ఇప్పుడే "నీలివెలిచం"(Blue radiance) అనే మళయాళ చిత్రాన్ని అమెజాన్ ప్రైం లో చూశాను. ఇది వైకోం ముహమ్మద్ బషీర్ యొక్క కథ.ఇంతకు ముందు ఈ సినిమాని అయిదు దశాబ్దాల కిందట తీసినప్పటికీ మళ్ళీ ఈ ఏడాది లో తీశారు. కథ అతీంద్రియ ఆత్మ ఇంకా అలాంటి జోనర్ గా చెప్పవచ్చు.సినిమా ఆసక్తి గా సాగింది.చనిపోయిన ఓ యువతి ప్రేతాత్మ, నివసించే పాడుబడ్డ భవనం లోకి ఓ రచయిత వచ్చినపుడు తారసపడిన అనుభవాలే ఈ కథ.
ఆనాటి మపాసా నుంచి మొన్నటి బషీర్ ఇంకా నిన్నటి ఆర్.కె.నారాయణ్ వరకు ప్రసిద్ధ రచయితలు చాలామంది కొన్ని అతీంద్రియ అనుభవాల్ని పొందినవారే.వాటిని వివిధ కధల్ని పొదిగిన వారే.కొంతమంది లోకం దృష్టిలో పల్చనవుతాం అని వేరే వాళ్ళ అనుభవాలుగా వర్ణిస్తే మరికొందరు తమ కోసం రాసుకున్నారు.అవి ఆ తర్వాత బాగా ప్రసిద్ది పొందాయి.
Le Horla ఇంకా Qui sait? వంటి ఫ్రెంచ్ కథల్లో మపాసా చిత్రించిన Supernatural phenomena తను పొందిన అనుభవాలుగానే చెప్పాడు.అలాగే ఆర్.కె.నారాయణ్ కూడా The English Teacher నవల లో చనిపోయిన భార్య ఆత్మ తో మాట్లాడటానికి చేసిన ప్రయోగాలు చదివాము గదా.నారాయణ్ నిజజీవితం లో కూడా ఈ ప్రయోగాలు చేశాడు.ఆయన కి దగ్గరగా ఉన్నవాళ్ళు ఈ విషయం అనేక వ్యాసాల్లో రాశారు.
అలానే ఈ మళయాళ సినిమా మొదట్లో బషీర్ గారి మాటలు ఇంగ్లీష్ లో ఇలా వేశారు. "నా జీవితం లో పొందిన కొన్ని అంతుతెలియని అనుభవాల్లో ఇది ఒకటి. దీన్ని ఒక బుడగ అని భావిస్తే ,హేతుదృష్టి అనే సూది తో దాన్ని పగలగొట్టాలని ప్రయత్నించి విఫలమయ్యాను.మీరూ ప్రయత్నించి చూడండి ".
----- Murthy kvvs
No comments:
Post a Comment