ఊర్మిళ (అనువాద కథ)
ఒరియా మూలం :గౌరహరి దాస్
తెలుగుసేత : మూర్తి కెవివిఎస్
నాకు అవకాశం వచ్చినప్పుడల్లా దేవుడిని ఒకటే కోరుకునేవాణ్ణి. మా క్లాస్ లో ఉండే ఊర్మిళ త్వరగా పైకి టపా కట్టేయ్యాలి లేదా పరీక్ష ఫేలయ్యి ,ఈ స్కూల్ నుంచి వెళ్ళిపోవాలి.అలాంటిది ఏదో జరగాలి.అదే నేనెప్పుడు కోరుకునేవాడిని.
అలాంటి దుష్ట ఆలోచనలు ఉన్నందుకు నాకేమీ పశ్చాతాపం లేదు. నేనెన్ని శాపనార్థాలు పెట్టినా అవి ఆమెకి తగిలితే గదా..! ఏమీలేదు.అదే గందరగోళం గా ఉండేది. ఒకసారి నా స్నేహితుడు పద్మలోచన్ ఇచ్చిన సలహా బాగా నచ్చి,సీరియస్ గా దాని గురించి ఆలోచించాను.మహాలిక్ అనే గ్రామం లో ఓ మంత్రగాడు ఉన్నాడట,తన మంత్రాలతో ఎలాంటివాళ్ళనైనా వశపరుచుకుంటాడట.అతగాడిని సంప్రదించి ఊర్మిళ కి చేతబడి చేయించాలని ఆలోచించాను.అప్పుడు తను నేను చెప్పినట్లు వినవలసిందేగా..!
పద్మలోచన్ ఇచ్చిన సలహా బాగానే ఉన్నా కొద్దిగా భయం కూడా వేసింది.పని కావాలంటే స్మశానం దగ్గరున్న అతని నివాసం దగ్గరకి పోవాలి. అదీ ఊరికి చాలా దూరం గా ఉంటుంది.అమావాస్య నాడు వెళ్ళాలి.అదంతా వింటే భయానకంగా తోచింది.
అది కాని పని..! దానికంటే రోజు దేవుడిని ఓ రెండు నిమిషాలు ప్రార్థిస్తే బాగుంటుంది.ఊర్మిళ పీడ వదలాలని.దానితో పాటు నా మనసు లో ఉండే ఈ దుష్ట ఆలోచన ఎవరికీ తెలిసే అవకాశం ఉండదు.ఎవరినుంచి ఏ ఆపదా ఉండదు.
తొలిచూపు లో ప్రేమ లాగా,ఊర్మిళ స్కూల్ లో పరిచయం అయిన దగ్గర్నుంచి తొలి చూపు లో ద్వేషం మొదలయింది.ఆమెకి నాకూ అసలు పడేది కాదు.దాని వేళ్ళు ఆ మొదటి ఘడియల్లోనే బలం గా నాటుకున్నాయి.
ఒకరోజున,మా క్లాస్ లో పెద్దగా పిల్లలు లేరు.నేను టేబుల్ ఎక్కి చేతి తో టేబుల్ ని డ్రం లా వాయిస్తూ పాట పాడసాగాను.ఉన్న నా నేస్తాలు ఆస్వాదించసాగారు.అంతలో మా హెడ్మాస్టర్ గారు వచ్చారు. "ఏయ్...ఎవర్రా పాటలు పాడేది." అని అరిచారు.అప్పటికీ ఆయన నన్ను చూశాడు.కాని సాక్ష్యం ఎవరో ఒకరు కావాలిగదా..! అంతలో ఊర్మిళ లేచి "సార్ ఆ పాట పాడుతున్నది బికాష్ సార్" అని చెప్పింది.
