Friday, April 21, 2023

వాట్సప్ ని జయించుట ఎట్లు...?

 వాట్సప్ ని జయించుట ఎట్లు, నీ స్వీయ అనుభవము నుండి కొన్ని సూచనలు చేయుము అని ఎవరైన ప్రశ్న సంధించినచో ఈ విధముగా నుడివెదను.

మిత్రమా, వాట్సాప్ చూడటానికి అలవాటు పడితే మళ్ళీ మానివేయడం అంత సులువు కాదు. ఎన్నోసార్లు మానివేయడానికి ప్రయత్నించి ఘోరంగా విఫలమయ్యాను. ఎవరికైనా చెబితే నవ్వుతారు గాని ప్రస్తుతం మందు మానివేయవచ్చు ప్రయత్నించి,అలాగే స్మోకింగ్ ని కూడా మానివేయవచ్చు ప్రయత్నించి, దీని తస్సాదియ్యా వాట్సాప్ చూడకుండా ఒక్కరోజు ఉండమంటే నా వల్ల  కావట్లా. 

ఒకరోజు చాలా చాలెంజ్ గా తీసుకుని వాట్సాప్ ని 24 గంటలు చూడటం మానివేశాను. సరిగ్గా మా మిత్రుడు ఒకడు ఫోన్ చేసి ఆ మధ్య టూర్ కి వెళ్ళినప్పుడు తీసిన ఫోటోలు పెట్టా. ఇంకా చూడలేదా అన్నాడు. ఇంకేముంది వ్రత భంగం. ఆత్రుత గా వాట్సాప్ లో కెళ్ళిపోయాను. వెళ్ళేముందు అప్పటికీ అనుకున్నా ఒక్క పదినిమిషాలు చూసి కట్టిపారేయాలి అని . అబ్బే ...అదెక్కడ కుదిరింది....నిమిషాలు దొర్లుకుంటూ అలా పోతూనే ఉన్నాయి.తీరా చూస్తే గంట అయింది వాట్సాప్ లోనుంచి బయటకి వచ్చేసరికి. 

ఇక ఇలా కాదని ఎప్పుడు బయటకి వెళ్ళినా, కావాలని మొబైల్ ని మర్చిపోయి వెళుతున్నా. ఇది కొద్దిగా ఫలితం ఇస్తోందని చెప్పాలి. మనకి ఇంటికి వచ్చేంతవరకు ఎవరు ఫోన్ చేస్తున్నారు తెలియదు ప్లస్ అందుబాటు లో మొబైల్ ఉండదు గనక వాట్సాప్ ని గీకడం ఉండదు. ఏ మాటకి ఆ మాట వాట్సాప్ చూడని రోజున కళ్ళు మాత్రం మహా ఆరోగ్యంగా,హాయిగా ఉంటాయి.అది ఒప్పుకు తీరాలి. ఈ మర్చిపోయి వెళ్ళే విధానం నాకు బాగానే పని చేస్తున్నది. మరి మిగతా వారి అనుభవాలు ఏమిటో..?   


1 comment:

  1. ఇంత కష్టమేల ! నార్మల్ కాల్ ఓన్లీ మొబైల్ కు మారిపోండి! హాయిగా అన్నీ మరిచి పోవచ్చు :)

    ReplyDelete