మన దేశం లో 1.2 బిలియన్ల కి పైగా మొబైల్ ఫోన్లు వాడుతున్నారు. మళ్ళీ దాంట్లో 600 మిలియన్ల స్మార్ట్ ఫోన్లు వాడకం లో ఉన్నాయి. విచిత్రంగా ఎక్కువ సంఖ్య లో ఆరుబయట మలవిసర్జన చేసే ప్రజలున్న దేశం కూడా మనదేనని యూనిసెఫ్ రిపోర్ట్ తెలుపుతోంది. 594 మిలియన్ల మంది అంటే 48 శాతం మంది జనాభా బహిరంగ మలవిసర్జన చేస్తున్నారన్నమాట. దానికీ,దీనికీ లంకె ఏమిటంటారా? కేవలం పేదరికం వల్లనే టాయిలెట్లు నిర్మించుకోలేక చాలామంది బయట కి వెళుతున్నారనే అపోహ ఉండేది. నిజానికి ఈ అలవాటు మానడాన్ని సీరియస్ గా తీసుకోపోవడమే దీని వెనుక ఉన్న కారణమని లోతుగా పరిశీలిస్తే అర్థమవుతుంది.
ప్రభుత్వం పెద్ద ఎత్తున సబ్సీడీలు ఇచ్చి గ్రామీణ ప్రాంతాల్లో టాయిలెట్ల నిర్మాణాన్ని ప్రొత్సహిస్తోంది. బహిరంగ మలవిసర్జన వల్ల అనేక అంటు రోగాలు ప్రబలుతాయాని,వాతావరణం కలుషితమై డయోరియా,డీసెంట్రీ లాంటి వ్యాధులు వస్తాయని పబ్లిసిటీ కూడా చేపట్టింది. టాయిలెట్లు నిర్మించుకున్నా,వాటిని స్టోర్ రూం లుగా కొంతమంది ఉపయోగిస్తున్నారు. స్వతహాగానే నాలుగు గోడల మధ్య విసర్జన చేయడం ఇష్టం లేనివారు ఎవరేమనుకున్నా ఆరుబయటనే తమ పనికానిస్తున్నారు. సమాజం లోని మిగతా ప్రజలందరూ కలిసి ఇలాంటి వారిపై వత్తిడి తెచ్చి టాయిలెట్ల ని వాడేలా చేయాలి.కొన్నాళ్ళు అలవాటు అయితే ఆ అలవాటు లుప్తమవుతుంది. ఇది కేవలం హేబిట్ కి సంబంధించిన అంశమే తప్పా పేదరికానికి సంబంధించినది కాదు.
మన దేశం లోని ప్రతి నలుగురి దగ్గరా మూడేసి మొబైల్ ఫోన్లు ఉన్నాయి. అయితే ప్రతి ఇద్దరి లో ఒకరు బహిరంగ మలవిసర్జనకి పాల్పడుతున్నారు. ఈరోజున అతి తక్కువ ఖర్చుతో అంటే రెండు లేదా మూడు వేల రూపాయల్లోనే టాయిలెట్లు నిర్మించే సాంకేతిక ప్రక్రియ అందుబాటు లో ఉంది.అలాంటప్పుడు దీన్ని ఆర్దిక సమస్య గా ఎలా చూడగలం? అంటే ఇది ప్రయారిటీ కి సంబంధించిన విషయం అన్నమాట. అలాగే ఈ అలవాటు ని తోటి మనుషులు గట్టిగా వ్యతిరేకించకపోవడం ఓ కారణం కాగా, ఇదొక తప్పా అన్నట్లు చూడటం మరో కారణం. ఇక పుణ్యతీర్థాల్లో స్నానం చేయడానికి వెళ్ళినా అక్కడి నదీ తీరాల్లో కూడా కొంతమంది యధేచ్చగా తమ పని కానిస్తుంటారు. కనీసం పాపకార్యంగా ,అపవిత్రం చేయడంగా కూడా భావించరు.
శుభ్రమైన గాలి, తాగునీరు ఎంత ముఖ్యమో ఆరోగ్యానికి ఇంకా పరిసరాలు చక్కగా ఉండటానికి బహిరంగ విసర్జన ని సమూలంగా నిర్మూలించడం అంత అవసరం. ఈ భావన ప్రతి ఒక్కరి లో వచ్చి అలాంటి అలవాటు ని కొనసాగించేవారిని ప్రతిఘటించాలి. మానసిక శుభ్రతకి, ఆధ్యాత్మికతకి ప్రాధాన్యతనిచ్చే భారతీయ సమూహం ఎందుకని ఈ ఆరుబయట విసర్జన ని పెద్ద తప్పుగా చూడదో కొన్నిసార్లు అర్థంకాదు. ఇలాంటి అనారోగ్య వైఖరుల్ని మానగలిగితే తప్పా, ప్రపంచ దేశాల మధ్య తలెత్తుకుని నిలవలేము, మిగతా విషయాల్లో ఎంత పురోగమించినా ఏం లాభం ఉందని? ఇలాంటి అవమానకరమైన,అనారోగ్యకరమైన అలవాట్లని నియంత్రించలేనపుడు..! ప్రతిరోజు ఒక లక్ష టన్నుల విసర్జన ని ఆరుబయట అలా వదిలేస్తే దాని పరిణామం మిగతా వారి ఆరోగ్యాలపై ఎందుకుండదు?
అయితే కర్ణాటక,కేరళ,లక్షద్వీప్,మధ్యప్రదేశ్ రాష్ట్రాలు మన దేశం లో పూర్తి గా ఈ మహమ్మారి అలవాటు నుంచి బయటబడి మిగతా రాష్ట్రాలకి దారిచూపాయి. నూటికి నూరు శాతం బహిరంగ మలవిసర్జన లేని రాష్ట్రాలుగా అవి సెప్టెంబర్,2021 నాటికే ప్రకటించబడ్డాయి. సాధ్యమైనంత త్వరలో మిగతా రాష్ట్రాలు కూడా ఈ బాటలో పయనించాలని ఆశిద్దాం.
----- మూర్తి కెవివిఎస్ (చరవాణి : 78935 41003)
No comments:
Post a Comment