నా చెవులు మెలిపెట్టారు హెడ్మాస్టారు.అయితే నన్ను అంతకంటే బాధపెట్టింది ఏమిటంటే ఊర్మిళ నా మీద చెప్పడం. దేవుడా,ఈ మనిషి మా క్లాస్ లో లేకుండా చూడు అని ఆ నిమిషం లో ప్రార్థించుకున్నాను. అయితే ఆమె మటుకు బడి కి ఏ మాత్రం మానేయకుండా వచ్చేది.నన్ను ఏడిపించడం లో ఆనందం పొందుతుండేది.ఆమె కి నా మీద అంత కసి ఏమిటో..?
ఎక్కడో మారుమూల గ్రామం నుంచి వచ్చి,వాళ్ళ ఊరి లో ఉన్న బడి లో చదువుతున్నాననా..? అంత చులకనా..?నా బాధని ఒకరోజు పద్మలోచన్ తో పంచుకున్నాను.మరి వాడికి అంతకుముందే ఆ అమ్మాయి మీద కోపం ఉండి కక్ష తీర్చుకోవాలనుకున్నాడో,లేకపోతే నాకు నిజంగానే హెల్ప్ చేయాలనుకున్నాడో తెలియదు గాని వాడు నా పక్షాన నిలిచాడు. "చూడు ఈ అమ్మాయి యవ్వారం అసలు బాలేదు.వాళ్ళ అన్నయ్య పోలీస్ ఇన్స్పెక్టర్ అయితే ఏమిటట..? నువు ఏమీ భయపడకు,మేమంతా నీతో లేమా..?" అన్నాడు వాడు వేలు చూపిస్తూ.
పద్మలోచన్ చెప్పిన మాటలు నాకు ధైర్యాన్ని ఇచ్చాయి.ఇదంతా జరిగింది నేను తొమ్మిదో తరగతి చదివే రోజుల్లో.మా ఊరి లో ప్రాధమిక పాఠశాల లో చదువు పూర్తయి ఆపై తరగతులకి గాను పతాపూర్ హైస్కూల్ లో చేరాను.మా క్లాస్ లో పద్నాలుగు మంది ఉండేవారు.పన్నెండు మంది అబ్బాయిలు.ఇద్దరు అమ్మాయిలు.హైస్కూల్ గదులన్నీ తాటాకు తో కప్పినవే.స్కూల్ ముందు పెద్ద తోట,దీర్ఘచతురస్రాకారం లో ఉండేది.ఓ పక్కన పెద్ద చెరువు కూడా ఉండేది.
హైస్కూల్ అంటే చాలా పెద్ద బిల్డింగ్ లు అవీ ఉంటాయని అనుకునేవాడిని గానీ తీరా చేరిన తర్వాత ఇంతేనా అనిపించింది.నా అంచనాలు తప్పినాయి.హాస్టల్ లో జాయిన్ అవడానికి కొన్ని రోజులు ముందు మా బంధువుల ఇంట్లో ఉన్నాను.
క్రమేణా ఈ తాళబంధ గ్రామానికి అలవాటై పోయాను.పచ్చని ప్రకృతి,పెద్ద చెరువులు...ఆహ్లాదం గా ఉండేది.వర్షా కాలం లో ఎర్రని ఆరుద్ర పురుగులు...వరుసగా చెట్ల కొమ్మల పై కూర్చునే కొంగలు...లేగదూడలు...చుట్టుపక్కలా గోల గోల గా ఆడుకునే పిల్లలు...మా స్కూల్ కి వెళ్ళే దారి మొత్తం చాలా బాగుండేది.తాళబంధ గ్రామం లో ,ఆకాశం లో రంగురంగుల మేఘాలు అద్భుతం గా అనిపించేవి.
నా పాత స్నేహితులు,ఇదివరకటి గ్రామం నా మనోపథం నుంచి చెరిగి పోసాగాయి.సెలవుల్లో పద్మలోచన్ వాళ్ళ గ్రామానికి తీసుకెళ్ళేవాడు.వాళ్ళ ఇంట్లో వండే బాయిల్డ్ ఎగ్స్,చికెన్ కూర చాలా బాగుండేవి.వాటిని ఆరగించే సమయం లో నేను బ్రాహ్మల అబ్బాయిని అని,ఇలాంటివి తినరాదనే సంగతిని మర్చిపోయేవాడిని.
