ హరేరాం" అని ద్విపద ని మార్చి మార్చి నూట ఎనిమిది రకాలుగా పాడగలడు.కనకనే అతనికంత డిమాండ్ ఉంది.భజనలు చేస్తున్నపుడు నటదాది కళ్ళలోనుంచి భక్తి పారవశ్యం తో నీళ్ళు చిప్పిల్లుతాయి. అతని కంఠం రుద్ధమవుతుంది.ఒక్కోసారి పావననామాన్ని జపిస్తూ నిశ్శబ్ద లోకాల్లో ఉండిపోతాడు,నోరు తెరిచి..!ఆకాశం వేపు చేతులు లేపుతాడు కౌగిలిస్తున్నట్లు,దివ్యమంగళరూపాన్ని చూస్తూ అతని కళ్ళు అశ్రుమయమవుతాయి.
లిటూ,అతని మిత్రులు ఈ తతంగాన్ని చూస్తూ.."నటదాది ఎలా నటిస్తున్నాడో చూడు" అంటుంటారు.ముఖ్యం గా బగులీ.అతను కటక్ సినిమా హాళ్ళ లో ఇలాంటి సినిమాలు ఎన్నో చూస్తుంటాడు.ఏదైమనా జనాల్ని నటదాది తన గానం తో అలా మైమరిపిస్తుంటాడు.
ఇంత వయసున్న ఈ మనిషి భజనలు మరీ ఇలా చేయాలా అనిపిస్తుంది లిటు కి.భజనలు కంటే నగర సంకీర్తన,ఉట్టిపగలకొట్టే కార్యక్రమాలు లిటూ కి బాగా నచ్చుతాయి.నగర సంకీర్తన చేసేటప్పుడు ఆ గుంపు కి ముందు భాగం లో నటదాది ఉంటాడు.లిటూ,నందా,బగులీ లాంటి వాళ్ళు ఓ పక్కన నడుస్తుంటారు.చివరి లో పెరుగు పాత్ర ని పగలగొట్టి దాంట్లో నీళ్ళు కలిపి అక్కడ నేల మీద జల్లుతారు.ఆ మట్టిలో బురద బురద గా పొర్లడం ఆ కార్యక్రమం లిటూ కి బాగా ఇష్టం.
ఇపుడు తమ గ్రామం కళ్ళముందు కదిలింది.లిటూ లో ధైర్యం పెరిగింది. నటదాది కి తాను భయపడేదేమిటి..?అయినా తనతో పాటు చికెన్ తిన్నవాళ్ళలో మిగతావాళ్ళూ ఉన్నారుగదా..!అదీ ఆ విందు జరిగి చాలా నాళ్ళయింది.మరీ ఆ విషయమంత పాపమయితే ఊళ్ళో ఎవరో ఒకరు చనిపోవాలిగదా..!అలాంటిది ఏమీ జరగలేదు. నటదాది కనక తనని బెదిరిస్తే ,తను తక్కువ తిన్నాడా..?
"అర్ధరాత్రుళ్ళు ..ఊళ్ళో బయట ఎందుకు తిరుగుతున్నావ్"అని తను మాత్రం తిరిగి అడగడా..?తప్పక అడుగుతాడు.తన ఆలోచన తనకే గొప్పగా అనిపించి భుజం చరుచుకున్నాడు.ఇపుడు కొద్దిగా హాయిగా తోచింది.చుట్టుపక్కల చూశాడు.కొత్తగా తవ్విన చెరువు పక్కన పశువులు మేస్తున్నాయి.వరిపొలాల మీదుగా చల్లని గాలి వీస్తోంది.కొంగ ఒకటి ఒంటి కాలి మీద నిలబడి ఉంది,కెనాల్ చివరన..!అది కింద పారే నీళ్ళ ని చూస్తున్నది.చంద్రశెఖర్ మహదేవ్ మందిరం ఇపుడు కనిపిస్తోంది.
No comments:
Post a Comment