తోడేలు అనగానే కుక్క లాంటి మరో జంతువు అనుకుంటాము. రూపం లో కుక్క కి దగ్గర గా ఉన్నప్పటికీ తోడేలు చాలా ప్రత్యేకతలు ఉన్న జంతువు. కుక్క ని పెంచుకుని మన ఇంట్లో కాపలా ఉంచుకోవచ్చు. శిక్షణ ఇస్తే చెప్పిన పనులు చేస్తుంది.కానీ తోడేలు అలా కాదు.దాన్ని మన ఇంట్లో పెంచుకుని శిక్షణ ఇవ్వాలని ప్రయత్నిస్తే అది మనం చెప్పినట్లు చెయ్యదు.అసలు మచ్చిక కావడం కూడా కష్టం అంటున్నారు నిపుణులు. మన దేశం లో ఎక్కువ గా బూడిద రంగు లో ఉన్న తోడేళ్ళు ఉన్నాయి. ఇవి చాలా తెలివైనవి.
చింపాంజీ,ఏనుగు,డాల్ఫిన్ ఇలాంటి పది అత్యున్నత తెలివైన జంతువుల్లో ఇది కూడా ఒకటి. వాటి పిల్లలకి వేట గురించి నేర్పించడమే కాకుండా , వాటికి గాయాలు తగిలితే మనుషుల్లాగానే జాగ్రత్తలు తీసుకుంటాయి. సాధ్యమైనంత వరకు మనుషులకి దూరంగా ఉండడానికి ప్రయత్నిస్తాయి. చూడటానికి గాని,ఫోటో తీసుకోవడానికి గాని తోడేళ్ళకి కనీసం 100 యార్డ్ లు దూరం ఉండటం మంచిది. అవి కౄర జంతువులు అనే విషయం గుర్తుంచుకోవాలి.
తోడేళ్ళని కొన్ని దేశాల్లో మృత్యువు కి, వినాశనానికి సంకేతం గా పరిగణిస్తారు. అయితే రోమన్ పురాణాల్లో వీటికి గౌరవనీయమైన స్థానమున్నది. హిట్లర్ తమ మూడు మిలటరీ స్థావరాలకి హెర్ వుల్ఫ్, కండక్టర్ వుల్ఫ్, వర్ వుల్ఫ్ అనే పేర్లు పెట్టాడు. వ్యవసాయానికి,యుద్ధానికి అధి దేవతలుగా తోడేళ్ళని భావించడం వల్ల చాలా పాశ్చాత్య దేశాల్లో వాటిని వేటాడరు.మనం కొన్ని ఇంగ్లీష్ సినిమాల్లో కూడా చూసి ఉంటాం.అడివి లో తోడేలు ఎదురైతే తుపాకి ని గాల్లోకి పేల్చి వాటిని వెళ్ళగొడతారు తప్పా చంపరు.
రొములస్,రెముస్ అనే చంటిపిల్లల్ని అడివి లోకి తీసుకెళ్ళి చంపమని అమూలియస్ అనే రాజు ఆజ్ఞాపించగా వాళ్ళని కొన్ని తోడేళ్ళు పాలిచ్చిపెంచాయని రోమన్ పురాణాల్లో ఒక ఉదంతం ఉన్నది. దానివల్ల తోడేలు విషయం లో వాళ్ళకి ఓ సెంట్ మెంట్ ఉందనుకోవాలి. ఇవి దుప్పి,కుందేలు,చిట్టెలుక,పక్షులు ఇంకా చిన్న జంతువుల్ని వేటాడి తింటాయి. మనుషుల్ని చంపిన ఉదంతాలు తక్కువ.అయితే ఇవి మంద గా ఉన్న సమయం లో ఎంతకైనా తెగించే అవకాశం ఉంది.
6 నుంచి 13 సంవత్సరాలు జీవించే ఈ తోడేళ్ళు అన్యోన్య దాంపత్యానికి మారు పేరు అని చెప్పవచ్చు.ఒక ఆడ తోడేలు జీవితాంతం ఒక మగ తోడేలు తోనే ఉంటుంది. ఇది మరే జంతువు లోనూ కనబడదు. మంద లో ఉన్నప్పటికీ ఎవరి పనులు అవి విభజించుకుని చేస్తాయి.ఆహారం కూడా మంద లో ఉన్న తోడేలు నాయకుడు తిన్న తర్వాత మిగతావి తింటాయి. ఒకేసారి 9 కిలోల మాంసాన్ని కూడా ఇవి తినగలవు.
6 అడుగుల పొడవు,30 నుంచి 50 అంగుళాల ఎత్తు ఉండే తోడేళ్ళు పుట్టిన పిల్లల ని మనుషుల మాదిరిగానే ఆహారం ఇవ్వడం లోనూ,దెబ్బలు తగిలితే ఆదుకోవడం లోనూ జాగ్రత్త గా ప్రవర్తిస్తాయి. వీటికి నలభై రెండు పళ్ళు ఉంటాయి.పుట్టిన వెంటనే పిల్లలకి కొన్ని రోజులపాటు కళ్ళు,చెవులు పనిచేయవు. కిర్గిస్థాన్ దేశ ప్రజలు తోడేలు కలలోకి వస్తే మంచిదని నమ్ముతారు. రాజస్థాన్ ,గుజరాత్,కర్నాటక,మధ్య ప్రదేశ్,మహారాష్ట్ర లాంటి రాష్ట్రాల్లో ఇవి ఉన్నాయి. అయితే జమ్మూ కాశ్మీర్ ఇంకా హిమాలయ సానువుల్లో కూడా గణనీయం గా ఉన్నాయి.
తోక ఊపడం,ముఖ కవళికలు,నోటి ద్వారా చేసే శబ్దాలు వీటన్నిటిని చేస్తూ వాటిలో ఆవి మాట్లాడుకుంటాయి. వేటాడేప్పుడు జంతువు ని బాగా ఉరికేలా చేసి అవి అలిసిపోయినప్పుడు మందగా పడి చంపుతాయి.ఇక యూరేషియన్ తోడేళ్ళు తెలివి గురించి చెప్పాలంటే , వేట కుక్క వచ్చినపుడు ఎరగా ఆడ తోడేలు ని దాని దగ్గరకి పంపి ట్రాప్ చేసి చంపుతాయి.అమెరికా లో తోడేళ్ళ సంఖ్య 60,000 కాగా (పాత) రష్యా లో కూడా 60,000 దాకా ఉన్నాయి. మిగతా యూరపు దేశాల్లో కూడా 20,000 దాకా ఉన్నాయి. మన దేశం లో కేవలం డార్జిలింగ్ లో మాత్రమే తోడేళ్ళ కి సంభందించిన సంరక్షణ కేంద్రం ఉన్నది.
----- మూర్తి కెవివిఎస్ (చరవాణి : 7893541003)
No comments:
Post a Comment