జరిగే ప్రతిదీ దేనికో దానికి మంచిదే అనిపించేది.మా క్లాస్ లో టీచర్లందరికీ ప్రేమపాత్రుడినయ్యాను.స్కూల్ ప్రేయర్ కూడా నేనే చేయించేవాడిని.ఫుట్ బాల్ టీం లో గోల్ కీపర్ ని కూడా..!
దోమతెర తో చేపలు ఎలా పట్టాలి,వాటిని ఎండుపుల్లలతో ఎలా కాల్చాలి అనే విషయాన్ని నా స్నేహితులకి చెప్పేవాడిని.నిజానికి ఇవన్నీ నేను బగూలీ గాడి దగ్గరనుంచి సేకరించిన సమాచారమే.తాళ బంధ గ్రామం లోని పిల్లలంతా నా తెలివితేటలకి ఆశ్చర్యపడేవారు.క్లాస్ లో కూడా నన్ను లీడర్ గా ఎన్నుకున్నారు.
నేను క్లాస్ లీడర్ కావడం తో అందరూ నా మాటకి వంత పాడేవారు.నేనేది చెప్పినా భేష్ అనేవారు.కాని ఊర్మిళ మాత్రం కొరకరాని కొయ్య లా ఉండేది.నన్ను పూచికపుల్ల లా తీసిపారేసేది.
నన్ను ఎవరన్నా పొగిడినా ఒప్పుకునేది కాదు.ప్రతి విషయం లోనూ నువ్వెంత అన్నట్లుగా ప్రవర్తించేది.మా క్లాస్ లో బిక్రం అనే కుర్రాడు ఉండేవాడు.నేను లీడర్ గా ఉండటం వాడికి ఇష్టం ఉండేది కాదు.వాడి వెంట ఇద్దరు,ముగ్గురు ఉండేవారు.ఏదో విషయం లో నేను సమ్యమనం కోల్పోయి వాడిని కులం పేరు తో దూషించాను.తను హరిజన వర్గానికి చెందినవాడు.
నా మాట పూర్తవ్వక ముందే ఎవరో నా చెంప చెళ్ళుమనిపించారు. అదెవరో కాదు ఊర్మిళనే..!చాలా కోపం తో నా ముందు నిలబడింది.మళ్ళీ వాయించేలా ఉందే అనిపించింది.నేను ఎలాగో అక్కడి నుంచి ఆమె ని విడిపించుకుని బయటపడ్డాను.కాని ఆమె తిట్లు మాత్రం పడక తప్పలేదు.
"ఇంకోసారి అలా కులం పేరు తో తిడితే మాత్రం బాగుండదు.ఇది నా హెచ్చరిక గా గుర్తుంచుకో.హరిజనులకి,బ్రాహ్మలకి తేడా ఏమిటి..?ఇక్కడంతా స్నేహితులే.నువ్వు పద్మలోచన్ వాళ్ళ ఇంటి లో చికెన్ తిన్నావు,దానికి మేము ఎవరమూ నిన్ను కామెంట్ చేయలేదే" అంది ఊర్మిళ.
ఆకాశం లో నుంచి నేను దఢాలున నేల మీద పడినట్లయింది.చాలా అవమానం తో క్లాస్ లో నుంచి బయటపడ్డాను."ఎంత ధైర్యం,నా చెంపలు వాయించడానికి..?ఏదో రోజున నీకు గుణపాఠం చెబుతా" అనుకున్నాను మనసు లో,హాస్టల్ కి వచ్చినా మనసు లో అదే సన్నివేశం పదే పదే మెదలసాగింది.
రూపం లో చిన్న వాడి గా ఉండటం,ఇంకా రాని మీసాలు,అమ్మాయి లాంటి ఎర్రని పెదాలు...ఇవన్నీ కలిసి ఏమీ చేయలేని వాడిగా మిగిలిపోయాను.దారు భాయ్ లాగానో,నకుల్ లాగానో రఫ్ అండ్ టఫ్ గా ఉండిఉన్నట్లయితే దానికి గుణపాఠం చెప్పిఉండేవాడిని.
ఊర్మిళ నా కంటే రెండేళ్ళు పెద్దది.తన సీనియార్టిని క్లాస్ లో అందరికీ గుర్తు చేస్తుంటుంది.ఆడవాళ్ళ వయసు దాయడం అనే సూత్రం ఈమెకి వర్తించదు.ఊర్మిళ చూడటానికి ఎత్తుగా, పెద్ద పర్సనాలిటీ తో ఉంటుంది.గుండ్రని మొహం,చిన్న జడలు,కాటుక కళ్ళు,చిన్న బొట్టు...ఇదీ ఆమె రూపం.మెడ చుట్టూతా తెల్లని స్కార్ఫ్ వేసుకుని చూడటానికి ఆకర్షణీయం గా ఉంటుంది.
ఊర్మిళ అందాన్ని,మంచితనాన్ని అందరూ పొగుడుతుంటారు,కాని నా దృష్టి లో మాత్రం ఆమె నాకు శత్రువు.అంతే.ఆమె ని పొగిడే వాళ్ళ తో నేను ఎంత మాత్రం ఏకీభవించను.ఆమె కి నేను కొన్ని నిక్ నేంస్ పెట్టుకున్నా...మగరాయుడు అని,ఎచ్చులమారి అని,మాయలమారి అని ఇలా..!అయితే ఆ పేర్లతో ఎప్పుడూ ఆమె ని నేరుగా పిలిచే ధైర్యం చేయలేదు.
నేను ఓ సారి క్లాస్ కి కొత్త షర్ట్ వేసుకొచ్చాను.అందరూ చాలా బాగుంది అన్నారు.ఒక్క ఊర్మిళ మాత్రం ఎగతాళి గా "లోపల ఏ విషయమూ లేని వాళ్ళే బయట హంగామా చేస్తారు" అంటూ డైలాగు వేసింది.అంతా నవ్వడం,అదేదో సీక్రెట్ జోక్ లాగా..! ఇంకెప్పుడూ ఆ షర్ట్ వేసుకోకూడదని నిర్ణయించుకున్నాను.
అయినా ఆమె మాటలకి నేనెందుకు అంత ప్రాముఖ్యత ఇస్తున్నాను అని చెప్పి అర్థమయ్యేది కాదు.ఏమిటో...ఆమె మాటలంటే అందరికీ శిరోధార్యమే.ఆధిపత్య ధోరణి లో మాటాడేది.వాళ్ళ అన్నయ్య ఇన్స్పెక్టర్ గదా ,అతని గుణాలు ఈమె కి కూడా వచ్చినట్లున్నాయి.
ఒకసారి నేను తాళబంధ వస్తూండగా అకస్మాత్తు గా వాన ప్రారంభమయింది.చెట్టు కూడా లేదు దగ్గర లో నిలబడటానికి,గొడుగూ తేలేదు.పుస్తకాలు నెత్తి మీద పెట్టుకుని వస్తుండగా వెనకనుంచి వినబడింది.
"ఎందుకు,వానలో తడవడం..?ఏదో గొప్ప చూపించుకోవాలనా...?నా గొడుగు కింది రారాదూ" వెనకనుంచి అన్నది ఊర్మిళ.చేసేదేముంది ,ఆ గొడుగు లోకి వెళ్ళాను.ఇద్దరం అలా నడుస్తున్నాం.వికసించిన పుష్పం వంటి ఊర్మిళ...ఆమె పక్కన నేను.పక్కనే నడుస్తుంటే ఏదో భయం.అప్పుడు వేసిన చెంపదెబ్బ గుర్తుకు వచ్చి కొద్దిగా ఎడం గా జరిగాను.
"దగ్గరకు వస్తే ...నిన్ను ఏమైనా చంపేస్తానా..?" అంది ఊర్మిళ ,గొడుగు ని నా వేపు పడుతూ.ఏమీ మాట్లాడకుండా మౌనం గా ఉండిపోయా.ఆమె హృదయ స్పందన లీలగా వినిపించసాగింది.ఆమె అందాలు మరింత దగ్గర గా..!ఇరువురి కళ్ళు కలిసినపుడు నేను ఎటో చూడసాగాను.
ఊరి చెరువు కి సమీపం లో నేను గొడుగు లో నుంచి బయటపడ్డాను.ఇద్దరం కలిసి నడవడం ఎవరైనాచూస్తే అని భయపడ్డాను.అయినా కోసేసిన ఆ మొక్క జొన్న తోట లో ఎవరుంటారులే సముదాయించుకున్నాను.
కొన్నిరోజుల తర్వాత ఊర్మిళ క్లాస్ కి జామకాయలు,కీరా దోసకాయలు తెచ్చింది.నా ఫ్రెండ్స్ తో సహా అందరూ తీసుకున్నారు. నేను మాత్రం తీసుకోలేదు.అయినా నన్ను కాదని నా ఫ్రెండ్స్ తీసుకోవడం ఏమిటి అని వాళ్ళని తిట్టుకోసాగాను.
"అసలు ఈ శాల్తీ ఎవరి తో నైనా లేచిపోయినా పోయేది,లేదా ఏ చెరువు లో అయినా మునిగినా పోయేది..అలా ఎందుకు జరగడం లేదో" అని లోలోనే తిట్టుకోసాగాను.
కానీ ఆమె కి ఏమి కావడం లేదు. ఇంకా చక్కగా తయారవుతోంది.టీచర్లందరికీ ఆమె అంటే ఎంతో ఇష్టం.ఆమె లెక్కలు చేయకపోయినా,చింతామణి మేష్టారు ఆమెని ఏమీ అనడు.ఏదో వంకతో హెడ్మాస్టారు కూడా ఆమె తో మాట్లాడాలని చూసేవాడే.ఊర్మిళ పరపతి ఇలా పెరిగిపోవడం నాకు విశ్రాంతి లేకుండా చేస్తోంది.మా స్నేహితులకి జామకాయలిచ్చి,టీచర్లవైపు కేమో నవ్వులు విసిరి అందరిని ఆకట్టుకుంటోంది.
టైం ఎప్పుడూ ఒకేలా ఉండదుగా,పదకొండో తరగతి లో ఊర్మిళ ఫేలయింది.ఆమె కలలన్నీ బద్దలయ్యాయి.ఆమె స్కూల్ కి రావడం మానేసింది.సజంగానే ఈ పరిణామం నాకు ఆనందం కలిగించింది.బయటకి నా భావాన్ని వ్యక్తం చేయకుండా,నా స్నేహితులకి స్వీట్లు పంచాను.మొత్తానికి దేవుడు నా మొర ఆలకించాడు.ఆలశ్యమైనా, న్యాయం మటుకు జరిగింది.
నేను ఈ ఊరు నుంచి సెలవు తీసుకోవలసిన రోజులు సమీపిస్తున్నాయి.మార్చ్ మొదటి వారం లో ఫైనల్ పరీక్షలు.మా స్కూల్ తోట ని,ఆ పక్కనే గల చెరువు ని తనివితీరా చూసుకున్నాను.చెరువు లో అలల్లా రోజులు ఎలా దొర్లిపోయాయి అనిపించసాగింది.
మా జూనియర్లు మాకు ఫేర్ వెల్ కార్యక్రమం ఏర్పాటు చేశారు. స్నేహాన్ని గుర్తు చేసే వివిధ రకాల స్లోగను గోడల మీద ఇంకా వీలున్న చోటల్లా రాశారు. మా జూనియర్లు ఏర్పాటు చేసిన విందు పూర్తి చేసుకుని,ఆ తర్వాత మా గ్రామాలకి వెళ్ళే విధానాన్ని ప్లాన్ చేసుకున్నాం.మా బ్యాగ్ లన్నీ ఎద్దులబండి మీద తిహిడి కి పంపించివేశాం.తెల్లారగానే ఉదయం వేళ బయలుదేరాలని నిర్ణయించుకున్నాం.
నేను హాస్టల్ లో ఓ చెక్క బల్ల ఉంటే,దాని మీద పడుకుని ఓ కునుకు తీస్తుండగా,ఊర్మిళ హఠాత్తుగా వచ్చింది. తనతో పాటు ఇంకో ఫ్రెండ్ కూడా ఉంది.నేను ఒక్కసారిగా బిత్తరపోయాను.ఈ చివరి రోజున కూడా ఏదైనా సీను క్రియేట్ చేస్తుందా ఏవిటి అనుకోసాగాను. పుస్తకాలు,బట్టలు రూం లో అక్కడక్కడా ఉన్నాయి,వాటి వేపు ఆమె అలా చూసింది.
" ఇందా, రిస్ట్ వాచ్ తీసుకో...నీకు లేనట్లుగా ఉంది. నేనెలాగూ పరీక్షలు రాయడం లేదు.నువ్వు వాడుకో" దాన్ని నాకిచ్చి,వచ్చినంత వేగంగా వెళ్ళిపోయింది.నేను స్తబ్దంగా నిలుచుండిపోయాను.ఆమె దూరంగా రోడ్డు మీద కనుమరుగు అయేంత వరకు చూస్తుండిపోయాను.
నిజానికి ఇప్పుడు నాకు బాగా అవసరమయింది ఈ రిస్ట్ వాచ్ నే..!ఎవరో ఇద్దరు ఫ్రెండ్స్ దగ్గర తప్పా నేనీ మాట ఎవరిదగ్గరా ప్రస్తావించలేదు.మరి ఈ సంగతి ఊర్మిళ కి ఎలా తెలిసిందో అంతుబట్టని విషయమే.అయినా ఈమెలో ఇంత మార్పు ఏమిటబ్బా...అసలు ఊహించని పరిణామం. నన్ను ఏదో దులపటానికి వచ్చిందేమో అనుకుంటే...వాచ్ ఇచ్చి వెళ్ళిందేమిటబ్బా..?
వాచ్ గోల్డ్ కలర్ లోనూ,దాని స్ట్రాప్ మంచి నలుపు రంగు లోనూ ఉన్నాయి.ఇది ఆడపిల్లల వాచీ కన్నా,కొద్దిగా పెద్దగా అనిపించింది.ఆమె వెళ్ళిపోయిన తర్వాత దాన్ని పెట్టుకోవాలని అనుకున్నా.ఉద్వేగం గానూ,సంతోషం గానూ అనిపించింది.
---- 2 ------
ఆ ఊరు,పతాపూర్ ని వదిలేసి చాలా కాలమైంది.జ్ఞాపకాలన్నీ చెరిగిపోయాయి.ఈ ఇరవై అయిదేళ్ళలో నా జీవితం లో ఎన్నో మార్పులు వచ్చాయి. మరపురారు అనుకున్నవాళ్ళు కూడా స్మృతిపథం నుంచి చెరిగిపోయారు. ఊర్మిళ విషయమూ అంతే.కాలం రేపిన ఇసుక తుఫానులు ఆ గుర్తుల్ని లేకుండాచేసింది.
ఆ నర్సింగ్ హోం వరండా లో ఆ స్త్రీ మూర్తిని చూడకపోయి ఉంటే ఊర్మిళ అసలు మళ్ళీ జ్ఞాపకమే వచ్చేది కాదు.మా అమ్మ గారికి ఒక ఆపరేషన్ చేయాల్సివచ్చినపుడు,డాక్టర్ ఆమెని ఒకరోజు ముందు ఆసుపత్రి లో అడ్మిట్ కమ్మన్నారు.ఆపరేషన్ తెల్లారి పది గంటలకి.
ఒక నర్స్ ని పిలుద్దామని నేను రూం బయటకి వెళుతున్నాను.అంతలోనే ఓ ఆయా ఎదురొచ్చింది.నేను ఒక్కసారిగా స్టన్ అయ్యాను. "ఊర్మిళ" అంటూ నా ప్రమేయం లేకుండా నోటి లోనుంచి ఆ పిలుపు వెలువడింది.ఒక్కసారిగా పాతికేళ్ళ వెనకటి జ్ఞాపకాలు మెరిశాయి.
నేను చివరిసారిగా ఊర్మిళ గురించి విన్నది సనాతన్ చెప్పినపుడే,అదీ ఆ పాఠశాల విడిచిపెట్టిన ఏడాది తర్వాత మాట. బాధ గానే చెప్పాడు. అది ఊర్మిళ వంటి అమ్మాయికి జరగవలసిన సంఘటన కాదు.
లంకె బిందెలు లాంటివి ఏవో దొరుకుతాయని ఊర్మిళ వాళ్ళ నాన్న తాంత్రికుడు ఒకడిని పిలిపించాడట.ఏడు రోజుల పాటు జరిగే పూజ లో ఓ కన్య పసుపు చీరె ధరించి కూర్చోవాలట.దానికి గాను ఈ అమ్మాయిని కూర్చోబెట్టారట.ఎనిమిదో రోజున పూజ జరిగే గది లో కిటికీ లో నుంచి తొంగి చూస్తే,హోమగుండం లో నుంచి వచ్చే పొగ ఇంకా బూడిద తప్పా ఏమీ కనిపించడం లేదు.ఆ తండ్రి అడిగిన మీదట తలుపులు విరగ్గొడితే లోపల నేల మీద పసుపు,కుంకుమ,ఊదువత్తులు,తమలపాకులు ఇలాంటి మన్నూ మశానం ఉన్నయి తప్పా ఊర్మిళా లేదు,తాంత్రికుడూ లేడు. ఇద్దరూ చీకట్లో పరారయ్యారు.
ఊర్మిళ తండ్రి,అన్నా తలవంపులు గా ఫీలయ్యారు.లేచిపోయిన ఇద్దరి గురించి ఎన్నో రూమర్లు. ఆ సమయానికే ఆమె ప్రెగ్నేంట్ అని అలా వెళ్ళిపోవడం తప్పా వేరే మార్గం లేదన్నట్లు సనాతన్ చెప్పకనే చెప్పాడు.
ఇన్ని ఏళ్ళ తర్వాత ఇప్పుడు మళ్ళీ ఆమె పోలికలతో ఉన్న ఆయా కనబడటం...అప్పటి జ్ఞాపకాలు నెమరేసుకునేలా చేసింది.
"అవును...నీ పేరు ఊర్మిళ గదా..?" అడిగాను ఆ ఆయా ని.
"ఊర్మిళ ఎవరు..? నాకు తెలీదు.నా పేరు బనలత, బనలతా పరీదా" అన్నదామె.
"మరోలా అనుకోవద్దు. మీరు మా క్లాస్ మేట్ లా ఉంటేనూ..!అయితే ఆమె కొద్దిగా రంగు..." నా మాట పూర్తి కాకుండానే వేగంగా వెళ్ళిపోయింది. మా అమ్మగారి బెడ్ పక్కనున్న కుర్చీ లో కూర్చున్నాను.లోపల ఎన్నో ఆలోచనలు.మనుషులు పోలిన మనుషులు ఎందుకు అలా ఉంటారో...! ఇరవై అయిదేళ్ళ క్రితం ఊర్మిళ చూడటానికి విరబూసిన పుష్పం లాఉండేది. ఆ యవ్వనపు బిగువు,అందం...ముఖ్యంగా ఆ కళ్ళ లోని కాంతి ఈ నలభై అయిదేళ్ళ ఆయా లో కనిపించడం లేదు.
ఏమైనా మళ్ళీ ఓసారి ఆమెని చూడాలి. బహుశా ఆ ఆయా తనతో అబద్ధమాడి ఉండవచ్చునా..? లేకపోతే నా కళ్ళే నన్ను మోసం చేసాయా..? మా అమ్మగారి ఆపరేషన్ అయిన తర్వాత ఇంకొన్ని రోజులు ఆసుపత్రి లో ఉండవలసి వచ్చింది.
ఊర్మిళ జ్ఞాపకాలు నన్ను వెంటాడసాగాయి. ఆమె ఆ రోజున రిస్ట్ వాచ్ ని వెనక్కి ఇవ్వలేకపోయాను. మా అమ్మ తొలిరోజుల్లో జ్ఞాపకం చేసేదిలే గాని,మెట్రిక్యులేషన్ తర్వాత నాకు తీరిక లేకుండా అయిపోయింది.
ఆ రోజు ఆదివారం..!నర్సింగ్ హోం కి వెళ్ళాను.సాయంత్రం కావస్తోంది.రిసెప్షన్ లో ఉన్న నర్స్ ని అడిగాను." ఈ రోజు బనలత పరిదా రాలేదా?" అని.
ఆమె మరో నర్స్ వైపు చూసింది. "లేదు,లేదు...తను ఇంచుమించు పది రోజుల నుంచి రావడం లేదు"అన్నారిద్దరు.
"ఆమె నివాసం ఎక్కడ?" ప్రశ్నించాను.
"సెక్టార్ త్రీ లో ఉంటుంది.గుడికి పక్కనే ఉంటుంది ఇల్లు.దాని ముందు ఓ బోర్ వెల్ కూడా ఉంటుంది" చెప్పారు వాళ్ళు.
గత పది రోజుల నుంచి ఎందుకు రావడం లేదబ్బా...నాలో ఓ కలవరం. వెంటనే ఆమెని కలవాలనుకున్నాను.ఇల్లు ఈజీగానే దొరికింది.గుడికి కి కొంచెం ముందుకు వెళితే,ఓ పాడయిపోయిన బోర్ వెల్ కనిపించింది.దాని చుట్టూ గడ్డి గాదం ఉంది.దాని ముందు చూస్తే ఓ ఆస్బెస్టాస్ కప్పు తో ఉన్న ఇల్లు కనిపించింది.దగ్గరకి వెళ్ళాను.
ఇంటి లోపల గడియ పెట్టారు.లోపల ఎవరో ఏడుస్తున్న మూలుగు వినబడుతోంది.పెళ్ళాం,మొగుళ్ళు ఏదో చండాలం తిట్టుకుంటున్నట్లు ఉంది.పాత్రలు కిందబడిన చప్పుడు వినిపించింది.కాసేపున్న తర్వాత శాంతించినట్లు అయింది.
ఇది బనలతా వాళ్ళ ఇల్లేన..? అడగడానికి ఎవరూ కనబడలేదు. ఇంతలో ఇంట్లోనుంచి ఒకడు బయటకి వచ్చాడు.ఎర్రని కళ్ళతో నా వేపు తేరిపారా చూశాడు.
"ఏంటి...ఏవైనా ఆబర్షన్ కేసా..?అయితే ఓ యాభై రూపాయలు ఇవ్వు" రఫ్ గా ఉంది అతగాడి గొంతు.
No comments:
Post a Comment